పురాతన ఒలింపిక్స్‌: ఆటగాళ్లు నగ్నంగా తలపడటానికి, గ్రీకు దేవతలకు సంబంధం ఏంటి?

ఒలింపిక్ గేమ్స్, పారిస్, గ్రీస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 'విత్‌ ద వరల్డ్స్ పీపుల్' పుస్తకంలో పురాతన గ్రీకు ఒలింపిక్స్‌ గురించిన వివరణాత్మక చిత్రం
    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"ఒలింపిక్స్‌కు గ్రీస్ ఊయల అయితే పారిస్ ఆ ఊయల ఊగే ఇల్లు". 2012 ఒలింపిక్ బిడ్‌ను గెలుచుకోవడంలో ఫ్రాన్స్ విఫలమైన తర్వాత ఒక రచయిత రాసిన కథనానికి పతాక శీర్షిక ఇది.

గ్రీసులో మొదలైన పురాతన ఒలింపిక్స్‌కు ఆధునిక దశ, దిశ ఇచ్చే ప్రయత్నం పారిస్‌లోనే మొదలైంది. 1894లో పారిస్‌లోని సోర్బొన్నే యూనివర్సిటీలో తొలిసారి ఒలింపిక్స్ కోసం అంతర్జాతీయ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా దానికి అధ్యక్షత వహించారు ఫ్రెంచ్ అరిస్టోక్రాట్ పియర్రే డి కౌబర్టిన్. ఒలింపిక్స్‌తో ఫ్యాషన్ సిటీకి ఉన్న అనుబంధం అలాంటిది. ఫ్రాన్స్‌లోనే ఆధునిక ఒలింపిక్స్‌ చరిత్ర మొదలైంది. 2024 సమ్మర్ ఒలింపిక్స్‌ నిర్వహణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఒక వెబ్‌సైట్ ద్వారా అందిస్తోంది క్రీడల నిర్వహణ కమిటి.

ఇందులో ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన సమస్త సమాచారం ఉంది. ఈ సైట్ హిందీ సహా 12 భాషల్లో అందుబాటులో ఉంది.

క్రీస్తుకు పూర్వం, 2800 ఏళ్ల కిందట గ్రీకు నగరం ఒలింపియాలో మొదలైన ఈ క్రీడా పోటీలు ఈనాటి వరకు అనేక ఊహించని మలుపులు తిరుగుతూ వచ్చాయి. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాలను దాటి వచ్చాయి.

దేశాల మధ్య పోటీలు, రాజకీయాలు, యుద్ధాలు, వర్ణ వివక్ష, పేదరికం, వ్యాపార ప్రకటనలు లాంటి ఎన్నో అంశాలకు వేదికలయ్యాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫ్రాన్స్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

క్రీస్తు పూర్వం ...

ఒలింపిక్స్ తొలిసారిగా క్రీస్తు పూర్వం 776లో ప్రారంభం అయ్యాయి. పురాతన గ్రీకుల ఆకాశం, వాతావరణానికి సంబంధించిన దేవుడికి గుర్తుగా తొలి ఒలింపిక్స్‌ను గ్రీకు చక్రవర్తి జుయిస్ నిర్వహించారు. ఈ పోటీలు ఆరు నెలల పాటు జరిగాయి.

ఇందులో కుస్తీ పోటీలు, బాక్సింగ్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, గుర్రాలు లాగే రథాల పందాలు జరిగాయి.

క్రీస్తు శకం 393లో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. ఆ తర్వాత 1500 సంవత్సరాల వరకు తిరిగి ప్రారంభం కాలేదు.

వేడుకల్లో మతపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని రోమన్ చక్రవర్తి థియోడోసిస్ I ఒలింపిక్స్‌ను నిషేధించారు. క్రైస్తవ దేశంలో ఇలాంటి వాటికి స్థానం లేదని ఆయన భావించారు.

1896 వరకు ఒలింపిక్స్ జరగలేదు. ఆ తర్వాత పియర్రే కౌబర్టన్ ఈ ఆటల పోటీలను ప్రారంభించారు. ఆధునిక ఒలింపిక్స్ పేరుతో ప్రారంభమైన ఈ క్రీడల పోటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

గ్రీస్‌లోని వెస్ట్రన్ పెలొప్పొన్నీస్ ప్రాంతంలో ఉన్న ఒలింపియాలో మౌంట్ ఒలింపస్ పేరు మీద ఒలింపిక్స్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం చాలా పవిత్రమైనదిగా గ్రీకులు భావిస్తారు.

క్రీస్తు పూర్వం ఈ పట్టణంలో ఒలింపిక్స్‌ అన్నీ ఒలింపియాలోని మైదానంలో నిర్వహించేవారు. ఈ స్టేడియంలో 45వేల మంది కూర్చునేవారు. వీళ్లంతా స్టేడియంలో వేసిన టెంట్లు కింద కూర్చుని క్రీడల్ని చూసేవారు.

ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి ముందు ఒలింపియా నుంచి ఇతర నగరాలకు మెసెంజర్లు వెళ్లేవాళ్లు. వాళ్లు ఒలింపియా ఒప్పందం గురించి ప్రకటించేవారు.

క్రీడల్లో పాల్గొనే ప్రతీ నగరం ఈ ఒప్పందంపై సంతకం చెయ్యాలి. ఒక్కసారి సంతకం చేస్తే యుద్ధాలు చేసే రాజ్యాలు ఒలింపియాపై దాడులు చెయ్యకూడదు. ఆటగాళ్లు, ప్రేక్షకులు భద్రతను దృష్టిలో ఉంచుకుని , క్రీడా పోటీలు సురక్షితంగా జరిగేందుకు ఈ ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ ఒప్పందం నెల రోజులే ఉండేది. తర్వాతి కాలంలో దీన్ని మూడు నెలలకు పెంచారు.

పురాతన గ్రీకు ఒలింపిక్స్‌లో ఆటగాళ్లు నగ్నంగా పాల్గొనేవారు. గ్రీకు దేవుడు జూయిస్‌కు నివాళులు అర్పించడం, అలాగే ప్రత్యర్థులకు తమ దేహదారుఢ్యాన్ని చూపించేదుకు ఇలా చేసేవారు.

ఒలింపిక్స్‌కు సంబంధించి పురాతన గ్రీకు అవశేషాలైన కుండలు, గిన్నెలు, కళాకృతుల్లో ఈ నగ్న చిత్రాలు కనిపించేవి. ఆ రోజుల్లో ఆటల పోటీల్లో నిబంధనలు అతిక్రమించిన క్రీడాకారులను బహిరంగ స్థలాలలో కొరడాలతో కొట్టేవారు. దెబ్బలతోపాటు భారీగా జరిమానాలు విధించేవారు.

ఒలింపిక్స్ టార్చ్, గ్రీస్, ఒలింపియా
ఫొటో క్యాప్షన్, గ్రీస్ నగరం ఒలింపియాలో పారిస్ ఒలింపిక్స్ జ్యోతిని వెలిగిస్తున్న గ్రీకు నటి మేరి మినా

ఒలింపిక్ టార్చ్, ఒలింపిక్ రింగ్స్

ఒలింపిక్స్ జ్యోతి కూడా గ్రీకు పురాణాల నుంచే వచ్చింది. గ్రీకు దేవత హెస్టియాకు నివాళిగా ఒలింపిక్ క్రీడలు జరిగినన్ని రోజులు ఈ జ్యోతిని వెలిగించి ఉంచేవాళ్లు. 1928 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అయితే జ్యోతికి బదులుగా ప్రస్తుతం టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు.

ఒలింపిక్ టార్చ్‌ను ఇప్పటికీ పురాతన పద్దతిలోనే వెలిగిస్తున్నారు. గ్రీస్‌లోని హీరా టెంపుల్‌లో నటీమణులు పురాతన గ్రీకు పూజారులు ధరించే దుస్తులు ధరించి కుంభాకార అద్దంలో పరావర్తనం చెందిన సూర్యకిరణాలతో జ్యోతిని వెలిగిస్తారు. ఒలింపిక్ జ్యోతి క్రీడల పోటీలు జరిగినంత కాలం వెలుగుతూనే ఉండాలి. ఒకవేళ మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆరిపోతే దాన్ని గ్రీస్‌లో మొదట వెలిగించిన మంటతోనే వెలిగించాలి తప్ప మరో రకంగా వెలిగించకూడదు.

ఈ టార్చ్‌ను తొలిసారిగా ఒలింపిక్స్ నిర్వహించిన గ్రీస్ నగరం ఒలింపియాలో సూర్య కిరణాల ద్వారా వెలిగిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ వెలిగించిన టార్చ్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో తిరిగి చివరిగా ఆతిధ్య దేశానికి చేరుకుంటుంది. ఒలింపిక్స్ జరిగిన ప్రతీసారి కొత్త రకాల టార్చ్‌లను డిజైన్ చేస్తున్నారు. ఈ టార్చ్‌ను పట్టుకోవడం ( టార్చ్ బేరర్) అనేది గొప్ప గౌరవంగా భావిస్తారు.

ఒలింపిక్ జ్యోతిని విమానాల్లో తీసుకెళ్లేవారు. ఇవి నీళ్లలో ముంచినప్పటికీ మండుతూనే ఉంటాయి. గతంలో ఒలింపిక్ జ్యోతిని ఎవరెస్ట్ శిఖరం మీదకు తీసుకెళ్లారు. వెలిగించని ఒలింపిక్ టార్చ్‌ను అంతరిక్షంలోకి కూడా తీసుకెళ్లారు.

ఒలింపిక్ టార్చ్‌ను ఒక దేశం నుంచి మరో దేశానికి అలా ప్రపంచం అంతా తిప్పే సంస్కృతి చాలా పురాతనమైనది. దీన్ని జర్మన్ ఒలింపియన్ కార్ల్ డైమ్ 1936 సమ్మర్ ఒలింపిక్స్‌లో బెర్లిన్‌లో ప్రారంభించారు. ఒలింపిక్స్ ప్రచారంలో భాగంగా ఆర్యులుగా తమ ఆధిపత్యాన్ని ప్రపంచమంతా ప్రచారం చేసేందుకు నాజీలు టార్చ్ రిలే కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు.

ఒలింపిక్ రింగ్స్‌ను తొలిసారి 1913లో తయారు చేశారు. ఆధునిక ఒలింపిక్స్‌కు వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన బారన్ పియర్రే డి కౌబర్టిన్ వీటిని డిజైన్ చేశారు. ఈ ఐదు రింగుల్లో ఉన్న ఐదు రంగులు, వీటి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే తెలుపు, ఒలింపిక్స్‌లో పాల్గొనే దేశాల జెండాల్లోని రంగులకు ప్రాతినిధ్యం వహించాలని ఆయన భావించారు.

ఒలింపిక్స్‌లోని ఐదు రింగుల్లో మనుషులు నివసిస్తున్న ఐదు ఖండాలను గుర్తించారు. అప్పట్లో ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాను ఒకే ఖండంగా భావించారు. నాలుగేళ్లకోసారి జరిగే ప్రతీ ఒలింపిక్ క్రీడలకు ప్రత్యేక భావన ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ మోటో "యునైటెడ్ బై ఎమోషన్"

పారిస్ ఒలింపిక్స్, ఫ్రాన్స్, లండన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1900,1924లో రెండుసార్లు సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన ఫ్రాన్స్

సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్

ఒలింపిక్స్‌లో సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ ఉంటాయి. సమ్మర్ ఒలింపిక్స్ సాధారణంగా జులై, ఆగస్టులో జరుగుతాయి. నాలుగేళ్లకోసారి జరిగే క్రీడా సంబరంలో అనేక రకాల క్రీడల్ని నిర్వహిస్తారు.

వింటర్ ఒలింపిక్ గేమ్స్ కూడా నాలుగేళ్లకోసారి జరుగుతాయి. అది కూడా ఆతిధ్య దేశంలో చలికాలం వచ్చే నెలల్లో జరుగుతాయి. ఇందులో కొన్ని క్రీడలు మంచు, ఐస్ మీద కూడా జరుగుతాయి. ఈ రెండు రకాల క్రీడల్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్వహిస్తుంది.

సమ్మర్ ఒలింపిక్స్ 1896 నుంచి ఇప్పటి వరకు 30 సార్లు నిర్వహించారు. ఇందులో పారిస్ మూడోసారి ఈ ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిస్తోంది. ఒలింపిక్స్ మొదటిసారి 1896లో గ్రీస్ నగరం ఏథెన్స్‌లో ప్రారంభం అయ్యాయని పారిస్ ఒలింపిక్స్‌ అధికారిక వెబ్‌సైట్ తెలిపింది.

ఒలింపిక్స్ తర్వాత ఎవరు నిర్వహించాలనే దాని గురించి ముందుగానే నిర్ణయిస్తారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత 2028లో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ జులై 14 నుంచి 30 వరకు అమెరికాలోని లాస్ ఏంజిలిస్‌లో జరగనున్నాయి. 2032 ఒలింపిక్స్‌కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యమివ్వనుంది.

తొలిసారి జరిగిన సమ్మర్ ఒలింపిక్ గేమ్స్‌లో 14 దేశాలు మాత్రమే పాల్గొన్నాయి. ఇవి అమెరికాలో జరిగాయి. ప్రస్తుతం ఒలింపిక్స్ పోటీల్లో 200కి పైగా దేశాలు పాల్గొన్నాయి.

ఒలింపిక్ టార్చ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్ టార్చ్

ఏయే క్రీడలు ఉండాలి?

ఒలింపిక్స్‌లో ఏఏ క్రీడలు ఉండాలి, వేటిని తొలగించాలనే దానిని ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఇందులో కొన్ని క్రీడలను తొలగించి మళ్లీ ఒలింపిక్స్‌లోకి తీసుకువచ్చారు. గోల్ఫ్, రగ్బీలాంటివి ఇందులో ఉన్నాయి. పరుగెత్తే జింకను కాల్చడం, పొడవాటి, బరువైన బ్యారెల్ ఉండే పిస్టల్‌తో బంతిని కాల్చడం వంటి వాటిని తొలగించారు. పారిస్ ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ లాంటి క్రీడల్ని ఈ ఏడాది ఒలింపిక్స్‌లో చేర్చారు.

1924లో తొలిసారిగా వింటర్ ఒలింపిక్ గేమ్స్ నిర్వహించారు. అదే ఏడాది సమ్మర్ ఒలింపిక్స్ కూడా జరిగాయి. వీటికి అంతగా ఆదరణ లభించలేదు. దీంతో సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్‌ను వేర్వేరుగా నిర్వహించాలని నిర్వహకులు నిర్ణయించారు.

ప్రస్తుతం సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండేళ్ల తర్వాత వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. వింటర్ ఒలింపిక్స్ ప్రారంభించిన తర్వాత ప్రతీ పోటీలోనూ పతకం సాధించింది ఒక్క అమెరికా మాత్రమే.

కొన్ని దేశాలు సమ్మర్ ఒలింపిక్స్ కంటే వింటర్ ఒలింపిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాయి. చాలా దేశాల్లో వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు కూడా లేరు.

1921-1948 మధ్య జరిగిన ఒలింపిక్స్‌లో క్రీడాకారులతో పాటు కళాకారులు కూడా పాల్గొన్నారు. పెయింటర్లు, శిల్పకళాకారులు, ఆర్కిటెక్టులు, రచయతలు, సంగీత విద్వాంసులు ఒలింపిక్స్‌‌లో పాల్గొన్నారు. తమ కళాభిరుచిని ప్రదర్శించడం ద్వారా వారు కూడా మెడల్స్ కోసం పోటీ పడ్డారు. 1948లో కళాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడాన్ని నిలిపివేశారు.

ఒలింపిక్స్ రింగులు

ఫొటో సోర్స్, Getty Images

బంగారు పతకంలో బంగారం ఎందుకు లేదు?

మొట్టమొదటి ఒలింపిక్స్ నుంచి 1912 వరకు జరిగిన ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే బంగారు పతకాలను పూర్తిగా బంగారంతో తయారు చేసేవారు. అయితే ఆ తర్వాత ఈ పద్దతి మారింది.

2020లో ముగిసిన ఒలింపిక్స్‌లో బంగారం, రజతం, కాంస్యం కలిపి 5వేల పతకాలు ఇచ్చారు. ఈ పతకాల తయారీకి చాలా బంగారం అవసరం. అందుకే ప్రస్తుతం బంగారు పతకాల్లో ఎక్కువ భాగం సిల్వర్ ఉంటుంది. దీని పైనా ఆరు గ్రాముల బంగారం కోటింగ్ వేస్తున్నారు.

పారిస్‌ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇస్తున్న పతకాల తయారీకి ఈఫిల్ టవర్ నుంచి సేకరించిన ఇనుమును ఉపయోగిస్తున్నారు.

1900 సంవత్సరం వరకు మహిళలకు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అవకాశం లేదు. తొలిసారిగా 1900లో పారిస్‌లో జరిగిన పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. ఇందులో కూడా అన్ని క్రీడల్లోనూ పాల్గొనే అవకాశం ఇవ్వలేదు.

ఒలింపిక్స్‌లో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు వాటిని కొరికే సంస్కృతి పురాతన గ్రీకు కాలం నుంచి వచ్చింది. ఆ రోజుల్లో బంగారం నాణ్యతను తెలుసుకునేందుకు లోహ వర్తకులు వాటిని కొరికి పరీక్షించేవారు. బంగారంలో లెడ్ కలిపి ఉంటే కొరికినప్పుడు దానిపై పళ్ల గుర్తులు పడతాయి. ఒలింపిక్స్‌లో కూడా పతకాలను అలా కొరికి చూసేవారు.

ఒలింపిక్ జ్యోతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్ జ్యోతి

ఒలింపిక్స్- ప్రపంచ దేశాలు

దక్షిణ అమెరికా ఖండంలో 2016 వరకు ఒలింపిక్స్ జరగలేదు. 2016లో తొలిసారిగా బ్రెజిల్ ఈ పోటీలకు ఆతిధ్యమిచ్చింది. రియోడి జెనీరోలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో వందేళ్ల తర్వాత మళ్లీ గోల్ఫ్, మహిళల రగ్బీని ఒలింపిక్స్‌లోకి తీసుకువచ్చారు.

1900లో పారిస్‌లో జరిగిన ప్రపంచ వాణిజ్య ప్రదర్శనలో భాగంగా ఈ నగరంలోనే ఒలింపిక్స్ నిర్వహించారు. ప్రస్తుతం పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇవి చాలా చిన్నవే ఈ క్రీడా పోటీలు అయినా ఐదు నెలల పాటు జరిగాయి. ఇందులో24 దేశాల క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న తొలి ఆసియా దేశం జపాన్. 1912లో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో జపాన్ క్రీడాకారులు పాల్గొన్నారు. అప్పటి వరకు ఆసియా దేశాలేవీ ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు.

ఒలింపిక్స్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న చరిత్ర ఐదు దేశాలకు మాత్రమే ఉంది. గ్రీస్, స్విట్జర్లాండ్, గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాలు ప్రతీ సమ్మర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి.

ఒలింపిక్స్ అధికారిక భాషగా ఇంగ్లిష్, ఫ్రెంచ్ గుర్తింపు పొందాయి. వీటితో పాటు నిర్వాహక దేశంలో భాషను కూడా గుర్తిస్తున్నారు.

బీచ్ వాలీబాల్, అథ్లెటిక్స్, రన్నింగ్, స్విమ్మింగ్

ఒలింపిక్స్ కొన్ని విశేషాలు

బంగారం, కాంస్యం, రజత పతకాలు ఇవ్వడం 1904 నుంచి మొదలైంది. అంతకు ముందు ఆలివ్ పుష్పగుచ్చాన్ని పెట్టేవారు.

ఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్ గెలుచుకున్న అథ్లెట్ మైకేల్ ఫెల్ఫ్స్. ఈ అమెరికన్ స్విమ్మర్ తాను పాల్గొన్న ఒలింపిక్స్‌లో 23 బంగారు పతకాలు సహా 28 మెడల్స్ గెలుచుకున్నారు. తర్వాతి స్థానంలో 18 పతకాలతో సోవియట్ జిమ్నాస్ట్ లరిసా లాటినైనా ఉన్నారు.

ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిచ్చే దేశం తనకు నచ్చిన విధంగా మెడల్స్ తయారు చేస్తుంది. ప్రపంచంలో ఏ దేశం ఒలింపిక్స్‌కు ఆతిధ్యమిచ్చినప్పటికీ, క్రీడల ప్రారంభ వేడుకల్లో అథ్లెట్ల మార్చ్‌లో అందరి కంటే ముందు గ్రీస్ టీమ్ ఉంటుంది. ఆ తర్వాత ఆతిధ్య దేశపు అథ్లెట్లు ఉంటారు. ఆ తర్వాత ఆతిథ్య దేశంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌ ప్రకారం ఆయాదేశాల ప్రతినిధులు ఉంటారు.

1960లో రోమ్‌లో జరిగిన ఒలింపిక్స్‌ను తొలిసారి అమెరికాలోని 'సీబీఎస్' చానల్ ప్రసారం చేసింది.

1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆర్చరీలో పాల్గొనే క్రీడాకారులు బాణాలతో కొట్టేందుకు బతికి ఉన్న పావురాలను ఉపయోగించారు.

ఇప్పటి వరకు దక్షిణ ధ్రువంలోని ఏ దేశం కూడా వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిధ్యం ఇవ్వలేదు.

2021లో ముగిసిన ఒలింపిక్స్‌లో గెలుచుకున్న పతకాలతో కలుపుకుని అమెరికా 2800 ఒలింపిక్ మెడల్స్ గెలుచుకుంది. మరే దేశం కూడా ఒలింపిక్స్‌లో వెయ్యి పతకాలను గెలవలేదు. 883 పతకాలతో బ్రిటన్ రెండో స్థానంలో ఉంది.

సమ్మర్ ఒలింపిక్స్‌కు నాలుగుసార్లు ఆతిధ్యమిచ్చిన ఏకైక దేశంగా అమెరికా రికార్డులకెక్కింది. మరే దేశానికి ఈ గౌరవం దక్కలేదు. 2028లోనూ అమెరికాలో ఐదోసారి ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి.

వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్‌, రెంటిలోనూ పతకాలు సాధించిన వాళ్లు నలుగురు అథ్లెట్లు మాత్రమే ఉన్నారు.

హాలీవుడ్ సినిమాల్లో తొలితరం టార్జాన్‌గా గుర్తింపు పొందిన జానీ వెస్‌ముల్లర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.1920లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆయన స్విమ్మింగ్‌లో 5 బంగారు పతకాలు గెలుచుకున్నారు.

1936లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇద్దరు జపాన్ పోల్ వాల్ట్‌లో రెండో స్థానం కోసం పోటీ పడినప్పుడు ఇద్దరి మధ్య టై అయింది. అయితే మరోసారి పోటీ పడేందుకు బదులుగా వీళ్లిద్దరు కాంస్యం, రజత పతకాలను తీసుకుని వాటిని కూడా చెరి సగం పంచుకున్నారు.

ఒలింపిక్స్‌లో జరిగిన ఒకే ఒక క్రికెట్ మ్యాచ్ 1900లో పారిస్ ఒలింపిక్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఫ్రాన్స్ తలపడింది. ఇంగ్లండ్ గెలిచింది. అంటే ఒలింపిక్ క్రికెట్‌లో రజత పతకం సాధించిన దేశంగా ఫ్రాన్స్ నిలించింది. అయితే ఈ విషయం ఫ్రాన్స్‌లోనే చాలా మందికి తెలియదు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)