హోమ్‌ లోన్‌: 25 ఏళ్ల ఇంటి రుణం 10 ఏళ్లలోనే పూర్తిగా చెల్లించడం ఎలా?

ఇంటి రుణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విష్ణు స్వరూప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హోమ్ లోన్‌ను టెన్యూర్ కంటే ముందే చెల్లించేయడం మంచిదా? లేదంటే రుణాన్ని పూర్తి కాల వ్యవధి వరకు కొనసాగించాలా?

ఇంటి రుణాన్ని కాల వ్యవధి పూర్తయ్యేంత వరకు తిరిగి చెల్లించడం కొనసాగిస్తే ఏటా పన్ను ప్రయోజనాలను డిడక్షన్ రూపంలో పొందవచ్చు. అందువల్ల, దీర్ఘ కాలిక ప్రయోజనాలు దీనిలో ఉంటాయని చాలామంది భావిస్తూ ఉంటారు.

కానీ, కరోనా మహమ్మారి తర్వాత చాలామంది ఆలోచనలు మారాయి.

ఉద్యోగంలో అభద్రత, ఆర్థిక అస్థిరత వంటి కారణాలు ఉంటే ఎక్కువ కాలానికి ఇంటి రుణం తీసుకోవడం, పూర్తి టెన్యూర్ వరకు రుణం తీర్చకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తొచ్చు.

కాబట్టి, అవకాశం ఉంటే టెన్యూర్ పూర్తి కావడానికి ముందే రుణం తీర్చేయడం ప్రయోజనకరం.

ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవడం మంచిదా? లేదా చేతిలో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు రుణంలో కొంత కానీ, పూర్తిగా కానీ ముందే క్లియర్ చేయడం మంచిదా? అనేది కూడా చాలామందికి కలిగే సందేహం.

ఇలాంటి సందేహాల నివృత్తికి బీబీసీ ఆర్థిక రంగ నిపుణులతో మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఇంటి రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడంలో ప్రయోజనాలేంటి?

ఇంటి రుణాన్ని త్వరగా తిరిగి చెల్లించడంలో ఉన్న ప్రయోజనాలను చార్టర్డ్ ఫండ్ మేనేజర్ గౌరి రామచంద్రన్ ‘బీబీసీ తమిళ్’కు వివరించారు.

  • వడ్డీ రూపంలో చెల్లించాల్సిన డబ్బు ఆదా చేసుకోవచ్చు.
  • రుణ భారం తగ్గుతుంది.
  • ఆర్థికంగా ప్రశాంతత లభిస్తుంది.
  • పెట్టుబడుల కోసం చేతిలో నగదు ఉంటుంది.
ఇంటి రుణం

ఫొటో సోర్స్, Getty Images

త్వరగా ఇంటి రుణాన్ని ఎలా చెల్లించాలి?

పూర్తి టెన్యూర్ కంటే ముందే ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు కావాల్సిన ఆర్థిక ప్రణాళికను గౌరి రామచంద్రన్ వివరించారు.

ఉదాహరణకు.. మీరు రూ. 50 లక్షల ఇంటి రుణాన్ని తీసుకున్నారనుకోండి, ఇంటి రుణంపై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంటే.. మీరు ఈ రుణాన్ని 25 ఏళ్లలో చెల్లించాలనుకుంటే, నెలనెలా ఈఎంఐ రూ.40 వేలు కట్టాలి.

ఈ ఇంటి రుణాన్ని మూడు విధానాల్లో త్వరగా చెల్లించుకోవచ్చని గౌరి చెప్పారు.

  • ప్రతి ఏడాది ఇంటి రుణ నెలవారీ వాయిదా లేదా ఈఎంఐను 10 శాతం పెంచుకోవాలి. ప్రతి ఏడాది 10 శాతం ఈఎంఐ పెంచుకుంటే, తొలి ఏడాది నెలకు రూ.40 వేలు కడితే, రెండో ఏడాది నెలకు రూ.44 వేలకు, మూడవ ఏడాది రూ.48,400 చెల్లించాలి. 25 ఏళ్ల టెన్యూర్‌తో ఇంటి రుణాన్ని తీసుకుంటే, ఈఎంఐ ప్రతి ఏడాది 10 శాతం పెంచుకోవడం ద్వారా కేవలం 10 ఏళ్ల రెండు నెలల్లోనే తిరిగి చెల్లించేసుకోవచ్చు.
  • ప్రతి ఏడాది ఇంటి రుణంపై నెలవారీ వాయిదాను 10 శాతం పెంచుకోలేని సమయంలో, 5 శాతం పెంచుకోవాలి. ఇలా పెంచుకుంటే, 25 ఏళ్ల టెన్యూర్ కలిగిన రుణాన్ని కేవలం 13 ఏళ్ల 3 నెలల్లో చెల్లించుకోవచ్చు.
  • ఈ రెండు రకాలుగా నెలనెలా కట్టే మొత్తం పెంచుకోవడానికి ఆర్థికంగా అవకాశం లేనివారు.. ఏటా ఒక ఈఎంఐను అదనంగా చెల్లించుకోవచ్చు. అంటే ఏడాది 12 ఈఎంఐలు చెల్లించడానికి బదులు 13 ఈఎంఐలు చెల్లిస్తారన్నమాట. ఇలా చేస్తే మొత్తం ఇంటి రుణాన్ని 25 ఏళ్లల్లో కాకుండా.. 19 ఏళ్ల మూడు నెలల్లో పూర్తిగా తిరిగి చెల్లించొచ్చు.
గౌరి రామచంద్రన్

ఫొటో సోర్స్, GOWRI RAMACHANDRAN

ఫొటో క్యాప్షన్, గౌరి రామచంద్రన్

ముందే చెల్లిస్తే ప్రీపేమెంట్ చార్జీలు ఉంటాయా?

2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. నిర్దేశిత సమయం కంటే ముందే ఇంటి రుణాన్ని తిరిగి చెల్లిస్తే కొన్ని సందర్భాలలో ఎలాంటి చార్జీలు పడవు.

రుణం తీసుకున్నప్పుడు ఎంచుకున్న వడ్డీ రేటు విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది.

‘‘ఫిక్స్‌డ్ వడ్డీ రేటులో ఇంటి రుణాన్ని తీసుకుంటే, లోన్ కాల వ్యవధి కంటే ముందే పూర్తిగా తిరిగి చెల్లిస్తే అప్పుడు పెనాల్టీ రూపంలో కొంత ఛార్జ్ చేస్తారు. అయితే, వేరియబుల్ వడ్డీ రేటులో ఇంటి రుణాన్ని తీసుకుంటే ఎలాంటి పెనాల్టీ వేయరు. అందుకే, వేరియబుల్ రేటులో ఇంటి రుణం తీసుకుంటే మంచిది. దీని వల్ల తక్కువ కాల వ్యవధిలోనే ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించుకునే అవకాశం ఉంటుంది’’ అని గౌరి రామచంద్రన్ వివరించారు.

రుణ చెల్లింపు

ఫొటో సోర్స్, Getty Images

ఆర్థిక వ్యవహారాల నిపుణులు శిర్పితో బీబీసీ మాట్లాడినప్పుడు ‘హోమ్ లోన్ వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడం మంచిది’ అన్నారు.

ఇంటి రుణాన్ని దీర్ఘ కాలానికి తీసుకుంటే.. అంటే, ఉదాహరణకు 20 ఏళ్లకు రూ. 20 లక్షల ఇంటి రుణాన్ని తీసుకుంటే, ఆదాయపు పన్ను మినహాయింపులను లేదా డిడక్షన్‌ను పొందవచ్చని చాలామంది భావిస్తారు కానీ అది చాలా పాత ఐడియా అని శిర్పి చెప్పారు.

‘‘2020 వరకు ఇలా ఆలోచించడం సరైనదే. అప్పటి వరకు ఆదాయం, ఉపాధిలో స్థిరత్వం ఉండేది. కానీ, ప్రస్తుతం అలా కాదు’’ అని శిర్పి అన్నారు.

ప్రస్తుతం 5 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధిలో రుణాన్ని తీసుకోవడం మంచిదని చెప్పారు.

దీర్ఘ కాలానికి ఇంటి రుణాన్ని తీసుకుంటే, ఈ లోన్‌ను త్వరగా చెల్లించడం మంచిదన్నారు.

ఆర్థిక సలహాదారు సోమ వల్లియప్పన్
ఫొటో క్యాప్షన్, ఆర్థిక సలహాదారు సోమ వల్లియప్పన్

‘ఆర్థిక సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది’

ఇంటి రుణాన్ని త్వరగా చెల్లించడం మంచిదా? అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదని ఎకనమిక్ కన్సల్టెంట్ సోమ వల్లియప్పన్ అన్నారు.

ఇదంతా వ్యక్తుల ఆర్థిక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.

ఇంటి రుణాన్ని తీసుకునేటప్పుడు కింద పేర్కొన్న నాలుగు విషయాలను గుర్తుంచుకోవాలి.

  • ప్రస్తుత వడ్డీ రేటు
  • రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం
  • నగదు అవసరాలు
  • భవిష్యత్‌లో వడ్డీ రేటు, ఆర్థిక అవకాశాలు

టెన్యూర్‌కు ముందే ఇంటి రుణాన్ని తిరిగి చెల్లించడం మంచిదా లేదా పూర్తి కాల వ్యవధిలో ఇంటి రుణాన్ని చెల్లించడం మంచిదా అంటే అది పూర్తిగా వారి ఆర్థిక సామర్థ్యం, మానసిక స్థైర్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు.

‘‘ఇంటి రుణాన్ని త్వరగా చెల్లించే ఆర్థిక సామర్థ్యం ఉంటే, అలా చెల్లించడం మంచిది. ఇక రెండో విషయం, మీకు ఎలాంటి రుణ లేదా రుణ ఆధారిత సమస్యలు ఉండాలని కోరుకోకపోతే, ఈ సమయంలో మీ చేతిలో ఉన్న డబ్బులను వాడుకోవాలి’’ అని సోమ వల్లియప్పన్ చెప్పారు.

ఇదంతా వ్యక్తి ఆర్థిక సామర్థ్యం, మానసిక స్థైర్యంపై ఆధారపడి ఉంటుందన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)