మిరాకిల్ బేబీ: రెండు రోజులు అన్నం, నీళ్లు లేకుండా అడవిలో తిరిగిన చిన్నారి, చివరకు ఎలా దొరికాడంటే....

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బ్రాండన్ డ్రెనన్
- హోదా, బీబీసీ న్యూస్
ఎప్పుడూ రద్దీగా ఉండే హైవే పక్కన గడ్డిలో పాకుతున్న చిన్నారి అటుగా వెళ్తున్న ఒక ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. దీంతో లూసియానాలో తప్పిపోయిన చిన్నారి కోసం రోజుల పాటు కొనసాగిన గాలింపు చర్యలకు తెరపడింది.
రెండు రోజుల పాటు తిండి, నీళ్లు లేకుండా, ఒంటరిగా గడిపిన ఆ చిన్నారి బతికి బయటపడడం 'మిరాకిల్' (ఒక అద్భుతం) అని స్థానిక పోలీస్ అధికారి (షెరిఫ్) గ్యారీ గిల్లరీ బీబీసీతో అన్నారు.
సమీపంలోని చెరువులో చిన్నారి నాలుగేళ్ల సోదరుడి మృతదేహాన్ని జూలై 8న గుర్తించారు. అప్పటి నుంచి కల్కషియు పోలీసులు చిన్నారి కోసం గాలిస్తున్నారు.
అదే రోజు పోలీసులు విడుదల చేసిన పత్రికా ప్రకటన స్థానిక మీడియాలో దుమారం రేపింది. అది వందల మైళ్ల దూరంలో ఉన్న మిస్సిస్సిప్పీలో ఆ చిన్నారుల తల్లి ఆలియా జాక్ అరెస్టుకు దారితీసింది.
ప్రస్తుతం ఆమె మిస్సిస్సిప్పీలోని మెరిడియన్ జైల్లో ఉన్నారు. తప్పిపోయిన తన పిల్లల గురించి ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలపై ఆమెను లూసియానా పోలీసులకు అప్పగించనున్నారు.
ఆమెపై అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉందని గిల్లరీ చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం బుధవారం చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్‌కు అందజేశారు.
''మేం ఆ చిన్నారిని మిరాకిల్ బేబీగా పిలుస్తాం'' అని షెరిఫ్ గిల్లరీ చెప్పారు.
''అతని శరీరం నిండా పురుగులు కుట్టిన గుర్తులున్నాయి. కానీ, క్షేమంగా ఉన్నాడు. చాలా సంతోషం.'' అన్నారు గిల్లరీ.
అందుకు వాతావరణం కూడా అనుకూలించిందని షెరిఫ్ పేర్కొన్నారు.
లూసియానాలో తీవ్ర ఉష్ణోగ్రతల గురించి ప్రస్తావిస్తూ, ''సూర్యుడు బయటకు రాకపోవడంతో వాతావరణం కూడా వేడెక్కలేదు'' అని ఆయన అన్నారు.
''బెరిల్ తుఫాను ప్రభావం కొంత ఉంది. వాతావరణం మేఘావృతంగా ఉండడంతో చిన్నారి శరీరం వాతావరణంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు, అది కొంత వరకు అదృష్టం.'' అన్నారు.
వింటన్ వెల్‌కమ్ సెంటర్ సమీపంలోని చెరువులో మృతదేహం ఉన్నట్లు కల్కషియు పారిష్ షెరిష్ ఆఫీస్‌కి సోమవారం ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత చిన్నారి కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.

ఫొటో సోర్స్, POLICE
ఒక చెరువులో నాలుగేళ్ల బాలుడి మృతదేహం దొరికిన విషయాన్ని ప్రకటించిన తర్వాత, అతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడని, అతను తప్పిపోయాడన్న విషయం తమకు తెలిసిందని పోలీసులు తెలిపారు.
''ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసి, తద్వారా తదుపరి వివరాలేమైనా తెలుస్తాయేమోనని చూశాం. సరిగ్గా అదే జరిగింది'' అని గిల్లరీ చెప్పారు.
సోమవారం సాయంత్రం షెరిఫ్ కార్యాలయానికి వాళ్ల అమ్మమ్మ ఫోన్ చేశారు. మీడియా కథనాలను చూసి తన మనవళ్ల గురించి ఆమె ఆందోళన చెందారు.
చెరువులో మృతదేహంగా కనిపించిన నాలుగేళ్ల బాలుడికి తమ్ముడు ఉన్నాడని, ఆ చిన్నారి కోసం, వారి తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టాలని ఆమె పోలీసులను కోరారు.
ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే తల్లి ఆలియా జాక్‌ను మిస్సిస్సిప్పీలోని ఒక రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేశారు.
షెరిఫ్ కార్యాలయ పరిధిలోని మెరైన్ డివిజన్, మంగళవారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన బాలుడి కోసం బోట్ల సాయంతో చెరువులో గాలింపు చేపట్టింది.
టెక్సాస్ - లూసియానా సరిహద్దుకు సమీపంలో, ఇంటర్‌స్టేట్-10(రహదారి)పై వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్ నుంచి ఉదయం 9 గంటల (అమెరికా కాలమానం ప్రకారం) సమయంలో ఫోన్ వచ్చింది. హైవే వెంబడి గుంతలో ఎవరో చిన్నారి కనిపించినట్లు డ్రైవర్ చెప్పారు.
కేసు దర్యాప్తు కొనసాగుతోందని, నాలుగేళ్ల బాలుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని గిల్లరీ చెప్పారు. పోస్టుమార్టం జరగాల్సి ఉంది.
అసలేం జరిగింది?
సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో ఈ చిన్నారి తల్లి ఎవరు, అతని అన్న లెజెండ్ మృతదేహం అంతకు ఒక రోజు ముందు ఒక చెరువులో ఎందుకు దొరికింది అన్న విషయంపై స్థానిక మీడియా అనేక కథనాలను ప్రచురించింది.
ఎక్స్‌ప్రెస్ డాట్ యూకే వెబ్‌సైట్ కథనం...
ఈ చిన్నారి అడవిలో దొరకడానికి కొద్ది రోజుల ముందు వరకు తన సంరక్షణలోనే ఉన్నాడని, అతని అమ్మమ్మ కాన్స్‌వెల్లా గతవారం పోలీసులకు తెలిపారు. వీళ్లిద్దరు తన కూతురు ఆలియా జాక్ పిల్లలని ఆమె వెల్లడించారు.
ఆలియా ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందని, పోయిన వీకెండ్‌లో ఇంటికి వచ్చి పిల్లలిద్దరినీ తనకు చెప్పకుండానే తీసుకునివెళ్లిందని ఆమె వెల్లడించారు.
తర్వాత తాను ఎన్నిసార్లు ఆలియాకు ఫోన్ చేసినా స్పందించలేదని వెల్లడించారు.
‘‘పిల్లలిద్దరూ కారులో ఉన్న ఫోటోలను నాకు పంపింది. ఆ కారున్న ప్రాంతమంతా చిట్టడివిలాగా ఉంది.’’ అని కాన్సవెల్లా అకాడియానా అడ్వొకేట్‌కు చెప్పినట్లు పీపుల్ అనే వెబ్‌సైట్ పేర్కొంది.
ఫోటోలు పంపిన తర్వాత కూడా తాను ఎన్నోసార్లు ఆలియాను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించానని, కానీ ఆమె స్పందించలేదని కాన్స్‌వెల్లా వెల్లడించారు.
తాను ఈ మధ్యే తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నానని, ఇప్పుడు పెద్ద మనవడికి కూడా అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని కాన్స్‌వెల్లా చెప్పినట్లు ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ పేర్కొంది.
చిన్న మనవడు క్షేమంగా ఉండటం తనకు ఊరటకలిగించిందని ఆమె అన్నట్లు ఆ వెబ్‌సైట్ వెల్లడించింది.
( బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














