ఆంధ్రప్రదేశ్: పిల్లల తల్లిదండ్రులే కట్టుకున్న స్కూలు ఇది, ఎందుకిలా చేశారంటే....

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం, కివర్ల పంచాయతీలోని తంగెళ్లబంద గ్రామానికి చేరువైనప్పటి నుంచి బీబీసీ బృందానికి గిరిజన సంప్రదాయ గీతాలు వినిపిస్తూనే ఉన్నాయి.

అక్కడ కొందరు గిరిజనులు పాటలు పాడుతూ మట్టి, పెంకులు, వెదురుతో ఒక షెడ్డు నిర్మించే పనిలో ఉన్నారు. ఈ షెడ్డు ఎందుకని అడిగితే.. 'మా పిల్లల కోసం బడి కడుతున్నాం' అని సమాధానమిచ్చారు.

''ఇకపై ఇదే మా స్కూల్. ఇది మా అమ్మానాన్నలు కడుతున్న బడి'' అని గ్రామంలో కొత్తగా కడుతున్న స్కూల్ షెడ్డు దగ్గర ఆడుకుంటున్న పిల్లలు చెప్పారు.

ఈ షెడ్డు నిర్మిస్తున్న వారంతా తంగెళ్లబంద గ్రామానికి చెందిన ఎలిమెంటరీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులే. వీరంతా తమ రోజువారీ పనులు మానుకుని, చందాలు వేసుకుని ఈ షెడ్డు(బడి)ని నిర్మిస్తున్నారు.

గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పి.గంగవరం గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. తంగెళ్లబంద గ్రామానికి చెందిన పిల్లలందరూ ఆ బడికే వెళ్తుంటారు. కానీ, ఇకపై తమ పిల్లలను అక్కడికి పంపలేమని, తామే పిల్లల కోసం ఒక స్కూల్ నిర్మించుకోవాలని గ్రామస్థులు తీర్మానించుకున్నారు.

ఈ గ్రామస్థులు పిల్లల్ని పక్కఊరిలోని పాఠశాలకు పంపబోమని ఎందుకు అంటున్నారు? సొంతంగానే ఓ స్కూల్ షెడ్డు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? ఆ ఊళ్లో ఏం జరిగింది?

బీబీసీ న్యూస్ తెలుగు
ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, శాంతి

అసలేం జరిగింది?

అనంతగిరి మండలంలోని కివర్ల పంచాయతీ తంగెళ్లబంద గ్రామంలో దాదాపు 110 మంది నివాసం ఉంటున్నారు. ఇది కొండ మీద ఉండే గ్రామం. ఏ అవసరానికైనా గ్రామస్థులు 40 కి.మీ. దిగువన ఉన్న దేవరాపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.

వానొస్తే ఈ తంగెళ్లబందతో పాటు ఆ చుట్టుపక్కలున్న ఏ గ్రామానికీ చేరుకోలేం. వాగులు, గెడ్డలు పొంగుతుంటాయి. పెద్దవాళ్లే వాటిని దాటేందుకు భయపడే పరిస్థితి ఉంటుంది.

ఈ గ్రామంలో 23 మంది ప్రాథమిక విద్యను చదువుకుంటున్న చిన్నారులు ఉన్నారు. వీరంతా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పి.గంగవరం మండల ప్రాథమిక పాఠశాలకు వెళ్తుంటారు. మార్గంమధ్యలో వారు రెండు గెడ్డలను దాటాల్సి ఉంటుంది.

వర్షాకాలం కావడంతో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పిల్లలు పాఠశాలకు వెళ్లడం కష్టంగా మారింది. ఇటీవలే ఇద్దరు పిల్లలు గెడ్డలో కొట్టుకుపోయారని, వారిని ఎలాగోలా కాపాడుకోగలిగామని గ్రామస్థులు చెప్పారు.

''బడికి పంపాలంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడినట్లు ఉంది. అందుకే పిల్లలను బడికి పంపేకంటే.. మా గ్రామానికి టీచరు వస్తే బాగుంటుందని అందరం అనుకున్నాం. అదే విషయాన్ని అధికారులకు చెప్పాం.'' అని గ్రామస్తురాలు శాంతి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

పిల్లల కోసం బడి కట్టుకుంటున్నాం: గ్రామస్థులు

''మా పిల్లలను బడికి పంపాలంటే భయమేస్తోంది. అలాగని, చదువులు మాన్పించలేం. దీంతో ఏం చేయాలో తెలీడం లేదు. ఈ పరిస్థితిలోనే మేం మా ఊరికే టీచర్ వస్తే.. అని ఆలోచించుకున్నాం.'' అని సత్యారావు చెప్పారు.

“గెడ్డలు దాటుకుని పిల్లలను బడికి పంపేకంటే పి.గంగవరం స్కూల్ లో ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు మా ఊరికే వచ్చి పాఠాలు చెప్తే బాగుంటుంది కదా అనుకున్నాం. ఎంఈవో దృష్టికి ఈ విషయం తీసుకెళ్తే ఆయన పైఅధికారులతో మాట్లాడారు.

మేం బడి కోసం షెడ్డు ఏర్పాటు చేస్తే టీచర్‌ని పంపిస్తామని చెప్పారు. దీంతో మా పనులన్నీ పక్కనబెట్టి, ఇంటికి రూ.500 చొప్పున చందాలు వేసుకుని షెడ్డు నిర్మాణం మొదలుపెట్టాం. దాదాపు పూర్తయింది. ఇక టీచర్‌ని పంపితే చాలు.” అని సత్యారావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, పి.గంగవరం పాఠశాల

‘‘తంగెళ్లబందలో ఆటోలు ఉన్నాయి. వాటిలో పిల్లలను తీసుకొస్తే డబ్బులు కూడా మేమే ఇస్తామని చెప్పాం. కానీ, గెడ్డలను దాటి తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం’’ అని పి.గంగవరం మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరభద్రరావు బీబీసీతో అన్నారు.

''ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామంలో పరిస్థితి తెలుసుకునేందుకు తంగెళ్లబంద వెళ్లా. అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించా. దాంతో వారు గ్రామంలో షెడ్డు నిర్మించుకుంటే టీచర్‌ని పంపించే ఏర్పాట్లు చేద్దామని చెప్పారు.'' అని అనంతగిరి మండల విద్యాశాఖాధికారి(ఎంఈవో) కిల్లో బాలాజీ బీబీసీతో చెప్పారు.

పాఠశాల కోసం గ్రామస్థులు తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని, వారి ఆదేశాల మేరకు పి.గంగవరం పాఠశాల ఉపాధ్యాయుడిని, లేదా భాషా వలంటీరును తంగెళ్లబంద పంపిస్తామని హామీ ఇచ్చారని బాలాజీ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఫొటో క్యాప్షన్, తంగెళ్లబందలో పిల్లల కోసం స్కూల్ షెడ్డు కడుతున్న తల్లిదండ్రులు

‘అమ్మానాన్నలు కడుతున్న బడులు పెరుగుతున్నాయి’

ఇలా బడికి వెళ్లే పిల్లల కష్టాలు చూసి తల్లిదండ్రులే బడులు నిర్మించుకుంటున్న ఘటనలు ఏజెన్సీలో పెరుగుతున్నాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీలోని కేందుగూడ గ్రామంలో కూడా తల్లిదండ్రులు సొంతంగా విరాళాలు సేకరించి, శ్రమదానం చేసి తమ పిల్లల కోసం బడి షెడ్డు నిర్మించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే గ్రామంలో పాఠశాల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అలాగే, అనంతగిరి మండలం, పినకోట, గుమ్మ పంచాయతీల్లోని కొట్టెంగూడ, గొప్పిలపాలెం, కడరేవు, కళ్యాణగుమ్మి గ్రామాల్లో దాదాపు 50 మంది బడికి వెళ్లే పిల్లలున్నారు. వారు స్కూలుకు సరాసరిన 6 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. దీంతో తమ గ్రామాల్లోనూ స్కూల్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కావాలంటే చందాలు వేసుకుని స్కూల్ కోసం షెడ్లు నిర్మించుకుంటామని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas

ఇలా షెడ్లు నిర్మించుకున్న ఘటనలు గతంలోనూ ఉన్నాయని అనంతగిరి ఎంఈవో కిల్లో బాలాజీ బీబీసీతో అన్నారు. అయితే, అలా నిర్మించుకున్న షెడ్ల స్థానంలో ప్రభుత్వం శాశ్వత భవనాలు లేదా పాఠశాలలు నిర్మించిన సందర్భాలూ ఒక్కటీ లేవని ఆయన చెప్పారు.

పాఠశాల నిర్మించుకుంటామని అడిగినంత మాత్రాన అందరికీ అనుమతులు రావని, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే తంగెళ్లబంద వంటి గ్రామాల్లో అనుమతి ఇస్తామని ఆయన తెలిపారు.

‘‘తంగెళ్లబంద మాత్రమే కాదు. ఇలాంటి గ్రామాలు ఏజెన్సీలో అనేకం ఉన్నాయి. నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. కానీ, వాటిని అందుకోవడంలో విద్యార్థులకు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాథమిక విద్యను అభ్యసించే వారికి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. వాటన్నింటిపై ఐటీడీఏ, రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని గిరిజన సంఘం నాయకుడు కె.గోవిందరావు అన్నారు.

''అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో 408 స్కూళ్లకు భవనాలు లేవని గుర్తించాం. బిల్డింగుల నిర్మాణాలకు ప్రతిపాదనలు పెట్టాం. త్వరలో వాటిని పూర్తి చేస్తాం'' అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చెప్పారు.

( బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)