కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

ఫొటో సోర్స్, Getty Images
మూత్రం రంగు ఆధారంగా మన శరీరంలో ఏం జరుగుతోందన్నది వైద్యులు అంచనా వేస్తారు. ఎందుకంటే, మూత్రం రంగు చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి తెలియజేస్తుంది.
మన రక్తంలో ప్రవహించే వ్యర్థ పదార్ధాలను కిడ్నీలు వేరు చేసి బయటకు పంపుతాయి. వ్యర్థాలను బయటకు పంపకుంటే అవి విషపూరితంగా మారి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయి.
మూత్రంలో నీరు, యూరియా, లవణాలు ఉంటాయి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. అలా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లుగా వైద్యులు పరిగణిస్తారు.
ఎరుపు రంగుతో పాటు మరికొన్ని అసాధారణ రంగుల్లో మూత్రం ఉంటే ప్రమాదానికి సంకేతమని చెన్నైకి చెందిన నెఫ్రాలజిస్ట్, కిడ్నీ మార్పిడి సర్జన్ డా. ఆంటన్ యూరేశ్ కుమార్ చెప్పారు.
మూత్రం రంగు మనలోని ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, కొన్నిసార్లు మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా ఆ రంగు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.
అయితే మూత్రం లేత పసుపు, ఎరుపే కాదు, మరికొన్ని రంగుల్లోనూ ఉంటుంది. మరి మీ మూత్రం ఏ రంగులో ఉంటే అనారోగ్యానికి సంకేతం? దీనికి సంబంధించి డాక్టర్ ఆంటన్ యూరేశ్ కుమార్ చెప్పిన వివరాలను చూద్దాం..


ఫొటో సోర్స్, Getty Images
1. ఎరుపు రంగు
ఎరుపు రంగు మూత్రం తీవ్రమైన సమస్యకు సంకేతం. ఈ మూత్రంలో రక్తం ఉందని అర్థం. ఎరుపు రంగు మూత్రం కిడ్నీ క్యాన్సర్, కిడ్నీలో రాళ్ల వంటి వ్యాధుల లక్షణాలను సూచిస్తుంది.
అందువల్ల మూత్రం ఎరుపు రంగులో ఉంటే దానిని తీవ్రమైన, అత్యవసర సంకేతంగా పరిగణించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అయితే బీట్‌రూట్, బ్లాక్ బెర్రీలు లాంటివి తింటే కొన్నిసార్లు మూత్రం ఎర్రగా వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. ముదురు పసుపు, నారింజ రంగు
పసుపు రంగు మూత్రం సాధారణంగా వస్తుంటుంది. అయితే ముదురు పసుపు, నారింజ రంగు మూత్రం శరీరంలో డీహైడ్రేషన్‌ను సూచిస్తుంది. ఎక్కువగా పని చేయడం, వ్యాయామం, వేడిగా ఉండే ప్రదేశంలో నివసించడం వల్ల ఎక్కువగా డీహైడ్రేషన్ వస్తుంది.
డీహైడ్రేషన్‌కు చికిత్స చేయకుండా వదిలేస్తే, అది మూత్రపిండాల్లో రాళ్లను అభివృద్ధి చేయవచ్చు. కాబట్టి, నిర్లక్షం చేయకూడదు. వైద్యులను సంప్రదించాలి.
టీబీ మాత్రలు వేసుకునేవారికి కొన్నిసార్లు నారింజ రంగు మూత్రం రావొచ్చు. తగినంత నీరు తీసుకున్నప్పుడు మూత్రం మళ్లీ లేత పసుపు రంగులోకి వస్తుంది. ఇది డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది.
ఒకవేళ తేనె రంగు మూత్రం వస్తే మీరు తగినంత నీరు తాగడం లేదని అర్థమని అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ చెబుతోంది.
3. పాల రంగు
పాల రంగు మూత్రం బోదకాలు (ఎలిఫెంటియాసిస్) వ్యాధికి సంకేతం.
మిల్కీ వైట్ రంగులోని మూత్రం దుర్వాసనతో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది.
బాక్టీరియా, శిలీంధ్రాలు లేదా వైరస్‌ల వల్ల ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) లక్షణాల్లో ఇదొకటి.
4. కాఫీ, నలుపు రంగు
కాఫీ రంగు మూత్రం యూరోబిలినోజెన్ అనే రుగ్మతను సూచిస్తుంది. ఇది కాలేయ సంబంధిత వ్యాధుల లక్షణంగా పరిగణిస్తారు. ఫావా బీన్స్ అని పిలిచే ఒక రకమైన బీన్‌ను ఎక్కువగా తినడం వల్ల కాఫీ రంగు మూత్రం వస్తుంటుంది.
మలేరియా కోసం తీసుకునే క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి మందులు, కొన్ని యాంటీబయాటిక్స్ కాఫీ రంగు మూత్రానికి కారణమవుతాయి. మీ మూత్రం నల్లగా ఉంటే అది మూత్రపిండాల వ్యాధి వంటి మరింత తీవ్రమైన సమస్యలకు సంకేతం కావచ్చు.
ఇవి కాకుండా కొన్ని అసాధారణ రంగులలోనూ మూత్రం వస్తుంటుంది. ఇవి చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్ ఆంటన్ యూరేశ్ కుమార్ చెబుతున్నారు. అయితే, అవి ఎక్కువ రిస్క్ కాదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5. గులాబీ రంగు
మీ మూత్రం లేత గులాబీ రంగులో ఉంటే అందులో రక్తం ఉండే అవకాశలెక్కువ. కొన్నిసార్లు దుంపలు వంటి ఆహారాలు తినడం వల్ల మీ మూత్రం లేత గులాబీ రంగులో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
6. ఆకుపచ్చ రంగు - నీలం రంగు
గ్రీన్, బ్లూ రంగుల్లో ఉండే కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆకుపచ్చ, నీలం రంగు మూత్రం వస్తుంటుంది. ఆకుపచ్చ మూత్రం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుందని అమెరికన్ యూరాలజికల్ అసోసియేషన్ చెబుతోంది.
అంతేకాదు, కృత్రిమ రంగులతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల కూడా మీ మూత్రం ఆకుపచ్చ లేదా నీలం రంగులోకి మారుతుందని ఆ సంస్థ తెలిపింది. అయితే, ఇది చాలా అరుదుగా జరుగుతుంటుందని చెప్పింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















