మధ్యప్రదేశ్: ఇద్దరు మహిళలపై డంపర్‌ ట్రక్కుతో మట్టి పోశారు, అసలేం జరిగింది?

మమతా పాండే

ఫొటో సోర్స్, SURAIH NIAZI/BBC

ఫొటో క్యాప్షన్, మమతా పాండే
    • రచయిత, సూరయ నైజీ
    • హోదా, బీబీసీ కోసం

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో నివసించే మమతా పాండే గత శనివారం జరిగిన ఘటనను మరచిపోలేకపోతున్నారు. పదే పదే అవే ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి.

ఓ భూ వివాదంలో నిందితులు ట్రక్కులో తెచ్చిన మట్టిని ఆమెపై పోశారు. అప్పుడు ఆమె తల మాత్రమే బయట ఉంది. మిగతా శరీరమంతా మట్టిలో కూరుకుపోయింది. ఆమె మరదలు ఆషా పాండేను మెడ వరకు పాతిపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం రేవాలోని సంజయ్ గాంధీ జిల్లా ఆసుప్రతిలో మమత చికిత్స పొందుతున్నారు.

‘‘ఇంట్లో ఎవరూ లేరు. ఆ సమయంలో వారు మా భూమిలోంచి రోడ్డు వేయడం మొదలుపెట్టారు. మొదటి నుంచి మా కుటుంబం ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. ఆ రోజు హఠాత్తుగా వారు మట్టి తీసుకొచ్చారు. దీంతో వారిని నిలువరించేందుకు మేం మట్టి తీసుకొచ్చిన డంపర్ ట్రక్కు వెనుక కూర్చున్నాం. అయినా డ్రైవర్ డంపర్ డోర్ తీసి మాపైన మట్టి పోసి మమ్మల్ని కిందకు అదిమాడు’’ అని మమత చెప్పారు.

ఈ ఘటనలో మమత స్పృహ తప్పి పడిపోయారు. దీనిపై గ్రామంలో అలజడి రేగి, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే పార తీసుకుని వారిపై పోసిన మట్టి తొలగించి ఆమెను బయటికి తీశారు.

వాట్సాప్ చానల్
ఆషా పాండే

ఫొటో సోర్స్, Getty Images

‘చనిపోయాననుకున్నా’

‘‘నేను చనిపోయాననిపించింది. నన్ను బయటికి తీయడం కొంచెం ఆలస్యమైనా నేను చనిపోయి ఉండేదానిని’’ అని మమత చెప్పారు.

తాము రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకించాం కాబట్టి మమ్మల్ని చంపే ప్రయత్నం మరోసారి జరుగుతుందేమోనని మమతా, ఆషా ఇంకా భయపడుతూనే ఉన్నారు.

‘‘మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టం అంటూ వారు మమ్మల్ని బెదిరించారు’’ అని మమత, ఆషా చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తమ ఇంట్లో ఇంకెవరూ లేరని తెలిపారు.

‘‘రోడ్డు నిర్మించడానికి వారు మట్టితో నిండిన డంపర్‌ను తీసుకువచ్చారు. ఇంట్లో మగవాళ్ళు వచ్చాక మేం ఈ విషయంపై మాట్లాడతామని వారికి చెప్పాం. కానీ వారికి వేరే ఆలోచన ఉంది. ఎలాగైనా సరే రోడ్డు నిర్మించేస్తామని, అవసరమైతే మా ప్రాణాలు తీసైనా రోడ్డు వేస్తామని అన్నారు’’ అని మమత వివరించారు.

ఒకవేళ ఘటనకు సంబంధించిన వీడియో బయటికి రాకపోయి ఉంటే తమను చంపేసి ఉండేవారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకుని ఉండేవారు కాదని ఆమె అన్నారు.

హనౌతా కొతార్ గ్రామం

వివాదం ఏంటి?

రేవా జిల్లాలోని హనౌతా కొతార్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇందులో బాధితులు, నిందితులు ఒకే కుటుంబానికి చెందినవారు.

వారి మధ్య ఓ రోడ్డు విషయమై వివాదం ఉంది. నిందితులు రోడ్డు నిర్మించాలనుకున్న భూమి తమదని, తాము అందుకు అంగీకరించమని బాధితులు చెబుతున్నారు.

ఈ కేసు న్యాయస్థానంలో కూడా నడుస్తోంది. కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తే, తదనుగుణంగా పనులు చేపట్టాలని బాధిత మహిళలు చెబుతున్నారు.

తమ మాట వినకుండా నిందితులు ఓ డంపర్ ట్రక్కు నిండా మట్టి తీసుకువచ్చారని బాధితులు చెప్పారు.

పోలీసు సూపరింటెండెంట్

ఫొటో సోర్స్, SURAIH NIAZI/BBC

ఫొటో క్యాప్షన్, నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు రేవా జిల్లా ఎస్పీ చెప్పారు.

నిందితుల వాదనేంటి?

ఈ కేసులో ఐదుగురు నిందితులలో నలుగురు అరెస్టయ్యారు. డంపర్ ట్రక్కు యజమాని రాజేష్ సింగ్, డ్రైవర్ ప్రమోద్ కోల్, మహిళ బంధవు విపిన్ అరెస్టయ్యారు.

మంగళవారం మరో నిందితుడు గోకర్ణ ప్రసాద్ పాండే కోర్టులో లొంగిపోయారు. మరో నిందితుడు మహేంద్ర ప్రసాద్ పాండే కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తనపై అసత్య అరోపణలు చేస్తున్నారని గోకర్ణ ప్రసాద్ చెబుతున్నారు.

‘‘మేం మా వ్యక్తిగత పనుల కోసం ఎర్రమట్టి తీసుకువెళుతున్నాం. ఆ ప్రదేశంలో కొంతమట్టి పోసి మేం ముందుకు వెళ్ళాల్సి ఉంది. కానీ హఠాత్తుగా ఆ మహిళలు డంపర్ వెనుక వచ్చి కూర్చున్నారు. ఆ విషయాన్ని డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ఘటన జరిగింది’’ అని చెప్పారు.

సంబంధిత భూమిలో తమకూ హక్కు ఉందని, కోర్టు ద్వారా తమకు ఆ విషయంలో న్యాయం దక్కుతుందని చెప్పారు.

‘‘ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకున్నాం. నిందితులను వదిలే ప్రసక్తే లేదు.మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తాం’’ అని రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ తెలిపారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్

ప్రతిపక్షాల విమర్శలు

ఈ సంఘటనపై ప్రతిపక్షాలు భగ్గమన్నాయి. ప్రభుత్వంపై మండిపడ్డాయి. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సిగ్గుతో తలదించుకోవాలని బెంగాల్‌లోని అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

‘‘ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మహిళలపై వేధింపులు మూడురెట్లు పెరిగాయి’’ అని టీఎంసీ ఎక్స్ వేదికగా విమర్శించింది.

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ కూడా ప్రభుత్వాన్ని ఈ విషయంలో విమర్శించారు.

‘‘ఈ ఘటన బీజేపీ పాలనలో మహిళల భద్రతా అంశాన్ని మరోసారి లేవనెత్తింది. మహిళలపై వేధింపుల విషయంలో మధ్యప్రదేశ్ తొలి ర్యాంక్‌లో ఉంది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, త్వరితగతిన విచారణ జరుగుతుందని బాధితులు ఆశించగలరా ముఖ్యమంత్రిగారు..మహిళపై జరిగే నేరాలను అరికట్టే విషయంలో మీ ప్రభుత్వం పదేపదే విఫలమవుతోంది’’ అని రాశారు.

ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాజధాని భోపాల్‌లోని అధికారవర్గం అప్రమత్తమైంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు.

మరోపక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ జరిగిన ఘటనపై పోలీసులకు ఓ లేఖ రాసింది. ఏం చర్యలు తీసుకున్నారో మూడురోజులలోపు నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపిని ఆదేశించింది.

మహిళలపై నేరాల విషయంలో మధ్యప్రదేశ్ దేశంలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది.

మహారాష్ట్రలో మహిళలపై 30,673 నేరాలు జరిగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)