అరుదైన వ్యాధికి మానవ మలంతో వైద్యం...అసలేమిటీ చికిత్స, ఎలా చేస్తారు?

ఫొటో సోర్స్, Rick Dallaway/Getty Images
- రచయిత, సునేత్ పెరీరా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అవయవమార్పిడి, రక్తమార్పిడి గురించి అందరూ వినే ఉంటారు. ఇప్పుడా కోవలోకి మలమార్పిడి కూడా చేరనుంది.పేగు వ్యాధులతో బాధపడేవారికి ఈ మలమార్పిడితో ఉపశమనం కలిగించేందుకు పలు దేశాలలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
"మల మార్పిడి అనే ఆలోచన నిజంగా వింతైనది," అని రిక్ డాలవే అన్నారు. వేరొకరు డొనేట్ చేసిన మలానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్‌లో చేరాలని తనను ఆహ్వానించిన క్షణాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగిటిస్ (పీఎస్‌సీ) అనే అరుదైన దీర్ఘకాలిక కాలేయ వ్యాధి నివారణ కోసం ఆశతో, 50 ఏళ్ల రిక్ ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో వారానికోసారి ‘మల మార్పిడి’ చేయించుకునే రెండు నెలల కార్యక్రమంలో పాల్గొన్నారు.
"అది మామూలు మలం కాదు," అని ఆయన మార్పిడి ప్రక్రియను వివరిస్తూ నవ్వారు. "దాన్ని ల్యాబ్‌లో శుద్ధి చేస్తారు."
ప్రస్తుతం రిక్ ఎదుర్కొంటున్న అరుదైన వ్యాధికి, చివరి దశ కాలేయ మార్పిడి మినహా చికిత్స లేదు. ఇది యూకేలోని లక్ష మందిలో ఆరు నుంచి ఏడుగురు వ్యక్తులకు వచ్చే అవకాశం ఉంది. ఇది వాళ్ల ఆయుర్దాయాన్ని 17- 20 ఏళ్లు తగ్గిస్తుంది.


ఫొటో సోర్స్, MTC/University of Birmingham
‘మల మార్పిడి’ అంటే ఏమిటి?
ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ (ఎఫ్‌ఎమ్‌టీ)ను, మల మార్పిడి అని పిలుస్తారు. అనేక దేశాలలో పేగు వ్యాధులతో బాధపడుతున్న రోగులకు, ఎక్కువగా క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా చేస్తున్నారు.
దీనిలో ఆరోగ్యకరమైన దాతలను పరీక్షించి, వారి మల నమూనాల నుంచి పేగు బ్యాక్టీరియాను తీసుకుని, ఆ బ్యాక్టీరియాను రోగి పేగులలో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు.
ఈ ప్రక్రియ సాధారణంగా కొలనోస్కోపీ, ఎనిమా లేదా నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా చేస్తారు.
50 ఎంఎల్ లిక్విడ్ ఎఫ్‌ఎమ్‌టీ నమూనా ఖరీదు సుమారు లక్షా 40 వేల రూపాయలు ఉంటుంది. యాంటీబయాటిక్స్‌ను మళ్లీ మళ్లీ వాడడం, ఆసుపత్రి ట్రీట్‌మెంట్ ఖర్చుకన్నా ఇది తక్కువ అని నిపుణులు అంటున్నారు. కొన్ని సందర్భాలలో, ఎఫ్‌ఎమ్‌టీని ఒకసారి మాత్రమే నిర్వహించాలి.
కొన్నిచోట్ల మానవ మలంలోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాతో తయారు చేసిన నోటి మాత్రలను కూడా అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, MTC/University of Birmingham
‘అసహ్యించుకోవాల్సిన పనిలేదు’
కాలేయం, మూత్రపిండాలు లేదా గుండె అవసరమైన వ్యక్తులు తగిన దాతను కనుగొనడానికి నెలలు లేదా సంవత్సరాలు వేచి ఉండాల్సి రావచ్చు.
ఇలాంటి అవయవాలకు భిన్నంగా, మానవ మలంతో ఆ సమస్య లేదు. అయితే మరొకరి మలం అనే ఆలోచన కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు.
కానీ సైన్స్‌ను విశ్వసించిన రిక్ ఈ ట్రయల్స్‌కు ఒప్పుకుంటే, స్నేహితులు, బంధువులు ఆయనకు మద్దతు ఇచ్చారు.
"దీనిలో అసహ్యించుకోవాల్సిన విషయం ఏమీ లేదు," అని రిక్ అన్నారు. "'ఒక అవకాశం అంటూ ఉంటే, దానిని ఎందుకు ప్రయత్నించి చూడకూడదు అని వాళ్లు అన్నారు.” అని రిక్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
స్టూల్ బ్యాంక్స్
యూనివర్శిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్‌లోని మైక్రోబయోమ్ ట్రీట్‌మెంట్ సెంటర్ (ఎమ్‌టీసీ) అనేది యూకేలోని మొట్టమొదటి థర్డ్ పార్టీ ఎఫ్‌ఎమ్‌టీ సర్వీస్. ఇది వందలమంది రోగులకు సురక్షితంగా చికిత్స చేయడానికి, ట్రయల్స్ నిర్వహించడానికి వైద్యులకు మల నమూనాలను సరఫరా చేస్తుంది.
ఇక్కడ దాతలకు కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. దీనిలో వారి వైద్య చరిత్ర, జీవనశైలిని పరిశీలించడమే కాకుండా, వారి రక్తం, మలంలో వ్యాధికారకాలు ఉన్నాయేమో పరీక్షిస్తారు.
పరీక్షల అనంతరం, ఆరోగ్యకరమైన మలం నమూనాలను సేకరించి మైనస్ 80 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఫ్రీజర్‌లో 12 నెలల వరకు నిల్వ చేస్తారు. రోగికి మల మార్పిడి అవసరమైనప్పుడు, మలాన్ని డీఫ్రాస్ట్ చేసి, సిరంజిలోకి ఎక్కిస్తారు.
"స్టూల్ బ్యాంకులు లేని దేశాల్లో ఇది చాలా కష్టం. కానీ నిజంగా, ఫ్రీజ్ చేసిన ఎఫ్‌ఎమ్‌టీని ఉపయోగించడం మంచిది. దాని వల్ల దాతలను పరీక్షించడానికి సమయం దొరుకుతుంది." అని మైక్రోబయోమ్ ట్రీట్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ తారిక్ ఇక్బాల్ బీబీసీకి చెప్పారు.
పీఎస్‌సీలో ఎఫ్‌ఎమ్‌టి పాత్ర
రిక్‌లాగే ప్రైమరీ స్క్లెరోసింగ్ కోలాంగిటిస్ (పీఎస్‌సీ) కండిషన్ ఉన్న రోగులలో 70 నుంచి 80% మందికి ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) పెరిగే అవకాశం ఉందని, దీని కారణంగా కడుపు నొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
రిక్‌ను పర్యవేక్షిస్తున్న కన్సల్టెంట్ హెపాటాలజిస్ట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పాలక్ త్రివేది, పీఎస్‌సీ ఎందుకు వస్తుందో, దానికీ ఐబీడీకి ఉన్న సంబంధం ఏమిటో శాస్త్రవేత్తలకు ఇంకా తెలీదని చెప్పారు.
మల మార్పిడిపై మార్గదర్శకాలు
అయితే ప్రస్తుతానికి మలమార్పిడి మొదటి ప్రత్యామ్నాయం కాదని ఎఫ్‌ఎమ్‌టీపై అధికారిక మార్గదర్శకాల తయారీలో సహకరించిన లండన్ ఇంపీరియల్ కాలేజ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ హోరేస్ విలియమ్స్ అన్నారు.
దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్‌రాండ్ (విట్స్) విశ్వవిద్యాలయలయానికి చెందిన మెడికల్ బయోఎథిసిస్ట్ డాక్టర్ హ్యారియెట్ ఎథెరెడ్జ్, స్పష్టమైన మార్గదర్శకాలు లేని పేద దేశాలలో ఎఫ్‌ఎమ్‌టీ చేయడం హానికరమని అభిప్రాయపడ్డారు.
ఈ చికిత్స కారణంగా కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అవగాహన పెరుగుతోంది
అమెరికా, యూరప్‌తో పాటు, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారతదేశంతో సహా పలు దేశాల్లో ఎఫ్‌ఎమ్‌టీని ప్రయోగాత్మకంగా నిర్వహించి చూశారు.
కొంతమంది రోగులు మలం పట్ల అసహ్యంతో పాటు వివిధ సాంస్కృతిక, సామాజిక, మత విశ్వాసాల కారణంగా ఈ చికిత్సకు అంగీకరించరు.
"ప్రజలు కొన్నిసార్లు ఈ చికిత్సకు చాలా విచిత్రంగా స్పందిస్తారు. వాళ్లు డాక్టర్ తమాషా చేస్తున్నారని అనుకుంటారు" అని భారతదేశంలోని సర్ గంగారామ్ హాస్పిటల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ప్యాంక్రియాటిక్ బిలియరీ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ పీయూష్ రంజన్ అన్నారు.
కొంతమంది రోగులు ఆ మలం బంధువులది అయితే స్వీకరించడానికి సిద్ధమైనట్లు డాక్టర్ రంజన్ చెప్పారు. అదే అపరిచితుల మలానికి పరీక్షలు జరిపి, ఆరోగ్యకరంగా ఉన్నట్టు తేల్చినా స్వీకరించడానికి కొందరు ఇష్టపడరని తెలిపారు.
దీనికి విరుద్ధంగా, యూకేలో నిర్వహించిన ఒక సర్వేలో, తమకు తెలిసిన వారి కంటే తెలియని వారి నుంచి తీసుకున్న మలమార్పిడికి సిద్ధమని మెజారిటీ వ్యక్తులు చెప్పారు.
అదే సర్వేలో మొదట 37% మందే తాము మల మార్పిడిని అంగీకరిస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ గురించి మరింత తెలుసుకున్న తర్వాత ఈ సంఖ్య 54 % కు పెరిగింది.
"చదువు చాలాసార్లు అవగాహనను పెంచి, అడ్డంకులను తొలగిస్తుంది" అని అధ్యయనాన్ని నిర్వహించిన డాక్టర్ బ్రెట్ పామర్ బీబీసీతో అన్నారు.
రిక్ తన ట్రయల్స్, ఈ అరుదైన వ్యాధి నయం కావడానికి దారి తీస్తుందని ఆశిస్తున్నారు.
"మానవ మలంతో వైద్య చికిత్స చేయవచ్చని 10 ఏళ్ల క్రితం ఎవరైనా నాకు చెబితే, నేను అస్సలు నమ్మేవాణ్ని కాదు" అని ఆయన అన్నారు. "కానీ అది ఇప్పుడు వాస్తవం, అది ఇప్పుడు జరుగుతోంది." అన్నారాయన.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










