పారిస్ ఒలింపిక్ విలేజ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్, ఎంతమంది షెఫ్‌లు ఉన్నారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎమిలీ మొనాకో
- హోదా, బీబీసీ ప్రతినిధి
పారిస్‌లో ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, 200 మందికి పైగా షెఫ్‌లు వంటకాలను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
జులై 26న ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈసారి ఎన్నో కొత్త అంశాలకు పారిస్ వేదిక కాబోతుంది.
తొలిసారి ఒలింపిక్స్‌లో లైంగిక సమానత్వం కనిపించనుంది. ఈసారి క్రీడాకారుల్లో మహిళల సంఖ్య పురుషులతో సమానంగా ఉండబోతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్‌కు ఈ ఒలింపిక్ విలేజ్ నిలయంగా మారింది.
ఈ క్రీడల సందర్భంగా 15 వేల మంది అంతర్జాతీయ అథ్లెట్లకు ఆహారం అందించడం అంత చిన్న విషయమేమీ కాదు.
ఇందుకోసం ఒలింపిక్ విలేజ్ రెస్టారెంట్‌లో, నగరంలో పోటీలు జరుగుతున్న 14 ప్రదేశాలలో 200 మందికి పైగా ప్రముఖ షెఫ్‌లు ప్రతిరోజూ 40,000కు పైగా భోజనాలు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఒలింపిక్, పారాలింపిక్ గేమ్స్ జరిగే 15 రోజుల వ్యవధిలో 1.3 కోట్లకు పైగా భోజనాలను తయారు చేస్తారు.
ఇది 10 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లలో అందించే భోజనాలకు సమానం.
పారిస్ నగరం శివార్లలో ఉన్న సెయింట్-డెనిస్‌లోని సైట్ డు సినిమా ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్, ఈ ఛెఫ్‌ల పాకశాస్త్ర ప్రావీణ్యానికి వేదిక అవుతోంది.
ఇక్కడ అథ్లెట్లు ఫ్రెంచ్, ఆసియన్, ఆఫ్రో-కరీబియన్, ప్రపంచ వంటకాలను అందించే ఆరు ప్రత్యేక ప్రదేశాలలో, 500కు పైగా విభిన్న వంటకాలతో ఆహారాన్ని ఆరగించవచ్చు.
మాజీ కాంస్య పతక విజేత హెలెన్ డిఫ్రాన్స్ (ప్రస్తుతం పోషకాహార నిపుణురాలు) సహకారంతో ఈ రెస్టారెంట్‌లో క్రీడాకారుల మెనూను తయారు చేశారు. హెలెన్ పదార్థాల నాణ్యతతో పాటు వంటకాల రుచులు, వాటి అలంకరణపైనా దృష్టి కేంద్రీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్యారిస్ ఒలింపిక్స్‌లో ఆహార నాణ్యత కోసం కఠినమైన నియమాలను రూపొందించారు. అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఆహారాన్ని సుస్థిర విధానంలో తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా, ఇక్కడ వంటల్లో ఉపయోగించే పదార్థాలలో పావు భాగం పారిస్‌కు 250 కి.మీ. పరిధిలో దొరికేవే వాడుతారు. ఆహారం తయారీలో ఉపయోగించే 20% పదార్థాలు ‘ఆర్గానిక్’ సర్టిఫికేట్ ఉన్నవే. మాంసం, పాలు, గుడ్లు మొత్తం ఫ్రాన్స్ నుంచే వస్తున్నాయి. ఆహారంలో మూడవ వంతు మొక్కల ఆధారితమైనది.
ఒలింపిక్ విలేజ్‌లో రెండు వందల మంచినీరు, జ్యూస్, సోడా ఫౌంటైన్‌లు ఏర్పాటు చేశారు. ఇక్కడ రీసైకిల్డ్ కప్పులను, పింగాణీ పాత్రలనే ఉపయోగిస్తారు.
"పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ ఒలింపిక్స్‌లో అత్యంత సుస్థిరమైన పద్ధతులను అనుసరిస్తున్నాం" అని ఒలింపిక్ విలేజ్ అధికారిక భాగస్వామి, సోడెక్సో లైవ్ గ్లోబల్ సీఈఓ నథాలీ బెలోన్-స్జాబో అన్నారు.
అంతర్జాతీయ మెనూ ఎంపికలో వైవిధ్యాన్ని అందించడంతో పాటు, సోడెక్సో లైవ్ సూపర్ షెఫ్‌లు అమాండిన్ చైగ్నోట్, అలెగ్జాండర్ మజియా, అక్రేమ్ బెనలాల్‌లను నియమించింది. వీరు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రీడాకారుల పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక పదార్థాలతో ఫ్రెంచ్ సంప్రదాయ, అత్యుత్తమ వంటకాలను తయారు చేయనున్నారు.
"ఫ్రెంచ్ ఆహారంలో ఒక ముఖ్యమైన ఆరోగ్యాంశం ఉందని నేను నమ్ముతున్నాను" అని డిఫ్రాన్స్ అన్నారు.
‘‘ఫ్రాన్స్‌లో చిన్న గ్రామంలోని బేకరీ నుంచి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ వరకు, అత్యుత్తమ నాణ్యత కలిగిన ఆహారపదార్థాలు లభిస్తాయి" అని ఆమె చెప్పారు.
ఒలింపిక్స్, పారాలింపిక్స్ జరిగినన్ని రోజులు ఒలింపిక్ విలేజ్ ఎగ్జిక్యూటివ్ షెఫ్ చార్లెస్ గిలాయ్, ప్రత్యేకంగా నియమించిన సూపర్ షెఫ్‌లకు సహాయం అందిస్తారు.

ఫొటో సోర్స్, Sodexo Live!
ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో సూపర్ షెఫ్‌ల ప్రత్యేకతలు
షెఫ్ చార్లెస్ గిలాయ్
షెఫ్ చార్లెస్ గిలాయ్, ఆయన బృందం అథ్లెట్లను సంతృప్తిపరిచే వంటకాలను అభివృద్ధి చేసేందుకు నెలల తరబడి కష్టపడ్డారు.
"100 కిలోలకు పైగా బరువున్న జూడోకా, 45 కిలోల జిమ్నాస్ట్ ఒకటే మాదిరి తినరు" అని ఆయన అన్నారు. తన బృందం వంటకాల తయారీలో ఆయా దేశాల సాంస్కృతిక అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు.
ఆహార పదార్థాలను సుస్థిర విధానంలోనే తయారు చేయాలన్న నిబంధన తనకు నిర్బంధం కాదని, నిజానికి అది తనకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. "తాజా, ఫ్రెంచ్, సీజనల్, లోకల్, లేబుల్, సర్టిఫైడ్ ఉత్పత్తులతో ఆహారాన్ని తయారు చేయడం కంటే ఒక షెఫ్‌కు కావాల్సినది ఏముంది?" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Sodexo Live!
షెఫ్ అమాండిన్ చైగ్నోట్
మాస్టర్ షెఫ్ ఫ్రాన్స్ 2013/2014 సీజన్‌లో జ్యూరర్‌గా కనిపించిన షెఫ్ అమాండిన్ చైగ్నోట్ 2019లో తన సొంత రెస్టారెంట్‌ను ప్రారంభించే ముందు, ఫ్రాన్స్‌లోని అగ్రశ్రేణి షెఫ్‌లతో కలిసి పనిచేశారు.
అమాండిస్ వంటకాలు అథ్లెట్ల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. ఆమె తన సిగ్నేచర్ డిష్ కోసం, రోస్టెడ్ ఫ్రెంచ్ పౌల్ట్రీని ఎంచుకున్నారు. అథ్లెట్లకు శ్రేష్ఠమైన మాంసాన్ని అందించడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. యువ క్రీడాకారులకు నచ్చేలా చేయడం తన లక్ష్యం అని, వాళ్లు తినగలిగే వంటకాలను రూపొందించాలని అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Sodexo Live!
అలెగ్జాండర్ మజియా
అలెగ్జాండర్ మజియాకు అథ్లెట్లకు ఇచ్చే ఆహారం విషయం ఎదురయ్యే సవాళ్ల గురించి బాగా తెలుసు. మార్సెయిల్‌లోని మజియాకు చెందిన ఏఎమ్ రెస్టారెంట్ మూడు మిచెలిన్ స్టార్‌లను సంపాదించింది.
మజియా ఒక ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్. ఒలింపిక్ విలేజ్‌లో ప్రపంచ క్రీడాకారులకు ఆహారం అందిస్తూనే మధ్య మధ్య వీలైతే ఆయన ఆ క్రీడలను స్వయంగా చూడాలనుకుంటున్నారు.
"నాకు బాస్కెట్‌బాల్ ఫైనల్స్ చూసే అవకాశం వస్తే బాగుంటుంది," అని ఆయన అన్నారు. "కానీ నేను ఆటలకన్నా ఎక్కువగా, అథ్లెట్ల కోసం ఇక్కడ ఉన్నాను."
ఆయన సిగ్నేచర్ వంటకం ఏఎమ్ రెస్టారెంట్‌లో తయారు చేసే, దక్షిణ ఫ్రెంచ్ వంటకాలలో ప్రధానమైన చిక్‌పీస్.
"ఫ్రెంచ్ వంటల గురించి తెలుసుకోవడం అంటే మా ఆతిథ్యం గురించి కూడా తెలుసుకోవడం," అని ఆయన అన్నారు. "మేము అథ్లెట్లను స్వాగతిస్తున్నామంటే, మేం వాళ్ల సేవకు సిద్ధంగా ఉన్నామని చెప్పడం."

ఫొటో సోర్స్, Sodexo Live!
అక్రేమ్ బెనలాల్
ఫ్రాన్స్‌లో పుట్టి అల్జీరియాలో పెరిగిన షెఫ్ అక్రేమ్ బెనలాల్‌కు అంతర్జాతీయ రుచులు, విధానాలు అంటే చాలా
ఇష్టం. ఒలింపిక్స్ విషయానికి వస్తే, మిచెలిన్ స్టార్‌లు సంపాదించిన ఈ షెఫ్, స్థానిక ఆహార దినుసులు, స్థానిక సాంకేతికతలతో అంతర్జాతీయ రుచులను తయారు చేయబోతున్నారు.
"ఫ్రెంచ్ వంటకాల గురించి నేను ఎప్పుడూ చెప్పేది ఏమిటంటే, సాంకేతికత పరంగా ఇవి ప్రపంచంలోనే అత్యంత వెరైటీ వంటకాలు," అని ఆయన అన్నారు. "మీరు ఫ్రెంచ్ వంటకంలో ఇటాలియన్ టెక్నిక్‌లను, జపనీస్ టెక్నిక్‌లను చూడొచ్చు. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం.’’
బెనలాల్‌కు ఇష్టమైన వంటకాలలో ఒకటి అటెలియర్ వివాండా విధానంలో తయారు చేసే మాంసం. దీనిని బంగాళాదుంపలతో కలిపి చేస్తారు. అయితే ఒలంపిక్ విలేజ్‌లో డీప్‌ఫ్రై చేయడం నిషేధించడం వల్ల, బెనలాల్ తన సిగ్నేచర్ రెసిపీని తయారు చేయడానికి మొక్కల ఆధారిత ప్రొటీన్‌ను ఉపయోగించుకుంటున్నారు. పారిస్ నుంచి 150కిమీ కంటే తక్కువ దూరంలో ఉన్న ఓర్లియన్స్ సమీపంలోని క్వినోవా, పర్మేసన్, పులియబెట్టిన పెరుగుతో సుసంపన్నమైన రిసోట్టో-శైలి వంటకంగా అటెలియర్ వివాండా రూపాంతరం చెందుతోంది.
"చాలా మంది ఫ్రాన్స్‌కు రావడం ఇదే మొదటిసారి," అని ఆయన చెప్పారు. "అందుకే వంటలో మా ప్రావీణ్యం వాళ్లకు చూపించాలనుకుంటున్నాము."
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














