కృత్రిమ మాయ, గర్భం: నెలలు నిండని శిశువుల తల్లిదండ్రులలో కొత్త ఆశలు

కృత్రిమ గర్భం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాకు ఉండాల్సిన కథాంశాలన్నీ ఉన్నాయి. శిశువులను తల్లి గర్భాశయం నుంచి తీసి, ఒక ద్రవంతో నిండిన గాజు పాత్రలలో పెంచవచ్చా?

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఉన్న చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆఫ్ ఫిలడెల్ఫియా (సీహెచ్ఓపీ) శాస్త్రవేత్తలు నెలలు నిండక ముందే పుట్టే శిశువుల విషయంలో ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నారు.

వాళ్లు "కృత్రిమ గర్భం"ను అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఇందులో గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు పిండం కృత్రిమ గర్భంలో పెరగదు. కేవలం నెలలు నిండక ముందే పుట్టే శిశువుల మనుగడ రేటును పెంచడంలో సహాయపడటానికి మాత్రమే ఇది ఉపయోగపడొచ్చని వారు చెబుతున్నారు.

సాధారణంగా నెలలు నిండక ముందే పుట్టే పిల్లలు జీవితమంతా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

ఒక సాధారణ ఆరోగ్యకరమైన గర్భం సుమారు 40 వారాలు ఉంటుంది. 37 వారాల సమయాన్ని పూర్తి కాలంగా పరిగణిస్తారు. అయితే కొన్నిసార్లు గర్భధారణ సమయంలో సమస్యల కారణంగా కొందరికి ముందుగానే (నెలలు నిండకముందే) కాన్పు అవుతుంది.

అదృష్టవశాత్తూ గత కొన్ని దశాబ్దాలుగా వైద్య పురోగతి కారణంగా ఇలా ముందు పుట్టిన పిల్లలు బతుకుతున్నా, కొన్ని సమస్యలతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. ఇంటెన్సివ్ కేర్‌లో పెడితే 22 వారాల తర్వాత జన్మించిన పిల్లలలో 30 శాతం మంది బతుకుతున్నారని తాజా డేటా వెల్లడిస్తోంది.

అయితే ఇలా జన్మించిన పిల్లలు తరచుగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటారు.

ఈ శిశువులు పుట్టినప్పుడు 900 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటారు. వీళ్ల గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ అవయవాలు, మెదడులాంటి క్లిష్టమైన అవయవాలు వైద్య సంరక్షణ లేకుండా శిశువును సజీవంగా ఉంచడానికి తగినంత అభివృద్ధి చెంది ఉండవు.

ఇలా నెలలు నిండని శిశువులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక సమస్యలలో సెరిబ్రల్ పాల్సీ, అభ్యాసంలో ఇబ్బందులు, దృష్టి, వినికిడి సమస్యలు, ఉబ్బసం ఉన్నాయి.

వాళ్ల ప్రాణాలను కాపాడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేషన్ లాంటివి సైతం శిశువుల ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి.

"ఊపిరితిత్తులు ఇంకా అభివృద్ధి చెందుతున్న సమయంలో అవి ద్రవంతో మునిగి ఉండాలి" అని మిచిగాన్ విశ్వవిద్యాలయంలోని మోట్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ప్రసూతి, గైనకాలజీ ప్రొఫెసర్ జార్జ్ మిచలిస్కా అన్నారు.

"కానీ వాళ్లు ముందే పుట్టినప్పుడు, వాళ్ల శ్వాసనాళంలో ఎండోట్రెకియల్ ట్యూబ్‌ను ఉంచి, ఊపిరితిత్తులలోకి అధిక పీడనంతో గాలి, ఆక్సిజన్‌ను పంపుతాము. దీని వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది."

వాట్సాప్
శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

నెలలు నిండని పిల్లలలకూ ఉపయోగపడేలా..

కాలక్రమేణా దీని కారణంగా బ్రాంకోపల్మనరీ డిస్‌ప్లేసియా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి తలెత్తవచ్చు. పిల్లలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక సైతం వాళ్లకు ఆక్సిజన్ సహాయం అవసరం కావచ్చు. లేదా జీవితాంతం మెకానికల్ వెంటిలేషన్ అవసరం పడవచ్చు. ఇలాంటి వెంటిలేషన్ వల్ల అంధత్వం వచ్చే ప్రమాదముంది.

కంట్లోని రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు పుట్టడానికి ముందు వరకు పూర్తిగా ఏర్పడవు. ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అసాధారణ రక్త నాళాల పెరుగుదలను ప్రేరేపించి, చివరికి ఈ రకమైన అంధత్వానికి దారి తీస్తుంది.

కృత్రిమ గర్భాలు, కృత్రిమ మాయ వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ మొత్తం చికిత్స నుంచి ఊపిరితిత్తులను తొలగించడం. దీని వల్ల శిశువులు తమ మొదటి శ్వాస తీసుకోవడానికి సిద్ధం అయ్యేంత వరకు సురక్షితమైన వాతావరణంలో పెరుగుతారు.

ప్రస్తుతం ఈ సాంకేతికత మూడు రకాలుగా ఉంది. ఈ మూడూ ఊపిరితిత్తులు, గుండె సరిగ్గా పని చేయని వ్యక్తికి సహాయపడే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) అని పిలిచే కృత్రిమ లైఫ్ సపోర్ట్ చికిత్స నుంచి స్ఫూర్తి పొందాయి. ఎక్మోలో, రోగి శరీరం వెలుపల కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌ను జోడించే యంత్రానికి రక్తాన్ని పంప్ చేస్తారు. తిరిగి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని కణజాలాలకు పంపుతారు.

ఈ విధానంలో రక్తం గుండె, ఊపిరితిత్తులను "బైపాస్" చేయడంతో ఆ అవయవాలకు విశ్రాంతి లభించి, అవి కోలుకోవడానికి సమయం దొరుకుతుంది. ఎక్మోను కొంచెం పెద్ద పిల్లలలో ఉపయోగించగలిగినా, అది నెలలు నిండని శిశువులకు తగినది కాదు. ఇప్పుడు ఈ మూడు బృందాలు ఎక్మో సాంకేతికతను నెలలు నిండని పిల్లలలకూ ఉపయోగపడే విధంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.

కృత్రిమ గర్భం

ఫొటో సోర్స్, Getty Images

మొదటి విధానంలో సర్జన్ అలాన్ ఫ్లేక్ నేతృత్వంలోని సీహెచ్ఓపీ శాస్త్రవేత్తలు, గర్భంలోని ఉమ్ము నీరులాంటి ద్రవంతో నిండిన సంచులలో నెలలు నిండక ముందే పుట్టిన శిశువులను ఉంచే ప్రయోగాలు చేస్తున్నారు.

సర్జన్లు శిశువు బొడ్డు తాడులోని చిన్న రక్తనాళాలను ఎక్మో లాంటి పరికరానికి అనుసంధానిస్తారు. దీంతో పిండం మామూలుగానే గుండె ద్వారా రక్తాన్ని శరీరం అంతటికీ సరఫరా చేస్తుంది.

ఫ్లేక్ 23-24 వారాల వయస్సు గల మానవ పిండాలకు సమానమైన నెలలు నిండక ముందే జన్మించిన ఎనిమిది గొర్రె పిల్లలను తీసుకుని, ఇలాంటి కృత్రిమ గర్భాన్ని ఉపయోగించి నాలుగువారాలు వాటిని సజీవంగా ఉంచారు. ఈ సమయంలో గొర్రెపిల్లలు సాధారణంగా అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించాయి.

వైద్య పరిశోధన

ఫొటో సోర్స్, Getty Images

రెండో విధానంలో మిచిగాన్ విశ్వవిద్యాలయంలో జార్జ్ మిచలిస్కా బృందం కృత్రిమ మాయను అభివృద్ధి చేశారు. మొత్తం గర్భస్థ పిండాన్ని ద్రవంలో ముంచడం కంటే, ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ద్రవం సహాయంతో శిశువు శ్వాసనాళాలను ఉపయోగించి ఊపిరితిత్తులను నింపాలనేది వాళ్ల ఆలోచన. దీనిలోని సాంకేతికత, ఎక్మో యంత్రాల మాదిరిగానే కంఠసిర ద్వారా గుండె నుంచి రక్తం ప్రవహించేలా చేస్తుంది, అయితే ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని బొడ్డు సిర ద్వారా తిరిగి పంపుతుంది.

ఇటీవల నిర్వహించిన కృత్రిమ మాయ పరీక్షలలో, నెలల నిండక ముందే జన్మించిన గొర్రెపిల్లలు మెకానికల్ వెంటిలేషన్‌కు బదిలీ చేయడానికి ముందు ఇలాగే 16 రోజులు జీవించాయి. ఆ సమయంలో వాటి ఊపిరితిత్తులు, మెదడు, ఇతర అవయవాలూ బాగా అభివృద్ధి చెందాయి.

మూడవ విధానంలో ఆస్ట్రేలియా-జపాన్ బృందం, ఎక్స్ వివో యుటెరిన్ ఎన్విరాన్మెంట్ (ఈవ్) థెరపీ అనే కృత్రిమ గర్భాన్ని అభివృద్ధి చేస్తోంది. దీనిలో మిగతా రెండు విధానాల్లా కాకుండా, నెలల నిండక ముందే జన్మించిన, అనారోగ్యంగా ఉన్న పిండాలకు చికిత్స చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మ్యాట్ కెంప్ నేతృత్వం వహిస్తున్నారు.

శిశువులు

ఫొటో సోర్స్, Getty Images

కృత్రిమ మాయ, కృత్రిమ గర్భాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?

ఈ రేసులో సీహెచ్ఓపీ చాలా వెనుకబడి ఉంది. ఈ బృందం ఇటీవలే ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ)కు మానవులపై ఈ పరీక్షలు చేయడం కోసం దరఖాస్తు చేసింది. మరోవైపు, మిచలిస్కా బృందం మూడు నాలుగేళ్లలో మానవ క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లాలని భావిస్తోంది.

అయితే, క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లే ముందు కృత్రిమ గర్భాలలో పిండాలు ఎలా పెరుగుతాయనే దాని గురించి మన జ్ఞానం ఇంకా పరిపూర్ణం కాదని కెంప్ భావిస్తున్నారు.

దానితో పాటు నైతిక సమస్యలూ ఉన్నాయి. ఉదాహరణకు ఈవ్ , సీహెచ్ఓపీ టీమ్‌ల కృత్రిమ గర్భాలకు బొడ్డు తాడుకు కాన్యులాను అమర్చడం అవసరం, పుట్టిన తర్వాత బొడ్డు ధమని త్వరగా మూసుకుపోతుంది కాబట్టి శిశువులను తక్షణమే తల్లి నుంచి పరికరానికి బదిలీ చేయాలి. అందువల్ల సాధారణ ప్రసవం జరిగే తల్లులకూ ఇక్కడ ముందుగానే సిజేరియన్ చేయవలసి ఉంటుంది.

మరొక సమస్య, శిశువును వెంటనే ఎక్స్‌టెండ్ సిస్టమ్‌లోకి బదిలీ చేయడం వల్ల ఆ శిశువు సాంప్రదాయిక చికిత్సా విధానంలో ఎలా ఉంటుందో అంచనా వేయడానికి అవకాశం లేదు.

దీని అర్థం, సాంప్రదాయ చికిత్సలలో బాగా ఉండే శిశువులకు, ఇంకా పరీక్షించని నూతన సాంకేతికతను ఉపయోగించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే అనారోగ్యంతో బాధ పడుతున్న 22-23 వారాల వయస్సులో ఉన్న శిశువులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని మిచలిస్కా అభిప్రాయపడ్డారు.

"సాంకేతికత నెలలు నిండక ముందే జన్మించే పిల్లల విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని భావిస్తున్నాను. కృత్రిమ మాయ, దానితో సంబంధం కలిగిన ఇతర విధానాలు దీనిలో కీలకపాత్ర పోషిస్తాయి," అని మిచలిస్కా అన్నారు.

ఈ మూడు సాంకేతిక విధానాలు విజయవంతమైతే, నెలలు నిండక ముందే ప్రసవం అయ్యే జంటలకు అది ఒక శుభవార్తే అవుతుంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)