‘ఆ మెరుపును చూడగానే నాకు వజ్రం దొరికిందని తెలిసిపోయింది. దాని విలువ తెలిశాక..’

వజ్రం దొరికిన రాజు
ఫొటో క్యాప్షన్, పదేళ్ళుగా రాజు గౌండ్ వజ్రాల కోసం వెతుకుతున్నారు.
    • రచయిత, చెరిలాన్ మోలన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మధ్యప్రదేశ్‌లోని ఓ కార్మికునికి విలువైన వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే ఆయన అదృష్టం మారిపోయింది. రాజు గౌండ్‌కు దొరికిన 19.22 క్యారెట్ల వజ్రం విలువ సుమారు 80 లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు.

వజ్రాలు దొరుకుతాయనే ఆశతో పన్నా పట్టణం చుట్టుపక్కల ఉన్న గనులను 10 ఏళ్లకు పైగా లీజుకు తీసుకున్నట్లు రాజు గౌండ్ బీబీసీకి తెలిపారు.

వజ్రాలకు పన్నా చాలా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి ప్రజలు విలువైన రాళ్ల కోసం ప్రభుత్వం నుంచి పెద్దగా లోతులేని గనులను లీజుకు తీసుకుంటూ ఉంటారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
వజ్రం
ఫొటో క్యాప్షన్, రాజుకు దొరికిన వజ్రం 80 లక్షల రూపాయల ధర పలుకుతుందని భావిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎమ్‌డీసీ) పన్నాలో మెకనైజ్డ్ డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది.

సాధారణంగా అత్యంత ప్రాథమిక సాధనాలు, పరికరాలతో వజ్రాల కోసం వెతికే వ్యక్తులు, సహకార సంఘాలకు ఎన్‌ఎమ్‌డీసీ ఈ గనులను లీజుకు ఇస్తుంది.

వాళ్లు తమకు దొరికిన వాటిని ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్తే, అక్కడ వాటి ధరను అంచనా వేస్తారు.

"ఈ గనులను నిర్దిష్ట కాలానికి లీజుకు తీసుకోవచ్చు. అది 200 నుంచి 250 రూపాయలు ఉంటుంది" అని రాష్ట్ర ప్రభుత్వ డైమండ్ కార్యాలయం అధికారి అనుపమ్ సింగ్ బీబీసీకి తెలిపారు.

2018లో, బుందేల్‌ఖండ్‌కు చెందిన ఒక కార్మికునికి పన్నాలోని గనిలో కోటిన్నర రూపాయల విలువైన వజ్రం దొరికింది. అయితే, ఇలాంటి సంఘటనలు చాలా అరుదు.

చాలా మందికి చిన్నచిన్న వజ్రాలు దొరుకుతుంటాయని, రాజుకు దొరికింది మాత్రం చాలా పెద్దది అని అనుపమ్ సింగ్ చెప్పారు.

పనిముట్లు ఫోటో
ఫొటో క్యాప్షన్, వజ్రాల వేటకు రాజు వాడే పనిముట్లు

ఉపాధి లేక గని లీజుకు తీసుకున్న రాజు

పన్నా సమీపంలోని కృష్ణ కళ్యాణ్‌పూర్ పట్టి గ్రామంలోని గనిని తన తండ్రి రెండు నెలల క్రితం లీజుకు తీసుకున్నారని రాజు బీబీసీకి తెలిపారు.

వ్యవసాయ పనులు, తాపీ పనులు లేని సమయంలో తమ కుటుంబం ఇలా గనులను లీజుకు తీసుకుంటుందని చెప్పారు.

"మేము చాలా పేదవాళ్లం. మాకు వేరే ఆదాయ వనరులు లేవు. అందుకే ఇల్లు గడవడం కోసం ఇలాంటి పనులు చేస్తుంటాం" అని ఆయన చెప్పారు.

వజ్రాలు దొరికిన వాళ్ల గురించి విని రాజు ఏదో ఒక రోజు అదృష్టం తననూ వరిస్తుందని ఆశించారు.

బుధవారం ఉదయం ఆయన విలువైన రాళ్లను వెతకడం కోసం, రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఆ గనికి వెళ్లారు.

"ఇది చాలా కష్టమైన పని. మేం ఒక గొయ్యి తవ్వి, మట్టి, రాళ్ళను తీసి, వాటిని జల్లెడతో వడగడతాం. ఆ తర్వాత వజ్రాలను వెతకడానికి వేలాది చిన్నచిన్న రాళ్లను జాగ్రత్తగా జల్లెడ పడతాం" అని ఆయన వివరించారు.

ఆ రోజు మధ్యాహ్నం ఆయన కష్టం ఫలించి, ఆయన అదృష్టం మారిపోయింది.

"నేను రాళ్లను జల్లెడ పడుతున్నప్పుడు గాజు ముక్కను పోలినది ఏదో కనిపించింది. దానిని నా కళ్ల దగ్గర పెట్టుకుని చూస్తే, దానిలో మెరుపులాంటిది కనిపించింది. అప్పుడే నాకు వజ్రం దొరికిందని అర్థమైంది" అన్నారు.

వజ్రాల తూకం
ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో రాజుకు దొరికిన వజ్రాన్ని తూచారు

రాజు తనకు దొరికిన వజ్రాన్ని ప్రభుత్వ వజ్రాల కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ దాని బరువు తూచి, దాని ధరను అంచనా వేశారు.

వజ్రాన్ని వేలంలో విక్రయించి, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించుకున్నాక మిగిలిన సొమ్మును రాజుకు అందజేస్తామని సింగ్ చెప్పారు.

ఈ డబ్బుతో తన కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని, తన పిల్లలను చదివించుకోవాలని రాజు అనుకుంటున్నారు.

అయితే ముందుగా, ఆయన తన 5 లక్షల రూపాయల అప్పును తీర్చాలనుకుంటున్నారు.

తమ కుటుంబంలో మొత్తం 19 మంది ఉన్నామని అందువల్ల వజ్రం గురించి ప్రజలకు తెలుస్తుందనే భయం తనకు లేదని అన్నారు.

"నేను వజ్రాల కోసం రేపు మళ్ళీ గనికి వెళ్తాను" అని ఆయన అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)