హిట్లర్‌ను ధిక్కరించిన ఒలింపిక్ స్నేహం, ఆ రోజు ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, క్రెయిగ్ నెల్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది ఒలింపిక్ జానపదాల్లో చేరిన కథ. అయితే జర్మనీ అథ్లెట్ ‘లజ్ లాంగ్’కు మాత్రం ఇదొక చీకటి పరిణామాల పరంపర.
1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్‌లో స్వర్ణ పతకం కోసం జరిగిన 'లాంగ్ జంప్' పోరులో జెస్సీ ఒవెన్స్ 8 మీటర్ల మార్కును అధిగమించారు. దీంతో ఒవెన్స్‌ను కౌగిలించుకొని అభినందించాలని ప్రత్యర్థి అథ్లెట్ ‘లజ్‌లాంగ్’ ఇసుకలోకి దూకారు.
అమెరికన్లపై నాజీల జర్మనీకి ఉన్న నమ్మకానికి విరుద్ధంగా ఆశ్చర్యకరమైన రీతిలో ఇద్దరు అథ్లెట్లు (బ్లాక్, వైట్) కలిసి గెలుపు పోడియంను పంచుకున్నారు. ఆ సమయంలో అందరూ చప్పట్లు కొట్టడం లేదు. స్టాండ్స్‌లో ఉన్న జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ దీన్నంతా అంగీకరించనట్లుగానే గమనిస్తున్నారు.
పోడియంపైకి ఎక్కిన తర్వాత ‘లజ్‌లాంగ్’ నాజీ సెల్యూట్ చేశారు.
మరోవైపు ఒవెన్స్ అమెరికా జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్నారు. తర్వాత ఏం జరుగుతుందో ఈ ఇద్దరు అథ్లెట్లకు తెలియదు.

వీరిద్దరి చరిత్ర ఏమిటి?
జెస్సీ ఒవెన్స్, లజ్ లాంగ్ ఇద్దరూ 1913లోనే పుట్టారు. బెర్లిన్‌లో ఒకరితో ఒకరు తలపడినప్పుడు తమ క్రీడా జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న సారూప్యతలు అంత వరకు మాత్రమే. వారి జీవితాలు, క్రీడల వైపు ప్రయాణం మాత్రం పూర్తిగా భిన్న ధ్రువాల వంటివి.
ఒవెన్స్ 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఆయన జీవితం గురించి చాలామందికి తెలుసు. ఆఫ్రికాకు చెందిన ఒవెన్స్ తాత అమెరికాకు బానిసగా వచ్చారు. ఒవెన్స్ తండ్రి అలబామాలోని ఓ రైతు దగ్గర కూలీగా పనిచేసేవారు. తన కుటుంబంలోని 10 మంది పిల్లల్లో అందరి కంటే చిన్నవాడు ఒవెన్స్.
చిన్నప్పుడు మిగతా సోదరులతో కలిసి పత్తి ఏరడానికి వెళ్లేవాడు. అయితే ఆ కుటుంబం క్లీవ్‌లాండ్ వెళ్లిన తర్వాత అతనిలో క్రీడా సామర్థ్యం బయటపడింది. తొమ్మిదేళ్ల వయసులో పాఠశాలలో చేరాడు.
స్కూలులో తన పేరును జేమ్స్ క్లీవ్ లాండ్ అనే పేరుకు సంక్షిప్తంగా జేసీగా పెట్టుకున్నాడు. అయితే అది టీచర్‌కు సరిగ్గా అర్థం కాకపోవడంతో అతని పేరును జెస్సీగా రిజిస్టర్‌లో రాశారు. అలా ఆయనకు జెస్సీ అనే పేరు స్థిరపడింది.
ఒహయో స్టేట్ యూనివర్సిటీలో ఆయనకు అథ్లెటిక్ స్కాలర్‌షిప్ లభించింది. అక్కడ ఆయన శిక్షణ తీసుకున్నారు. అనంతరం ప్రపంచ గుర్తింపు పొందిన అథ్లెట్లలో ఒకరిగా ఒవెన్స్ పేరు తెచ్చుకున్నారు.
1935లో మిషిగన్ యూనివర్సిటీలో ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో ఒవెన్స్ మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పారు. మరో రికార్డునూ ఆయన సమం చేశారు. ఇదంతా గంటలలోపే జరిగింది.
లాంగ్ జంప్‌లో 25 సంవత్సరాలుగా సుస్థిరంగా ఉన్న రికార్డును బద్దలు కొట్టి 8.13 మీటర్లతో ‘సరికొత్త చరిత్ర’ సృష్టించారు.

ఫొటో సోర్స్, Getty Images
లజ్ లాంగ్ జీవితం భిన్నం..
తన ప్రత్యర్థి మాదిరిగా కాకుండా.. లజ్ లాంగ్ మంచి జీవితాన్ని అనుభవించారు. జర్మనీలో లీప్‌జిగ్‌లోని మధ్య తరగతి కుటుంబంలో ఆయన పుట్టారు. అతని తండ్రి కార్ల్‌కు సిటీ సెంటర్‌లో ఫార్మసీ షాపు ఉంది. తల్లి జొహానా క్వాలిఫైడ్ ఇంగ్లీష్ టీచర్. ఆమె విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చారు.
ఆర్గానిక్ కెమిస్ట్రీ వ్వవస్థాపకుడిగా గుర్తింపు పొందిన ప్రముఖ శాస్త్రవేత్త వాన్ లేబిగ్ కూడా అదే కుటుంబం నుంచి వచ్చారు.
లజ్ లాంగ్ అసలు పేరు కార్ల్ లుడ్‌విగ్ హర్మన్ లాంగ్. అయితే ముద్దుగా లజ్ అని పిలిచేవారు. లీప్‌జిగ్ నగర శివారులోని ఓ గ్రామంలో తన నలుగురు సోదరులతో లజ్ కలిసి జీవించారు. వారి ఇంటి వెనుకున్న చిన్న తోటలో ఫ్యామిలీ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగేవి.
1928లో లజ్ లాంగ్ లీప్‌జిగ్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేరారు. కోచ్ జార్జ్ రిక్టర్ ఆయనకు శిక్షణ ఇచ్చారు. హై జంపర్‌గా గాలిలోకి ఎగిరినప్పుడు.. ఈదుతున్నట్లుగా ముందుకు దూసుకుపోయే టెక్నిక్‌ను రిక్టర్ లజ్‌లాంగ్‌కు నేర్పించారు.
ఒక స్ప్రింటర్‌గా లజ్ లాంగ్ తనకున్న అడ్వాంటేజ్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.
రిక్టర్ శిక్షణ ఆయనను రాటు తేల్చింది. 1933లో లజ్‌లాంగ్ జర్మన్ లాంగ్ జంప్ రికార్డును బద్దలు కొట్టి నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగారు. అప్పుడాయన వయసు 20 ఏళ్లు మాత్రమే.
బెర్లిన్ ఒలింపిక్స్‌కు రెండు నెలల ముందు 7.82 మీటర్లు దూకడం ద్వారా యూరోపియన్ లాంగ్ జంప్‌లో కొత్త రికార్డు సృష్టించారు.
వివాదాల నడుమ ఒలింపిక్స్..
జెస్సీ ఒవెన్స్, లజ్ లాంగ్ ఇద్దరూ ట్రాక్ మీద పోటీ పడే సమయానికి వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాలు కూడా రాజకీయంగా పోటీ పడుతున్నాయి.
నాజీల పాలనలో యూదులపై అరాచకాలు జరిగాయని అందుకే బెర్లిన్ గేమ్స్‌ను బహిష్కరించాలని అమెరికా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది.
"జర్మనీలో మైనార్టీలపై వివక్ష చూపితే పోటీల నుంచి అమెరికా తప్పుకోవాలి" అని అమెరికాకు నేషనల్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్‌మెంట్ ఆప్ కలర్డ్ పీపుల్ సూచించినట్లు నివేదికలు ఉన్నాయి.
ఒలింపిక్ క్రీడల్ని బహిష్కరించాలన్న ప్రతిపాదనను ఒవెన్స్ కూడా మొదట సమర్థించారు.
అయితే తర్వాత రోజుల్లో అమెరికన్ ఒలింపిక్ కమిటి, ఆయన కోచ్ హామీ ఇవ్వడం, పదే పదే విజ్ఞప్తి చెయ్యడంతో జెస్సీ ఒవెన్స్ అంగీకరించారు.
ఆ సమయంలో జర్మనీలో పరిస్థితులు, యూదు క్రీడాకారులు ఒలింపిక్స్‌లో పాల్గొనడం పట్ల ఆతిథ్య దేశం వైఖరి లాంటి అంశాలను అధ్యయనం చేసేందుకు అమెరికన్ ఒలింపిక్ కమిటీ ఒక బృందాన్ని జర్మనీకి పంపింది.
ఇక జర్మనీ విషయానికి వస్తే, క్రీడల్లో పాల్గొంటున్న ఆటగాళ్లపై ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి చాలానే ఉంది.
"అథ్లెట్లు జర్మన్ సామ్రాజ్యానికి ప్రతినిధులు, ట్రాక్ బయటే కాదు ట్రాక్ పైన కూడా. వారేం ప్రైవేటు వ్యక్తులు కాదు’’ అని లజ్ లాంగ్ మనవరాలు జులియా కెల్నెర్ అప్పటి విషయాలను గుర్తుచేసుకుంటూ చెప్పారు.
1933లో లజ్ లాంగ్ జాతీయ జట్టులో అడుగు పెట్టారు. అదే సంవత్సరం హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ అయ్యారు.
"1936 ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లూ... మనం మన నాయకుడు అడాల్ఫ్ హిట్లర్‌ను నిరాశ పరచకూడదు" అని రాసి ఉన్న బ్యానర్‌ను అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే మైదానంలో కట్టారు. ఇలాంటి సందేశాన్ని లజ్ లాంగ్ ముందుగా ఊహించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచానికి గుర్తుండిపోయిన ఫైనల్
హిట్లర్ బెర్లిన్ ఒలింపిక్స్ స్టేడియంలో ఆటలు చూసేందుకు వచ్చారు. అదే స్టేడియంలో ‘లాంగ్ జంప్’ పోటీలో లజ్ లాంగ్, జెస్సీ ఒవెన్స్ ఫైనల్‌కు చేరుకున్నారు.
ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు తర్వాత చివరి రౌండ్‌లో మూడో ఛాన్స్‌లో జెస్సీ ఒవెన్స్ దూకిన 7.87 మీటర్లను లజ్ లాంగ్ దూకి సమం చేశారు. దీంతో స్టేడియంలో ఉన్న జర్మన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
దీంతో ఇద్దరి మధ్య మళ్లీ పోటీ మొదలైంది. ఒవెన్స్ 7.94 మీటర్లు దూకి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించారు. లాంగ్ తన చివరి ప్రయత్నంలో ఫౌల్ అయ్యారు. అయినప్పటికీ ఆయనకు అప్పటికే రజతం ఖాయమైంది. లాంగ్ జంప్‌లో జర్మనీకి ఇదే తొలి మెడల్ కూడా.
జెస్సీ ఒవెన్స్ చివరి ప్రయత్నంలో 8.06 మీటర్లు దూకి ఒలింపిక్స్ చరిత్రలో రికార్డు సృష్టించారు. ఇది 24 వరకు ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంది.
అయితే, తాను ఓడిపోయానన్న నిరాశ, నిస్పృహల్ని పక్కన పెట్టి లజ్‌లాంగ్ ఇసుక గుంటలోకి దూకి బంగారు పతకం గెలుచుకున్న జెస్సీ ఒవెన్స్‌ను కౌగిలించుకున్నారు.
దాదాపు లక్ష మంది ప్రేక్షకుల ముందు ఒవెన్స్‌ను గట్టిగా హత్తుకుని అభినందించారు. ఆ సమయంలో ఒవెన్స్ "నేను నా బెస్ట్ ఇచ్చేలా చేశావు" అని లజ్‌ను అభినందించారు.
ఒవెన్స్, లజ్ లాంగ్‌లు ఈ పోరులో అంతకుముందు ఒలింపిక్స్‌లో నమోదైన రికార్డుల్ని ఐదుసార్లు అధిగమించారు.
"ఇలాంటి వాతావరణంలో ఇంత దూరం లాంగ్ జంప్ చేయడం - ఇదంతా ఓ అద్భుతమైన కథలా ఉంది" అని లజ్‌లాంగ్ తన స్వస్థలానికి చెందిన న్యూస్ పేపర్‌జైటుంగ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"నేనేమీ చెయ్యలేను. అతని వద్దకు పరుగెత్తాను. అతనిని మొదట అభినందించింది, హత్తుకున్నది నేనే" అని లజ్ అన్నారు. అయితే, లజ్‌లాంగ్ మైదానంలో చేసిన పనిని చూసిన జర్మన్ అధికారులు ఆశ్చర్యపోయారు.
ఒలింపిక్ గేమ్స్ తర్వాత నాజీ పార్టీ ఉపాధ్యక్షుడు రుడాల్ఫ్ హెస్ తనను హెచ్చరించారని లజ్‌లాంగ్ తల్లి జొహనా తన డైరీలో రాసుకున్నారు.
"చాలా పెద్దవాళ్ల నుంచి ఒక ఆదేశం వచ్చింది. అదేంటంటే లజ్‌లాంగ్ ఇంకెప్పుడూ మరో నల్ల వ్యక్తిని కౌగిలించుకోకూడదు" అని ఆమె రాశారు.
అయితే, నాజీల వర్ణ వివక్షను లజ్ లాంగ్ పెద్దగా పట్టించుకోలేదు.
జెస్సీ ఒవెన్స్‌ను ఆయన కౌగిలించుకోవడం నాజీలలో ఆగ్రహన్ని రేకెత్తించింది. వాళ్లిద్దరి స్నేహం నాజీల సిద్ధాంతాలు, ప్రచారం ప్రాధాన్యతను తగ్గిస్తుందేమోనని వారు ఆందోళన చెందారు.
90 ఏళ్లయినా..
దాదాపు 90 ఏళ్ల తర్వాత కూడా ఒవెన్స్, లజ్‌లాంగ్ ఫ్రెండ్ షిప్ గురించి ఒలింపిక్ కథల్లో ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
"వాళ్లిద్దరి బంధం, స్నేహం అందులో నిజాయతీ చాలామంది హృదయాలను తాకింది" అని లజ్ లాంగ్ మనుమరాలు కెల్నర్ లాంగ్ అన్నారు.
"లజ్‌లాంగ్, జెస్సీ ఒవెన్స్ కలిసి ఆ రోజు ప్రత్యేకమైన స్నేహబంధాన్ని ఆనందించారు. వాళ్లిద్దరూ కలిసి ప్రపంచానికి క్రీడా స్ఫూర్తిని చాటారు. క్రీడాకారుల కులం, మతం, వర్ణం లాంటి వాటి కంటే ఆటల్లో స్నేహం, గౌరవం ముఖ్యం అని ఈ ఇద్దరూ చాటి చెప్పారు’’ అని ఆమె అన్నారు.
స్టువర్ట్ రాంకిన్ ఒవెన్స్ మనవడు, ఈ సంఘటనను ఆయన చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
"1936 ఒలింపిక్స్‌లో మా తాత సాధించిన అన్ని విజయాలలో లజ్ లాంగ్‌తో ఆయన ఊహించని స్నేహం నన్ను ఆకట్టుకుంది. నేను చాలా గర్వపడుతున్నాను" అని స్టువర్ట్ చెప్పారు.
" ఆ స్టేడియంలో ఆ పరిస్థితుల్లో అది కూడా హిట్లర్ ముందు వారి స్నేహం నిజంగా అద్భుతమైనది" అని అన్నారు.
ఒవెన్స్ ఆ పోటీల్లోనే లాంగ్ జంప్, 100 మీటర్లతో పాటు, 200 మీ, 4x100 మీ. ల టైటిళ్లనూ గెలుచుకున్నారు. జర్మన్ రాజధాని నుంచి నాలుగు బంగారు పతకాలతో ఆయన ఇంటికి వెళ్లారు.
ఒలింపిక్ రజత-పతక విజేతగా, జాతీయ ఛాంపియన్‌గా, యూరోపియన్ లాంగ్-జంప్ రికార్డ్ హోల్డర్‌గా బెర్లిన్ నుంచి లజ్ లాంగ్ వెళ్లిపోయారు. లాంగ్ మరుసటి ఏడాది 7.90 మీటర్లతో మరో రికార్డును నెలకొల్పారు. కానీ, ఆయనపై జర్మన్ అధికారులు ఓ కన్నేసి ఉంచేవారు. దాన్నుంచి ఆయన తప్పించుకోలేకపోయారు.
"ఇసుకలో లాంగ్ ఆలింగనం పరిణామాలు ఇంకా ఉన్నాయి" అని కెల్నర్-లాంగ్ అభిప్రాయపడ్డారు.
"ఆయనను అధికారుల పర్యవేక్షణలో ఉంచారు. మరింత జాగ్రత్తగా నడుచుకోవాలని, అందరితో ఎక్కువగా కలవకూడదని ఒత్తిడి చేశారు" అని ఆమె అన్నారు.
లజ్ లాంగ్ కెరీర్ ఎలా ముగిసింది?
రెండో ప్రపంచ యుద్దం ప్రారంభమైన తర్వాత లజ్ లాంగ్ మళ్లీ పోటీల్లో పాల్గొనలేదు. ఆయన న్యాయవాది వృత్తిపై దృష్టి పెట్టారు. కాగా, ఆయన తమ్ముడు హెన్రిచ్ హత్యకు గురయ్యారు.
లాంగ్ 1941లో గిసెలాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. అతనికి కై హెన్రిచ్ అనే పేరు పెట్టారు.
అప్పటికి లాంగ్ సైన్యంలోకి వెళ్లాల్సి వచ్చింది, మొదట్లో ఆయన ఫ్రంట్‌లైన్‌కు దూరంగా విధులు నిర్వర్తించేవారు. అయితే 1943లో 10వ బ్యాటరీ పారాచూట్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ రెజిమెంట్‌తో లాంగ్ సిసిలీకి బదిలీ అయ్యారు.
ఆ ఏడాది జూలై 10న ఇటలీని విడిపించేందుకు మిత్రరాజ్యాల దళాలు సిసిలీలో అడుగుపెట్టాయి. నాలుగు రోజుల తరువాత, జర్మన్ దళాలు వెనక్కి తగ్గాయి, ఆ పోరులో లాంగ్ గాయపడ్డారు. అనంతరం మరణించారు.
భర్త చనిపోయిన విషయాన్ని అధికారులు జూలై 30న గిసెలాకు తెలియజేశారు. ఏడేళ్ల తర్వాత లాంగ్ ఆనవాళ్లను కనిపెట్టగలిగారు. గెలాలోని అమెరికన్ సైనిక స్మశానవాటికలో జర్మన్ గౌరవ విభాగంలో లాంగ్ సమాధిని కనుగొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'బంగారు పతకాలు తినలేం'
ఒవెన్స్ యుద్ధ సమయంలో సైన్యంలో చేరకూడదని నిర్ణయించుకున్నారు. ఆయనను అధికారులు బలవంత పెట్టలేదు.
అయితే, ఆయనను అధికారిక అథ్లెటిక్ పోటీల నుంచి నిషేధించారు. మరోవైపు అడ్వర్టైజింగ్ ఆఫర్లు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడానికి ఒవెన్స్ ఇతర మార్గాలను వెతికారు.
స్థానికంగా ఉండే స్ప్రింటర్లతో పోటీపడేవారు. పోటీ పడటానికి మనుషులు లేనప్పుడు మోటార్‌బైక్‌లు, కార్లు, గుర్రాలతో పోటీపడేవారు.
"ఒలింపిక్ ఛాంపియన్ ఇలా గుర్రంతో పరిగెత్తడం దిగజారి పోవడమేనని ప్రజలు అంటున్నారు. మరి నేనేం చేయాలి? నాకు నాలుగు బంగారు పతకాలు ఉన్నాయి, కానీ వాటిని తినలేను" అని ఒవెన్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తక్కువ జీతమున్న ఉద్యోగాలు చేసిన తర్వాత, 1950లలో ఒవెన్స్ మోటివేషనల్ స్పీకర్‌గా మారడంతో ఆయన పరిస్థితులు మెరుగుపడ్డాయి.
తర్వాత ఒవెన్స్ స్వంత పబ్లిక్ రిలేషన్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు, స్పోర్ట్స్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాదరణ పొందారు.
1951లో హర్లెమ్ గ్లోబెట్రోటర్స్ బాస్కెట్‌బాల్ జట్టుతో కలిసి ఒవెన్స్ జర్మనీ పర్యటనకు వెళ్లినపుడు లాంగ్ కుటుంబాన్ని సందర్శించారు. లాంగ్ కొడుకు కైని ఒవెన్స్ కలుసుకున్నారు. ఆయనను గౌరవ అతిథిగా హాంబర్గ్‌లోని గ్లోబ్‌ట్రాటర్స్ గేమ్‌కు తీసుకెళ్లారు.
1964లో కై "జెస్సీ ఒవెన్స్ రిటర్న్స్ టు బెర్లిన్" అనే డాక్యుమెంటరీలో భాగమయ్యారు. ఆ సమయంలో వారు బెర్లిన్ ఒలింపిక్ స్టేడియంలో ఒవెన్స్, లాంగ్ రిలాక్స్‌గా ఉన్న చిత్రాన్ని రీక్రియేట్ చేస్తూ ఫోజు ఇచ్చారు.
ఒవెన్స్ 1976లో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను అందుకున్నారు. నాలుగు సంవత్సరాల తరువాత (66 సంవత్సరాల వయస్సులో) ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆయన చనిపోయారు.
ఒవెన్స్ మరణం తర్వాత 1990లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ ప్రకటించారు. 2016లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒవెన్స్ బంధువులను వైట్ హౌస్‌కి ఆహ్వానించారు.

ఫొటో సోర్స్, Getty Images
కలిసిన ఫ్యామిలీలు..
చాలా ఏళ్లుగా లాంగ్, ఒవెన్స్ కుటుంబాలు సన్నిహితంగా ఉన్నాయి.
2004లో బెర్లిన్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జూలియా కెల్నర్-లాంగ్, ఒవెన్స్ మనవరాలు గినా ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు.
ఒవెన్స్ వారసురాలు మార్లిన్‌తో కలిసి 2009లో బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జూలియా లాంగ్ జంప్ పతకాలను అందించారు.
జూలియా కెల్నర్-లాంగ్, స్టువర్ట్ రాంకిన్ 2012లో మ్యూనిచ్‌లో అనుకోకుండా కలుసుకున్న తర్వాత మిత్రులయ్యారు, వారి 'గ్రాండ్ పేరెంట్స్'పై తీసిన డాక్యుమెంటరీలో కలిసి పనిచేశారు.
ఇలా ఒవెన్స్, లాంగ్‌ల ప్రత్యేక బంధం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది, ఆన్‌లైన్‌లో పాపులర్‌గా నిలిచింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














