టీ20 వరల్డ్‌కప్‌లో ఓడిపోయాక పాకిస్తాన్ జట్టుకు ‘సర్జరీ’ చేస్తున్నారా?

ఫొటో సోర్స్, Getty Images
సర్జరీ, ఇన్‌సైడ్ స్టోరీ, ఫార్ములా, చేంజ్, రిఫార్మ్... పాకిస్తాన్ క్రికెట్ గురించి ఇలాంటి ఎన్నో పదాలు స్థానిక మీడియాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి.
ఎందుకంటే, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం అంత సున్నితమైన దశలో ఉంది. ప్రతి ప్రపంచ కప్ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, టీమ్‌కు ఇదే పరిస్థితి ఎదురవుతోంది.
ఈసారి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దీన్ని ‘సర్జరీ’గా అభివర్ణిస్తున్నారు. ఈ సర్జరీలో తొలి బాధితులు అబ్దుల్ రజాక్, వాహాబ్ రియాజ్‌లు. వీరిద్దర్నీ పదవుల నుంచి తొలగించారు. ఈ మాజీ ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో చెరో రెండు పదవులు ఉండేవి.
మహిళల జట్టును, పురుషుల జట్టును ఎంపిక చేసే కమిటీలో అబ్దుల్ రజాక్ సభ్యుడు కాగా.. వాహాబ్ రియాజ్ పురుషుల జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడుగా మాత్రమే కాక, టీమ్ సీనియర్ మేనేజర్ పోస్టులో కూడా ఉన్నారు.
ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటతీరుపై కోచ్‌లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. కోచ్‌లు ఇచ్చిన నివేదికలో ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రీదిని టార్గెట్ చేసినట్లు ఆరోపణలున్నాయి.

మీడియా చానళ్లలో సర్క్యూలేట్ అవుతున్న వార్తలను పీసీబీ ఇప్పటి వరకు ఖండించలేదు. ఆ సంస్థ అధికార ప్రతినిధి సమీ ఉల్ హసన్ బర్నీ దీని గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
పాకిస్తాన్ క్రికెట్‌లో ఇప్పుడు కల్లోలం నెలకొంది. ఇది రాబోయే రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుంచి ఎలాంటి అధికారిక పత్రికా ప్రకటనా రాలేదు.
కోచ్, కెప్టెన్ బాబర్ సహా, ఏడుగురు సభ్యుల సెలక్షన్ కమిటీలో, కేవలం వాహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లను మాత్రమే ఎందుకు తొలగించారు? కొద్ది మందిని మార్చినంత మాత్రాన పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ను, దాని రూపురేఖలను మెరుగుపర్చగలరా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
వారిద్దరే ఎందుకు?
వాహాబ్ రియాజ్‌ను పదవి నుంచి తొలగిస్తూ మొహ్సిన్ నఖ్వీ తీసుకున్న నిర్ణయం చాలామందికి నచ్చిన నిర్ణయంగా భావిస్తున్నారు. రియాజ్‌ను పదవి నుంచి తొలగిస్తూ, తనకు దగ్గర వారైనా జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరనే సందేశాన్ని ఇచ్చేందుకు నఖ్వీ ప్రయత్నించారు.
‘‘వాహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లు చేర్చుకోవాలని పట్టుబట్టిన ఆటగాళ్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను తీసుకురావాలని కమిటీలోని ఇతర సభ్యులు కోరినట్లు దర్యాప్తులో తేలింది. కానీ, వారి నుంచి వచ్చిన నిరంతర ఒత్తిడితో, ఎంపిక కమిటీలో ఇతర సభ్యులు మౌనంగా ఉన్నారు’’ అని పీసీబీ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.
ఆ ఆటగాళ్లు ప్రపంచ కప్‌లో బాగా ఆడలేదనే ఆరోపణలున్నాయి.
సీనియర్ టీమ్ మేనేజర్ అయిన వాహాబ్ రియాజ్ తన విధుల్లో విఫలమయ్యారని ఆ అధికారి చెప్పారు.
ఈ ఆరోపణలపై వాహాబ్ రియాజ్ వాదన ఎలా ఉందో తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ, ఇప్పటి వరకు ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వాహాబ్ రియాజ్‌ను మాత్రమే కాక, టీమ్ మేనేజర్ మన్సూర్ రాణాను కూడా పదవి నుంచి తప్పించారు. వాహాబ్ రియాజ్, అబ్దుల్ రజాక్‌లు వారికి వ్యతిరేకంగా వస్తోన్న ఆరోపణలపై స్థానిక మీడియాకు, సోషల్ మీడియాలో ప్రకటనలు జారీ చేశారు.
బ్లేమ్ గేమ్‌లో భాగం కావాలనుకోవడం లేదని వాహాబ్ రియాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పారు. సెలెక్షన్ కమిటీలో సభ్యుడిగా తన పని ముగిసిందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘నేను నిజాయితీగా పనిచేశానని ప్రజలకు చెప్పాలనుకుంటున్నా. ఏడుగురు సభ్యులున్న ఎంపిక కమిటీలో భాగం కావడం, జాతీయ జట్టును ఎంపిక చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను’’ అని వాహాబ్ రియాజ్ అన్నారు.
ఎంపిక కమిటీ నిర్ణయాలపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడారు.
‘‘ప్రతి ఒక్కరి ఓటూ సమానమే. జట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రతి ఒక్కరూ దానికి సమాన బాధ్యత వహించాలి. ఒక ఓటు ఆరుగురి ఓటుకు ఎలా సమానమవుతుంది? మీటింగ్ ఏం చర్చించినా రికార్డు అవుతుంది’’ అని తెలిపారు.
అబ్దుల్ రజాక్ కూడా ఇలాగే స్పందించారు.
మొహ్సిన్ నఖ్వీ ఎంపిక కమిటీలో ఏడుగురు సభ్యులను చేర్చారు. ప్రతి ఒక్క సభ్యుని ఓటుకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. కానీ, ఎంపిక కమిటీ నిర్ణయాల్లో వాహాబ్ రియాజ్ ప్రభావం ఎక్కువగా ఉందనే అభిప్రాయం చాలామందిలో ఉంది.
వీరిని పదవుల నుంచి తొలగించడంపై ఎందుకు స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదని పీసీబీ అధికారులను అడిగినప్పుడు, లీగల్ కారణం ఉండి ఉండొచ్చని ఒక అధికారి చెప్పారు. ఈ నిర్ణయానికి ప్రభావితమైన వ్యక్తి బోర్డును కోర్టుకు లాగొచ్చు. అందుకే, ఈ తొలగింపుకు కారణాన్ని చెప్పలేదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెర వెనుక ఏం జరుగుతోంది?
సాధారణంగా ప్రపంచకప్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ బోర్డులు మార్పులు చేపడుతుంటాయి. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న మార్పులే ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతుంటాయి ఎందుకు? అంటే.. మార్పులు చేసే పద్ధతి, దాని చుట్టూ ఉన్న అస్పష్టతే ఈ ఆందోళనలకు కారణమని పాకిస్తాన్ టీమ్ మాజీ మీడియా మేనేజర్, జర్నలిస్ట్ అహ్సన్ ఇఫ్తిఖార్ నాగి చెప్పారు.
ఇప్పటి వరకు పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై క్రికెట్ బోర్డు చైర్మన్ ఎలాంటి పత్రికా ప్రకటనను కానీ, అధికారిక ప్రకటనను గానీ జారీ చేయలేదు.
పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.
‘‘2015 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజ్ నుంచి ఇంగ్లండ్ టీమ్ వైదొలిగినప్పుడు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్ష చేపట్టింది. ఈ సమీక్షలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సక్సెస్‌ఫుల్ కెప్టెన్ల అభిప్రాయాలు తీసుకున్నారు. వారి డేటా ఆధారంగా టీమ్ వ్యూహాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత, ఇంగ్లండ్ జట్టు 2019 ప్రపంచ కప్‌ను, 2022లో టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది’’ అని అహ్సన్ తెలిపారు.
పీసీబీ కూడా ఇలాంటి సమీక్షనే చేపట్టి, దానికి అనుగుణంగా తీసుకోవాల్సినవసరం ఉందని అహ్సన్ అబిప్రాయం.
కేవలం సెలక్టర్లనే ఎందుకు తొలగించారు? అని ఆయన ప్రశ్నించారు.
‘‘తొలుత మీరు ఒక వ్యూహాన్ని రూపొందించాలి. ఆ తర్వాత చర్యలు తీసుకోవాలి. ఎంపిక కమిటీలో సభ్యులందరికీ రెండు పదవులున్నాయి. కేవలం ఇద్దరు సభ్యులనే తొలగించడం, వారిని ఈ పేలవమైన ప్రదర్శనకు కారణం అడగడం అర్థరహితం’’ అని వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయాన్ని క్రికెట్ నిపుణులు ‘కాస్మోటిక్ చేంజ్’గా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కోచ్ రిపోర్టు లీక్ అయిందనే వార్తలు..
పీసీబీకి కోచ్ ఇచ్చిన రిపోర్టులోని సమాచారం వెలుగులోకి వచ్చిన తర్వాత, షాహీన్ అఫ్రీది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు.
అహ్సన్ ఇఫ్తీఖార్ దీనిపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. ‘‘కొన్ని నెలల కిందటి వరకు కూడా ఇదే ఆటగాడు మీకు కెప్టెన్‌గా ఉన్నారు. ఇలాంటి వార్తలు బయటపెట్టడం ద్వారా డ్రెస్సింగ్ రూమ్‌లోని వాతావరణాన్ని పీసీబీ మరింత దిగజార్చింది’’ అని అహ్సన్ ఇఫ్తీఖార్ అన్నారు.
షాహీన్, మొహ్సిన్ నఖ్వీ మధ్యలో నెలకొన్న వివాదం కూడా అంతకుముందు బయటికి వచ్చినట్లు అహ్సన్ ఇఫ్తీఖార్ చెప్పారు.
ఆటగాళ్లతో ఈ విధంగా ప్రపంచంలో ఏ బోర్డు కూడా వ్యవహరించదని, వారి మధ్యలో ఏదైనా చర్చలు జరిగితే అవి బయటికి రావని అన్నారు.
‘‘మీరు తప్పక చర్యలు తీసుకోవాలి. కానీ, ఈ విధంగా కాదు’’ అని అన్నారు.
ప్లేయర్ మేనేజ్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాలని, కానీ, దురదృష్టవశాత్తు ఈ విషయంలో తాము చాలా వెనుకబడి ఉన్నామని అహ్సన్ వ్యాఖ్యానించారు.
అయితే, ఈ రకమైన వైఖరి 1990ల నుంచి పాకిస్తాన్ క్రికెట్‌లో కొనసాగుతోందని క్రికెట్ జర్నలిస్ట్ సమీ చౌధరీ చెప్పారు.
‘‘అప్పట్లో ఇలాంటి వార్తలు ప్రింట్ మీడియాలో ప్రచురితమయ్యేవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో రావడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో, ఇలాంటి ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి’’ అని అన్నారు.
‘‘ఈ వార్త నిజమో అబద్ధమో తెలియదు. కానీ, ప్రతిసారీ దీని వెనక ఉన్న ఉద్దేశం నెరవేరుతుంది. దీనికి ఎవరూ బాధ్యత తీసుకోవడం లేదు. గత ప్రపంచకప్ సమయంలో, ఆ తర్వాత, బాబర్ ఆజమ్ పరిస్థితి ఇలానే ఉండేది. అంతకుముందు కూడా క్రికెటర్లకు ఇలాగే జరిగింది’’ అని సమీ చౌధరి చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














