చేయని నేరానికి 43 ఏళ్లు జైలులో గడపాల్సి వచ్చింది, బంగారు చెవి పోగులు ఆమెను ఎలా విడిపించాయంటే..

సాండ్రా హెమ్మె

ఫొటో సోర్స్, Innocence Project

ఫొటో క్యాప్షన్, 43 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన సాండ్రా హెమ్మె (ఎడమ)
    • రచయిత, టామ్ మెకార్థర్
    • హోదా, బీబీసీ న్యూస్

చేయని నేరానికి 43 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఒక మహిళ తాజాగా విడుదలయ్యారు. నిర్దోషి అని తేలడంతో ఆమెను విడుదల చేశారు.

అమెరికాకు చెందిన సాండ్రా హెమ్మె 20 ఏళ్ల వయసులో ఒక హత్య కేసులో దోషిగా తేలారు. 1980 నవంబర్‌లో మిస్సోరిలోని సెయింట్ జోసెఫ్‌కు చెందిన గ్రంథాలయ సిబ్బంది పాట్రీషియా జెస్చ్‌ను కత్తితో పొడిచి చంపారనే నేరం కింద సాండ్రాకు జీవిత ఖైదు విధించారు.

సాండ్రా ఒక మానసిక ఆసుపత్రిలో తీవ్రమైన మత్తులో ఉన్నప్పుడు నేరాన్ని ఒప్పుకుంటున్నట్లు ఇచ్చిన వాంగ్మూలం తప్పించి, ఈ నేరంతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆ కేసును పున:సమీక్షించగా ఆమె నిర్దోషి అని వెల్లడైంది.

ఇప్పుడు సాండ్రా వయసు 64 ఏళ్లు. అమెరికా చరిత్రలో తప్పుడు నేరారోపణకు సుదీర్ఘ కాలం శిక్ష అనుభవించిన మహిళ సాండ్రా అని ఆమె ప్రతినిధులు చెబుతున్నారు.

సాండ్రా ఎట్టకేలకు తన కుటుంబం దగ్గరికి వెళ్లడంతో తమకు సంతోషంగా ఉందని ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన ఆమె న్యాయ బృందం వ్యాఖ్యానించింది. ఆమె పేరు మీద నేరం తాలూకూ మచ్చను తొలిగించేందుకు కృషి చేస్తామని పేర్కొంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఫొటో సోర్స్, Getty Images

జూన్ 14న సాండ్రాపై నేరారోపణను తోసిపుచ్చుతూ సర్క్యూట్ కోర్ట్ జడ్జి ర్యాన్ హార్స్‌మన్ 118 పేజీల తీర్పును వెలువరించారు.

సాండ్రాపై నేరాన్ని నిర్ధారించిన సమయంలో డిఫెన్స్ బృందం ఇవ్వని సాక్ష్యాలతో సహా లాయర్ల వద్ద ఇప్పుడు సాండ్రా నిర్దోషిత్వానికి సంబంధించిన స్పష్టమైన అన్ని రుజువులు ఉన్నాయని జడ్జి వ్యాఖ్యానించారు.

‘‘ఆమెను నిర్దోషిగా పరిగణించేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్నాయి’’ అని జడ్జి హార్స్‌మన్ తీర్పును ముగించారు.

స్థానిక పోలీసులు తమ అధికారుల్లో ఒకరైన మైకేల్ హోల్మన్‌ను పట్టించే సాక్ష్యాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సాండ్రా కేసు పున: సమీక్షలో తేలింది. ఆ తర్వాత మరో కేసులో జైలుకు వెళ్లిన మైకేల్ హోల్మన్, 2015లో చనిపోయారు.

పాట్రీషియా హత్య జరిగిన రోజు అదే వీధిలో హోల్మన్ ట్రక్ కనిపించింది. కానీ, అప్పుడు ఆయన ఘటనా ప్రదేశంలోనే ఉన్నారనే అంశం నిర్ధారణ కాలేదు.

హోల్మన్ ఇంట్లో దొరికిన పాట్రీషియా బంగారు చెవి పోగుల్ని ఆమె తండ్రి గుర్తుపట్టారు.

సాండ్రాపై నేర నిర్ధరణ జరిగిన సమయంలో ఆమె డిఫెన్స్ బృందం ఈ ఆధారాలను పట్టుకోలేకపోయింది. తాజాగా కేసు సమీక్షలో ఇవన్నీ బయటపడ్డాయి.

సాండ్రా

ఫొటో సోర్స్, Getty Images

సాండ్రా 12 ఏళ్ల వయస్సు నుంచి అప్పుడప్పుడు/అవసరమైనప్పుడు మానసిక చికిత్స పొందుతున్నారు. ఇలాగే ఒకసారి మానసిక ఆసుపత్రికి ఆమెను తరలించిన తర్వాత, శక్తిమంతమైన మత్తుమందు, యాంటీసైకోటిక్ మెడికేషన్ ఇచ్చిన తర్వాత పలుమార్లు పోలీసులు ఆమెను విచారించారు.

ఆ సమయంలో ఆమె పూర్తి స్పృహలో లేకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా వాంగ్మూలం ఇచ్చినట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. శక్తిమంతమైన మందుల కారణంగా ఆమె తలను కూడా నిటారుగా ఉంచలేకపోయారని, కండరాల నొప్పులతో బాధపడ్డారని వాటిలో పేర్కొన్నారు.

హత్యతో సాండ్రాకు సంబంధం లేదని ఫోరెన్సిక్ సాక్ష్యాలు చూపించాయని జడ్జి హార్స్‌మన్ అన్నారు. ఆమెకు హత్య చేయాలనే ఉద్దేశం లేదు, నేరం చేసినట్లు సాక్ష్యాలు కూడా లేవని పేర్కొన్నారు.

సాండ్రా శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. సోదరి దగ్గర ఆమె జీవిస్తారని కన్సాస్ సిటీ స్టార్ వెబ్‌సైట్ పేర్కొంది.

జైలు నుంచి విడుదలైన తర్వాత సమీపంలోని ఒక పార్కులో సాండ్రా తన కుటుంబాన్ని కలుసుకున్నారు. తన సోదరిని, కుమార్తెను, మనవరాలిని గట్టిగా హత్తుకున్నారు.

పాట్రీషియా తండ్రి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లి తండ్రిని పాట్రీషియా కలుసుకుంటారని ఆమె న్యాయ బృందం చెప్పింది.

జీవితంలో ఎక్కువ భాగం జైలులోనే గడిపినందున, సామాజిక భద్రతకు అర్హురాలు కానందుకు ఆమెకు సహాయం ఇంకా అవసరమని డిఫెన్స్ లాయర్ సీన్ ఓబ్రియాన్ అన్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)