నెల్లూరు బారాషహీద్ దర్గా దగ్గర మతాలకు అతీతంగా చేసుకునే రొట్టెల పండుగ ఏమిటి?

రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు
ఫొటో క్యాప్షన్, రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటున్న మహిళలు
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు బారా షహీద్ దర్గా దగ్గర జరిగే రొట్టెల పండుగకు వెళ్తే అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఒకరికొకరు రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం కనిపిస్తుంది.

ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు, క్రిస్టియన్లు.. ఇలా వేర్వేరు మతాలకు చెందిన లక్షలాది మంది ఒకే చోట కలసికట్టుగా జరుపుకొనే పండుగ ఇది.

ఇక్కడికి వచ్చేవారు తొలుత బారా షహీద్ సమాధులను దర్శించుకుంటారు, ఆ తరువాత పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు.

రొట్టెల పండుగ జరుగుతున్న ఆ దర్గాను బీబీసీ సందర్శించింది. దర్గాను దర్శించుకున్న, స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతున్న వారితో మాట్లాడింది.

‘‘నేను ఇక్కడికి రెండోసారి వచ్చాను. మొదటిసారి వచ్చినప్పుడు గానీ, రెండోసారి గానీ రొట్టె వదిలినప్పుడు దాన్ని తీసుకున్న వాళ్లెవరో నాకు తెలియదు. అంతేకాదు, నేను మొదటిసారి ఎవరి నుంచి రొట్టె తీసుకున్నానో కూడా నాకు తెలియదు. ఇదంతా రొట్టె మీద నమ్మకంతోనే ఇక్కడ జరుగుతోంది. నేను ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. వస్తూ ఉంటాను’’ అని చిలకలూరిపేటకు చెందిన శ్రావణి అన్నారు.

వాట్సాప్
శ్రావణి
ఫొటో క్యాప్షన్, శ్రావణి

‘‘నేను ఒక హిందువు అయినప్పటికీ కుల, మత భేదాలు లేకుండా రొట్టె తీసుకున్నాను’’ అని శ్రావణి అన్నారు.

ఆమె షేక్ మొబీనా అనే ముస్లిం యువతి నుంచి చదువుల రొట్టె తీసుకున్నారు.

‘‘నేను నిరుడు వచ్చి చదువుల రొట్టె తీసుకున్నాను. నా డిప్లొమా విజయవంతంగా పూర్తి చేశాను. ఇప్పుడు చదువుల రొట్టె వదలడానికి వచ్చాను. అన్ని పండుగలు వేర్వేరుగా చేసుకున్నా.. రొట్టెల పండుగ మాత్రం అందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ కనిపిస్తుంది’’ అని షేక్ మొబీనా బీబీసీతో చెప్పారు.

రొట్టెల పండుగ

ఒక్క రోజు నుంచి ఐదు రోజులకు

ఏటా మొహర్రం నుంచి మొదలుకుని ఐదు రోజులపాటు రొట్టెల పండుగ చేసుకోవడం బారా షహీద్ దర్గాలో ఆనవాయితీగా వస్తోంది.

కొన్నేళ్ల కిందటి వరకు ఈ పండుగను ఒక్కరోజు మాత్రమే జరుపుకొనేవారు. భక్తుల సంఖ్య పెరగడంతో ఐదు రోజుల వేడుకగా నిర్వహిస్తున్నారు.

రొట్టె లేదా రోటీ లేదా చపాతీని గోధుమ పిండితో తయారు చేసి తీసుకువస్తారు.

భక్తుల కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టెలు ఉంటాయి. ఈ రొట్టెలు వదిలేందుకు, పట్టుకునేందుకు (తీసుకునేందుకు) తగ్గట్టుగా స్వర్ణాల చెరువులో ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేశారు. ఈ రొట్టెల రకాలు ఇలా ఉంటాయి.

  • ఇల్లు లేదా నూతన గృహ రొట్టె
  • సంతాన రొట్టె
  • ఉద్యోగం రొట్టె
  • ఆరోగ్య రొట్టె
  • సౌభాగ్య రొట్టె
  • చదువు లేదా విద్యా రొట్టె
  • పెళ్లి రొట్టె
  • ప్రమోషన్ రొట్టె
  • వ్యాపారాభివృద్ధి రొట్టె
  • ధన రొట్టె
రొట్టెల పండుగ

ఇలా భక్తులు తమ మనసులోని కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టెలు అందించుకుంటారు.

ఆయా కోరికలు కోరుకున్నవారు అప్పటికే ఆ కోరిక నెరవేరిన వారి నుంచి రొట్టెలు తీసుకుంటారు.

రొట్టె తీసుకున్నాక తమ కోరిక నెరవేరితే మరుసటి ఏడాది వచ్చి వేరొకరికి రొట్టె ఇస్తుంటారు.

మళ్లీ వేరొక కోరిక ఉంటే దానికి సంబంధించిన రొట్టె తీసుకుంటారు.

ఏ కోరిక తీరాలని రొట్టె వదిలితే దాన్ని ఆ రొట్టెగా వ్యవహరిస్తారు.

వివాహం కావాలని కోరుకుంటూ ఎవరైనా రొట్టె వదిలినా, తీసుకున్నా దాన్ని వివాహ రొట్టెగా పిలుస్తారు.

స్వర్ణాల చెరువు

ఫొటో సోర్స్, NMC

ఫొటో క్యాప్షన్, స్వర్ణాల చెరువు దగ్గర భక్తుల స్నానం

కుటుంబంలోని ఒకరి తరఫున మరొకరు రోటీ తీసుకోవడం లేదా విడిచిపెట్టడం కూడా చేస్తుంటారు.

తెలంగాణలోని నాగర్ కర్నూల్‌కు చెందిన పారిజాతం తన కుమారుడి తరఫున రొట్టె వదలడానికి వచ్చారు.

‘‘రొట్టెల పండుగ అంటే ఏంటో ఇంతకుముందు నాకు తెలియదు. వార్తల్లో చూసి 2023లో మొదటిసారి వచ్చాం. నా కుమారుడి కోసం చదువుల రొట్టె తీసుకున్నాను. మా అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాశాడు. ప్రభుత్వ కాలేజీలో మెడిసిన్ సీటు వచ్చింది. అందుకే మళ్లీ చదువు రొట్టె ఇవ్వడానికి వచ్చాను’’ అని పారిజాతం బీబీసీకి చెప్పారు.

రేష్మ
ఫొటో క్యాప్షన్, రేష్మ

కిలోమీటర్లు నడిచి, గంటల తరబడి నిలబడి..

రొట్టెల పండుగతో నెల్లూరు పట్టణానికి ఏటా సరికొత్త కళ వస్తుందని స్థానిక వ్యాపారి వెంకటేశ్వరరావు చెప్పారు.

లక్షల మంది తరలిరావడంతో పట్టణంలో రద్దీ వాతావరణం కనిపిస్తుంది.

వివిధ రాష్ట్రాల బస్సులు, రైళ్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి వస్తుంటారు. మూడు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి.. బారా షహీద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన రేష్మ ఐదారేళ్లుగా రొట్టెల పండుగకు వస్తున్నారు. ఈసారి రేష్మ.. తన స్నేహితురాలు లక్ష్మితో కలిసి వచ్చారు.

‘‘మొదట నేను పెళ్లి రొట్టె తీసుకున్నాను, వివాహం జరిగింది. తర్వాత సంతాన రొట్టె తీసుకున్నాను. నాకిప్పుడు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు సంతాన రొట్టెను మరో యువతికి అందించాను. ఇక్కడ హిందువు, ముస్లిం అనే తేడా లేకుండా ఎవరూ అడిగినా రొట్టె ఇవ్వడం.. ఎవరిచ్చినా తీసుకోవడం చేస్తుంటాం’’ అని చెప్పారు రేష్మ.

‘‘మా మధ్య హిందూ, ముస్లిం అనే తేడాలు ఎప్పుడూ కనిపించవు. నా స్నేహితురాలితో కలిసి ఉద్యోగ రొట్టె తీసుకునేందుకు వచ్చాను. రొట్టెల పండుగలో ముస్లింలు మాత్రమే ఉంటారని అనుకున్నా. కానీ, ఇక్కడ మతంతో పట్టింపులేకుండా అందరూ ఒకరి నుంచి మరొకరు రొట్టెలు తీసుకుంటున్నారు’’ అని రేష్మ స్నేహితురాలు లక్ష్మి చెప్పారు .

రొట్టెల పండుగ

దేశవిదేశాల నుంచి రాక

రొట్టెల పండుగలో పాల్గొనేందుకు భారత్‌లోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా వస్తుంటారు. రొట్టెల పండుగలో పాల్గొని తమ కోర్కెల రొట్టెలు విడిచేందుకే పనిగట్టుకుని విదేశాల నుంచి వస్తుంటారు.

అలా సౌదీ అరేబియా నుంచి రొట్టెల పండుగ కోసం వచ్చారు నెల్లూరుకు చెందిన షేక్ సల్మాన్.

‘‘నిరుడు సౌదీ అరేబియా వెళ్లాలనే కోరికతో విదేశీ రొట్టె తీసుకున్నాను. ఎంతో భక్తి, నమ్మకంతో బారా షహీద్ దర్గాలో ప్రార్థన చేసుకున్నాను. రెండు నెలల్లోనే సౌదీ వెళ్లడానికి కాల్ వచ్చింది. అక్కడికి వెళ్లి వచ్చాను. మళ్లీ రోటీ వదిలిపెట్టాను. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ భక్తితో మనం ఏది కోరుకుంటామో.. అది తప్పకుండా నెరవేరుతుందనేది తరతరాలుగా విశ్వాసంగా వస్తోంది’’ అని సల్మాన్ బీబీసీతో చెప్పారు.

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీ, బిహార్, ఛత్తీస్‌గడ్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఈ ఏడాది రొట్టెల పండుగకు వచ్చారు.

బారాషహీద్ దర్గా

ఫొటో సోర్స్, NMC

ఫొటో క్యాప్షన్, బారాషహీద్ దర్గా

సయ్యద్ అయేషా మహారాష్ట్రలోని నాగ్‌పుర్ నుంచి వచ్చారు .

‘‘మేం 12 ఏళ్లుగా రోటీ తీసుకునేందుకు వస్తున్నాం. ఇక్కడ అందరూ రోటీ ఇస్తుంటారు.. అందరి నుంచి అందరూ తీసుకుంటారు. గతంలో పెళ్లి, వ్యాపారం, విదేశీ రొట్టె తీసుకునేందుకు వచ్చాం. ఆ కోరికలన్నీ నెరవేరడంతో వాటిని ఇచ్చేందుకు మళ్లీ వచ్చాం’’ అని చెప్పారు సయ్యద్ అయేషా.

అయితే, ఇవన్నీ నమ్మకాలకు సంబంధించినవి మాత్రమే అని జనవిజ్ఞాన వేదిక నాయకులు, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం బీబీసీతో అన్నారు.

"రొట్టెల పండుగలో హిందువులు ముస్లింలు కలిసి జరుపుకోవడం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పవచ్చు. కానీ రొట్టెలు మార్చుకుంటే కోరికలు నెరవేరుతాయి అనేది ఒక మూఢ విశ్వాసం’ అన్నారు ఆయన.

ఇలా రొట్టెలు మార్చుకోవడం అనేది కాలక్రమంలో వచ్చిందే తప్ప దీనికి చారిత్రక ఆధారాలేమీ లేవని బాలసుబ్రమణ్యం అన్నారు.

సయ్యద్ సమీ హుస్సేనీ
ఫొటో క్యాప్షన్, బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం నిర్వాహకులు సయ్యద్ సమీ హుస్సేనీ

బారా షహీద్ దర్గా చరిత్ర ఏమిటి?

బారా అంటే పన్నెండు, షహీద్ అంటే పవిత్రకార్యం లేదా ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన వారని అర్థం.

దర్గాలో 12 మంది సమాధులు దర్శనమిస్తాయి.

బారా షహీద్ దర్గా చరిత్రపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ప్రాచుర్యం పొందిన కథను బీబీసీతో పంచుకున్నారు నెల్లూరుకు చెందిన చరిత్ర పరిశోధకులు ఈతకోట సుబ్బారావు.

‘‘నాలుగు శతాబ్దాల కిందట మక్కా నుంచి బయల్దేరిన 12 మంది ప్రపంచవ్యాప్తంగా మత బోధనలు చేస్తూ నెల్లూరుకు వచ్చారు. వీరికి జుల్ఫేఖత్ బేగం అనే మహిళ సారథ్యం వహించారు. వీరికి అరబ్బీ భాష మాత్రమే తెలుసు. వారికి వచ్చిన కళలు, హావభావాలతోనే ఇస్లాం సూక్తులను ప్రజలకు చేరవేసేవారు. నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్ద ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో మత బోధనలు చేసేవారు.

అప్పట్లో వాలాజా నవాబు నెల్లూరును పాలిస్తుండేవారు. బీజాపూర్ సుల్తానుకు, వాలాజా నవాబుకు యుద్ధాలు జరిగేవి. అందులో వాలాజా నవాబుకు వీరు మద్దతుగా నిలిచారు. దానివల్ల బీజాపూర్ సుల్తానుల సైన్యం వారిని అంతమొందించాలని నిర్ణయించింది.

ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్న సమయంలో కిందకి వంగినప్పుడు బీజాపూర్ సుల్తానుల సైన్యం ఒక్కసారిగా దాడి చేసి 12 మందిని నరికి చంపేసింది’’ అని చరిత్ర చెప్తోందని ఈతకోట సుబ్బారావు తెలిపారు.

సుబ్బారావు
ఫొటో క్యాప్షన్, సుబ్బారావు

జుల్ఫేఖత్ బేగంను చంపేసిన తర్వాత ముక్కలుగా చేశారని చరిత్ర చెబుతోందని ఆయన వివరించారు.

‘‘ఆ తర్వాత వారి మృతదేహాలను గుర్రాలు తెచ్చి నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద వదిలేశాయి. ఆ క్రమంలోనే దారి మధ్యలో వారి తలలు, మొండాలు వేరు పడ్డాయి. అది చూసి తమ యజమానులు లేరన్న బాధతో గుర్రాలు కూడా ప్రాణత్యాగం చేశాయి. ఆ 12 మందిని స్థానికులు బారా షహీద్ దర్గా ప్రాంతంలోనే ఖననం చేశారు’’ అని సుబ్బారావు చెప్పారు.

దర్గాపై ప్రచారంలో ఉన్న మరో కథనాన్ని బారా షహీద్ దర్గా గంధ మహోత్సవం నిర్వాహకులు సయ్యద్ సమీ హుస్సేనీ బీబీసీతో పంచుకున్నారు.

‘‘దాదాపు 400 ఏళ్ల కిందట ఇస్లాం మతఛాందసవాదుల వల్ల ఆ మతంలోకి బలవంతంగా మార్పిడులు జరిగేవి. వాటిని ఆపేందుకు సయ్యద్ మీర్జా అలీ హుస్సేనీ బేగ్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో తుర్కియే నుంచి 300 మంది వచ్చారు. వారిలో 12 మంది నెల్లూరుకు వచ్చి బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించారు. మతఛాందసవాదులతో జరిగిన ఘర్షణల్లో 12 మంది అమరులు అవుతారు. వారిని దర్గా ప్రాంతంలో ఖననం చేశారు’’ అని సమీ హుస్సేనీ చెప్పారు.

రొట్టెల పండుగ

రొట్టెల పండుగ ఎలా మొదలైంది?

మొహర్రం మరుసటి రోజున రాత్రి గంధ మహోత్సవం బారా షహీద్ దర్గాలో సందడిగా జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో జనం వస్తుంటారు.

గంధ మహోత్సవానికి దాదాపు 363 సంవత్సరాల చరిత్ర ఉంది. 2024లో జరిగినది 364వ గంధ మహోత్సవం అని సయ్యద్ సమీ హుస్సేనీ చెప్పారు.

రొట్టెల పండుగ ఎలా మొదలైందన్న విషయాన్ని ఆయన వివరించారు.

‘‘దాదాపు 400 సంవత్సరాల కిందట నెల్లూరును పాలించిన వాలాజా నవాబు కుమార్తెకు చర్మ వ్యాధి సోకింది. ఎన్నిచోట్ల చూపించినా అది నయం కాలేదు. ఒకరోజు స్వర్ణాల చెరువు వద్ద దుస్తులు ఉతికిన తర్వాత రజకుడు, అతని భార్య అక్కడే నిద్రపోతారు.

12మంది అమరులలో ఒకరు రజకుడి భార్యకు కలలో కనిపించి బారా షహీద్ సమాధుల వద్ద మట్టి తీసుకెళ్లి నవాబు కుమార్తెకు రాస్తే నయం అవుతుందని చెబుతారు.

రజకుడి భార్యకు వచ్చిన కల సమాచారం ఆ నోటా ఈ నోటా నవాబుకు తెలుస్తుంది.

సైనికులతో బారా షహీద్ సమాధుల వద్ద మట్టి తెప్పించి రాయడంతో నవాబు కుమార్తెకు ఉన్న వ్యాధి వెంటనే నయమవుతుంది.

వాలాజా నవాబు కుమార్తె ఆరోగ్యం బాగా లేకపోతే ఎవరూ నయం చేయలేకపోయారు. దర్గా దగ్గర మట్టి పూస్తే సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందనే సమాచారం అంతటా ప్రచారం జరుగుతుంది.

దీంతో వాలాజా నవాబు కుమార్తెను చూసేందుకు చుట్టుపక్కల ఊళ్ల జనాలు వస్తారు. వాలాజా నవాబు తరఫు నుంచి కూడా 300 మంది వస్తారు. వాళ్లు రొట్టెలు తింటుంటే... తమకూ ఇవ్వాలని అక్కడికి వచ్చిన ప్రజలు అడుగుతారు. అది మంచి ఎండాకాలం కావడంతో రొట్టెలు గట్టిగా అవుతాయి.

మన వద్ద 300 మందికి సరిపడా భోజనమే ఉంది. కానీ ఇక్కడ వేలాది మంది ఉన్నారు, ఏం చేయాలో చెప్పమని వాలాజా నవాబును భటులు అడుగుతారు.

అల్లా మీద నమ్మకంతో వచ్చానని, ఆయన్ని తలచుకుని రొట్టెలను చెరువులో ముంచి, ముక్కలు చేసి తలా ఒక ముక్క ఇవ్వండని భటులను నవాబు ఆదేశిస్తారు.

అలా భటులు రొట్టెలు తుంచి ప్రజలకు ఇస్తారు. అందరి కడుపు నిండుతుంది గానీ రొట్టెలు ఇంకా మిగులుతాయి. ఆ రోజు నుంచి ఏదైనా కోరిక ఉంటే అల్లా పేరుతో మనం ప్రయత్నం చేస్తే కోరిక తీరుతుందని ప్రచారంలోకి వచ్చింది.

అలా మొదలైన రొట్టెల పండుగ క్రమంగా మతాలకు అతీతంగా లక్షల మంది తరలివచ్చి జరుపుకొనే ఉత్సవంలా మారింది’’ అని చెప్పారు సయ్యద్ సమీ హుస్సేనీ.

రొట్టెల పండుగ

ఫొటో సోర్స్, NMC

రాష్ట్ర పండుగగా గుర్తింపు

రొట్టెల పండుగకు ఉన్న జనాదరణను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మేరకు 2015లోనే ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.

పండుగ నిర్వహణకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించి ఏర్పాట్లు చేస్తుంటారు.

2024లో పండుగ నిర్వహణతోపాటు ఇతర మరమ్మతుల నిమిత్తం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

నెల్లూరు వేదికగా ప్రభుత్వ సహకారంతో కులం, మత పట్టింపు లేని వాతావరణంలో రొట్టెల పండుగ ఏటా జరుగుతోంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)