పారిస్ ఒలింపిక్స్ 2024: ఆట కోసం వేలును తొలగించుకున్న ఆస్ట్రేలియా హాకీ ఆటగాడు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టిఫనై టర్న్‌బుల్
- హోదా, బీబీసీ న్యూస్
పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక హాకీ ఆటగాడు తన వేలులో కొంత భాగాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
రెండు వారాల కిందట పెర్త్‌లో జరిగిన శిక్షణా కార్యక్రమంలో మాట్ డాసన్ కుడి చేతి వేలుకు తీవ్ర గాయమైంది.
ఆ గాయానికి శస్త్రచికిత్స చేయిస్తే దాని నుంచి కోలుకోవడానికి నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.
దీంతో మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 30 ఏళ్ళ మాట్ డాసన్ గాయపడిన వేలు పై భాగాన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆ నిర్ణయం, ఆయన టీమ్ సహచరులను, కోచ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
డాసన్ గాయపడిన 16 రోజుల తరువాత శనివారం (జులై 27) నాడు ఆయన టీమ్ కూకాబుర్రాస్ (ఆస్ట్రేలియా ఫీల్డ్ హాకీ జట్టుపేరు) అర్జెంటీనాతో తలపడనుంది.
తన వేలుకు అయిన గాయం చాలా తీవ్రమైనదని డాసన్ మీడియాకు చెప్పారు.
చేంజింగ్ రూమ్‌లో గాయాన్ని చూసినప్పుడు తన ఒలింపిక్ కల ముగిసిపోయినట్టు భావించానని తెలిపారు.
దీంతో వెంటనే ప్లాస్టిక్ సర్జన్‌ను కలిసిన డాసన్‌కు, సర్జరీ ద్వారా వేలు బాగు అవడానికి చాలా కాలం పడుతుందని, అయినా పూర్వంలా వేలు పనిచేయదని డాక్టర్ చెప్పారు. కానీ గాయపడిన భాగాన్ని తొలగిస్తే పది రోజుల్లోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టొచ్చని డాక్టర్ తెలిపారు.
తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని భార్య హెచ్చరించారు. అయినా పట్టించుకోకుండా, ఆ రోజు మధ్యాహ్నమే తానో స్థిర నిర్ణయం తీసేసుకున్నట్టు డాసన్ చెప్పారు.
‘‘నేను కచ్చితంగా నా ఆట మొదలుపెట్టినప్పటి కంటే ఇప్పుడు చాలా ముందున్నాను. ఎవరికి తెలుసు ఇదే చా చివరి ఒలింపిక్సేమో.. నేను ఇంకా బాగా ఆడగలను అనిపిస్తే నేను అప్పుడు కచ్చితంగా ఆడతాను’’ అని ఆయన పార్లేజ్ వూస్ హాకీ పాడ్‌కాస్ట్‌కు తెలిపారు.
‘‘నా వేలి పై భాగం తీసివేయడమే నేను చెల్లించాల్సిన మూల్యమైతే నేను ఆ పనే చేస్తాను’’ అని చెప్పారు.

డాసన్ నిర్ణయం జట్టులో ప్రకంపకనలు సృష్టించిందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని, కానీ అంతిమంగా తామంతా డాసన్‌కు మద్దతుగా నిలిచామని టీమ్ కెప్టెన్ అరాన్ జాలెవ్‌స్కీ చెప్పారు.
‘‘ఆ విషయం విన్న తరువాత ఎలా ఆలోచించాలో కూడా మాకు అర్థం కాలేదు. ఆ తరువాత అతను ఆస్పత్రికి వెళ్ళి తన వేలును కత్తిరించుకున్నట్టు తెలిసింది. ఇది కొంచెం ఆసక్తిగానూ అనిపించింది. ఎందుకంటే ఇక్కడకు రావడానికి ఎంతోమంది ఎన్నోరకాల త్యాగాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఓ వేలులోని కొంత భాగంకూడా కావచ్చు’’ అని పారిస్‌లో ఓ న్యూస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
‘‘అత్యున్నతస్థాయికి చేరుకోవడానికి జీవితాంతం త్యాగాలు చేస్తూనే ఉన్నప్పుడు, ఇప్పడీ వేలు తొలగించుకోవడమనేది ఆయనకు చాలా తేలికైన నిర్ణయమై ఉంటుంది’’ అన్నారు.
ఈ వారం ప్రారంభంలో డాసన్ టీమ్ ట్రైనింగ్‌లో చేరారని కూకాబుర్రాస్ కోచ్ కోలిన్ బ్యాచ్ చెప్పారు.
‘‘మాట్‌కు పూర్తి మార్కులు పడతాయి. పారిస్‌లో ఆడటానికి అతను గట్టిగా కట్టుబడి ఉన్నాడు. నేనైతే ఆయనలా చేసి ఉండేవాడిని కాను. కానీ ఆయన చేశారు. అదెంతో గొప్పపని’’ అని కోలిన్ ఆస్ట్రేలియా సెవెన్ న్యూస్ నెట్‌వర్క్‌కు చెప్పారు.
డాసన్ తీవ్రంగా గాయపడటం ఇదే మొదటిసారి కాదు.
2018 కామన్‌వెల్త్ గేమ్స్‌లో హాకీ బ్యాట్ తగిలి ఆయన కన్నుపోయినంత పనైంది.
అయినా ఆయన కుకాబుర్రాస్ తరపున ఆడారు.
ఆ టోర్నమెంట్‌లో వారు గోల్డ్ మెడల్ సాధించారు.
తరువాత టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














