నేత్ర యోగ: కంటి వ్యాయామాలతో కళ్లద్దాలు ధరించకుండా ఉండవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, షార్లెట్ కొడీనా
- హోదా, బీబీసీ కోసం
ఈ రోజుల్లో రెండు మూడేళ్ల వయసు పిల్లల నుంచి వృద్ధుల దాకా చాలామందికి కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. అయితే, నేత్ర యోగాతో కళ్లద్దాలు ధరించాల్సిన అవసరాన్ని నివారించుకోవచ్చని, తాను అలాగే చేస్తున్నానని బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు పాల్ మెకార్ట్‌నీ చెప్పారు.
ఇటీవల టైమ్స్ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. కొన్నేళ్ల క్రితం భారత్‌లో కంటి వ్యాయామాలను నేర్చుకున్నానని, అప్పటి నుంచి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు. కంటి కండరాలతో వ్యాయామం చేయడం వల్ల కళ్లద్దాల అవసరం తగ్గుతుందని ఆయన అంటున్నారు.
ఇంతకీ ఈ నేత్ర యోగ ఏమిటి? మీ కళ్లతో వ్యాయామం చేయడం వల్ల నిజంగా కళ్లద్దాల అవసరం ఉండదా?


ఫొటో సోర్స్, Getty Images
రుజువులు ఉన్నాయా?
వివిధ రకాల నేత్ర యోగాను వేల సంవత్సరాలుగా సాధన చేస్తున్నారు. ఇది ఒక 'త్రాటక్ క్రియ', ఇది భారతదేశంలో ఉద్భవించింది. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపునకు సహాయపడుతుందనే నమ్మకంతో సాధన చేసే ఒక యోగ రూపం.
సంస్కృతంలో "త్రాటక్" అంటే "తదేకంగా చూడటం" అని అర్ధం. కన్నీళ్లు కారేంత వరకు కొవ్వొత్తి మంట వంటి వాటిని రెప్పవేయకుండా చూడటాన్ని ఇది సూచిస్తుంది.
19వ శతాబ్దపు చివరలో న్యూయార్క్ కంటి వైద్యుడు డాక్టర్ విలియం బేట్స్ "కళ్లద్దాలు లేకుండా కంటి చూపును మెరుగుపరిచే బేట్స్ మెథడ్"ను సూచించారు. దీనిలో ఆయన కంటి వ్యాయామాలతో కళ్లద్దాల అవసరం ఉండదని తెలిపారు.
కంటి కదలికలు, విజువలైజేషన్ టెక్నిక్‌లతో కూడిన వ్యాయామాలు, కంటి చార్ట్‌ను చూడటం, అక్షరాల రూపురేఖలపై దృష్టి పెట్టడం, తరచుగా రెప్పవేయడం, అక్షరాలను దృశ్యమానం చేయడానికి కళ్లు మూసుకోవడం వంటి వ్యాయామాల ద్వారా కళ్లజోడు అవసరాన్ని నివారించొచ్చని డాక్టర్ విలియం విశ్వసించారు.
బేట్స్ సూచించిన కంటి వ్యాయామ పద్ధతులను ఇప్పటికీ ఒక వెబ్‌సైట్ ప్రమోట్ చేస్తోంది.
అయితే, కంటి కదలికలు, దృష్టి కేంద్రీకరించే సమయంలో కంటి ఆకారం మారుతుందనే బేట్స్ సిద్ధాంతం శరీర ధర్మపరంగా వాస్తవం కాదు.
2018లో జరిపిన ఒక అధ్యయనాన్ని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ఎనిమిది వారాల పాటు బేట్స్ వ్యాయామాలు లేదా "త్రాటక్"ను అభ్యసించిన వారిలో దృశ్య తీక్షణత (మనుషులు చూడగలిగే అతి చిన్న ముద్రణ), వక్రీభవన లోపాలను పోల్చి చూసింది.
వ్యాయామాల వల్ల దృశ్య తీక్షణత లేదా వక్రీభవన లోపంలో ఎలాంటి తేడా కనిపించలేదని ఈ అధ్యయనం నిర్ధరించింది. బేట్స్ విధానాలను నేత్ర వైద్యనిపుణులూ తిరస్కరించారు. దీనికి రుజువులు లేకపోవడమే కాకుండా ఇది ప్రమాదకరమైనదని, ఇది రెటీనాకు సూర్యరశ్మి అతిగా తాకేలా చేస్తుంది కాబట్టి హానికరమైనది కూడా అని చెప్పారు.
నేత్ర యోగ లేదా బేట్స్ థియరీ వ్యాయామాలు ఎందుకు దృష్టిని సరిచేయలేవో అర్థం చేసుకోవడానికి కంటిని, మనం ఎలా చూస్తామన్నదానిని అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
మనకు కళ్లద్దాలు ఎందుకు అవసరం?
కాంతి కిరణాలు రెటీనాపై ఫోకస్ కానప్పుడు కళ్లద్దాల అవసరం ఏర్పడుతుంది. రెటీనా ముందు ఫోకస్ పాయింట్ ఏర్పడితే, దానిని మయోపియా లేదా హృస్వ దృష్టి అంటారు. ఫోకస్ పాయింట్ రెటీనా వెనుక ఉన్నప్పుడు, దానిని హైపరోపియా లేదా దీర్ఘ దృష్టి అంటారు.
కంటి ముందు ఉపరితలపు వక్రత - గోళంలా కాకుండా, రగ్బీ బాల్ లాగా మారినప్పుడు ఆస్టిగ్మాటిజం ఏర్పడుతుంది. దీని వలన ఎంత దగ్గర ఉన్న వస్తువైనా అస్పష్టంగా కనిపిస్తుంది.
ప్రెస్బియోపియా అనేది ఒక సాధారణ వృద్ధాప్య ప్రక్రియ, దీనిలో కంటి లెన్స్ గట్టిబడి ఉంటాయి. దీని వల్ల దగ్గరగా ఉన్నవాటిపై ఫోకస్ పెట్టలేం. అందుకే చాలామందికి మధ్య వయసులో రీడింగ్ గ్లాసెస్ అవసరం అవుతాయి.
కంటి లోపలి, బయటి కండరాలు కొంతవరకు కలిసి పని చేస్తున్నప్పుడు, కళ్లతో అటు వైపు, ఇటు వైపు చూడడం కంటి ఆకారం లేదా పరిమాణం లేదా దృష్టిని ప్రభావితం చేయదు. కాబట్టి వక్రీభవన శక్తిని మార్చడానికి కంటి వ్యాయామాలు చేయడం అనేది అర్థరహితం.
అయినప్పటికీ, కంటి కదలిక లోపాలు, కంటి సమస్యలను నిర్ధారించి, చికిత్స చేసే నిపుణులైన ఆర్థోప్టిస్టులు, కొన్ని నిర్దిష్ట వ్యాయామాలను సూచిస్తారు.
దీనికి ఒక ఉదాహరణ "కన్వర్జెన్స్ ఇన్‌సఫీషియెన్సీ". దీనిలో ప్రజలు తమ కళ్లను లోపలికి లాక్కోవడంలో ఇబ్బంది వల్ల దగ్గరలో ఉన్న వస్తువులు వాళ్లకు రెండుగా కనిపిస్తాయి. పెన్సిల్‌తో సున్నితమైన కన్వర్జెన్స్‌ని సాధన చేయడం దీనికి సాయపడవచ్చు. దీనిలో పెన్సిల్ మెల్లగా ముక్కు వైపు కదులుతుండగా, కళ్ళు పెన్సిల్‌ను అనుసరిస్తాయి.
రీడింగ్ గ్లాసెస్ ధరించడం, దగ్గరగా ఉన్నవాటిపై ఫోకస్ చేయడం కష్టంగా మారినప్పుడు, చిన్న అక్షరాలపై దృష్టి పెట్టి, దానిని మెల్లగా ముక్కు వైపునకు కదిలించడం ద్వారా దీన్ని మెరుగుపరచవచ్చు.
అంతే కాకుండా పెద్దలు వయసు పెరిగే కొద్దీ పైకి చూడడం కష్టంగా మారడమూ సహజమే.
ఈ వ్యాయామాలు కొంతమేరకు సాయపడవచ్చు. అయితే వ్యాయామాల ద్వారా ప్రెస్బియోపియాను జాప్యం చేయవచ్చన్న వాదనను సమర్ధించే రుజువులు లేవు.
20:20:20 నియమాన్ని అనుసరించండి
నేత్ర యోగాను మీరు రెండు నిమిషాలు మాత్రమే చేసి, ఆపై దూరంగా చూస్తూ మీ కండరాలను రిలాక్స్ కానిస్తే, అది మీ కళ్లకు హాని కలిగించదు. అయితే, జీవనశైలిలో మరికొన్ని మార్పులు చేసుకుంటే అవి మరింత సాయపడవచ్చు.
మీ కంటి గ్లాస్ ప్రిస్క్రిప్షన్, కంటి ఒత్తిడి, మీ రెటీనా, కళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం కోసం నేత్ర వైద్యులను (సాధారణంగా పిల్లలకు ప్రతి సంవత్సరం, పెద్దలకు ప్రతి రెండు సంవత్సరాలకు) సంప్రదించడం వల్ల గ్లకోమా వంటి వ్యాధులను ప్రారంభంలోనే గుర్తించి, చికిత్స తీసుకోవచ్చు.
స్క్రీన్ చూడడం నుంచి క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం వల్ల కళ్లు పొడిబారడం తగ్గుతుంది.
20:20:20 నియమం
ప్రతి 20 నిమిషాలకు, 20 సెకన్ల విరామం తీసుకోండి. 20 అడుగుల (6 మీటర్లు) కంటే ఎక్కువ దూరం నుంచి చూడండి.
ఆరు బయట సమయం గడపడం మీ కంటి చూపుకు మంచిది. ఆరుబయట సమయం గడిపే పిల్లలకు హ్రస్వ దృష్టి వచ్చే అవకాశం తక్కువ.
మధ్యధరా ప్రాంతానికి సంబంధించిన ఆహారం, ఆకుకూరలు కండరాల క్షీణతను నిరోధించడంలో సహాయపడతాయనడానికి ఆధారాలు ఉన్నాయి.
ఒమేగా-3 ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న ఆహారంతో పొడికళ్ళ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
రాత్రి మంచి నిద్రపోవడం, సూర్యుని వెలుతురులోకి వెళ్లినప్పుడు నాణ్యమైన సన్ గ్లాసెస్ ధరించడం మంచిది.
మీరు పొడికళ్లతో బాధపడుతుంటే లేదా ఎక్కువ కాలం స్క్రీన్‌ను చూస్తుంటే, మీ మియ్‌బోమియన్ గ్రంధులను మసాజ్ చేయడం వల్ల అసౌకర్యాన్ని నివారించవచ్చు.
సరైన వెలుతురులో చదవడం, వీలైతే ఫోన్‌లో కాకుండా కంప్యూటర్‌లో అక్షరాల పరిమాణాన్ని పెంచి చదవడం మంచిది.
నేత్ర యోగా కళ్లద్దాలు ధరించాల్సిన అవసరాన్ని తొలగించదు. మీ కళ్ళను, దృష్టిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇతర మార్గాలు ఉన్నాయి.
*(షార్లెట్ కోడినా అనేక బ్రిటీష్ ఆసుపత్రులలో అనుభవం ఉన్న ఆర్థోప్టిస్ట్, షెఫీల్డ్ విశ్వవిద్యాలయంలో లెక్చరర్)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














