ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చుట్టూ నెలకొన్న వివాదం ఏంటి? ఆమెకు ప్రభుత్వం ఎందుకు నోటీసులు ఇచ్చింది?

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతి చుట్టూ అలుముకున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

ఆమె వ్యక్తిగత జీవిత అంశాలతోపాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న శాంతికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ జులై 19న మెమో జారీ చేసింది.

ఆమె వివాహం, వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మీద ఆమె చేసిన ట్వీట్ తదితర అంశాల మీద వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆమెను ఆదేశించారు.

వాట్సాప్

‘‘విడాకులు తీసుకోకుండా మరో పెళ్లి’’

కె.శాంతికి దేవాదాయ శాఖ ఇచ్చిన మెమో ప్రకారం..

చార్జ్-1: 2020లో కె. శాంతి దేవాదాయ శాఖలో చేరినప్పుడు సర్వీసు రికార్డులో కె.మదన్ మోహన్‌ను భర్తగా పేర్కొన్నారు. 2023 జనవరి 5న మెడికల్ లీవు కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు అదే రాశారు. కానీ 2024 జులై 17న నిర్వహించిన మీడియా సమావేశంలో తన భర్త పేరు పి.సుభాష్ అని శాంతి చెప్పారు. అదే సమయంలో సివిల్ కోర్టు ద్వారా మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదని కూడా ఆమె అంగీకరించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఏపీసీసీ) రూల్స్- 1964 (రూల్–25)కు విరుద్ధం.

చార్జ్-2: కె.శాంతి తన ప్రవర్తన, చర్యల ద్వారా ప్రజలు, భక్తుల దృష్టిలో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించడం.

చార్జ్-3: దేవాదాయ శాఖ కమిషనర్ తీసుకున్న క్రమశిక్షణ చర్యల మీద ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే కె.శాంతి ప్రెస్‌మీట్ పెట్టారు. రూల్-16కి ఇది విరుద్ధం.

చార్జ్-4: గత ఏడాది మే 28న "ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సర్, మీరు పార్టీకి వెన్నెముక” అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి గురించి కె. శాంతి ఎక్స్ (గతంలో ట్విటర్)లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఒక రాజకీయ పార్టీతో ఆమెకున్న సంబంధాన్ని ఇది సూచిస్తోంది. రూల్ – 19(1) కి ఈ చర్య వ్యతిరేకం.

చార్జ్-5: 2022 ఆగస్ట్ 8న ప్రజలతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలపై విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో శాంతి మీద కేసు నమోదైంది. దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాలేదు.

చార్జ్-6: విశాఖలో పని చేస్తున్నప్పుడు తన అధికార పరిధి కాకపోయినా అనకాపల్లి, చోడవరం, లంకెలపాలం, పాయకరావుపేట, ధారపాలెంలోని ఆలయాలకు చెందిన దుకాణాలు, భూముల లీజులను 3 ఏళ్ల నుంచి 11 ఏళ్లకు రెన్యూవల్ చేసేలా కమిషనర్‌కు కె.శాంతి ప్రతిపాదనలు పంపి, రెన్యూవల్ చేయించారు.

ఈ అభియోగాలపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని మెమోలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదేశించారు.

దేవాదాయ శాఖ మెమో

ఫొటో సోర్స్, AP Endorcement order

ఫొటో క్యాప్షన్, అసిస్టెంట్ కమిషనర్ శాంతికి దేవాదాయ శాఖ జారీ చేసిన మెమోలోని మొదటి పేజీ

అసిస్టెంట్ కమిషనర్ శాంతి నేపథ్యం ఏంటి?

ఆదివాసీ అయిన కాళింగిరి శాంతి నంద్యాల జిల్లాకు చెందినవారు. 2020లో రాష్ట్ర దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా చేరారు. విశాఖపట్నంలో 2020 ఏప్రిల్ 24 నుంచి 2022 జూన్ 30 వరకు పనిచేశారు. ఆ తర్వాత విజయవాడకు బదిలీ అయ్యారు.

కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆమెను అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో జులై 2న రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

2021 ఆగస్టు 5న తొలిసారి శాంతి వార్తల్లోకి వచ్చారు.

విశాఖ జిల్లా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ తన ఛాంబర్లో ఉండగా అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న శాంతి లోపలికి వచ్చి, ఆయన ముఖంపై ఇసుక విసిరారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. త‌న‌పై డిప్యూటీ క‌మిష‌న‌ర్ పుష్ప వ‌ర్ద‌న్‌ అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తున్నారని, కొన్ని రోజులుగా లైంగిక వేధింపుల‌కు గురిచేస్తున్నారని శాంతి ఆరోపించారు. ఆమె ఆరోప‌ణ‌ల‌ను పుష్ప వ‌ర్ద‌న్ ఖండించారు.

ఇటీవల శాంతిపై కె.మదన్‌ మోహన్‌ చేసిన వ్యక్తిగత ఆరోపణలు చర్చనీయమయ్యాయి. ఆయన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి ఫిర్యాదు చేశారు.

శాంతి విషయంపై హోం మంత్రికి ఫిర్యాదు చేస్తున్న మదన్ మోహన్

ఫొటో సోర్స్, Sai

ఫొటో క్యాప్షన్, శాంతిపై హోం మంత్రి వంగలపూడి అనితకు మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు.

శాంతి ఏమన్నారు?

కె.మదన్ మెహన్ చేసిన ఆరోపణలను శాంతి ఖండించారు. ఈ నెల 17న ప్రెస్‌మీట్ పెట్టి, వివరణ ఇచ్చారు.

“2013 నవంబరులో మదన్ మోహన్‌తో వివాహం అయింది. 2015లో మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. మదన్ మోహన్ నన్ను హింసిస్తుండటంతో 2016లో మేం గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకుల ఒప్పందం రాసుకున్నాం. ఆ తరువాత 2019లో మదన్ మోహన్ అమెరికా వెళ్లిపోయారు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత న్యాయవాది సుభాష్‌ను పెళ్లి చేసుకున్నాను” అని శాంతి చెప్పారు.

ఆ తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించి, తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించారు.

“నాపై కావాలనే నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌‌తో సహా అందరికీ ఫిర్యాదు చేస్తాను. 2020లో వైజాగ్‌ సీతమ్మధార ఆఫీసులో తొలిసారి శాంతిని కలిశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను కూతురుగానే భావిస్తున్నాను” అని విజయసాయి రెడ్డి అన్నారు.

గిరిజనుల వివాహ వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు?

‘‘వివాహాల విషయంలో గిరిజనులకు భారత రాజ్యాంగం ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. దీనిని కస్టమరీ లా అంటారు. దీని ప్రకారం, గిరిజనులు పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం చెల్లుతాయి. అయితే, గిరిజన సంప్రదాయాల ప్రకారం జరిగే పెళ్లిళ్ల విషయంలో ఏవైనా వివాదాలు వస్తే వాటిని పరిష్కరించాల్సింది గిరిజన సంక్షేమ శాఖే. అంటే, అది ప్రభుత్వం దగ్గరికే వెళ్తుంది’’ అని విశాఖపట్నానికి చెందిన న్యాయవాది ఏ.అన్నపూర్ణ చెప్పారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే పరిమితులు ఏంటి?

ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రూప్ వన్ అధికారి ఒకరు మాట్లాడారు. అయితే ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని పరిమితులు ఉంటాయని ఆ అధికారి చెప్పారు.

“సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగతమైన పోస్టులు చేయవచ్చు. కామెంట్స్ పెట్టవచ్చు. కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. రాజకీయ పార్టీలకు అనుగుణంగానో, వ్యతిరేకంగానో ప్రభుత్వ ఉద్యోగులు స్పందించకూడదు. అలా చేస్తే ఆ పార్టీపై వాళ్లు ఒక అభిప్రాయంతో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సమావేశాలు పెట్టాలంటే మాత్రం కచ్చితంగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి” అని ఆ గ్రూప్-1 అధికారి వివరించారు.

ఇక దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా శాంతి నియామకం మీద కూడా ఆరోపణలు రావడంతో విచారణ జరుపుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఈ ఆరోపణలన్నింటి మీద కె.శాంతి స్పందన కోసం బీబీసీ మూడు రోజులుగా ప్రయత్నిస్తోంది. అనేక మార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించింది. అలాగే విజయవాడలోని ఆమె నివాసం వద్ద కూడా ఆమెను కలిసేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ అక్కడ కూడా కె. శాంతి అందుబాటులోకి రాలేదు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)