హోటల్ గది 502లో ఏం జరిగింది? టీ కప్పుల్లోకి సైనైడ్ ఎలా వచ్చింది? పాము రక్తంతో చేసిన ఔషధం కావాలని ఆమె ఎందుకు అడిగారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, జోయెల్ గుంటో
- హోదా, బీబీసీ వియత్నాం సర్వీస్, బీబీసీ న్యూస్
పోలీసు అధికారులు గది తలుపులు తెరిచేంతవరకు బ్యాంకాక్‌లోని గ్రాండ్ హయత్ హోటల్ అయిదో అంతస్తులో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
అక్కడ ఎవరికీ అరుపులు గానీ, రక్షించాలంటూ పిలుపులు గానీ వినపడలేదు. కనీసం ఎవరూ ఆ గది దగ్గరికి కూడా వెళ్లలేదు.
గదిలోపల కూడా పెనుగులాడినట్లు లేదా ఏదో జరిగినట్లు ఎలాంటి సంకేతాలు లేవు. అతిథుల కోసం టేబుల్ మీద ఉంచిన ఆహారపదార్థాలు చెల్లాచెదురుగా కాకుండా శుభ్రంగా అలాగే ఉన్నాయి.
అక్కడ అనుమానం కలిగించే ఏకైక విషయం, హోటల్‌లోని 502 గదిలో ఉన్న అతిథులు చెక్ అవుట్ కావాల్సి ఉన్నప్పటికీ వారు ఎంతకీ ఆ గది నుంచి బయటకు రాలేదు. లోపలి నుంచి గదికి తాళం వేసి ఉంది. ఈ ఒక్క అంశం తప్పా పోలీసులు గది తలుపులు తెరిచేంతవరకు అక్కడ ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు.
ఆ గది లోపల ఆరు మృతదేహాలతో పాటు సైనైడ్ పూసిన టీ కప్పులు ఉన్నాయి.
గదిలో ఉన్నవారంతా విషపూరితమైన టీ తాగినట్లు గుర్తించడానికి పోలీసులకు ఎక్కువ సమయం పట్టలేదు. బాధితులు ఎవరనేది కూడా పోలీసులు త్వరగానే గుర్తించారు.
అయితే ఈ మరణాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. అవేంటంటే, ఎవరు ఈ పని చేశారు? వారినే ఎందుకు ఎంచుకున్నారు?


ఫొటో సోర్స్, Facebook
చనిపోయిన ఆరుగురు ఎవరు?
బాధితుల్లో నలుగురురు థి గుయెన్ పువాంగ్ (46), ఆమె భర్త హాంగ్ ఫామ్ తాన్ (49), థి గుయెన్ పువాంగ్ లాన్ (47), దిన్ ట్రాన్ ఫు (37) వియత్నాం పౌరులు.
మిగతా ఇద్దరూ అమెరికా జాతీయులు. వారు షెరిన్ చాంగ్ (56), డాంగ్ హంగ్ వాన్ (55).
జపాన్‌లో ఒక ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టు కోసం భార్యభర్తలైన హాంగ్ ఫామ్ థాన్, థి గుయెన్ పువాంగ్ నుంచి చాంగ్ 2,80,000 డాలర్లు (రూ. 2.30 కోట్లు) అప్పు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.
హాంగ్-పువాంగ్ దంపతులు నిర్మాణ పనుల వ్యాపారంలో ఉన్నారు. చాంగ్ నుంచి డబ్బు తిరిగి రాబట్టడానికి ప్రయత్నించి వారు విఫలమయ్యారు.
నిజానికి, ఈ వ్యవహారంపై కొన్ని వారాల్లో వారు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కోర్టుకు వెళ్లేముందు ఈ వ్యవహారంపై చర్చించుకునేందుకే వారు హోటల్‌లో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.
ఈ పెట్టుబడికి సంబంధించిన చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించాలని చాంగ్ కోరడం వల్ల గుయెన్ పువాంగ్ లాన్ అక్కడికి వచ్చారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో లాన్ ఉంటారని అమెరికా మీడియా పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
మిగతా ఇద్దరికి ఈ కేసుతో సంబంధం ఏంటి?
ఈ సమావేశంలో ఉన్న మరో వ్యక్తి దిన్ ట్రాన్ పు. ఆయన ఒక విజయవంతమైన మేకప్ ఆర్టిస్ట్. వియత్నాంలోని సినీ స్టార్లకు, గాయకులకు, అందాల పోటీల్లో పాల్గొనేవారికి ఆయన మేకప్ చేస్తుంటారు. చాంగ్ తరఫున ఆయన ఈ సమావేశానికి హాజరయ్యారు.
దిన్ తండ్రి బీబీసీతో మాట్లాడారు. దిన్ అపరిచితులతో వెళ్లలేదని, అతని రెగ్యులర్ క్లయింట్లతో కలిసి థాయ్‌లాండ్‌కు వెళ్లారని చెప్పారు.
హోటల్ మీటింగ్‌లో డాంగ్ హాంగ్ వాన్ ఎందుకు పాల్గొన్నారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.
హోటల్ రిజర్వేషన్‌లో ఏడో వ్యక్తి పేరు కూడా ఉందని పోలీసులు చెప్పారు. ఆ వ్యక్తి ఈ ఆరుగురిలో ఒకరికి సోదరి అని తెలిపారు. ఆమె గత వారమే థాయ్‌లాండ్ నుంచి వియత్నాం చేరుకున్నారని, ఈ ఘటనలో ఆమె ప్రమేయం లేదని వారు వెల్లడించారు.

ఫొటో సోర్స్, ROYAL THAI POLICE
హోటల్ గదిలో ఏం జరిగింది?
వారాంతంలో ఈ వ్యక్తులందరూ వేర్వేరుగా హోటల్‌కు వచ్చారు. వారికి అయిదు గదులను కేటాయించారు. ఏడో అంతస్తులో నాలుగు గదులు, అయిదో అంతస్తులో ఒక గదిని వారికి ఇచ్చారు.
చాంగ్ ఆదివారం రోజున 502 గదిలో చెకిన్ అయ్యారు. మిగతా అయిదుగురు అదే రోజున ఆమె గదికి వచ్చారు. రాత్రి మళ్లీ తమ గదులకు వెళ్లిపోయారు.
సోమవారం మధ్యాహ్నం తన గది నుంచి డాంగ్ హాంగ్ వాన్ ఆరు కప్పుల టీ ఆర్డర్ చేశారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన దిన్ ట్రాన్ ఫు కూడా తన గది నుంచే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు.
ఈ ఆర్డర్లను మధ్యాహ్నం 2 గంటలకు 502 గదిలో ఇవ్వాలని వారు వెయిటర్లను కోరారు.
2:00 అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు చాంగ్ ఉన్న 502 గదికి వెయిటర్లు ఆర్డర్లు తీసుకురావడం మొదలైంది. ఆ సమయంలో గదిలో ఆమె ఒంటరిగా ఉన్నారు.
వెయిటర్లు టీ తయారు చేస్తానంటే చాంగ్ వద్దన్నారని, ఆమె అప్పుడు కాస్త ఒత్తిడిలో ఉన్నట్లుగా వెయిటర్లు గుర్తించారని పోలీసులు చెప్పారు.
కాసేపటి తర్వాత మిగతా సభ్యులంతా ఆ గదికి చేరుకున్నారు. భార్యభర్తలిద్దరూ సూట్‌కేస్‌తో అక్కడికి వెళ్లారు.
2:17 గంటల సమయంలో ఆ ఆరుగురు గది తలుపు వద్ద కనిపించారు. ఆ తర్వాత తలుపులు మూశారు. అప్పటి నుంచి లోపల ఎలాంటి కదలిక కనిపించలేదు.
సోమవారం వారు హోటల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోవాలి. కానీ, అలా జరగలేదు.
మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు పోలీసులు ఆ గదిలోకి వెళ్లేసరికే నేలపై ఆరుగురు చనిపోయి కనిపించారు.
అందులో ఇద్దరు గది తలుపు దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మృతదేహాలన్నింటిపై సైనైడ్ విషప్రయోగానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. వాళ్ల పెదవులు, గోళ్లు ముదురు ఊదారంగులోకి మారాయి. శరీరంలో ఆక్సీజన్ కొరత ఏర్పడినప్పుడు ఇలా అవుతుంది. పైగా అందరి అంతర్గత అవయవాలు రక్తం లాంటి ఎరుపు రంగులోకి మారాయి. సైనైడ్ విష ప్రయోగం జరిగిందని చెప్పడానికి ఇది మరో సంకేతం.
వారి మరణాలకు సైనైడ్ తప్ప ఇంకో కారణమేదీ కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.
సైనైడ్ తీవ్రతను నిర్ధరించడానికి ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు.
సైనైడ్ శరీరంలోని కణాల్లో ఆక్సీజన్‌ను హరించివేస్తుంది. ఇది గుండెపోటును ప్రేరేపిస్తుంది. మైకం కమ్మడం, శ్వాస ఆడకపోవడం, వాంతులు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
థాయ్‌లాండ్‌లో సైనైడ్ వాడకంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అనధికారికంగా ఎవరైనా సైనైడ్‌ను కలిగి ఉంటే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తారు.

వారికి ఎవరు విషం పెట్టారు?
చనిపోయిన వారిలో ఒకరు, ఈ విషప్రయోగం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అది ఎవరనేది స్పష్టంగా చెప్పలేదు.
పెట్టుబడులకు సంబంధించి చాంగ్ మీద మిగతా అయిదుగురు దావాలు వేశారని వియత్నాం వార్తా సంస్థ వీఎన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ఈ సమస్యకు పరిష్కారం కోసం బ్యాంకాక్‌లో వారంతా సమావేశమయ్యారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది.
ఈ బృందానికి టూర్ గైడ్‌గా వ్యవహరించిన 35 ఏళ్ల పాన్ గోక్ వు వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు.
మధ్యవర్తి అయిన గుయెన్ పువాంగ్ లాన్ చనిపోయేముందు, తన కీళ్ల నొప్పుల కోసం పాము రక్తంతో తయారయ్యే సంప్రదాయ ఔషధాన్ని కొనాలని ఎవరినో అడిగారని పాన్ వాంగ్మూలంలో పేర్కొన్నారు.
మరణాలు జరిగిన 502 గదిలో రెండు పానీయాల డబ్బాలు కనిపించాయి. అవి హోటల్‌కు చెందినవి కావు.
డైనింగ్ టేబుల్‌కు దగ్గరగా సైనైడ్ పూసిన టీ కప్పుల పక్కన ఈ కంటైనర్లు ఉన్నాయి.
వీలైనంత త్వరగా ఈ మిస్టరీ మరణాలను ఛేదించాలని పోలీసులను అధికారులు కోరుతున్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














