‘సీరియల్ కిల్లింగ్స్’: ఆ 42 మంది మహిళలను చంపింది ఒకరేనా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఇవాన్ వఫులా
- హోదా, బీబీసీ ఆఫ్రికా సెక్యూరిటీ కరెస్పాండెంట్, నైరోబీ
కెన్యాలో సీరియల్ కిల్లర్ అనే ఆరోపణలున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ దేశంలో ప్రకంపనలు సృష్టించింది.
ఆయనను అరెస్టు చేసిన పరిస్థితులపై చాలామంది ప్రశ్నలు సంధిస్తున్నారు.
కాలిన్స్ జుమైసీ ఖాలుషా అనే వ్యక్తి 42 మంది మహిళలను చంపినట్లు అంగీకరించారని పోలీసులు చెబుతున్నారు.
అయితే, 33 ఏళ్ల కాలిన్స్‌ను నేరం అంగీకరించేలా హింసించారని మంగళవారం కోర్టులో ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
కాలిన్స్ కేసులో ఇది తాజా ట్విస్ట్. రాజధాని నైరోబీలోని ఒక పోలీస్ పోస్ట్‌కు సమీపంలో ఉన్న వాడుకలో లేని ఒక క్వారీలో ప్లాస్టిక్ కవర్లలో చుట్టిన తొమ్మిది మృతదేహాల అవశేషాలను ఇటీవల గుర్తించారు.
ఈ మృతదేహాలన్నీ ఛిద్రమైన స్థితిలో దొరికాయి.

1) పోలీస్ పోస్ట్‌కు కొన్ని మీటర్ల దూరంలోకి ఈ మృతదేహాలు ఎలా వచ్చాయి?
ముకురు క్వా న్జెంగా ఏరియాలోని ఒక పోలీస్ పోస్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఈ మృతదేహాలు దొరికాయి.
పోలీస్ పోస్ట్‌కు చాలా సమీపంలో మృతదేహాలను పడేస్తుంటే పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారని చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో అధికారుల అలసత్వాన్ని స్థానికులు విమర్శించారు.
ఘటనా స్థలానికి సమీపంలోని పోలీస్ పోస్ట్‌కు చెందిన అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తాత్కాలిక పోలీస్ చీఫ్ డగ్లస్ కాంజా ప్రకటించారు.
ఈ మృతదేహాలను పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారనే అంశాన్ని విచారించారో లేదో తెలియలేదు.
అయితే, ఈ అంశంలో పోలీసుల పాత్రపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.
ఈ మృతదేహాలను సాధారణ వ్యక్తి ఒకరు గుర్తించడం స్థానికులను ఆశ్చర్యపరుస్తోంది.
కనిపించకుండా పోయిన వారిలో జోసెఫినో ఓవినో కూడా ఒకరు. జోసెఫినో తమ కుటుంబంలో ఒకరికి కలలోకి వచ్చి మృతదేహాలున్న ఈ ప్రదేశాన్ని గుర్తించడంలో సాయపడిందని ఆ కుటుంబీకులు చెప్తున్నారు.
దీనిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ తర్వాత కొంతమంది యువకులకు డబ్బులిచ్చి క్వారీలోని చెత్త కుప్పలోని శిథిలాల్లో వెతికించామని జోసెఫినో కజిన్ డయానా కెయా సిటిజన్ టీవీతో చెప్పారు.
బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తొమ్మిది మృతదేహాలను శుక్రవారం ఆ క్వారీలో గుర్తించారు. నైలాన్ సంచిలో మృతదేహాలను ఉంచి, తాడుతో కట్టేశారు.
ఈ విషయం ప్రజల నుంచి తెలిసిందని తొలుత పోలీసులు చెప్పారు.
ఆ తర్వాత ఈ కేసు గురించి ప్రశ్నించినప్పుడు డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ మొహమ్మద్ అమిన్ మాట్లాడుతూ, ‘‘మేం కలలు కనే వాళ్లం కాదు, కలల్ని నమ్మం’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, EPA
2. మృతదేహాలను ఎప్పుడు పడేశారు
మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిని చూస్తే, వారిని వేర్వేరు సమయాల్లో చంపి ఉంటారని అర్థమవుతుందని పోలీసులు అన్నారు.
కాలిన్స్ రెండేళ్లుగా మహిళలను హత్య చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.
అయితే, ఈ మృతదేహాల అవశేషాలను వారిని చంపేసినప్పుడే పారేశారా? లేదా ఇటీవలే ఇక్కడ వదిలేశారా అనే అంశంలో స్పష్టత లేదు.
పోలీసులు చెబుతున్నదానిలో చాలా లొసుగులు ఉన్నాయని హకీ ఆఫ్రికా రైట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హుస్సేన్ ఖలీద్ అన్నారు.

ఫొటో సోర్స్, AFP
3. పోలీసులు అంత త్వరగా నిందితుడిని ఎలా అరెస్ట్ చేశారు?
రెండేళ్లుగా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయని పోలీసులు, మృతదేహాలు లభ్యమైన మూడు రోజుల్లోపే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.
కాలిన్స్‌ను ఒక బార్‌లో పట్టుకున్నామని సోమవారం పోలీసులు చెప్పారు.
అనుమానితుడి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నామంటూ పోలీసులు 10 ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, గుర్తింపు కార్డులు, మహిళల దుస్తులను మీడియాకు చూపించారు. అనుమానితుడి ఇల్లు కూడా మృతదేహాలు లభ్యమైన ప్రదేశానికి సమీపంలోనే ఉంది.
బాధితుల్లో ఒకరి మొబైల్ ఫోన్‌ను జియో లొకేటింగ్ చేయడం ద్వారా కాలిన్స్ ఆచూకీని గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
అయితే, ఈ సాక్ష్యాల చెల్లుబాటుపై కాలిన్స్ తరఫు న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Ongogo family
4. బాధితులు ఎవరు?
ఇప్పటివరకు ఒకే మృతదేహాన్ని గుర్తుపట్టారు. అది 24 ఏళ్ల రోసెలిన్ ఒంగోగో మృతదేహం.
జూన్ 28న పని మీద ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె అప్పటినుంచి కనిపించకుండా పోయారని బీబీసీతో రోసెలిన్ సోదరుడు ఎమ్మాన్యుయేల్ ఒంగోగో చెప్పారు.
ముకురులో కొందరి మృతదేహాలు లభ్యమయ్యాయని తెలిసి అక్కడికి వెళ్లినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
దుస్తులు, హెయిర్ స్టయిల్‌ను బట్టి రోసెలిన్ మృతదేహాన్ని ఆమె కుటుంబీకులు గుర్తించారు.
కాలిన్స్ భార్యే అతని మొదటి బాధితురాలని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇతర బాధితులకు చెందిన వస్తువుల్లో ఆయన భార్య గుర్తింపుకార్డు కూడా లభ్యమైందని వెల్లడించారు.
జోసెఫినో మృతదేహం గుర్తింపు కోసం ఇంకా ఎదురుచూస్తున్నామని బీబీసీతో ఆమె కుటుంబం తెలిపింది.

ఫొటో సోర్స్, AFP
5. కెన్యాలో మహిళల భద్రత గురించి పోలీసులు ఏం చెబుతున్నారు?
తాజాగా తొమ్మిది మృతదేహాలు లభ్యం కావడంతో జనవరిలో 20 ఏళ్ల రీటా వేనీ దారుణ హత్య ఉదంతం మళ్లీ బయటకు వచ్చింది.
నైరోబీలోని ఒక అద్దె ఇంట్లో రీటా మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసు ఇంకా పరిష్కారం కాలేదు.
ఈ కేసు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మహిళల హత్యలు, ఇతర హింసలపై నిరసన ప్రదర్శనలకు దారితీసింది.
కెన్యాలో 2016-2023 మధ్య 500 మందికి పైగా మహిళల హత్య కేసులు నమోదయ్యాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వెల్లడించింది.
తాజాగా క్వారీలోని చెత్తకుప్పలో లభ్యమైన మృతదేహాలన్నీ మహిళలవే.
స్త్రీ హత్యలు, మహిళలపై హింసకు సంబంధించిన కేసులను పరిష్కరించడానికి పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు, ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించలేమని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రెసిలా ఒన్యాంగో అన్నారు. అందరి ప్రాణాలను, ఆస్తులను రక్షించడమే పోలీసుల పని అని బీబీసీకి ఆమె చెప్పారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














