అరకు కాఫీ: ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లోనూ ఘుమఘుమలాడిన ఈ కాఫీ ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజనుల జీవితాలను ఎలా మార్చింది

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో పండే కాఫీ తరచూ వార్తల్లో వినిపిస్తోంది.
గత సంవత్సరం దిల్లీలో జరిగిన జీ20 దేశాల సమావేశానికి హాజరైన ప్రతినిధులు అరకు కాఫీని రుచి చూశారు.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా అరకు కాఫీకి మెచ్చుకున్నారు.
భారతదేశానికి చెంది బ్రాండ్లు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయంటూ ఆయన అరకు కాఫీని ప్రస్తావిస్తూ ప్రశంసించారు.
ఒకప్పుడు పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో నేడు పండుతున్న కాఫీ గింజలు దేశం సరిహద్దులు దాటి అమెరికాతో పాటు యురప్ దేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.
ప్రస్తుతం ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లోనూ అరకు కాఫీ అవుట్‌లెట్ ఒకటి గతంలోనే ఒకటి ఏర్పాటు కాగా మరొకటి కూడా తెరవాలనుకుంటున్నట్లు ఇటీవల పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తెలిపారు.


ఆదివాసీల జీవితాల్లో వెలుగులు
తూర్పు మన్యంలోని ఆదివాసీలు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసేవారు. పోడు వ్యవసాయంలో అడవుల నరికివేత ఎక్కువగా ఉంటుంది.
అడవుల నరికివేతను అడ్డుకోవడం, ఆదివాసీలను నక్సలిజం వైపు మళ్లకుండా చూడటం, వాళ్ల ఆదాయం పెంచడం వంటి లక్ష్యాలతో 1990లలో ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ సాగును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది.
అలా మొదలైన కాఫీ సాగు ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చింది.
అలాంటి ఆదివాసీల్లో రంగసింగిపాడుకు చెందిన చిలకమ్మ ఒకరు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న రంగసింగిపాడులో 35 ఇళ్లు, 150 మంది జనాభా ఉన్నారు. వీరంతా కాఫీ తోటలను పెంచుతున్నారు.
ఇంతకుముందు పోడు వ్యవసాయం చేసే చిలకమ్మ ఇప్పుడు కాఫీ సాగు చేస్తున్నారు.
కాఫీ సాగుతో ‘‘నాలుగు రూపాయలు కళ్ల చూడగలుగుతున్నాను’’ అని ఆమె చెబుతున్నారు.
చిలకమ్మ తనకున్న కొద్దిపాటి భూమిలో కాఫీ సాగు చేశారు. గత సంవత్సరం రూ . 20,000 వరకు ఆదాయం వచ్చిందని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అరకు లోయలోని కాఫీ తోటలు ఆదివాసీల జీవితాలకు ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నాయన్న ప్రధాని మోదీ మాటలను రైతు చిలకమ్మ అంగీకరిస్తున్నారు.
‘‘కాఫీ తోటల ఆదాయంతో పిల్లలను బాగా చదివించుకోగలుగుతున్నాం’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.
కాఫీ తోటల సాగుతో చుట్టుపక్కల రైతుల ఆదాయం పెరగడం చూసిన చిలకమ్మ, నాలుగేళ్ల క్రితం ఈ దిశగా అడుగులు వేశారు.
“నిరుడు ఖర్చులు అన్నీ పోగా రూ. 20 వేలు మిగిలింది. ఇంట్లో సామాన్లు, పిల్లల చదువులకు, కాస్త పొదుపు చేసుకోవడానికి సరిపోతుంది’’ అని చిలకమ్మ సంతోషంగా చెప్పారు.
''ఐదు, పదేళ్ల కిందటివరకు ఈ గ్రామంలో రాగులు, సామలు వంటి పంటలతో పాటు అడవి తేనే, అడ్డాకుల సేకరణతో ఆదాయం పొందుతూ ఉండేవారు. అయితే ఆ ఆదాయం అంతంత మాత్రమే కావడంతో ఐటీడీఏ ప్రోత్సాహంతో గత పదేళ్ల నుంచి ఈ గ్రామంలో ఒక్కొక్కరుగా కాఫీ తోటలు సాగు చేస్తున్నాం'' అని రంగసింగిపాడుకు చెందిన వి.లక్ష్మణరావు బీబీసీతో చెప్పారు.
ఆయన 3 ఎకరాల్లో కాఫీ తోటలను సాగు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఆర్థిక స్థిరత్వం ఎక్కువగా ఉన్నది లక్ష్మణ రావుకే. ఇదంతా కాఫీ తోటల పెంపకం మొదలు పెట్టినప్పుటి నుంచే సాధ్యమైందని ఆయన చెప్పారు.

లాభం ఎంత వస్తోంది?
“అంతకుముందు ఇతర పంటలు వేసేవాళ్లం. ఏడాదికి రూ. 15 వేలు రావడం కష్టంగా ఉండేది. కాఫీ తోటల సాగుతో ఆదాయం పెరగడం మొదలైంది’’ అని లక్ష్మణరావు అన్నారు.
మొదట ఎకరం భూమిలో కాఫీ సాగు ప్రారంభించిన లక్ష్మణరావు ఇప్పుడు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
కాఫీ గింజల నుంచే కాకుండా ఇతర మార్గాల్లోనూ ఆదాయం ఆదివాసీలకు వస్తోంది. తోటల్లో కాఫీ మొక్కలకు నీడ కోసం సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతారు. ఆ చెట్ల అమ్మకం వల్ల ఆదాయం వస్తుంది. ఇక సిల్వర్ ఓక్ చెట్ల మధ్య అంతరపంటగా వేసే మిరియాల వలన కూడా మరి కొంత ఆదాయం వస్తోంది.

ఒక ఎకరా కాఫీ తోట నుంచి ఏడాదికి గింజల ద్వారా రూ. 50 వేలు నుంచి రూ. లక్ష వరకు, అంతేకాకుండా అంతరపంటగా వేసే మిరియాల ద్వారా రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వస్తున్నాయని లక్ష్మణరావు తెలిపారు.
మొత్తం మీద ఎకరం కాఫీ తోటతో ఏడాదికి రూ. 3- 4 లక్షల ఆదాయం వస్తోందని ఆయన చెబుతున్నారు. సిల్వర్ ఓక్ చెట్ల ద్వారా వచ్చే ఆదాయం దీనికి అదనం.
ఒకప్పుడు సామలు, రాగులు వంటి పంటలు వేసినప్పుడు ఏటా లక్ష రూపాయలు కూడా వచ్చేవి కావని, ఇప్పుడు తమ జీవితం బాగుందని లక్ష్మణరావు ఆనందం వ్యక్తం చేశారు.

11 మండలాలలో సాగు
స్థానిక సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాడేరు ప్రకారం..
సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో పగలు వేడిగా, రాత్రుళ్లు చల్లగా ఉండి, నేలలో అధికంగా ఐరన్ ఉండటం కాఫీ తోటల సాగుకు, ప్రత్యేకమైన రుచికి కారణం.
కాఫీ తోటలను నీడలోనే పెంచుతారు. వాటికి నీడ కోసం సిల్వర్ చెట్లు వేస్తారు. ఆ సిల్వర్ చెట్లకు ఆసరాగా మిరియాల పంట వేస్తారు.
దేశంలో కాఫీ సాగులో కర్ణాటక తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. 2019లో అరకు కాఫీకి భౌగోళిక సూచిక (జీఐ) హెూదా లభించింది.
11 మండలాల్లో కాఫీ తోటల సాగు జరుగుతున్నప్పటికీ దీనికి 'అరకు కాఫీ' అనే పేరే స్థిరపడింది.
ఆంధ్రప్రదేశ్‌లో అరబికా రకం కాఫీని పండిస్తారు.
పారిస్‌లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ తెరిచారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి 'అరకు కాఫీ' షాప్ ఇది.
2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఏపీక్యూరస్-2018 పోటీలో అరకు కాఫీకి గోల్డ్ మెడల్ వచ్చింది.
ఇథియోపియాలో పుట్టిన ఈ కాఫీ అరకు వరకు ఎలా వచ్చిందనే విషయాలతో పాటు కాఫీ చరిత్ర మొత్తాన్ని వివరించే కాఫీ మ్యూజియం అరకులో ఉంది.

బ్రిటిషర్లతో ప్రారంభమైన సాగు
1920లో బ్రిటిష్ వారి ద్వారా ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మొదలైన కాఫీ తోటల పెంపకం 1960వ సంవత్సరానికి పది వేల ఎకరాలకు చేరుకుంది. 1985 నుంచి జీసీసీ (గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ ) ఆధ్వర్యంలో ప్రత్యేక కాఫీ తోటల విభాగం ఏర్పడంతో సాగు మరింత పెరిగింది.
ఏజెన్సీలోని 11 మండలాల్లో ఐటీడీఏ తరపున 2 లక్షల ఎకరాలు, ఆదివాసీలు వ్యక్తిగతంగా మరో 30 నుంచి 40 వేల ఎకరాల్లో కాపీ తోటలను సాగు చేస్తున్నారని ఐటీడీఏ పాడేరు ప్రాజెక్ట్ ఆఫీసర్ వి. అభిషేక్ బీబీసీతో చెప్పారు.
అర ఎకరం, ఒక ఎకరం, రెండు ఎకరాలు ఇలా చిన్నకమతాలలో కాఫీ తోటలను సాగు చేస్తున్న పద్దతి తూర్పు కనుమల్లోని ఐటీడీఏ పాడేరు పరిధిలో తప్ప దేశంలో మరెక్కడా ఉండదని ఆయన తెలిపారు.
‘‘ఊటీ, అస్సాం వంటి ప్రాంతాల్లో ఒకే యాజమాన్యం చేతిలో వందల ఎకరాల తోటలుంటాయి. కానీ ఇక్కడ సగటున 2 ఎకరాల చొప్పున లక్ష మంది రైతులు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు’’ అని అభిషేక్ అన్నారు.
రానున్న ఐదేళ్లలో మన్యంలో కాఫీ తోటల సాగుతో టూరిజం మరింత పెరుగుతుందన్నారు.
‘‘ఇప్పటీకే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడి కాఫీ తోటలను చూసేందుకు వస్తున్నారు. ఇది మరింత పెరుగుతుంది. కాఫీ తోటలు, కాఫీ ప్రాసెసింగ్, ప్యాకింగ్ వంటివి టూరిస్టులకు చూపిస్తూ ఆదాయం పొందవచ్చు” అని అభిషేక్ వివరించారు.

కిలో రూ.250
గిరిజన సహకార సంస్థ ద్వారా ఈ ఏడాది కిలో పార్చిమెంట్ (కాఫీ గింజలు) రూ. 280, చెర్రీ (తొక్క తీసిన గింజలు) రూ.145కు కొనుగోలు చేశారని కొండలరావు అనే రైతు తెలిపారు.
బెంగళూరులో పార్చిమెంట్ కిలో రూ. 370 ఉందని, అంతర్జాతీయ స్థాయిలో రూ. 470 కంటే ఎక్కువ పలుకుతోందని అన్నారు. కాబట్టి, కాఫీ రైతులకు ఇంకాస్త ధర ఎక్కువ వచ్చేలా చేయాలని కొండలరావు కోరుతున్నారు.
అయితే, కాఫీ రైతులకు మరింత ఆదాయం వచ్చేలా ఐటీడీఏ చర్యలు తీసుకుంటోందని పీవో అభిషేక్ బీబీసీతో చెప్పారు.
“ఒక ఎకరాలో 900 కాఫీ మొక్కలు నాటాలి. కానీ మన దగ్గర ఎకరానికి 500 వరకే ఉంటున్నాయి. దీనినే డెన్సిటీ ఆఫ్ క్రాపింగ్ అంటారు. ఈ సారి కొత్త కొత్త ఏరియాలో కాఫీ మొక్కలు పెంచడానికి బదులు ఎక్కడైతే మొక్కలు చనిపోయాయో అక్కడ కొత్త మొక్కలు వేస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి, ఒక ఎకరాలో ఎక్కువ ఉత్పత్తి వచ్చి, ఆదాయం పెరిగే అవకాశం ఉంది” అని అభిషేక్ తెలిపారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














