ఒలింపిక్స్‌లో 8 మంది తెలుగువాళ్లు.. పారిస్‌లో పతకాల వేట

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగు క్రీడాకారులు జ్యోతి యర్రాజీ, నిఖత్ జరీన్, సాత్విక్, పీవీ సింధు, ఇషా సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగు క్రీడాకారులు జ్యోతి యర్రాజీ, నిఖత్ జరీన్, సాత్విక్, పీవీ సింధు, ఇషా సింగ్
    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పారిస్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్ ఆతిథ్యమిస్తున్న ఈ క్రీడలు జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు 33 భిన్న వేదికల్లో జరుగుతాయి.

భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు 8 మంది ఉన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో తెలుగు క్రీడాకారులు పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్)‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
జ్యోతి యర్రాజీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జ్యోతి యర్రాజీ

జ్యోతి యర్రాజీ

భారత అథ్లెటిక్స్‌లో ఈ మధ్య బాగా వినిపించిన పేరు జ్యోతి యర్రాజీ. విశాఖపట్నానికి చెందిన జ్యోతి, 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత ఆశాకిరణం.

జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఇటీవల ఆమె చూపిన ప్రతిభే ఇందుకు నిదర్శనం.

ఒలింపిక్స్‌ 100 మీ. హర్డిల్స్ ఈవెంట్‌లో పోటీపడుతున్న మొట్టమొదటి భారత అథ్లెట్ జ్యోతి.

వరల్డ్ ర్యాంకింగ్ కోటాలో జ్యోతి పారిస్ బెర్తు దక్కించుకున్నారు. తొలిసారి ఆమె ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు.

అరంగేట్ర ఒలింపిక్స్ కాబట్టి కాస్త ఒత్తిడి ఉందని, అయితే ప్రశాంతంగా ఉండేందుకు ధ్యానం చేస్తున్నాని ఒక వర్చువల్ మీడియా ఇంటరాక్షన్‌లో జ్యోతి చెప్పారు.

జ్యోతి తల్లిదండ్రులు కుమారి, సూర్యనారాయణ. కైలాసపురంలో నివాసముండే సూర్యనారాయణ దంపతులకు జ్యోతి 1999 ఆగస్ట్ 28న జన్మించారు.

తండ్రి సూర్యనారాయణ ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డు. తల్లి స్థానిక ఆసుపత్రిలో, ఇళ్లలో పనులు చేస్తుంటారు.

జ్యోతి విశాఖలోని డాక్ లేబర్ బోర్డ్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ పాఠశాలలో పీటీ ఉపాధ్యాయుడు శ్రీనివాస రెడ్డి క్రీడల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించినట్లు జ్యోతి బీబీసీకి చెప్పారు.

24 ఏళ్ల జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఇప్పటికీ 100మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) ఆమె పేరు మీదనే ఉంది.

నిరుడు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించి చరిత్ర సృష్టించారు.

తర్వాత, ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్యాన్ని సాధించారు. ఆమె ఇప్పటివరకు మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు.

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడంపైనే దృష్టి సారించానని, అందుకు అనుగుణంగా శిక్షణ తీసుకుంటున్ననని జ్యోతి వెల్లడించారు.

జ్యోతిక శ్రీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జ్యోతిక శ్రీ

జ్యోతిక శ్రీ

ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు పట్టణానికి చెందిన దండి జ్యోతిక శ్రీ, భారత మహిళల 4x400మీ. రిలే జట్టులో సభ్యురాలు.

ఇది తనకు మొదటి ఒలింపిక్స్‌ అయినప్పటికీ, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని ఆమె అంటున్నారు.

జ్యోతిక వయస్సు 24 ఏళ్లు. 2000 జులై 16న జన్మించారు.

జ్యోతిక శ్రీ తండ్రి డి.శ్రీనివాస రావు ఒకప్పుడు వెయిట్ లిఫ్టర్.

వ్యక్తిగత విభాగంలో 400 మీటర్ల పరుగు.. మేజర్ టోర్నీల్లో దేశం తరఫున 4x400మీ. రిలే జట్టులో జ్యోతి ప్రాతినిధ్యం వహిస్తారు.

400మీ. పరుగు ఈవెంట్‌లో ఆమె వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన రేసును 51.53 సెకన్లలో పూర్తి చేయడం.

ఇప్పటికి ఆమె రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు.

నిరుడు జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల 400మీ. రిలే జట్టు కాంస్యం సాధించింది. ఇందులో ఆమె పాత్ర కీలకం.

మోకాలి గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరం కావడం తనను బాధించిందని ఆమె చెప్పారు. అయితే, ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందన్నారు.

నిఖత్ జరీన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2022 ఆసియా క్రీడల్లో కాంస్యంతో నిఖత్ జరీన్

నిఖత్ జరీన్

నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ మామూలు బాక్సర్ కాదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్.

బక్కపల్చగా ఉండే ఈ అమ్మాయి తెలంగాణలోని నిజామాబాద్‌లో 1996 జూన్ 14న జన్మించారు.

మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిఖత్ జరీన్, వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్‌గా అవతరించారు. మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్‌ నిఖత్ జరీన్.

తండ్రి జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో నిఖత్ బాక్సింగ్‌లో అడుగుపెట్టారు.

వరుసగా 2022, 2023 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె విజేతగా నిలిచారు.

ఆడిన తొలి కామన్వెల్త్‌ క్రీడల్లోనే స్వర్ణాన్ని దక్కించుకున్నారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, 2023 ఆసియా క్రీడల్లో కాంస్యాన్ని అందుకున్నారు. ఆసియా క్రీడల్లో పతకంతో ఆమె పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకున్నారు. నిఖత్‌కు ఇవే తొలి ఒలింపిక్స్

పతకాలే లక్ష్యంగా పోరాడే ఆమెపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి.

ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల విభాగంలో ఆమె బరిలో దిగుతారు. ఒలింపిక్స్‌లో భారత బాక్సర్లు విజేందర్ సింగ్, మేరీకోమ్, లవ్లీనా బోర్గోహైన్ 3 కాంస్యాలు సాధించారు.

ఆకుల శ్రీజ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడుతున్న ఆకుల శ్రీజ

ఆకుల శ్రీజ

హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ భారత మహిళల అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ ప్లేయర్.

గత రెండేళ్లుగా శ్రీజ నిలకడగా, అద్భుతంగా రాణిస్తున్నారు.

ఇటీవలే వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-25లో చోటు దక్కించుకున్నారు.

శ్రీజ తన కెరీర్‌లో అత్యుత్తమంగా వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానంలో నిలిచారు. భారత్ తరఫున సింగిల్స్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్. శ్రీజ కంటే ముందు మనికా బాత్రా కూడా ఈ ర్యాంకును సాధించారు.

2022 కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించారు. 2024లో డబ్ల్యూటీటీ ఫీడర్ కోర్పస్ క్రిస్టీ టోర్నీలో విజేతగా నిలిచి తొలి సింగిల్స్ టైటిల్‌ను అందుకున్నారు. మార్చిలో మరో సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. జూన్‌లో డబ్ల్యూటీటీ కంటెండర్ లాగోస్ టైటిల్‌ను నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.

ఒలింపిక్స్‌లో భారత్ టీటీ జట్టు ఇప్పటివరకు ఒక్క పతకాన్ని సాధించలేదు.

తొలిసారి ఒలింపిక్స్ ఆడబోతున్న 25 ఏళ్ల శ్రీజ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో బరిలో దిగుతారు.

ఇషా సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇషా సింగ్

ఇషా సింగ్

భారత షూటింగ్‌లో 19 ఏళ్ల హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్‌ హవా సాగుతోంది.

నిరుడు ఆసియా క్రీడల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలు సాధించారు. ఈ క్రీడల్లో భారత షూటర్లు అందరూ కలిసి 18 పతకాలు సాధించగా, అందులో 4 పతకాలు ఇషా సింగ్ వల్ల టీమిండియా ఖాతాలో చేరాయి.

13 ఏళ్లకే ఆమె జాతీయ సీనియర్ చాంపియన్‌గా ఎదిగారు.

నేషనల్ చాంపియన్‌షిప్‌ సీనియర్ కేటగిరీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం గెలిచిన పిన్న వయస్కురాలు ఇషా.

అప్పటినుంచి షూటింగ్‌లో ఆమె మెరుస్తూనే ఉన్నారు.

సీనియర్ కేటగిరీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సాధించిన రెండు స్వర్ణాలు ఆమె ప్రతిభకు నిదర్శనం.

ఇప్పుడు తన తొలి ఒలింపిక్స్‌లోనూ పతకాల వేటను కొనసాగించాలని ఇషా లక్ష్యంగా పెట్టుకున్నారు.

తన తండ్రి అందించే గొప్ప మద్దతు కారణంగానే ఈ విజయాలు సాధ్యమవుతున్నాయని అంటున్నారు ఇషా.

పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్ క్రీడాభిమానులందరికీ సుపరిచితమైన పేరు పూసర్ల వెంకట సింధు.

ఒలింపిక్ స్వర్ణం, ఆల్ ఇంగ్లండ్ సింగిల్స్ టైటిల్ మినహా బ్యాడ్మింటన్‌కు సంబంధించిన అన్ని ముఖ్యమైన ట్రోఫీలను సింధు గెలిచారు.

పుల్లెల గోపీచంద్ శిక్షణలో ఆరితేరిన సింధు జూనియర్ స్థాయిలోనే అంతర్జాతీయంగా రాణించారు.

21 ఏళ్ల వయస్సులోనే ఒలింపిక్ పతకాన్ని గెలిచి దేశం దృష్టిని తన వైపు తిప్పుకున్నారు.

బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్ రజతాన్ని గెలిచిన తొలి భారత ప్లేయర్ సింధు. రియో ఒలింపిక్స్‌లో ఆమె ఈ ఘనత సాధించారు.

2019లో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యంతో పతకాల వేటలో సింధు వెనుదిరిగి చూడలేదు.

కామన్వెల్త్ క్రీడల స్వర్ణం సహా అనేక సూపర్ సిరీస్ టోర్నీల టైటిళ్లు ఆమె ఖాతాలో ఉన్నాయి.

సైనా నెహ్వాల్ తర్వాత ప్రపంచం దృష్టిలో భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రంగా సింధు మారారు.

కాలి గాయం తర్వాత సింధు జైత్రయాత్రకు బ్రేక్ పడింది.

కొంతకాలంగా సింధు నుంచి మెరుగైన ప్రదర్శనలు రానప్పటికీ, పారిస్ ఒలింపిక్స్ కోసం ఆమె తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

సాత్విక్ సాయిరాజ్

ఫొటో సోర్స్, Getty Images

సాత్విక్ సాయిరాజ్

అమలాపురం కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి దూకుడైన ఆటగాడు. వయస్సు 23 ఏళ్లు.

చిరాగ్ శెట్టి జోడీగా బ్యాడ్మింటన్ డబుల్స్‌లో భారత్ తరఫున చరిత్రాత్మక విజయాలు నమోదు చేస్తున్నాడు.

చిరాగ్‌తో కలిసి నిరుడు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాత్విక్, 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్‌షిప్ కాంస్యాన్ని అందుకున్నాడు.

ఇవే కాకుండా ప్రతిష్టాత్మక టైటిళ్లు ఇంకా అనేకం వారి ఖాతాలో ఉన్నాయి.

సాత్విక్-చిరాగ్ జోడీ బరిలోకి దిగిందంటే పతకం ఖాయం అనేలా వారి ఆట సాగుతుంది.

బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గతంలో భారత్‌కు సాధ్యం కాని రికార్డులను ఈ ద్వయం నెలకొల్పింది.

డబుల్స్ ర్యాంకుల్లో వరల్డ్ నంబర్‌వన్ స్థానాన్ని అందుకున్న తొలి భారత జోడీ ఇదే. ప్రస్తుతం ఈ జంట వరల్డ్ నంబర్ 3 ర్యాంకులో ఉంది.

ఈ ఏడాది మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్, మే నెలలో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిళ్లను గెలిచి జోరు మీద ఉన్నారు.

ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో పతకానికి గట్టి పోటీదారులుగా ఉన్నారు.

బొమ్మదేవర ధీరజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధీరజ్

ధీరజ్

విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ వయస్సు 22 ఏళ్లు.

తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

గత 12 నెలల్లో ధీరజ్ 10 అంతర్జాతీయ పతకాలను సాధించారు.

విజయవాడలోని చెరుకూరి వోల్గా అకాడమీలో ఆర్చరీలో శిక్షణ పొందిన తర్వాత, 2017లో ఏఎస్‌ఐలో చేరారు.

2023, 2024 వరల్డ్ కప్ టోర్నీల్లో కాంస్యాలు సాధించి పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్నారు. భారత నంబర్‌వన్ రికర్వ్ ఆర్చర్‌గా ఎదిగారు.

షాంఘైలో ఈ ఏడాది జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్‌లో పురుషుల టీమ్ విభాగంలో స్వర్ణాన్ని అందుకున్నారు ధీరజ్.

ఆంటాల్యాలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఒలింపిక్ రజత పతక విజేత మౌరో నెస్పోలీపై గెలుపొంది పతకం సాధించడం ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఇదే ఉత్సాహంతో పారిస్‌లో పతకం కోసం తలపడుతున్నారు.

ఒలింపిక్స్ ఆర్చరీలో భారత్‌కు ఇప్పటివరకు ఒక్క పతకం కూడా దక్కలేదు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)