బడ్జెట్ 2024-25: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 15 వేల కోట్లు...

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్‌కు కీలక సాయం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. రానున్న సంవత్సరాలలోనూ సాయం కొనసాగుతుందన్నారు.
అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు, దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు.. ప్రకాశం జిల్లాకు సాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని.. విశాఖ-చెన్నై కారిడార్‌లో ఉన్న కొప్పర్తి నోడ్ , హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లోని ఓర్వకల్లుకు నిధులు కేటాయిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అనుసరించి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలోని మిగతా 8 నెలల కాలానికి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చెప్పినట్లుగానే పేదలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
మధ్యంతర బడ్జెట్లో చెప్పినట్లుగా ఇప్పటికే రైతుల కోసం అన్ని ప్రధాన పంటలకు అధిక కనీస మద్దతు ధరలు ప్రకటించినట్లు ఆమె చెప్పారు.
80 కోట్ల మందికి లబ్ధి కలిగేలా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను అయిదేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
4.1 కోట్ల యువతకు అయిదేళ్ల కాలంలో 2 లక్షల కోట్ల రూపాయలతో అయిదు పథకాలు తెస్తున్నట్లు చెప్పారు.
రైతుల కోసం వచ్చే రెండేళ్లలో అధిక దిగుబడులిచ్చే, వాతావరణ పరిస్థితులను తట్టుకునే 109 కొత్త వంగడాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. 32 రకాల వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఈ కొత్త వంగడాలను తీసుకొస్తామన్నారు.
మహిళ పేరిట ఆస్తులు రిజిస్టర్ చేసినప్పుడు స్టాంప్ డ్యూటీలో తగ్గింపు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచిస్తున్నట్లు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

బడ్జెట్లో ఇంకా ఏముందంటే..
- గ్రామీణ అభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయించారు. ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షలకు పెంచారు.
- దేశంలోని 100 నగరాలలో ప్లగ్ అండ్ ప్లే సదుపాయం ఉన్న ఇండస్ట్రియల్ పార్క్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
- 25 వేల గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా రోడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేస్తామన్నారు.
- 500 పెద్ద కంపెనీలలో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పనకు సహకరిస్తామన్నారు.
- ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా 3 పథకాల ద్వారా ఉపాధి ఆధారిత నైపుణ్యాలు పెంపు
- విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం
- తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం, మూడు వాయిదాల్లో నెల జీతం నేరుగా బదిలీ, గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. ఈ ప్రయోజనానికి నెలకు రూ.లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు.
- తయారీ రంగంలో ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌లు
- పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈకామర్స్ ఎక్స్‌పోర్ట్ హబ్‌లు ఏర్పాటు
- ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ కోసం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు
- న్యూక్లియర్ ఎనర్జీ కోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం
- మౌలిక సదుపాయాల పెట్టుబడులకు రూ.11,11,111 కోట్లు
- నీటిపారుదల, వరద ముప్పు తగ్గింపు కోసం బిహార్‌కు రూ.11,500 కోట్లు కేటాయింపు
- వరదల నిర్వహణ, సంబంధిత ప్రాజెక్టులకు అస్సాంకు సాయం
- వరదలకు ప్రభావితమైన ఉత్తరఖాండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లకు సాయం చేసేందుకు సిద్ధం
- పర్యాటక కేంద్రంగా నలందాను అభివృద్ధి చేసేందుకు సాయం
- ఒడిశాలో పర్యాటక అభివృద్ధికి సాయం అందిస్తాం
- వచ్చే పదేళ్లలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదింతలు చేసేందుకు రూ.1000 కోట్లు ఏర్పాటు
- మరింత సరళంగా జీఎస్టీ మార్పు
- మరో 3 క్యాన్సర్ మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తి మినహాయింపు
- 25 క్రిటికల్ మినరల్స్‌కు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు
- బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ 6 శాతానికి తగ్గింపు, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గింపు

ఫొటో సోర్స్, Getty Images
9 ప్రాధాన్యాలు
మోదీ ప్రభుత్వం 9 కీలక ప్రాధాన్యాలు నిర్దేశించుకున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇవీ ఆ ప్రాధాన్యాంశాలు..
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
- ఉపాధి, నైపుణ్యాల కల్పన
- ఇన్‌క్లూజివ్ హెచ్‌ఆర్‌డీ, సోషల్ జస్టిస్
- తయారీ, సేవల రంగ అభివృద్ధి
- పట్టణాభివృద్ధి
- ఇంధన భద్రత
- మౌలిక సదుపాయాలు
- ఇన్నొవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్
- నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్

ఫొటో సోర్స్, Getty Images
వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
వరుసగా ఏడవసారి నిర్మల సీతారామన్ ఆర్థిక మంత్రి హోదాలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
అంతకుముందు, మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆయన రికార్డును ప్రస్తుతం నిర్మలా సీతారామన్ అధిగమించారు.
1959 నుంచి 1964 కాలంలో ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ ఐదుసార్లు వార్షిక బడ్జెట్లను ప్రవేశపెట్టగా.. ఒక మధ్యంతర బడ్జెట్ తీసుకొచ్చారు.
భారతీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందని చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ వీ. అనంత నాగేశ్వరన్ అన్నారు.
జూలై 22న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన తర్వాత, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారత ఆర్థిక వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్యలో ఉండనుందని పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














