'కరెంట్ పోయినా ఆపరేషన్ చేయడం నేర్చుకున్నాం'...అంటున్న యుక్రెయిన్ డాక్టర్లు, ఆ దేశంలో విద్యుత్ కోతలు ఏ స్థాయిలో ఉన్నాయంటే...

ఫొటో సోర్స్, Volodymyr Stefaniv
- రచయిత, విటలీ షవ్‌చెంకో
- హోదా, బీబీసీ మానిటరింగ్
టెటియానా కొడుకుకు విద్యుత్ సరఫరా ఉండటం లేకపోవడం అనేది జీవన్మరణ సమస్య. అతను వైకల్యంతో పుట్టాడు. ఊపిరి పీల్చుకోవడానికి, తినడానికి, మందులు వేసుకోవడానికి విద్యుత్తుతో పనిచేసే పరికరాలు అవసరం.
"మేం విద్యుత్ పైనే ఆధారపడ్డాం. ఈ యుద్ధం లేకపోతే జీవితం ఇంత కష్టంగా ఉండేది కాదు. సమస్యలున్నా ఎలాగో ఎదుర్కొనేవాళ్లం." అని టెటియానా బీబీసీకి చెప్పారు.
తమ విద్యుత్ కేంద్రాలను రష్యా ఎంతగా దెబ్బతీస్తున్నా...ఉన్న వాటితోనే జీవించడం నేర్చుకుంటున్నారు యుక్రేనియన్లు.
యుక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న నిరంతర వైమానిక దాడులకు గురికాని ప్రాంతాలు కూడా ప్రతిరోజూ గంటల తరబడి విద్యుత్ కోతను ఎదుర్కొంటున్నాయి.
విద్యుత్ సరఫరా స్థిరంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని, కానీ, తీవ్ర విద్యుత్ కోతలు జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయని దక్షిణ ఓడరేవు నగరం ఒడెసాలో నివసిస్తున్న టెటియానా అన్నారు.
వాళ్లింట్లో పెట్రోల్‌తో నడిచే జనరేటర్ ఉంది. దాన్ని ఎప్పుడూ టాప్ అప్ చేయాలి. అలాగే చల్లబరచడానికి ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఆపాలి.
విద్యుత్ కోతలతో మొబైల్ ఫోన్ కవరేజీ కూడా ఉండటం లేదు. దీంతో, కొడుకుకు అంబులెన్స్ సర్వీస్ కావాలంటే కాల్ చేయడం కూడా ఆమెకు కష్టంగా మారింది.
‘‘అంబులెన్స్ రావడానికి కొన్నిసార్లు అరగంట పడుతుంది. ఇంకొన్నిసార్లు గంట అవుతుంది. రావడం ఆలస్యమయితే నా బిడ్డ స్పృహ కోల్పోయి, నీలం రంగులోకి మారిపోతాడు. సమయానికి ఆక్సిజన్ అందకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. నాకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు.” అని టెటియానా ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Tetiana
టెటియానా నివసించే ప్రాంతంలో ఇటీవలి కాలంలో రోజులో 12 గంటలు విద్యుత్ సరఫరా ఉండడం లేదు.
కరెంట్ లేకపోతే అక్కడి లక్షల మంది ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటారు.
ఏసీలు, లిఫ్ట్‌లు పనిచేయవు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే పరికరాలు పని చేయవు.
గడిచిన 9 నెలల్లో 9 గిగావాట్ల విద్యుత్ ఉత్పాదక సామర్ధ్యాన్ని యుక్రెయిన్ కోల్పోయిందని నేషనల్ ఎనర్జీ కంపెనీ యుక్రెయినర్ గో తెలిపింది.
ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు మొత్తం యుక్రెయిన్ విద్యుత్ ఉత్పాదకతలో ఇది మూడోవంతు కంటే ఎక్కువగా ఉండేదని ఆ సంస్థ చెప్పింది.
ఇక్కడ జరిగే విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పీక్‌లో ఉన్న సమయంలో నెదర్లాండ్స్ మొత్తానికి సరఫరా చేయడానికి సరిపోతుంది.
స్లోవేకియా, లాత్వియా, లిథువేనియా, ఎస్టోనియాలకు సరఫరా చేయగలిగేంత విద్యుత్ తమ దగ్గర ఉండేదని యుక్రెయినర్ గో చెప్పింది.
"ప్రభుత్వ థర్మల్ పవర్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. రష్యన్ క్షిపణులు, డ్రోన్‌ల వల్ల దేశంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి." అని యుక్రెయినర్ గో ప్రతినిధి మరియా త్సతురియన్ బీబీసీకి చెప్పారు.
విద్యుత్ కొరతతో వేసవిలో ఉష్ణోగ్రతలు తట్టుకోవడం కష్టంగా ఉంటుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సరిపడా విద్యుత్ ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో దేశవ్యాప్తంగా గంటల పాటు విద్యుత్ కోతలను అమలు చేయాల్సి వస్తోంది.
ఫలితంగా, పెద్ద పవర్ బ్యాంక్‌లను, జనరేటర్లను ఉపయోగించే యుక్రెనియన్ల సంఖ్య పెరిగింది.
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ కూడా సుదీర్ఘ విద్యుత్ కోతలను ఎదుర్కొంటోంది.
రాజకీయ నాయకురాలు, ఆర్థికవేత్త రాక్ సోలానా తాను నివసిస్తున్న 24 అంతస్తుల భవనంలో విద్యుత్ సౌకర్యాలను కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
‘‘కరెంట్ లేనప్పుడు ఎత్తైన భవనాలలో నివసించడం అంత సులువు కాదు. విద్యుత్ లేకపోతే పై అంతస్తులకు నీటి సరఫరా చాలా కష్టం.’’ అని రాక్ సోలానా చెప్పారు.
“లిఫ్ట్‌లు పని చేయడం లేదు. తల్లులు, వికలాంగులు కరెంటు ఉన్న సమయంలోనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక వృద్ధుల గురించి చెప్పనవసరం లేదు. నిత్యావసరాలు తెచ్చుకోవడం వారికి కష్టంగా మారింది.” అని ఆమె అన్నారు.
ఎత్తైన భవనాల్లో నివసించే వారు ఏసీలు పనిచేయక ఉక్కపోతలోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.
పైగా వారు రష్యా వైమానిక దాడులకు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. భూగర్భంలో ఉండే బాంబ్ సేఫ్టీ షెల్టర్లకూ వాళ్లు వెళ్లలేరు.
ఆసుపత్రులలో అపాయింట్‌మెంట్‌లను చివరి క్షణంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తోందని, క్లిష్టమైన శస్త్రచికిత్స సమయంలో కరెంటు పోయిన సందర్భాలు ఉన్నాయని జపోర్జిజియాలోని దంత వైద్యుడు వ్లాదిమిర్ స్టీఫెన్సివ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
శస్త్రచికిత్స సమయంలో కరెంట్ పోతే దానిని పూర్తి చేయడానికి జనరేటర్లు ఆన్ చేస్తున్నామని చెప్పారు.
‘‘మాకు ఇంకోదారి లేదు. చికిత్స మధ్యలో ఆపేసి పేషెంట్‌ను కరెంట్ వచ్చాక రమ్మని చెప్పలేం కదా. ముఖ్యంగా రెండు వారాల నుంచి విద్యుత్ కోతలు బాగా ఉన్నాయి. అవి మా పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి.’’ అని ఆయన చెప్పారు.
అత్యవసర చికిత్స, రిస్క్ తక్కువగా ఉండే ఆపరేషన్లు చేయడానికి స్టీఫెన్ హెడ్ టార్చ్‌ను ఉపయోగిస్తున్నారు.
విద్యుత్ కొరతల వల్ల ఇలా చేయడం ఆయన నేర్చుకున్నారు. సైనికులకు చికిత్స చేయగలుగుతున్నారు.
ఆయన హాస్పిటల్ ఇప్పటికీ యుక్రెయిన్ ఆర్మీ సభ్యులకు రాయితీతో కూడిన ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.
‘‘పన్ను నొప్పి, వాపుకి విద్యుత్ లేకుండా చికిత్స చేయగలం. కానీ, ఇప్పుడు కరెంట్ లేకుండా శస్త్రచికిత్స చేయడం కూడా నేర్చుకున్నాం.’’ అని చెప్పారు.
విద్యుత్ కొరత కారణంగా సుదీర్ఘ కరెంటు కోతలు విధించినందుకు చాలామంది నుంచి నిరసన ఎదుర్కొన్నామని, కానీ ఇంకో దారి లేదని మారియా త్సతురియన్ అన్నారు.
‘‘మనం యుద్ధం చేస్తున్నాం. విద్యుత్ క్షేత్రాలను కూడా రష్యన్ టెర్రరిస్ట్‌లు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. అదే వాళ్ల ప్రధాన లక్ష్యం. ఎందుకంటే మన జీవితం, నాగరికత విద్యుత్‌పైనే ఆధారపడి ఉంది. వాళ్లకు శత్రువు విద్యుత్ క్షేత్రాలను ధ్వంసం చేస్తే చాలు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. జీవితం తారుమారవుతుంది.’’ అని ఆమె అన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














