పారిస్‌ ఒలింపిక్స్: ఓపెనింగ్ వేడుక స్టేడియంలో కాకుండా నది దగ్గర ఎందుకు నిర్వహించాలని అనుకుంటున్నారు?

పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్‌లో ఒలింపిక్ క్రీడలు

ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 మధ్య ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరుగుతాయి. 329 ఈవెంట్‌లకు ప్రపంచవ్యాప్తంగా 10,500 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు.

ఈసారి భారత్ నుంచి 120 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

వీటి తర్వాత పారాలింపిక్ క్రీడలు ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లోనే జరుగుతాయి. వీటిలో 4,400 మంది అథ్లెట్లు, 549 ఈవెంట్‌లలో పతకాల కోసం పోటీ పడనున్నారు.

ఒలింపిక్ క్రీడల్లో 206 దేశాల క్రీడాకారులు, పారాలింపిక్స్‌లో 184 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు.

ఈ క్రీడల సందర్భంగా 1.5 కోట్ల మందికి పైగా పర్యాటకులు పారిస్‌ను సందర్శిస్తారని అంచనా.

ఫ్రాన్స్‌లో పార్లమెంట్ ఎన్నికలు ఒలింపిక్ క్రీడల నిర్వహణపై ప్రభావం చూపుతాయని మొదట ఆందోళన చెందినా.. ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

క్రీడలు ఎక్కడెక్కడ జరుగుతాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

చాలా అథ్లెటిక్ ఈవెంట్‌లు పారిస్ శివార్లలోని ఒలింపిక్ స్టేడియం స్టాడ్ డి ఫ్రాన్స్‌లో జరుగుతాయి.

ఇది కాకుండా, సెంట్రల్ పారిస్‌లోనే ఒలింపిక్ క్రీడల కోసం 15 వేదికలను, పారాలింపిక్స్ కోసం 11 వేదికలను కేటాయించారు.

పారిస్ ఒలింపిక్ ఈవెంట్ సందర్భంగా భద్రత కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు.

డ్రోన్ దాడుల వంటి బెదిరింపుల నేపథ్యంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఒలింపిక్ ప్రారంభ వేడుకలకు హాజరయ్యే ప్రేక్షకుల సంఖ్యను పరిమితం చేసింది.

ప్రారంభ వేడుకలు ఈసారి స్టేడియంలో కాకుండా, సెన్ నదిలో నిర్వహిస్తున్నారు.

సెంట్రల్ ప్యారిస్‌లోని సెన్ నదికి ఇరువైపులా, 6 కిలోమీటర్ల పొడవునా నదిలో సాగే వివిధ దేశాల ఆటగాళ్ల పరేడ్‌ను చూసేలా ఏర్పాటు చేశారు.

మొదట సెన్ నదీ తీరం వెంట జరిగే ఈ కార్యక్రమాన్ని 6 లక్షల మంది వీక్షించేలా ప్రణాళిక రూపొందించగా, ప్రభుత్వం ఇప్పుడు వాళ్ల సంఖ్యను కేవలం 3 లక్షల మందికే పరిమితం చేసింది.

క్రీడల సందర్భంగా 1.5 కోట్ల మందికి పైగా పారిస్‌ను సందర్శిస్తారని అంచనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీడల సందర్భంగా 1.5 కోట్ల మందికి పైగా పారిస్‌ను సందర్శిస్తారని అంచనా

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా, ప్రారంభ వేడుకలను ఆఖరి నిమిషంలో ఏదైనా స్టేడియానికి మార్చవచ్చు.

ఫ్రాన్స్ ప్రభుత్వం దాదాపు 20 వేల మంది సైనికులను, 40 వేల మందికి పైగా పోలీసు అధికారులను భద్రత కోసం మోహరిస్తోంది.

అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన సుమారు 2 వేల మంది సైనికులు, పోలీసు అధికారుల సహాయం తీసుకోనుంది.

ఒలింపిక్ క్రీడల సందర్భంగా, ఏవైనా బెదిరింపులు వస్తే వాటిని ఎదుర్కోవటానికి ఫ్రెంచ్ సైనికులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చారు.

ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లను అనుమతించకపోవడంపై రష్యా ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్స్‌లో తమ అథ్లెట్లను అనుమతించకపోవడంపై రష్యా ఆగ్రహం

రెండు దేశాలపై నిషేధం ఎందుకు?

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు రెండు దేశాలను అనుమతించలేదు. ఈ ఒలింపిక్స్‌లో రష్యా, బెలారస్ జట్లు రెండూ కనిపించవు.

యుక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాను, రష్యాకు మద్దతు ఇచ్చినందుకు బెలారస్‌ను పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించారు.

అయితే ఈ రెండు దేశాల ఆటగాళ్లు 'తటస్థ క్రీడాకారులు'గా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంది.

కానీ ‘తటస్థ క్రీడాకారులు’ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో పాల్గొనలేరు. పతకం గెలిచిన తర్వాత వాళ్ల జాతీయ గీతాన్ని ఆలపించరు. వాళ్ల జాతీయ జెండాను ఎగరవేయరు.

తమ అథ్లెట్ల పట్ల అనుసరిస్తున్న విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా , ఈ ఏడాది సెప్టెంబర్‌లో మాస్కో, యెకటెరిన్‌బర్గ్‌లలో 'వరల్డ్ ఫ్రెండ్‌షిప్ గేమ్స్' నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

సోవియట్ యూనియన్ 1984లో లాస్ ఏంజెల్స్ ఒలింపిక్ క్రీడలను బహిష్కరించినప్పుడు, 'ఫ్రెండ్‌షిప్ గేమ్స్'ను నిర్వహించింది. ఈసారీ రష్యా అదే పని చేయబోతుంది.

క్రీడల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఫ్రాన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్రీడల సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేసిన ఫ్రాన్స్

ఇజ్రాయెల్‌పై నిషేధం ఉందా?

గాజాలో సైనిక చర్య కారణంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇజ్రాయెల్‌ను ఎందుకు నిషేధించలేదంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి)ని ప్రశ్నించారు.

అయితే, ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ రష్యా వాదనను తోసిపుచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ పాల్గొంటుందని ఆయన ధృవీకరించారు.

పారిస్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

పారిస్ ఒలింపిక్స్ గురించి ఫ్రెంచ్ ప్రజలు ఏమనుకుంటున్నారు?

44 శాతం పారిస్ వాసులు ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లలో చాలా మంది ఈవెంట్ సందర్భంగా నగరాన్ని వదిలిపెట్టి పోవాలని ఆలోచిస్తున్నట్లు ఒక సర్వే తెలిపింది.

ఒలింపిక్ క్రీడల సమయంలో పారిస్‌లో బస్సు, మెట్రో ఛార్జీలు రెట్టింపు అవుతాయి.

ఒలింపిక్, పారాలింపిక్ విలేజెస్, అలాగే న్యూ అక్వాటిక్స్ సెంటర్‌లను పారిస్ శివార్లలో అత్యంత పేదలు ఉండే సీన్-సెయింట్-డెనిస్‌ ప్రాంతంలో నిర్మించారు.

ఇందుకోసం ఆ సమీపంలో నిర్మించిన భవనాల్లో అక్రమంగా నివసిస్తున్న వేలాది మందిని ఖాళీ చేయించారు.

పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కార్యక్రమాల నేపథ్యంలో భద్రత కోసం అనేక ఆంక్షలను విధించగా వాటిపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

"పారిస్ భరించలేనిదిగా తయారైంది. ఇక్కడ కారును పార్క్ చేయడం కూడా సాధ్యం కాదు. ఎక్కడికీ వెళ్లలేం. ఏమీ చేయలేకపోతున్నాం." అని ఆవేదన వ్యక్తం చేశారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)