సైనైడ్ కలిసిన టీ తాగడం వల్లే ఆ ఆరుగురు చనిపోయారా?

టీ కప్పులు

ఫొటో సోర్స్, Royal Thai Police

ఫొటో క్యాప్షన్, ఆరు టీ కప్‌లలో సైనైడ్ కలిసినట్లు పోలీసులు గుర్తించారు.
    • రచయిత, తాన్యరత్ డాక్సోన్, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ న్యూస్, బ్యాంకాక్, సింగపూర్

థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఒక లగ్జరీ హోటల్‌లో ఆరు శవాలు కనిపించాయి.

సైనైడ్ కలిసి టీని తాగడం వల్లే వీరు మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విష ప్రయోగం వెనుక చనిపోయిన ఆ ఆరుగురిలోనే ఒకరు కారణమని.. అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో ఈ పని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

బ్యాంకాక్‌లోని 5 స్టార్ గ్రాండ్ హయత్ ఎరావాన్‌ హోటల్‌లో గదులను శుభ్రం చేసే వారు ఈ ఆరుగురు మృతదేహాలను గుర్తించారు.

మృతదేహాలను గుర్తించిన సమయానికే వారు చనిపోయి 24 గంటలు అయి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని శ్రెథా థావిసిన్ చెప్పారు. ఆ తర్వాత మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫుడ్

ఫొటో సోర్స్, Royal Thai Police

మరణించిన ఆరుగురిలో ఇద్దరు.. వారిలో మరో వ్యక్తికి పెట్టుబడుల కోసం కోటి థాయ్ బాత్‌లను అప్పుగా ఇచ్చినట్లు అధికారులు చెప్పారు. భారతీయ కరెన్సీలో దాని విలువ సుమారు రూ.2 కోట్లకు పైనే.

తొలుత 5 స్టార్ గ్రాండ్ హయత్ ఎరావాన్‌లో కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

కానీ, ఆ తర్వాత ఈ మీడియా కథనాలను పోలీసులు కొట్టివేశారు. కాల్పులు జరిగిన ఆధారాలు లేవన్నారు.

ఆరుగురి మరణానికి విషం కారణమా అనే కోణంలో దర్యాప్తు చేశారు.

చనిపోయిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

వారంతా వియత్నాం పౌరులు. వారిలో కొందరికి అమెరికా పౌరసత్వం కూడా ఉన్నట్లు థాయిలాండ్ ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.

‘‘వీరందరూ హోటల్‌కు వేరువేరుగా వచ్చి చెకిన్ అయ్యారు. ఐదు గదులను వారికి కేటాయించారు. ఏడో అంతస్తులో నాలుగు గదులు, ఐదవ అంతస్తులో ఒకటి వారికి ఇచ్చారు’’ అని ఈ మరణాలపై బ్యాంకాక్ డిప్యూటీ పోలీసు చీఫ్ జనరల్ నోప్పాస్సిన్ పూన్సావత్ చెప్పారు.

చనిపోయిన వారిలో షెరిన్ చాంగ్(56), డాంగ్ హంగ్ వాన్(55)లు అమెరికా పౌరులు.

మిగిలిన నలుగురు థి గుయెన్ ఫువాంగ్(46), ఆమె భర్త హాంగ్ ఫామ్ తాన్హ్(49), థి గుయెన్ ఫువాంగ్ లాన్(47), దిన్హ్ ట్రాన్ ఫు(37)లు వియత్నాం పౌరులు.

ఈ ఆరుగురు ఫుడ్, టీ ఆర్డర్ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఇవి వారి గదికి డెలివరీ చేశారు. చాంగ్ ఈ ఆహారాన్ని, టీని తీసుకున్నారు.

అతిథులకు వెయిటర్ టీ ఆఫర్ చేయగా, చాంగ్ వద్దన్నట్లు డిప్యూటీ పోలీసు చీఫ్ తెలిపారు.

ఆమె చాలా తక్కువగా మాట్లాడారని, ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమైందని వెయిటర్ గుర్తుకు చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. వెయిటర్ వెళ్లిపోయిన తర్వాత, ఆ ఆరుగురు తప్ప మరెవరూ ఆ గదిలోకి వెళ్లలేదు.

సోమవారం వీరు చెక్ అవుట్ కావాల్సి ఉంది. కానీ, సూట్‌లోని లివింగ్ రూమ్, బెడ్ రూమ్‌లో వీరి మృతదేహాలను గదులు శుభ్రం చేసే వారు గుర్తించారని అధికారులు తెలిపారు.

వీరి మధ్య కొట్లాట జరిగినట్లు కానీ, అక్కడ దొంగతనం జరిగినట్లు కానీ ఆధారాలు లేవన్నారు.

బాధితుల్లో ఒకరి శరీరంపై ఒక గాయం ఉందని, అది కూడా కింద పడడం వల్ల తగిలిన గాయం కావచ్చని అధికారులు చెప్పారు.

బాత్‌రూమ్‌లో టీ, ఎనర్జీ డ్రింక్స్, తేనెను దర్యాప్తు అధికారులు గుర్తించారు. అవన్నీ తెరిచి ఉన్న కంటైనర్లలో ఉన్నట్లు పోలీసు అధికారి తెలిపారు.

అక్కడున్న ఆరు టీ కప్‌లలో సైనైడ్ కలిసి ఉన్నట్లు ఆ తర్వాత పోలీసులు గుర్తించారు.

చనిపోయిన దంపతులు థి గుయెన్ ఫువాంగ్, ఆమె భర్త హాంగ్ ఫామ్ తాన్హ్‌ల బంధువులను పోలీసులు విచారించారు. వీరికి రోడ్డు నిర్మాణ వ్యాపారలున్నాయని తెలిసింది. జపాన్‌లో ఆస్పత్రి భవంతి ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టేందుకు చాంగ్‌కు వారు డబ్బులు ఇచ్చారు.

దిన్హ్‌ను మేకప్ ఆర్టిస్ట్‌గా పోలీసులు భావిస్తున్నారు. ఇతను కూడా మోసపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం దిన్హ్ థాయిలాండ్‌కు వెళ్లినట్లు ఆయన తల్లి చెప్పారు. ఆదివారం కూడా ఫోన్ చేశాడని, తన స్టేను మరి కొన్ని రోజులు పొడిగించుకున్నట్లు తెలిపారు. అదే చివరి ఫోన్ కాల్ అని తల్లి చెప్పారు.

థాయ్ పోలీసులు
ఫొటో క్యాప్షన్, కొట్లాట, దొంగతనం జరిగిన ఆనవాళ్లు లేవని థాయ్ పోలీసులు స్పష్టం చేశారు.

హోటల్ సూట్ రూమ్‌ నుంచి బయటికి వచ్చేందుకు ఇద్దరు బాధితులు ప్రయత్నించారని, అయితే లోపల నుంచి లాక్ అయి ఉండటంతో వారు బయటకి రాలేకపోయారని చెప్పారు. విచారణలో భాగంగా బాధితుల సామగ్రిని పరిశీలించనున్నారు.

ఈ ఘటన జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చెప్పారు. బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వారికి కావాల్సిన సాయం అందించేందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉందని మథ్యూ మిల్లర్ చెప్పారు.

గ్రాండ్ హయత్ ఎరావాన్ బ్యాంకాక్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం. బాధితుల్లో కొందరు తొలిసారి థాయ్‌లాండ్‌కు వచ్చారు. మిగిలిన వారు అంతకుముందే ఇక్కడకు వచ్చారని పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటన ప్రభావం థాయిలాండ్ టూరిజంపై ప్రభావం చూపకూడదని అనుకుంటున్నామని ప్రధానమంత్రి చెప్పారు.

థాయ్ ఆర్థిక వ్యవస్థకు పర్యటకమే కీలకం. కరోనా వైరస్ మహమ్మారి తరువాత ఈ రంగం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలోనే థాయ్ దేశం 93 దేశాలకు, ప్రాంతాలకు వీసా రహిత ప్రవేశ పథకాన్ని ప్రవేశపెట్టింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)