ఆస్ట్రేలియా ఫిగర్‌ స్కేటర్‌... మాస్కోలో అనుమానాస్పద స్థితిలో మృతి

అలెగ్జాండ్రోవ్‌స్కయా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అలెగ్జాండ్రోవ్‌స్కయా తనకు పౌరసత్వం ఇచ్చిన ఆస్ట్రేలియా తరఫున 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు.

రష్యాలో పుట్టి, ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ ఫిగర్‌ స్కేటింగ్‌ ప్లేయర్‌ ఎకాటెరినా అలెగ్జాండ్రోవ్‌స్కయా మాస్కోలో మృతి చెందారు.

అయితే ఆమె మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. గాయాల కారణంగా ఎకాటెరినా అలెగ్జాండ్రోవ్‌స్కయా గత ఫిబ్రవరిలో రిటైర్‌మెంట్ తీసుకున్నారు.

2018లో వింటర్‌ ఒలింపిక్స్‌లో హార్లే విండ్సర్‌తో కలిసి స్కేటింగ్‌లో పాల్గొనడానికి ఆమె ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు.

వరల్డ్ జూనియర్స్ 2017లో ఆమెతో కలిసి పతకం గెలుచుకున్న విండ్సర్‌, ఆమె మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. " ఆమెతో కలిసి నేను సాధించిన విజయాలను నేనెప్పటికీ మరిచిపోలేను, ఆమె ఎప్పటికీ నా హృదయంలోనే ఉంటుంది'' అని విండ్సర్‌ తన ఇన్‌స్టా అకౌంట్‌లో రాశారు.

ఎకాటెరినా అలెగ్జాండ్రోవ్‌స్కయా ఇటీవలే మూర్ఛవ్యాధికి చికిత్స తీసుకున్నారని ఆమె కోచ్‌ ఆండ్రే ఖెకాలో వెల్లడించారు. "ఆమె చాలా ధైర్యవంతురాలు'' అని ఆయన ఏఎఫ్‌పీతో అన్నారు.

"ఆమె ఒక అద్భుతమైన అథ్లెట్, గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి'' అని ప్యాంగ్‌చాంగ్ 2018 గేమ్స్‌లో ఆస్ట్రేలియన్ ఒలింపిక్‌ టీమ్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ఇయాన్‌ చెస్టర్‌మ్యాన్‌ అన్నారు.

విండ్సర్‌తో కలిసి అలెగ్జాండ్రోవ్‌స్కయా ఎంతో కష్టపడి ఆడారు. వింటర్‌ ఒలిపింక్స్‌కు అర్హత సాధించిన తొలి స్వదేశీ ఆస్ట్రేలియన్‌గా విండ్సర్‌ రికార్డు సాధించారు.

తొలిసారి ఆమెను కలవడానికి మాస్కో వెళ్లిన విండ్సర్‌ " ఆమెతో జట్టుకట్టిన మొదటిసారే మేం అద్భుతంగా మ్యాచ్‌ అయ్యాం'' అని అన్నారు.

వింటర్‌ ఒలింపిక్‌లో పాల్గొన్న ఆటగాళ్ల మరణాలలో పది రోజుల వ్యవధిలో ఇది రెండోది. ఒలింపింక్స్‌లో మూడుసార్లు, వరల్డ్ స్నో బోర్ట్‌ చాంపియన్‌ షిప్‌లో రెండుసార్లు పతకం సాధించిన అలెక్స్‌ పుల్లిన్‌ గతవారం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌లో విహారానికి వెళ్లి మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)