నెలసరి సమయంలో మహిళలకు సెలవు ఇవ్వాల్సిందేనా? దీనిపై వివాదం ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రాచీ కులకర్ణి
- హోదా, బీబీసీ కోసం
పీరియడ్స్ సమయంలో మహిళలకు సెలవు అవసరమా? కాదా? అనే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.
మహిళలకు పూర్తిగా సెలవు ఇవ్వడం వారి బలహీనతకు చిహ్నంగా కనిపిస్తుందని, ఫలితంగా వారికి అవకాశాలు ఇచ్చేందుకు వెనకాడతారని ఒక వర్గం అంటోంది.
ఈ రోజుల్లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే వారికి మేలు జరుగుతుందని మరో వర్గం చెబుతోంది.
ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలే ఈ చర్చకు కారణం.
నెలసరి సమయంలో మహిళలకు సెలవు ఇవ్వాలా? వద్దా? అనే విధానంపై వివిధ సామాజిక సమూహాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత నిపుణులతో చర్చించాలని విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
శైలేంద్ర త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 8న విచారణ సందర్భంగా కోర్టు ఈ సూచనలు చేసింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది.
మహిళలకు పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తే, అది వారి ఉద్యోగావకాశాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.
కోర్టు వ్యాఖ్యల అనంతరం, ఇలాంటి సెలవులు నిజంగా అవసరమా? వాటి వల్ల మహిళలకు అవకాశాలు తగ్గిపోతాయా? అనే చర్చ మొదలైంది.


ఫొటో సోర్స్, ANI
పిటిషన్‌లో ఏం డిమాండ్ చేశారు?
నెలసరి సమయంలో మహిళలకు సెలవు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శైలేంద్ర త్రిపాఠి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
''1961 చట్టం ప్రకారం, ప్రస్తుతం మహిళలు ప్రసూతి సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది. ప్రసవం, లేదా గర్భంతో ఉన్నప్పుడు క్లిష్లమైన పరిస్థితుల్లో ఈ సెలవు తీసుకోవచ్చు. కానీ, దానికి మొదటి దశ అయిన రుతుక్రమాన్ని న్యాయ నిపుణులు, చట్టసభల సభ్యులు, నిపుణులు, అందరూ విస్మరించారు. విదేశాల్లో ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. వాటిని పరిశీలించి కోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి'' అని త్రిపాఠి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
2023లో ఈ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు, ఇది విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన విషయమని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో చర్యలు చేపట్టాల్సిందిగా పిటిషనర్లు మహిళా శిశుసంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకోవాలని 2023 ఫిబ్రవరి 24న కోర్టు సూచించింది.
ఇదే విషయమై రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, అలాంటి సెలవు అవసరం లేదని అప్పటి మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. రుతుక్రమంలో ఉన్న మహిళలు వికలాంగులు కాదని, అది మహిళల జీవితంలో అత్యంత సహజమని పేర్కొన్నారు.
దీంతో త్రిపాఠి మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సెలవు డిమాండ్ ఎందుకు?
నెలసరి సమయంలో మహిళల్లో శారీరకంగా, మానసికంగా మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో చాలామంది మహిళలు అలసిపోతారు. కొందరు తీవ్రమైన కడుపునొప్పి, వెన్నునొప్పితో బాధపడతారు. మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి సెలవులు ఇచ్చే విధానాన్ని తీసుకురావాలని పిటిషనర్ కోరారు.
పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే వైద్యపరమైన సమస్యలను అర్థం చేసుకునేందుకు బీబీసీ గైనకాలజిస్టులను సంప్రదించింది.
''అందరూ కాకపోయినా, పీరియడ్స్ సమయంలో చాలామంది మహిళలకు తీవ్రమైన నొప్పి వస్తుంది. చాలా మంది మహిళలు ఎండోమెట్రియోసిస్‌తో బాధపడుతుంటారు'' అని గైనకాలజిస్ట్, రచయిత అయిన డాక్టర్ ఐశ్వర్య రేవాద్కర్ చెప్పారు.
''ఫైబ్రాయిడ్స్ (గర్భాశయంలో కణుతులు) ఉన్న మహిళలకు పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది. అలాంటి సమయంలో కొందరికి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండొచ్చు. కానీ, పని ప్రదేశాలు, ప్రయాణ సమయాల్లో సరైన సౌకర్యాలు, పరిశుభ్రత వంటివి ఉండవు. కాబట్టి ప్రతి విషయాన్నీ లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది'' అని ఆమె అన్నారు.
పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత పాటించడంపై పనిచేస్తున్న స్వచ్చంద సంస్థ 'సమాజబంధ్' ట్రస్టీ, సామాజిక కార్యకర్త సచిన్ ఆశా సుభాశ్ రుతుస్రావం సమయంలో కలిగే భావోద్వేగ మార్పుల సమస్య గురించి ప్రస్తావించారు.
''రుతుస్రావానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇటీవల పెరుగుతున్నాయి. మహిళలు శారీరక సమస్యలతో పాటు భావోద్వేగ సమస్యలకు గురవుతున్నారు'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల నుంచి వ్యతిరేకత?
పీరియడ్స్ సమయంలో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటారనేది వాస్తవమే అయినా, పని ప్రదేశాల్లో దాని గురించి చర్చించుకోవడం వల్ల మహిళలు బలహీనురనే కొందరి భావన మరింత బలపడుతుంది. అందువల్ల మహిళలు ఈ సెలవులకు అనుకూలంగా లేరని మహారాష్ట్ర మహిళా కమిషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాలి చకంకర్ అన్నారు.
''ఈ విషయంపై సెమినార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మెయిల్స్ వచ్చాయి. పలు సామాజిక సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మహిళలు బలహీనులనే అంతరార్థం ధ్వనిస్తోందన్నారు. ఒకవైపు, మహిళల సమానత్వ డిమాండ్, మరోవైపు స్పెషల్ ట్రీట్‌మెంట్ అవసరమా? అనే వాదన'' అని రూపాలి అన్నారు.

ఫొటో సోర్స్, ANI
'అసంఘటిత రంగంలో అమలు అతిపెద్ద సవాల్'
పీరియడ్స్ సమయంలో సెలవుల కారణంగా మహిళలకు ఉద్యోగావకాశాలు తగ్గిపోవచ్చనే అంశాన్ని కోర్టు లేవనెత్తింది.
సంఘటిత రంగంలోనే కాకుండా, అసంఘటిత రంగంలోనూ రుతుస్రావం అనేది మహిళలకు అనేక విధాలుగా సమస్యగా మారుతోందని సచిన్ ఆశా సుభాశ్ తెలిపారు. అసంఘటిత రంగానికి వస్తే, ఈ సమస్య మరింత క్లిష్టతరమని ఆమె సూచించారు.
ఆశా తెలిపిన దాని ప్రకారం, ''సంఘటిత రంగంలోని మహిళలకు రుతుస్రావం సెలవులు ఉపయోగపడతాయి. కానీ, వ్యవసాయం, భవన నిర్మాణం వంటి రంగాల్లో మహిళలు రోజువారీ కూలీలుగా పనిచేస్తారు. అందులోనూ, ప్రతి యజమానికీ వేతనంతో కూడిన సెలవు ఇచ్చేంత సామర్థ్యం ఉండకపోవచ్చు'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అనేక దేశాల్లో అమలు.. భారత్‌లోనూ కొన్ని ఉదాహరణలు..
పీరియడ్స్ సమయంలో సెలవుల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహిళలకు పీరియడ్స్ సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని సోవియట్ రష్యా నిర్ణయించింది. జపాన్ కూడా 1947లో దీనికి సంబంధించిన చట్టాన్ని ఆమోదించింది.
దక్షిణ కొరియా 1953లో వేతనంతో కూడిన సెలవులను ఆమోదించింది. అలాగే, చైనాలోని కొన్ని ప్రావిన్సులలో రెండు రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు.
యూకే, తైవాన్, జాంబియాలోనూ ఇలాంటి సెలవులు తీసుకునే అవకాశం ఉంది. స్పెయిన్‌లో రుతుస్రావం సెలవు తీసుకునేందుకు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
భారత్‌లోనూ రెండు రోజులు సెలవు ఇవ్వాలని 1992లో బిహార్‌లో నిర్ణయించారు. 2017లో నినాంగ్ ఎరింగ్ ఎంపీగా ఉన్నప్పుడు 'మెన్‌స్ట్రుయేషన్ బెనెఫిట్ బిల్లు'ను ప్రవేశపెట్టారు.
కోవిడ్ సమయంలో జొమాటో కూడా ఇలాంటి సెలవును ప్రకటించింది. దానితో పాటు ముంబయిలోని కల్చర్ మెషీన్, గురుగ్రామ్‌లోని గోజూప్, కోల్‌కతాలోని ఫ్లైమాబిజ్ వంటి కంపెనీలు కూడా పీరియడ్స్ సమయంలో సెలవులు ఇచ్చాయి.
పీరియడ్స్ సమయంలో సెలవులు తీసుకునే అవకాశం ఉన్నచోట వాటిని మహిళలు పూర్తిగా వినియోగించుకుంటున్నారా? అనేదే అసలు ప్రశ్న అని మిఠీబాయ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గాయత్రి లేలే అన్నారు.
ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''జపాన్‌లో సెలవు తీసుకునే అవకాశం ఉంది. కానీ, సెలవు తీసుకోవడం బలహీనతకు సంకేతంగా భావించారు. అందువల్ల అక్కడి మహిళలు సెలవు తీసుకోవడం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి" అన్నారు.
''పితృత్వ సెలవులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, చాలా మంది పురుషులు తమ పనిపై ప్రభావం పడుతుందని ఆ సెలవులు తీసుకోరు. అలాగే, మహిళలు కూడా సెలవు తీసుకోవడం మానేస్తారు. సెలవు లేదా విశ్రాంతి తీసుకోవడం అనేది సామర్థ్యాన్ని తగ్గిస్తుందనే భావనతో ముడిపడి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధమైన విషయం ఏంటంటే, విశ్రాంతి సామర్థ్యాన్ని పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి'' అని గాయత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
'స్వచ్చంద సెలవు ఉండాలి కానీ, తప్పనిసరిగా కాదు'
అయితే, సెలవులు అవసరం లేదా? అంటే, అలాంటి సెలవులు అవసరమేనని మహిళలు అంటున్నారు.
న్యాయవాది, సామాజిక కార్యకర్త రమా సరోదే మాట్లాడుతూ, ''తప్పనిసరిగా సెలవు ఇవ్వాలనేదానికి బదులుగా, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సెలవు తీసుకునే విధానం ఉండాలి. దీనిని ఇతర సెలవులతో పోల్చకూడదు. ఎందుకంటే, రుతుక్రమం అనేది అనారోగ్యం కాదు, అందువల్ల మెడికల్ లీవ్ అనే ప్రశ్నే లేదు. వైద్యనిపుణుల సూచన మేరకు సెలవు తీసుకునేలా విధానం రూపొందించాలి'' అన్నారు.
దానితో పాటు, సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునిపోయే విషయంలో, సుప్రీం కోర్టు యోచన సరైనదని సరోదే అభిప్రాయపడ్డారు.
''మహిళలు ఇప్పటికీ సమాన స్థాయిలో లేరని గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. పనిప్రదేశాల్లో మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉంది. వైవిధ్యం, భాగస్వామ్యాన్ని ఇప్పటికీ చాలా కంపెనీలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందువల్ల కోర్టు ఆలోచన సరైనది'' అని న్యాయవాది చెప్పారు.
స్వచ్చందంగా సెలవు తీసుకునే అవకాశం ఉంటే మహిళలు విధులు నిర్వర్తిస్తారని, అవసరమైతే వారికి సెలవు తీసుకునే అవకాశం ఉంటుందని సరోదే అన్నారు.
స్వచ్చంద సెలవు ఇవ్వాలని రూపాలీ చకంకర్ కూడా సూచించారు.
ఇబ్బంది ఎదుర్కొంటున్న మహిళకు సెలవు ఉండాలి. కానీ, దానికోసం ప్రత్యేక నిబంధన అవసరం లేదని ఆమె అన్నారు.
''మేం స్కూల్, కాలేజీలో ఉన్నప్పుడు టీచర్‌కి చెప్పి సెలవు తీసుకునేవాళ్లం. అలాగే చదువు పూర్తి చేశాం. అలాంటి అవకాశం ఉండాలి. ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సెలవు ఇవ్వాలి కానీ, మహిళలను తగ్గించేందుకు అది కారణం కాకూడదు'' చకంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'సక్రమంగా అమలు జరగాలి'
''ఆ సమయంలో కొంతమంది మహిళలు తీవ్రంగా బాధపడతారు. ప్రయాణ సమయంలో ఇది చాలా బాధిస్తుంది. కాబట్టి, విశ్రాంతి అవసరం. ఆఫీసుల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు, టీ, కాఫీ వంటి చిన్న చిన్న ఏర్పాట్లు కూడా ఉపశమనం కలిగించవచ్చు'' అని ప్రొఫెసర్ గాయత్రి అన్నారు.
న్యాయవాది విజయలక్ష్మి ఖోప్డే రుతుక్రమం సెలవులకు అనుకూలంగా ఉన్నారు.
''రుతుక్రమం మహిళలకు సంబంధించిన అంశం. వాస్తవానికి, ఇది కోర్టు బాధ్యతను మరింత పెంచింది. దిశానిర్దేశం చేయడానికి బదులు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని భావించారు. సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగ సమస్యలను కూడా పరిష్కరించాలి. నిజానికి దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే పెద్ద విషయమే'' అని ఆమె అన్నారు.
బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














