డబ్బు ఆదా చేస్తే ప్రశాంతంగా నిద్ర పడుతుందా? తాజా పరిశోధన ఏం చెబుతోందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెవిన్ పీచీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్రమం తప్పకుండా డబ్బు ఆదా చేస్తే, నిద్ర బాగా పడుతుందని ఇటీవల విడుదలైన ఒక నివేదిక సూచిస్తోంది.
నెలవారీగా కొంత మొత్తాన్ని పక్కన పెట్టడం, అది ఎంత చిన్న మొత్తం అయినా సరే, ప్రజలు ఆందోళన లేకుండా జీవించడానికి, భవిష్యత్తు గురించి మరింత ఆశాజనకంగా ఉండటానికి సహాయపడిందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తల అధ్యయనం వెల్లడించింది.
తక్కువ ఆదాయం ఉన్నా క్రమం తప్పకుండా డబ్బును ఆదా చేసే వారి జీవితంలోని సంతృప్తి స్థాయి, పొదుపు చేయని ధనికులతో సమానంగా ఉంటుందని వీరు తెలిపారు.
యూకేలోని వయోజనుల్లో దాదాపు 25 శాతం మంది 100 యూరోల(రూ.10 వేల) కంటే తక్కువ పొదుపు చేస్తున్నారని సర్వేలు సూచించాయి.
బ్యాంకులు, వివిధ సొసైటీలు చెల్లించే వడ్డీ రేటు పెరిగినా, ఇంటి ఖర్చులు, ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా ఇటీవలి కాలంలో డబ్బు ఆదా చేయడం కష్టంగా మారింది.
యూకేలో 10 మందిలో ఆరుగురికి పొదుపు అలవాటు ఉందని తెలుస్తోంది. తక్కువ ఆదాయంలోనూ డబ్బును ఆదా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులునైనా తట్టుకోగలిగే స్థితిలో ఉన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
బ్రిస్టల్ యూనివర్సిటీ పర్సనల్ ఫైనాన్స్ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం, తక్కువ మొత్తం అయినా క్రమం తప్పకుండా పొదుపు చేయడం అనేది జీవితంలో సంతృప్తిని కలిగిస్తుంది.
డబ్బు గురించి తక్కువ ఆందోళన, అప్పు చేయాల్సిన అవసరం తగ్గడం లేదా ఊహించని సంఘటనలను సమర్థంగా ఎదుర్కోవడం వంటి వాటి ఫలితంగా వారిలో సంతృప్తి స్థాయి పెరుగుతుందని ఆ నివేదిక పేర్కొంది.
పరిశోధకులు 10 సంవత్సరాల కాలంలో వివిధ అధ్యయనాలను పరిశీలించడంతో పాటు వేల మంది చేసిన పొదుపు మొత్తాల వివరాలను ట్రాక్ చేసి ఈ నివేదికను రూపొందించారు.
పొదుపు చేయడం వల్ల జీవితంలో సంతృప్తి మెరుగుపడుతుందని, పొదుపు చేయనప్పుడు అది సంతృప్తిని తగ్గిస్తుందని పరిశోధకులు చెప్పారు.
అయితే, ఈ నివేదికపై ఇతర నిజ జీవిత సంఘటనలూ ప్రభావాన్ని చూపాయి. ఉదాహరణకు, ఇల్లు మారడం లేదా పెళ్లి చేసుకోవడం వంటి వాటి వల్ల మానసిక సంతృప్తి చాలా వరకు మెరుగుపడుతుందని వెల్లడైంది.
ఉద్యోగం కోల్పోవడం లేదా పిల్లలు పుట్టడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని తేలింది.
“కొంతమంది ప్రస్తుతం పొదుపు చేసే స్థితిలో లేకున్నా, ప్రతి ఒక్కరూ ఎందుకు పొదుపు చేయాలో ఈ నివేదిక ఫలితాలు చూపిస్తున్నాయి. పొదుపు చేసేలా అందర్నీ ప్రోత్సహించాలి" అని ఈ పరిశోధనకు నిధులు సమకూర్చిన బిల్డింగ్ సొసైటీస్ అసోసియేషన్ సేవింగ్స్ హెడ్ ఆండ్రూ గాల్ అన్నారు.
పొదుపు ఖాతాలు సరళంగా, వినియోగదారులు పొదుపు చేయడాన్ని ప్రోత్సహించే విధంగా ఉండాలని ఈ నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి గుర్తుంచుకోండి..
- పాత పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లు తక్కువ ఉంటే వాటిని అధిక వడ్డీ వచ్చే పథకాలకు మార్చుకోవాలి.
- పొదుపు పథకాలను కేవలం పెద్ద బ్యాంకులు మాత్రమే కాకుండా, అనేక రకాల సర్వీస్ ప్రొవైడర్లూ అందిస్తున్నారు. ఎక్కడ మంచి పథకం ఉందో చూసి ఎంచుకోవాలి.
- మీరు మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే కాస్త అధిక వడ్డీ రేట్లు పొందవచ్చు. కానీ అది అందరి జీవనశైలికి సరిపోకపోవచ్చు.
- ఏదైనా ఊహించని ఖర్చులను కవర్ చేయడానికి మీ బడ్జెట్‌లో కొంత పొదుపు చేయడం ముఖ్యం.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














