ఒలింపిక్స్: పారిస్ నగరంలో ఇప్పటికీ నిలిచిన 124 ఏళ్లనాటి జ్ఞాపకాలు!

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హ్యూ స్కోఫీల్డ్
- హోదా, పారిస్ కరస్పాండెంట్
"ఒలింపిక్స్ పుట్టిన ప్రదేశం గ్రీస్ అయితే, పారిస్ దాని ఇల్లు లాంటిది." ఒలింపిక్స్‌తో పారిస్‌కు ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి చెప్పే ఒక కథనం ఇలా మొదలవుతుంది.
2012 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్‌ను పారిస్ కోల్పోవడానికి ముందు ఈ స్టోరీ ప్రచురితమైంది. (ఈ బిడ్ ను లండన్ గెలుచుకుంది)
1894 జూన్‌లో సోర్బోన్ విశ్వవిద్యాలయంలో ఫ్రెంచ్ అరిస్టోక్రాట్ పియరీ డి కూబెర్టిన్ అధ్యక్షతన మొదటి దశ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యవస్థాపక సమావేశం జరిగింది. ఆ తర్వాత రెండో, ఎనిమిదో ఒలింపిక్ క్రీడలు ఫ్రెంచ్ రాజధానిలో నిర్వహించారు.
నేటికీ ఆ రెండు ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయి. ఎగ్జిబిట్ వన్ అనేది బోయిస్ డి విన్సెన్స్‌లోని సిపలే అని పిలిచే ఒక వెలోడ్రోమ్. ఈ స్టేడియం పారిస్‌లో ఉంది. 124 సంవత్సరాల (మొదటి పారిస్ గేమ్స్) తర్వాత కూడా అది వాడుకలో ఉంది.
1900లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలలో సైక్లింగ్ ఒకటి. అయితే సిపలే స్డేడియంను తర్వాత జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్, రగ్బీ, క్రికెట్ ఆటలకు కూడా ఉపయోగించారు.


చరిత్రగానే మిగిలాయి
ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు ఒకే ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది. 1900 సంవత్సరంలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచింది.
ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. బహుశా ఈ రికార్డు 2028లో జరగబోయే లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో చెరిగిపోవచ్చు. ఎందుకంటే మళ్లీ క్రికెట్ పోటీలు ఆ ఒలింపిక్స్‌తో మొదలుకాబోతున్నాయి.
గత కొన్నేళ్లలో లా సిపలేలో కొన్ని కట్టడాలను రిపేర్ చేశారు. కొత్తగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. కానీ స్డేడియం పైకప్పు, వ్యూ స్టాండ్ మారలేదు. కాంక్రీట్ ట్రాక్ రెండు చివర్లలో వంపులు ఉన్నాయి. అక్కడ ఒక మూలలో గడ్డి పొదలు కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని ఏళ్లుగా చాలామంది సైక్లింగ్ అభిమానులు మూత్రం పోయడానికి వినియోగిస్తున్నారు.
వాస్తవానికి 1900 సంవత్సరంలో జరిగిన గేమ్స్ అసాధారణమైనవి. అయితే, కొన్ని గేమ్‌లు చరిత్రగానే మిగిలిపోయాయి. అందులో ఒకటి ఫిరంగి కాల్పుల పోటీ. దానితో పాటు బౌల్స్, ఫిషింగ్, క్రాస్‌బౌ-ఫైరింగ్, బారెల్-రోలింగ్, లాంగ్ డిస్టేన్స్ (సుదూర) బెలూనింగ్ వంటి విభాగాలూ ఉన్నాయి. లాంగ్ డిస్టేన్స్ బెలూనింగ్ ఈవెంట్‌లో పోటీ పడిన వ్యక్తి యుక్రెయిన్ రాజధాని కీయేవ్ సమీపంలో దిగి, విజేతగా నిలిచారు.
అప్పట్లో సమస్య ఏమిటంటే గేమ్స్ ‘పారిస్ వరల్డ్ ఫెయిర్’ సమయంలోనే జరిగాయి. అథ్లెట్లతో సహా చాలామంది జనం ఆ క్రీడలను వరల్డ్ ఫెయిర్‌లో భాగమనుకున్నారు.
అయితే, 1896 మొదటి గేమ్స్ తర్వాత ఒలింపిక్స్‌ను గ్రీస్ మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారని 1900 గేమ్స్ చాటిచెప్పాయి.
వినోదం కోసమే కాదు
ఆటలు వినోదం కోసం మాత్రమే కాదని సీరియస్‌గా పరిగణించాలంటూ 1900 గేమ్స్ చాటి చెప్పాయి.
ఎటియన్ జూల్స్ మేరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఆటలలో పాల్గొంటున్న క్రీడాకారులను ఫోటోలు తీసి, వారిని అధ్యయనం చేస్తుండేవారు.
అప్పట్లో తన అవుట్‌డోర్ స్టూడియోలో 1,900 మంది అథ్లెట్లను ప్రదర్శనకు ఒప్పించాడు. ఇప్పుడా ప్రాంతం రోలాండ్-గారోస్‌లోని కోర్ట్ 1లో భాగమైంది.
తమాషా ఏంటంటే, ఆయన ఒలింపిక్స్ క్రీడాకారులకు ఇచ్చిన ప్రశ్నావళిలో వింత వింత ప్రశ్నలు ఉండేవి.
అందులో కొన్ని ఇలా ఉన్నాయి.
- మీ గడ్డం రంగు ఏంటి?
- మీ తాతయ్య బలం ఎంత ?
- చిన్నప్పుడు తల్లిపాలు తాగారా డబ్బా పాలు తాగారా
....ఇలా ఉండేవి.
గోల్ఫ్, టెన్నిస్, సెయిలింగ్, క్రోకెట్ వంటి క్రీడలలో 1900 గేమ్స్‌లో కొద్దిమంది మహిళలు కూడా పాల్గొన్నారు. 1924 నాటికి ఈత, డైవింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడలనూ చేర్చారు. ఆ సమయంలో 135 మంది మహిళలు పోటీ పడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
జ్ఞాపకాలతో నిండిన ప్రదేశం
1924 గేమ్స్‌లో కొలంబెస్ స్టేడియానికి ప్రాముఖ్యత ఉంది. ఇక్కడే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంతో పాటు అనేక కార్యక్రమాలు జరిగాయి.
గుర్రపు పందేలు నిర్వహించే పాత ట్రాక్‌పై ఈ స్టేడియం నిర్మించారు. ఇది గత శతాబ్దంలో ఎక్కువ భాగం ఫుట్‌బాల్, రగ్బీ ఆటలకు ప్రధాన వేదికగా ఉండేది.
అనంతరం దానిని పార్క్ డెస్ ప్రిన్సెస్ స్డేడియంగా తరువాత, స్టేడ్ డి ఫ్రాన్స్ స్డేడియంగా మార్చారు.
ఆ స్టేడియం ఇప్పటికీ అలాగే ఉంది. రాబోయే ఒలింపిక్స్‌లో ఫీల్డ్ హాకీ ఈవెంట్ కోసం దీనిని ఉపయోగించనున్నారు.
“క్రీడలను ఇష్టపడే ఫ్రెంచ్ ప్రజలకు కొలంబెస్ ఒక ప్రత్యేక ప్రదేశం. చాలామంది ప్రముఖ క్రీడాకారులు ఇక్కడ పోటీ పడ్డారు. ఇది చరిత్ర, జ్ఞాపకాలతో నిండి ఉంది” అని క్రీడా చరిత్రకారుడు మైకేల్ డెలిపైన్ అన్నారు.
ఈ స్టేడియంలో బంగారు పతకాలు సాధించిన స్ప్రింటర్లు హెరాల్డ్ అబ్రహంస్, ఎరిక్ లిడెల్‌లు బ్రిటిష్ క్రీడాభిమానులకు చిరస్మరణీయ వ్యక్తులు. వారిద్దరి విజయాన్ని ‘చారియట్స్ ఆఫ్ ఫైర్’ సినిమా రూపంలో తెరకెక్కించారు.
మెర్సీసైడ్‌లో విరాల్‌లోని ఒక ప్రదేశంలో ఈ సినిమా కోసం స్టేడియంను పునఃసృష్టించారు. కొలంబెస్‌లో ట్రాక్, ఐరన్ స్టాండ్ 100 సంవత్సరాల కిందట ఉన్న ప్రదేశంలోనే ఉన్నాయి.
1924 గేమ్స్‌లో కొత్త కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించారు. దీంతో విజేతలైన అథ్లెట్లు పాపులర్ అయ్యారు.
మిడిల్ లాంగ్ డిస్టేన్స్ రేసింగ్‌లో పావో నూర్మి, విల్లే రిటోలాలు ఆధిపత్యం చెలాయించారు. లాంగ్-జంపర్ విలియం డి హార్ట్-హబ్బర్డ్ ఒలింపిక్ ఈవెంట్‌లో పతకం గెలుచుకున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా నిలిచారు.

మరిచిపోని గుర్తులు
కొలంబెస్ స్టేడియంలో ఉరుగ్వే ఫుట్‌బాల్ జట్టు మ్యాచ్ గెలిచింది. అది ఆ దేశానికి 1930లో మొదటి ప్రపంచ కప్ గెలవడానికి తోడ్పడింది.
అమెరికా, ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రగ్బీ ఫైనల్ 'హింసాత్మకం'గా సాగింది. అది భవిష్యత్తులో ఒలింపిక్స్ నుంచి రగ్బీని నిషేధించడానికి దారితీసింది. ఆ మ్యాచ్‌లో అమెరికా విజయం సాధించింది.
1924 ఒలింపిక్స్ నినాదం "సిటియస్, ఆల్టియస్, ఫోర్టియస్" (వేగంగా, ఉన్నతమైనది, బలమైనది). ఆ పోటీలలో దిగువన లేన్‌లతో 50 మీటర్ల స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు. దీని నుంచి ప్రయోజనం పొందిన స్విమ్మర్ జానీ వీస్ముల్ల. ఆయన సినిమాల్లో టార్జాన్‌గా ఫేమస్ అయ్యారు.
పారిస్‌లో 20వ అరోండిస్‌మెంట్ (స్థానిక) గేమ్స్ కోసం నిర్మించిన టౌరెల్స్ స్విమ్మింగ్ పూల్ నేటికీ ఉంది. ప్రస్తుత ఒలింపిక్ అథ్లెట్లు దీన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














