‘మోదీ బడ్జెట్‌’కు అతిపెద్ద సమస్యేంటి? ఆర్థిక వేత్తలు ఏమంటున్నారు

narendra modi

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
    • హోదా, బిజినెస్ కరస్పాండెంట్, బీబీసీ ఇండియా

సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది.

ఎన్నికల్లో ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో మోదీ మొదటిసారిగా సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడ్డారు.

ఈ నేపథ్యంలో ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు పాటిస్తూనే, ఖర్చుల విధానాలను సమీక్షిస్తారని చాలామంది భావిస్తున్నారు.

బడ్జెట్‌లో కొత్త ప్రభుత్వం గ్రామీణ జనాభాపై మరింత దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

వాట్సాప్

దేశంలోని వేగవంతమైన ఆర్థిక వృద్ధి నుంచి సంపన్నులకు దక్కినన్ని ప్రయోజనాలు గ్రామీణ ప్రజలకు దక్కడం లేదన్నది వారి అభిప్రాయం.

ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ అధికారం చేపట్టారు కాబట్టి, శాశ్వతంగా తన మార్క్ పడేలా ఆయన దృష్టి సారించవచ్చని ప్రధాని ఆర్థిక సలహా మండలి మాజీ సభ్యుడు రతిన్ రాయ్ అన్నారు.

ఇది సామాన్య ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరిచే దిశగా ఏదైనా చేసేందుకు అవకాశమివ్వొచ్చని చెప్పారు.

అయితే, ఈ విభాగంపై మోదీ గతంలో అంతగా ప్రభావం చూపలేకపోయారని రాయ్ అభిప్రాయపడ్డారు.

ప్రధాని నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్రమోదీ

పెరిగిన అసమానతలు

గత పదేళ్లలో సముద్ర వంతెనలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించడం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

పెద్ద సంస్థలకు పన్ను తగ్గింపులను కూడా చేపట్టారు. ఎగుమతుల లక్ష్యంతో తయారీని ప్రోత్సహించడానికి రాయితీ పథకాలను ప్రవేశపెట్టారు.

ఫలితంగా దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం పొంది, స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. అయినప్పటికీ దేశంలో అసమానతలు, గ్రామీణ స్థాయిలో ఇబ్బందులు అలానే ఉన్నాయి.

మొత్తంగా వినియోగ వృద్ధి గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా కనిష్ఠంగా నమోదైనప్పటికీ, ఈ ఏడాది ప్రథమార్థంలో మాత్రం బీఎండబ్ల్యూ కార్లు అత్యధిక అమ్మకాలను నమోదు చేశాయి.

వేతనాలు పెరగలేదు. పొదుపులు తగ్గాయి. చాలామంది భారతీయులకు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు దొరకడం లేదు.

నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్మలా సీతారామన్

‘‘దేశంలో ఆయా ప్రాంతాల మధ్య తీవ్ర అసమానతలు ఉన్నాయి. ఉత్తర, తూర్పు భారత్‌లో నివసిస్తున్న చాలామంది ప్రజల సగటు తలసరి ఆదాయాలు నేపాల్ ప్రజల కంటే తక్కువగా ఉన్నాయి. వారి ఆరోగ్యం, మరణాలు, ఆయుర్దాయం బుర్కినా ఫాసో (ఆఫ్రికాలోని ఒక దేశం) కంటే తక్కువగా ఉన్నాయి’’ అని రాయ్ అన్నారు.

మూడోసారి పదవీ కాలంలో మోదీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య దీర్ఘకాలిక నిరుద్యోగమని పదిలో తొమ్మిది మంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల తర్వాత జరిగిన ఒక సర్వే ప్రకారం.. ప్రతి పది మందిలో ఏడుగురు భారతీయులు అత్యంత సంపన్నులపై పన్ను విధించడాన్ని సమర్థిస్తున్నారు.

ఆర్థికాభివృద్ధి అందరికీ సమానంగా ప్రయోజనం చేకూర్చలేదని పది మందిలో ఎనిమిది మంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

పరిశ్రమలు

‘ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం లేదు’

ఉత్తర భారతదేశంలో వ్యవసాయం చేసే ప్రాంతాల మీదుగా వెళ్తే గ్రామీణ ప్రజలు, నగరాల్లోని ప్రజల జీవితాల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ దేశ రాజధాని దిల్లీ నుంచి కొన్ని గంటల దూరంలో ఉంటుంది.

విశాలమైన పొలాల మధ్యగా వెళ్లే ఆధునిక రహదారి మినహా దేశ ఆర్థికాభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతంలా ఇది అనిపిస్తుంది.

ఇక్కడ బెహ్రా ఆసా గ్రామంలో సుశీల్ పాల్ కుటుంబం తరతరాలుగా వ్యవసాయం చేస్తోంది. వ్యవసాయం చేస్తే కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదని ఆయన బీబీసీతో తెలిపారు.

పాల్ గత రెండు ఎన్నికలలో మోదీకి మద్దతు ఇచ్చినప్పటికీ, ఈసారి ఆయన పార్టీకి ఓటు వేయలేదన్నారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని ఇచ్చిన వాగ్దానం వాస్తవ రూపం దాల్చలేదని ఆయన అన్నారు.

"నా ఆదాయం తగ్గిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. కానీ, నా పంటకు ధర పెరగలేదు. ఎన్నికల ముందు చెరకు పంటకు ధరలను కాస్త పెంచారు. నేను సంపాదించే డబ్బు అంతా నా పిల్లల స్కూల్, కాలేజీ ఫీజులకే సరిపోయింది. నా పిల్లల్లో ఒకరు ఇంజినీరింగ్ చదివినా రెండేళ్లుగా ఉద్యోగం లేదు" అని ఆయన అన్నారు.

ఉద్యోగ సంక్షోభం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, భారత్‌లో ఉద్యోగ సంక్షోభం, ఈ ఏడాది ప్రారంభంలో ఇజ్రాయెల్‌లో ఉపాధి కోరిన వేలమంది ప్రజలు

సుశీల్ పాల్ పొలం సమీపంలోనే ఒక ఫర్నిచర్ వర్క్‌షాప్ ఉంది.

కోవిడ్ అనంతరం గ్లోబల్ ఆర్డర్‌లు తగ్గడంతో గత ఐదేళ్లలో ఈ వర్క్ షాప్ అమ్మకాలు 80 శాతం మేర తగ్గాయి.

‘’విదేశీ విక్రయాల లోటును పూడ్చటానికి స్థానికంగా ఫర్నిచర్‌ అమ్మాలనుకున్నాను. అయితే గ్రామీణ సమస్యల వల్ల ఉత్పత్తులకు డిమాండ్ లేదు’’ అని కంపెనీ యజమాని రజనీష్ త్యాగి చెప్పారు.

"వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. స్థానికంగా డిమాండ్‌ను పెంచాలంటే రైతులకు ఉన్న అప్పుల బెడద, నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారాయి’’ అని ఆయన వివరించారు.

"ఏదైనా కొనాలన్నా డబ్బు లేదు" అని త్యాగి అన్నారు.

గ్రామీణ పరిస్థితులు

ఫొటో సోర్స్, Getty Images

దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన అనేక చిన్న సంస్థలలో త్యాగి వ్యాపారం ఒకటి.

2015 నుంచి 2023 మధ్యలో 63 లక్షల చిన్న వ్యాపారాలు మూతపడ్డాయని, దీనివల్ల కోటి 60 లక్షల అసంఘటిత ఉద్యోగాలు పోయాయని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.

దీనికి భిన్నంగా, దేశంలోని 5,000 లిస్టెడ్ కంపెనీల లాభాలు 2018 నుంచి 2023 మధ్యలో 187 శాతం పెరిగినట్లు విశ్లేషకులు వివేక్ కౌల్ అన్నారు. దీనికి పాక్షికంగా పన్ను తగ్గింపులు కారణమని చెప్పారు.

ఆర్థిక వ్యవస్థలోని అధికారిక, అసంఘటిత రంగాల మధ్య భారీ అంతరాన్ని తగ్గించడం, గ్రామాలలో పరిస్థితులను మెరుగుపరచడం మోదీ మూడవ కాలంలో ఉన్న అతిపెద్ద సవాళ్లు.

సార్వత్రిక ఎన్నికల తర్వాత వస్తున్న మోదీ మొదటి బడ్జెట్ సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్‌లోని ఆర్థికవేత్తలు తమ నోట్‌లో రాశారు.

ఇదే సమయంలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అధిక కేటాయింపులను పక్కన పెట్టాల్సినవసరం లేదని అన్నారు.

సెంట్రల్ బ్యాంక్ నుంచి ఊహించిన దానికంటే (జీడీపీలో 0.3 శాతం) ఎక్కువగా వచ్చే నిధులతో మోదీ ప్రభుత్వం సంక్షేమంపై ఖర్చును పెంచడంతో పాటు, మౌలిక సదుపాయాలలో పెట్టుబడిని కొనసాగించేలా చేస్తుందని వాల్ స్ట్రీట్ బ్యాంక్ తెలిపింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంపై, ఉద్యోగాల సృష్టిపై దృష్టి పెడుతుందని పేర్కొంది.

దేశంలోని సంపన్న వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తున్న కొంతమంది కూడా దీనిని అంగీకరిస్తున్నారు.

‘’పేదరికం తగ్గింపు అనేది ప్రభుత్వ బడ్జెట్‌లో కీలకమైన ఎజెండా. ఆర్థిక లెక్కలు దెబ్బతీయకుండా పన్నులు, ఇతర వసూళ్లతో దీనిని సాధించవచ్చు’’ అని ఏఎస్‌కే ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలుజా చెప్పారు.

ఆహార ధరలు పెరగడంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆహార ధరలు పెరగడంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఉత్పత్తుల తయారీ ఎలా ఉండాలి?

ప్రజల చేతికి నేరుగా ఎక్కువ నగదు ఇవ్వడం మంచి ప్రత్యామ్నాయం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దాదాపు 80 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే ఉచిత ధాన్యాన్ని పొందుతున్నారు. కొన్ని రాష్ట్రాలు తమ ఆదాయంలో దాదాపు 10 శాతం సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేస్తున్నాయి.

లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడంతోపాటు ఆదాయ అవకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రణాళికలు వేస్తోందో బడ్జెట్‌లో చూపించాల్సిన అవసరం ఉంది.

ఉద్యోగ కల్పన కోసం అధికారిక, అసంఘటిత రంగాలకు మద్దతు ఇచ్చే విధానాలుండటం చాలా ముఖ్యమని ఇండియా రేటింగ్స్‌ ప్రధాన ఆర్థికవేత్త సునీల్ కుమార్ సిన్హా అభిప్రాయపడ్డారు.

నిధులు

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు, దేశీయంగా అత్యధిక డిమాండ్‌ను తీర్చడానికి భారత్ కూడా తక్కువ ఖర్చు, కార్మికులు ఎక్కువ అవసరమయ్యే పరిశ్రమలను అంటే టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి వాటిని ప్రోత్సహించాలని రాయ్ సూచిస్తున్నారు.

ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు మోదీ అందించిన ఉత్పత్తి ప్రోత్సాహకాలను చిన్న వ్యాపారాలకు కూడా విస్తరించాలని ఎస్బీఐలోని ఆర్థికవేత్తలు సూచించారు.

ప్రజలు తయారీ గురించి ఆలోచించినప్పుడు తరచుగా సూపర్ కంప్యూటర్లు లేదా యాపిల్ వంటి కంపెనీలు దేశంలో తయారు చేసే అత్యాధునిక వస్తువులను ఊహించుకుంటారని, అయితే ఇవి భారత జనాభాలో చాలామందికి అవసరమైనవి కావని రాయ్ అభిప్రాయపడ్డారు.

భారత్ దాని 70 శాతం మంది ప్రజలు వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలి, అంటే సరసమైన చొక్కాల వంటివని ఆయన సూచించారు.

బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు భారతదేశమే రూ.200 చొక్కాలను స్థానికంగా తయారు చేయగలిగితే, అది దేశ తయారీ రంగాన్ని పెంచడంలో సహాయపడుతుందని రాయ్ అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)