తెలంగాణ విద్యుత్ కొనుగోళ్లు: విచారణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా, వివాదం ఏంటి, అసలేం జరిగింది?

కేసీఆర్, రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, FB/Revanth,Kcr

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో గత ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై తనను విచారణకు పిలిచే అధికారం జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌కు లేదని, దాన్ని రద్దు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ (జులై 16) విచారణ జరిపింది.

కేసీఆర్ తరపున, ప్రభుత్వం తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణ మధ్యలో ఉండగా విచారణ కమిషన్ ఛైర్మన్‌గా ఉన్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ నరసింహారెడ్డి విలేఖర్ల సమావేశం నిర్వహించడాన్ని సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఆక్షేపించారు. దీంతో మరో వ్యక్తిని కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తామని సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

అనంతరం కమిషన్ ఛైర్మన్ పదవికి జస్టిస్ నరసింహా రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమించాల్సి ఉంది. అసలింతకీ ఈ వివాదం ఏంటి? ఇప్పటి వరకు ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ ఆరోపణ ఏంటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఛత్తీస్‌గఢ్ నుంచి కరెంటు కొన్నారు. అలాగే యాదాద్రి, భద్రాద్రి పేరుతో కొత్తగా రెండు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం ప్రారంభించారు.

ఈ రెండు అంశాల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కేసీఆర్ నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి సుమారు 6 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటూ దానిపై విచారణ సంఘాన్ని నియమించింది.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి యూనిట్ కరెంటుకు 3.90 రూపాయల చొప్పున కొనడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కొన్న కరెంటు తీసుకురావడానికి లైన్ల కోసం పెట్టిన ఖర్చుతో కలిపితే యూనిట్ ధర 5.64 రూపాయలు అవుతోంది. దీనివల్ల సుమారు 3 వేల కోట్లు అదనంగా అప్పటి తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది.

అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి అనుకున్న మేరకు కరెంటు రాకపోవడంతో బయటి మార్కెట్ నుంచి సుమారు రూ.2 వేల కోట్లు పెట్టి కరెంటు అదనంగా కొనాల్సి వచ్చింది. ఇక ముందుగా రిజర్వు చేసుకున్నందుకు గానూ కరెంటు తీసుకొచ్చే లైన్లకు అద్దె కట్టాల్సి వస్తుందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. ఇవన్నీ కలసి దాదాపు రూ.6 వేల కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడిందన్నది ప్రస్తుత ప్రభుత్వ ఆరోపపణ.

కరెంటు పంపిణీ చేసే కంపెనీలు అంటే తెలంగాణ డిస్కంలు ఈ చర్యలన్నింటి వల్ల అప్పుల పాలయ్యాయని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం శాసన సభ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది.

దీనిపై విచారణ చేపడతామని 2023 డిసెంబరులో అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసిన సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

విద్యుదుత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

విచారణ కమిషన్ ఏం చేస్తుంది?

ఛత్తీస్‌గఢ్ ఒప్పందంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల విషయంలో జరిగాయని చెబుతున్న అవకతవకల సంగతి తేల్చడానికి జస్టిస్ నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో విచారణ సంఘాన్ని నియమించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

2024 మార్చి 14న దీనిపై ఉత్తర్వులు వచ్చాయి. కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ నరసింహా రెడ్డి... కేసీఆర్ సహా 25 మందికి నోటీసులు ఇచ్చారు. అప్పటి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులు సురేశ్ చందా, ఎస్కే జోషి, అరవింద్ కుమార్ లతో పాటు ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ ప్రభాకర రావు, బీహెచ్ఈఎల్ మాజీ సీఎండీ, ప్రస్తుత సీఎండీలను కూడా విచారించారు.

ప్రొఫెసర్ కోదండ రాం, విద్యుత్ రంగ నిపుణుడు ఇంజినీర్ రఘు, విద్యుత్ రంగ నిపుణుడు – సీనియర్ పాత్రికేయుడు వేణుగోపాల రావులు కూడా కమిషన్‌కు సమాచారం ఇచ్చారు.

తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండ రాం కోరారు.

కేసీఆర్ మాత్రం లోక్ సభ ఎన్నికలు ఉన్నందున సమాధానం ఇవ్వడానికి జులై 31 వరకూ గడువు అడగ్గా, కమిషన్ జూన్ 15 వరకూ గడువిచ్చింది. కొందరికి రెండోసారి కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్.

సాధారణంగా ఇలాంటి విచారణ కమిషన్‌ల సభ్యులు మీడియాతో మాట్లాడడం చాలా అరుదు. కానీ జస్టిస్ నరసింహా రెడ్డి ఈ విచారణ గురించి మీడియాతో మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందంలో అనేక లోపాలు ఉన్నట్టు ఆయన మీడియా ముందు చెప్పారు.

విద్యుదుత్పత్తి కేంద్రాలు

ఫొటో సోర్స్, NTPC

‘‘అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం తప్ప జెన్కోగానీ, ఇతర విద్యుత్ సంస్థలుగానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. ప్రభుత్వంలో ఎవరు నిర్ణయం తీసుకున్నారనే దానిపై విచారణ చేస్తున్నాం’’ అని జస్టిస్ నరసింహా రెడ్డి మీడియాతో చెప్పారు.

  • 2 వేల మెగావాట్ల కరెంటును దక్షిణాది రాష్ట్రాల నుంచి కొనాలని ముందుగా అనుకుని తరువాత దేశంలో ఎక్కడి నుంచైనా కొనేలా ఉత్తర్వులు మార్చారు.
  • అత్యవసర పరిస్థితి పేరుతో టెండరు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. రెండు థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణాలను నామినేషన్ పద్ధతిలో చేశారు. దీనివల్ల ప్రభుత్వంపై భారం పడింది.
  • ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం నాటికి అక్కడ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉంది. ఆ తరువాత నాలుగేళ్ల పాటు కరెంటు ఇచ్చి తరువాత ఆపేశారు.
  • దేశమంతా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుతుంటే భద్రాద్రి ప్లాంటును మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించారు. దీనివల్ల ఏటా రూ.300 కోట్ల వరకూ అదనపు భారం.
  • ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంతో ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ 2016 లోనే లేఖ రాశారు. ఆ తరువాత ఆయన వేరే శాఖకు బదిలీ అయ్యారు.
  • ఛత్తీస్‌గఢ్ ఒప్పందంలో ధర నిర్ణయించే హక్కు ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇచ్చారు.

ఇలా విచారణ సందర్భంగా వెలుగులోకి వచ్చిన అంశాలను మీడియా ముందు చెప్పారు జస్టిస్ నరసింహా రెడ్డి.

కేసీఆర్

ఫొటో సోర్స్, TWITTER/BRS PARTY

కేసీఆర్ సమాధానం ఏంటి?

జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్‌కు కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అసలు ఈ కమిషన్ నియామకం చెల్లదని, జస్టిస్ నరసింహా రెడ్డి ఈ విచారణ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మీడియాతో మాట్లాడడం తప్పని అన్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటుకు ముందు, ఏర్పాటు సమయంలో విద్యుత్ లేక పడిన ఇబ్బందులు చెబుతూ సుదీర్ఘంగా సాగుతుంది ఆ లేఖ. ఈ విచారణ నుంచి తప్పుకోవాల్సిందిగా జస్టిస్ నరసింహా రెడ్డికి ఆ లేఖలో అనేకమార్లు సూచించారు కేసీఆర్.

‘‘రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7,778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్తు, తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైచిలుకుకు చేరింది. కరెంటు కొనుగోళ్లు, కొత్త కేంద్రాల ఏర్పాటును పారదదర్శకంగానే చేశాం. అన్ని చట్టాలూ నిబంధనలూ పాటించాం. ఈఆర్సీ తీర్పులకు లోబడి చేశాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలుపై అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ లేవనెత్తిన అభ్యంతరాలు కూడా విన్న తరువాతే ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. వాటిపై ఆయన అప్పీలుకు కూడా వెళ్లలేదు. కానీ గొప్ప విద్యుత్తు విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి ఆయన సీఎం అయిన తరువాత దురుద్దేశాలను ఆపాదిస్తున్నారు. చట్ట విరుద్ధంగా ఈ విచారణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీహెచ్ఈఎల్ దగ్గర సబ్‌క్రిటికల్‌ విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన సామగ్రి సిద్ధంగా ఉంది. అందుకే ఆ పరిజ్ఞానం భద్రాద్రికి ఉపయోగించాం. కరెంటు అత్యవసరం కాబట్టి ఆ టెక్నాలజీ వాడాం. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కరెంటు విషయంలో ఆనాడు తెలంగాణ అలాంటి అసాధారణ సంక్షోభంలోనే ఉంది. కాబట్టే అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం’’ అంటూ విద్యుత్ రంగంలో తన నిర్ణయాలపై లేఖ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చారు కేసీఆర్.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, TWITTER@REVANTH_ANUMULA

‘‘అయినా రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. కమిషన్‌ చైర్మన్‌గా వచ్చిన మీరు పత్రికా విలేఖరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించింది. ఎంక్వయిరీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేసిన ఏ వ్యాఖ్యను గమనించినా, మీరు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. మా వాదనలేవీ వినకుండానే మా ప్రభుత్వం ఏదో తప్పుచేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని విచారించే అర్హతను కోల్పోయారు. కాబట్టి మీరు మీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని రాశారు కేసీఆర్.

ఇదొక్కటే కాదు, జస్టిస్ నరసింహా రెడ్డి విలేఖరుల సమావేశంలో చేసిన వివిధ ఆరోపణలపై కేసీఆర్ తన లేఖలో వివరంగా సమాధానాలు రాశారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

కేసీఆర్ కోర్టుకు ఎందుకెళ్లారు? సుప్రీం కోర్టు ఏమన్నది?

కేసీఆర్ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆయన్ను నేరుగా విచారణకు పిలిచే అవకాశం పరిశీలిస్తామని గతంలోనే జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. అయితే అసలు ఈ అంశంపై కమిషన్ వేసి విచారించడమే చెల్లదంటూ కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు కేసీఆర్ వాదనను అంగీకరించలేదు. విచారణ ఆపడానికి కూడా ఒప్పుకోలేదు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు కేసీఆర్. జులై 16న సీజేఐ బెంచ్ ముందు కేసీఆర్ తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

విచారణ మధ్యలో ఉండగా విచారణ కమిషన్ అధ్యక్షుడిగా ఉన్న రిటైర్డ్ జడ్జి విలేఖర్ల సమావేశం నిర్వహించడాన్ని సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఆక్షేపించారు. ‘‘న్యాయమూర్తి న్యాయం చేయడమే కాకుండా, న్యాయం చేసినట్టు కనిపించాలి కూడా’’ అని ఆయన గుర్తు చేశారు. దీంతో మరో వ్యక్తిని కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం కమిషన్ ఛైర్మన్ పదవికి జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ కమిషన్‌కి కొత్త చైర్మన్‌ను నియమించాల్సి ఉంది.

సుప్రీం కోర్టు తీర్పు గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చెరో విధంగా చెప్పుకున్నాయి.

‘‘విద్యుత్ విచారణ కమిషన్ చైర్మన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డికి చెంప పెట్టు లాంటివి. ప్రభుత్వాల మధ్య కుదిరిన విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటేనే దురుద్దేశ పూరిత చర్య. కరెంటు ఇచ్చి తెలంగాణ రైతులను, పరిశ్రమలను కాపాడింది కేసీఆరే. కేసీఆర్‌కు వచ్చిన మంచి పేరును చెరిపేయడమే సీఎం రేవంత్ లక్ష్యం. కానీ రేవంత్ ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు తగిలింది. రేవంత్ ఇప్పటికైనా దుర్బుద్ది మానుకోవాలి. కేసీఆర్ మీద విచారణలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదు’’ అని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

‘‘విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్‌ను వేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసినా కేసీఆర్‌కు భంగపాటు తప్పలేదు. విచారణ కమిషన్ చైర్మన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ విచారణ కమిషన్ ఏర్పాటును తప్పు పట్టలేదు. అసలు మొత్తం కమిషనే వద్దన్న కేసీఆర్ వాదనను సుప్రీం పట్టించుకోలేదు. కమిషన్ ఏర్పాటును సుప్రీం తప్పు పట్టలేదు’’ అని కాంగ్రెస్ నాయకుడు జీ నిరంజన్ అన్నారు.