మగవారు యుద్ధానికి, ఆడవాళ్లు కొత్త పాత్రల్లోకి, వీళ్ల జీవితాలు ఎలా మారుతున్నాయంటే....

ఫొటో సోర్స్, Lilia Shulha
- రచయిత, ఇలోనా హ్రొమ్లిక్
- హోదా, బీబీసీ న్యూస్ యుక్రయిన్
యుద్ధం కారణంగా యుక్రెయిన్ల జీవితాల్లో వచ్చిన మార్పుల్లో, ఇప్పటి వరకూ మగవారి ఆధిపత్యమున్న రంగాల్లోకి మహిళలు రావడం కూడా ఒకటి.
ఆర్మీ నిబంధనల కారణంగా పురుషులు సైన్యంలోకి వెళ్లాల్సి రావడంతో మహిళలు ఫ్యాక్టరీల్లో మేనేజర్లు, లారీ డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి కొత్త పాత్రలు పోషిస్తున్నారు.
యుక్రెయిన్‌లోని అతిపెద్ద సూపర్ మార్కెట్ కంపెనీ అయిన 'సిల్పో'లో లిలియా షల్హా లారీ నడుపుతున్నారు. ఇది ఆమెకు ఏళ్లనాటి కల.
కానీ, మొదట్లో పిల్లలు చిన్నవారు కావడం, ఈ పని చేసేందుకు ఆమె భర్త కూడా సుముఖంగా లేకపోవడంతో అది కుదరలేదు.
ఇప్పుడామె విడాకులు తీసుకున్నారు. పిల్లల పెంపకంలో ఆమె తల్లి సాయంగా ఉంటున్నారు.

'కల' నిజమైంది
యుద్ధానికి అయిదేళ్ల ముందు వరకూ లిలియా ఒక గోడౌన్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. సాయంత్రం వేళల్లో ట్యాక్సీ నడుపుతూ ఆర్జించేవారు.
తనకు లారీ నడపాలనే ఆసక్తి ఉండేదని, అవకాశం చిక్కినప్పుడల్లా లారీ నడపడం నేర్చుకునే దాన్నని ఆమె చెబుతున్నారు.
నిరుడు లారీ డ్రైవర్ పరీక్షలో పాస్ అయిన తర్వాత, తన అమ్మమ్మ కూడా లారీ నడపాలని కలలు కనేదని ఆమెకు తెలిసింది.
''మా అమ్మ చెప్పింది. మీ అమ్మమ్మ కలను కూడా నిజం చేశావు'' అన్నారని ఆమె చెప్పారు.
ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రయాణం చేయడం బావుంటుందని లిలియా అన్నారు.
''ఇంతటి భారీ వాహనం ఎక్కడం చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోతుంటారు. కొన్నిసార్లు రోడ్డుమీద నాతో ఫోటోలు కూడా తీసుకుంటారు'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Lilia Shulha
ఇప్పుడొస్తున్న కొత్త మోడల్ లారీలను నడపడం అంత కష్టమేమీ కాదని ఆమె చెబుతున్నారు.
''మీరు లారీని సరైన ప్రదేశంలో నిలిపితే, వాళ్లే సరుకును అన్‌లోడ్ చేస్తారు. రిపేర్ వంటి ఏదైనా ఇబ్బంది కలిగితే, వెంటనే సాయం కోసం ఫోన్ చేయొచ్చు. చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వారు వెంటనే వచ్చేస్తారు.'' అని లిలియా చెప్పారు.
ఇటీవల ఆమె ఆస్ట్రియాకు కూడా వెళ్లారు. అంతర్జాతీయ భారీ వాహనాల డ్రైవర్‌గా మొదటిసారి ఆమె విదేశాలకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లారు.
ప్రస్తుతానికి లిలియా, ఆమె సహోద్యోగి అయిన నటాలియా మాత్రమే ఆ కంపెనీలో పనిచేస్తున్న మహిళా డ్రైవర్లు. నటాలియాకు గతంలో ట్రాలీబస్ నడిపిన అనుభవముంది.
మరింత మందికి శిక్షణనిచ్చి విధుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సిల్పో కంపెనీ హెచ్‌ఆర్ లియుబోవ్ యుక్రెయినెట్స్ తెలిపారు.

ఫొటో సోర్స్, Budmix Company
కాలంలో మార్పులకు సంకేతం
రష్యా పూర్తి స్థాయి దాడి మొదలైన రెండున్నరేళ్ల తర్వాత, యుక్రెయిన్‌లో ఇప్పటి వరకూ పురుషాధిపత్యం కొనసాగిన పరిశ్రమలు సిబ్బంది లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యుద్ధం ప్రారంభ సమయంలో దాదాపు 10 వేల మంది పురుషులు వలంటీర్లుగా సైన్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కొత్త నిబంధనలతో వేలమంది సైన్యంలోకి వెళ్లాల్సి వచ్చింది.
యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వారిని రొటేట్ చేసేందుకు, దళాలను మరింత బలోపేతం చేసేందుకు మే నెలలో యుక్రెయిన్ ప్రభుత్వం (న్యూ మొబిలైజేషన్ లా) కొత్త చట్టాన్ని ఆమోదించింది.
చట్టంలో మార్పులు చేయకముందే, పురుషులకు వీధుల్లో లేదా సాధారణ చెకింగ్ పాయింట్ల వద్ద డ్రాఫ్ట్ పేపర్లు (సైన్యంలోకి తీసుకుంటున్నట్లు పత్రాలు) అందేవి. దీంతో పురుషులు ఆర్మీలోకి వెళ్లాల్సి రావడంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు శాశ్వతంగా సిబ్బందిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ప్రైవేటు వ్యాపార సంస్థలకు వాటి నుంచి మినహాయింపులు ఉన్నప్పటికీ, చట్టప్రకారం పురుష సిబ్బంది గరిష్టంగా 50 శాతానికి మించకూడదు.
సంప్రదాయంగా పురుషులు చేస్తూ వస్తున్న ఉద్యోగాలు మహిళలకు దక్కడం వారికొక కొత్త అనుభవం. యుద్ధం కారణంగా వారి కలలు, వృత్తిపరమైన ఆశయాలు నెరవేరడం.. కొంత తీపి, కొంత చేదు లాంటి పరిస్థితి.
అవసరమైనప్పుడు మహిళలు ఇలాంటి పాత్రలు పోషించడం చరిత్రలో ఇదే మొదటిసారి కాదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్, ఇంకా ఇతర దేశాలతో పోరాడుతున్నప్పుడు నాజీ జర్మనీ మహిళలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో కీలకంగా పనిచేశారు.
''విమెన్ హీరోస్ ఆఫ్ వరల్డ్ వార్ - II' రచయిత కేథరిన్ జె. అట్‌వుడ్ ఇలా రాశారు. ''వారు తమ మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నారు. పరిస్థితిని గమనించి, చేయాల్సిన పని చేశారు.''

ఫొటో సోర్స్, Budmix Company
నాయకత్వం..
నటాలియా స్కైడనోవిచ్ కెమిస్ట్ అయినప్పటికీ, ఇటీవల ఆమె బడ్మిక్స్ కంపెనీలో టెక్నాలజిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. పశ్చిమ యుక్రెయిన్‌లోని ఈ కంపెనీ ప్లాస్టర్, జిగురు (గమ్) పదార్థాలు తయారు చేస్తుంది.
నెలరోజుల ముందు స్వచ్చందంగా సైన్యంలో చేరిన పురుష సిబ్బంది స్థానాలను భర్తీ చేసేందుకు కంపెనీ ఆమెకు చీఫ్ ఆఫ్ ప్రొడక్షన్ ఉద్యోగమిచ్చింది. చిన్న టీమ్‌తో పనిచేయించడంలో నటాలియాకు కొంత అనుభవం ఉన్నప్పటికీ, ఫ్యాక్టరీ సిబ్బంది మొత్తంతో పనిచేయించడం సవాల్‌గా మారింది.
''ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న అబ్బాయిలకు ఉత్పత్తికి సంబంధించిన విషయాలు నాకంటే బాగా తెలుసు. కానీ, వాళ్లెప్పుడూ నన్ను ఎగతాళి చేయలేదు. నాకు తెలియని విషయాల్లో సాయం చేస్తుంటారు. నిజంగా అది నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలని నిశ్చయంగా ఉన్నా.'' అన్నారు నటాలియా.

ఫొటో సోర్స్, Budmix Company
అయితే, నటాలియా మాట్లాడుతూ కొన్ని ఉద్యోగాలు మహిళలు చేయకూడదని నిషేధించే సోవియెట్ వారసత్వాన్ని 2017లో యుక్రెయిన్ రద్దు చేసిందని, అందువల్ల ఈ అవకాశం రావడం పెద్ద ఆశ్యర్యకరంగా ఏమీ లేదని ఆమె అన్నారు.
గతంలో వ్యవసాయం, పరిశ్రమలు, మైనింగ్ వంటి రంగాల్లో దాదాపు 500 రకాల ఉద్యోగాలు చేయకుండా మహిళలపై నిషేధం ఉండేది. శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం, లేదా విషపూరిత పదార్థాలకు సంబంధించిన విధులుగా వాటిని భావించేవారు.
మరికొన్ని ఉద్యోగాలు నిషేధిత జాబితాలో లేకపోయినా అనాదిగా పురుషులకే అవకాశం ఉండేది. ఉదాహరణకు నిర్మాణ రంగం, రవాణా, సేల్స్‌మెన్ ఉద్యోగాలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు లేదా సెక్యూరిటీ గార్డుల వంటివి.

ఫొటో సోర్స్, AB Supermarkets
'మహిళగా చేయలేనిది ఏమీ లేదు'
నర్సుగా శిక్షణ పొందిన వాలెంటినా టానిచ్, ఇప్పుడు ప్రముఖ సూపర్ మార్కెట్ కంపెనీ అయిన ఏటీబీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఏడాది కిందటి వరకూ ఆమె అక్కడే క్యాషియర్‌గా పనిచేసేవారు.
చిన్నతనంలో 'డిటెక్టివ్స్' ఆటంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పారు. క్యాషియర్‌గా ఉన్నప్పుడు కూడా సెక్యూరిటీ గార్డు విధులను ఆసక్తిగా గమనించేదానినని చెప్పారామె. సెక్యూరిటీ గార్డు పోస్టు ఖాళీ అయితే, దరఖాస్తు చేద్దామని ఉత్సాహం చూపేవారు.
గార్డు విధుల్లో ఒక మహిళగా చేయలేనిది ఏమీ లేదని వాలెంటినా చెప్పారు. ఇక్కడ ఆయుధాలు ఉండవు, ఎవరిపైనా బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు.
''ఏదైనా తప్పు జరిగితే బటన్ నొక్కుతాం. ఆ వెంటనే సెక్యూరిటీ గ్రూప్ వచ్చేస్తుంది'' అని వాటెంటినా చెప్పారు.
''అయితే బయటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలనే విషయాలను తెలుసుకోవాలి. రకరకాల కస్టమర్లు ఉంటారు. కొందరు దూకుడుగా ఉండొచ్. కానీ గొడవలు రాకుండా సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి.'' అన్నారామె.

ఫొటో సోర్స్, Kryvyi Rig Cement Company
పురుషులందరినీ మహిళలు భర్తీ చేయగలరా?
లక్షల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, కొందరు దేశం విడిచి వెళ్లిపోవడం వంటి కారణాలతో యుక్రెయిన్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జాబ్ మార్కెట్ కూడా మారిపోతోంది. పెద్దయెత్తున ఖాళీ అవుతున్న ఉద్యోగాలు, మరీముఖ్యంగా యుద్ధ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఖాళీ అవుతున్న ఉద్యోగాలు భర్తీ కావడం లేదు.
ఉదాహరణకు, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్ నగరంపై తరచూ రష్యన్ బాంబు దాడులు జరుగుతున్నాయి. అక్కడి స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీ మహిళా లారీ డ్రైవర్లను నియమించుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ అది అసాధ్యంగా కనిపిస్తోంది.
''వలసల కారణంగా మహిళల ఉద్యోగాలకు సైతం తగినంత మంది మహిళలు అందుబాటులో లేరు. శిక్షణ ఇవ్వడంతో పాటు ఉద్యోగోన్నతికి అవకాశం ఉన్నప్పటికీ మహిళలు అంతగా ఆసక్తి చూపడం లేదు.'' అని యుక్రెయిన్‌కి చెందిన ప్రముఖ ఎంప్లాయ్‌మెంట్ వెబ్‌సైట్ work.uaకి చెందిన విక్టోరియా తెలిపారు.
యుక్రెయిన్‌లోని కంపెనీలు, వ్యాపారసంస్థల యజమానులు ఇప్పుడు వృద్ధులు, పెన్షనర్ల వైపు చూస్తున్నారని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
( బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














