పారిస్ ఒలింపిక్స్: సేన్ నదిలో పెళ్లి రింగు పోగొట్టుకున్న అథ్లెట్, భార్యకు క్షమాపణ చెబుతూ..

పారిస్ ఒలింపిక్ క్రీడలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒలింపిక్ అథ్లెట్ జియాన్‌మార్కో టామ్‌బెరీ
    • రచయిత, లుసీ క్లార్కె-బిల్లింగ్స్
    • హోదా, బీబీసీ న్యూస్

పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల సందర్భంగా పెళ్లి రింగు పోగొట్టుకోవడంతో ఇటలీకి చెందిన హైజంపర్ జియాన్‌మార్కో టామ్‌బెరీ తన భార్యకు క్షమాపణ చెప్పారు.

ఈ ప్రపంచ చాంపియన్ తమ దేశపు జాతీయ జెండాను ఊపుతూ సేన్ నదిలో అథ్లెట్ల చేత నిర్వహించిన బోటు పరేడ్‌లో పాల్గొన్నారు.

ఆ సమయంలో చేతి వేలికి ఉన్న పెళ్లి రింగు జారి, సేన్ నదిలో పడిపోయింది.

‘‘ఐయామ్ సారీ మై లవ్, ఐయామ్ సో సారి’’ అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన భార్య చియారా బొంటెంపి టామ్‌బెరీకి క్షమాపణ చెప్పారు టామ్‌బెరీ.

చాలా కిలోల బరువు తగ్గడమో లేదా చెప్పలేనంత ఉత్సాహమో దీనికి కారణమై ఉంటుందని ఈ అథ్లెట్ అన్నారు.

పారిస్ ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు బరువుపై తగిన శ్రద్ధ వహిస్తూ, ఫిట్‌గా ఉంటూ ప్రాక్టీసు నిర్వహిస్తూ ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

‘‘ఒకవేళ అదే జరిగితే, ఈ రింగును కోల్పోవాల్సి వస్తే, ఇంతకంటే మంచి ప్రదేశాన్ని నేను ఊహించుకోలేను’’ అని జియాన్‌మార్కో టామ్‌బెరీ రాశారు.

ప్రేమకు చిహ్నమైన నగర నదీ గర్భంలో ఈ రింగు ఎప్పటికీ ఉండిపోతుందని అన్నారు.

అంతేకాక, చియారా రింగును కూడా నదిలో వేయమని ఆయన సూచించారు.

‘‘అప్పుడు, ఆ రెండూ చిరకాలం నదీ గర్భంలో ఉండిపోతాయి. మన పెళ్లి వాగ్దానాలను గుర్తుకు తెచ్చుకునేందుకు, మరోసారి పెళ్లి చేసుకునేందుకు మరో అవకాశం’’ అని అన్నారు.

ఆ తర్వాత జియాన్‌మార్కో టామ్‌బెరీ పోస్టుపై భార్య చియారా సైతం స్పందించారు.

‘‘నువ్వు మాత్రమే దీన్ని రొమాంటిక్‌గా మార్చగలవు’’ అంటూ భర్త క్షమాపణ పోస్టుకు చియారా రిప్లయి ఇచ్చారు.

చియారా, జియాన్‌మార్కో టామ్‌బెరీలకు 2022 సెప్టెంబర్‌లో పెళ్లయింది.

మూడు సార్లు ఒలింపిక్ పతాకం సాధించిన అరియానో ఎర్రిగోతో పాటు జియాన్‌మార్కో టామ్‌బెరీ కూడా పారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఇటలీ క్రీడాకారులకు నేతృత్వం వహిస్తూ జాతీయ జెండాను పట్టుకుని ఊపారు.

ఆ సమయంలోనే రింగు పడిపోయింది. బోటుపై నుంచి కిందకి జారి, ఆ తర్వాత నదిలో కలిసిపోయింది.

2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా జియాన్‌మార్కో టామ్‌బెరీ వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో ఖతార్ ముతాజ్ ఎసా బార్‌షిమ్‌తో కలిసి హైజంప్‌లో బంగారు పతకాన్ని షేర్ చేసుకున్నారు.

హైజంప్ ఫైనల్లో బార్‌షిమ్, టామ్‌బెరీ ఇద్దరూ 2.37 మీటర్లు విజయవంతంగా జంప్ చేశారు. ఆ తర్వాత 2.39 మీటర్లు దూకడంలో మూడు ప్రయత్నాల్లోనూ వీరిద్దరూ విఫలమయ్యారు.

దీంతో విజేతను నిర్ణయించడానికి ఒలింపిక్ అధికారి టైబ్రేక్ రూపంలో వారికి మరో అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని తిరస్కరించిన బార్‌షిమ్ ‘మేం ఇద్దరం పసిడి పతకాలు పొందవచ్చా?’ అని అడిగారు.

అతని ప్రతిపాదనకు అధికారి అంగీకరించడంతో ఇద్దరు అథ్లెట్లు ఆనందంగా కరచాలనం చేసుకొని నవ్వారు.

అథ్లెటిక్స్‌లో 1912 తర్వాత ఒలింపిక్ పోడియాన్ని ఇద్దరు అథ్లెట్లు పంచుకోవడం అదే తొలిసారి.

స్వర్ణాన్ని పంచుకోవాలనే అసాధారణ నిర్ణయం తీసుకున్నాక వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకొని, తర్వాత వారి కోచ్‌లు, సహచరులతో సంబరాలు జరుపుకున్నారు. తమ తమ జాతీయ జెండాలతో పరిగెడుతూ గెలుపు వేడుకలు చేసుకున్నారు.

2011 నుంచి పలు పోటీల్లో టామ్‌బెరీ సగం షేవ్ చేసుకున్న గడ్డంతోనే పాల్గొంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇది ఆయన ట్రేడ్‌మార్క్ స్టయిల్‌గా నిలుస్తోంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)