గాజాలో గాడిదలను హమాస్ లీడర్ల పేర్లతో ఎందుకు పిలుస్తున్నారు, వారిపై వ్యతిరేకత పెరిగిపోతోందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, లూసీ విలియమ్సన్, రుష్ది ఎబ్యులౌఫ్
- హోదా, బీబీసీ మిడిల్ ఈస్ట్ కరస్పాండెంట్, గాజా కరస్పాండెంట్
ఇటీవల ఒక వీడియోలో వైరల్ అయ్యింది. అందులో రక్తంతో తడిసిపోయి కనిపిస్తున్న వ్యక్తి ముఖంలో ఆవేదన కనిపిస్తోంది.
''నేనో డాక్టర్‌ని. మంచిగా బతికేవాళ్లం. కానీ, మాకో చెత్త నాయకత్వం ఉంది. వాళ్లు రక్తపాతానికి అలవాటుపడ్డారు. వాళ్లకు దేవుడి శాపం తప్పదు!'' ఆయన అన్నారు.
గత నెలలో సెంట్రల్ గాజా నుంచి బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్‌లో వందల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అప్పుడు ఓ ఆస్పత్రి బయట తీసిన వీడియో అది. యుద్ధానికి ముందు ఎవరూ ఇలాంటి పరిస్థితులను ఊహించలేదు.
వీడియో చివర్లో, కొన్ని సెకన్ల ముందు, ఆయన జనం వైపు తిరిగారు.
''నేను కూడా మీలో ఒకడినే. కానీ, మీరంతా పిరికివాళ్లు. మనం ఈ దాడిని నివారించగలిగేవాళ్లం!'' అని ఆయన అంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి.
కలవరపరిచేలా ఉన్న ఆ వీడియోను బీబీసీ చూపించడంలేదు.


ఫొటో సోర్స్, Reuters
హమాస్‌పై విమర్శలు..
గాజా వీధులతో పాటు సోషల్ మీడియాలోనూ హమాస్‌పై బహిరంగ విమర్శలు పెరుగుతున్నాయి.
ఎప్పుడూ రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాలకు సమీపంలోని అపార్ట్‌మెంట్లలో బందీలను దాచడం, లేదా నివాస ప్రాంతాల మధ్య నుంచి రాకెట్లను పేల్చడంపై హమాస్‌ను కొందరు బహిరంగంగానే విమర్శించారు.
హమాస్ నాయకత్వాన్ని తిట్టుకోవడం, శాపనార్థాలు పెట్టడం ఇప్పుడు సర్వసాధారణంగా మారిందని, గాజాలోని కొందరు గాడిదల బండ్లను నడిపేవారు తమ గాడిదలను హమాస్ నాయకుడు యహ్యా సిన్వర్ పేరుతో పిలుస్తున్నారని, గాడిదలు ముందుకు కదిలేందుకు యల్లా, సిన్వర్ అంటూ గట్టిగా అదిలిస్తున్నారని స్థానికులు కొందరు బీబీసీతో చెప్పారు.
''హమాస్ మా జీవితాలను నాశనం చేసింది. వాళ్లను ఈ భూమ్మీద నుంచి తీసుకెళ్లిపోవాలని ప్రజలు దేవుడిని కోరుకుంటున్నారు'' అని ఒక వ్యక్తి చెప్పారు.
''2023 అక్టోబర్ 7 దాడులు ఎందుకు చేశారని అడుగుతున్నారు. అవి ఇజ్రాయెల్‌కు బహుమతి అని కొందరు అంటున్నారు'' అని ఆయన అన్నారు.
కొందరు ఇప్పటికీ ఇజ్రాయెల్‌తో తమ నాయకులు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటున్నారు.
ఇన్నాళ్లూ గాజాలో హమాస్‌కి వీరవిధేయులుగా ఉన్న వారిలో ఏళ్ల తరబడి అణచివేత తర్వాత ఎంతమంది ఇంకా హమాస్‌కు మద్దతుగా ఉన్నారో, లేదా ఇప్పటికే వ్యతిరేకత ఉన్నవారిలో ఎంతమంది తమ అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరచగలరన్నది చెప్పడం కష్టం.
అలాగే, హమాస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న కొందరు అధికారులు కూడా అల్లాడిపోతున్నారు.
‘‘హమాస్ దాడులు చేయడం ఒక పిచ్చి పని. తర్వాత ఎదురయ్యే పరిణామాలను అంచనా వేయకుండా వేసిన ఎత్తుగడ'' అని హమాస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి ఒకరు అన్నారు. ఆయన తన వివరాలను గోప్యంగా ఉంచాలని కోరారు.
''దాడుల కోసం హమాస్ ప్రభుత్వం సైనికపరంగా సంసిద్ధమైందని నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా నాకు తెలుసు. కానీ, వారు ఇక్కడ చేయాల్సింది చేయలేదు'' అన్నారు.
"ఇక్కడి ప్రజల కోసం ఎలాంటి సురక్షితమైన నివాసాలను ఏర్పాటు చేయలేదు. తగినంత ఆహారం, ఇంధనం, వైద్య సామగ్రిని సిద్ధం చేసి ఉంచుకోలేదు. ఈ యుద్ధంలో నేను, నా కుటుంబం బతికుంటే, అవకాశం వచ్చిన వెంటనే గాజా వదలి వెళ్లిపోతాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
యుద్ధానికి చాలాకాలం ముందు నుంచీ హమాస్‌పై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రతీకార దాడులకు భయపడి చాలావరకూ బయటపడలేదు.
2006లో పాలస్తీనాలో చివరిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గాజా వాసులు 24 స్థానాలకు గానూ 15 స్థానాల్లో హమాస్‌కు ఓటు వేశారు. మిగిలిన 9 డిస్ట్రిక్ట్స్‌లో వేరే పార్టీని ఎంచుకున్నారు.
ఏడాది తర్వాత, గాజా నుంచి పాలస్తీనియన్ అథారిటీ బలగాలను హమాస్ హింసాత్మకంగా తరిమికొట్టి, గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంది. అది ప్రత్యర్థి ఫతా ఉద్యమంతో తీవ్ర విభేదాలకు కారణమైంది.
రాజకీయ కార్యకర్త అమీన్ అబేద్ మాట్లాడుతూ, ఈ యుద్ధానికి ముందు హమాస్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఎన్నోసార్లు అరెస్టయ్యానని, అయితే 9 నెలలుగా ఇక్కడ అసమ్మతి సర్వసాధారణంగా మారిందని ఆయన అన్నారు.
''హమాస్ చేసిన పనిని గాజాలో చాలా మంది తప్పుబడుతున్నారు'' అని ఆయన చెప్పారు.
''పిల్లలు టెంట్ల కింద ఉండాల్సి రావడం చూసి చాలా మంది హమాస్ నాయకులను తిట్టుకుంటున్నారు. కానీ, గాజాకు దూరంగా, సరిహద్దుకు అవతల ఏసీల కింద సౌకర్యవంతంగా కూర్చున్న వారు.. యుద్ధంలో తమ బిడ్డలను, ఇళ్లను, కాళ్లూ చేతులు పోగొట్టుకోని వారు, భవిష్యత్తుపై బెంగలేని వారు మాత్రం వారికి మద్దతు ఇస్తున్నారు'' అని ఆయన అన్నారు
యుద్ధం, నిరాశ గాజాలో సామాజిక పరిస్థితులను నాశనం చేస్తున్నాయి. ఇది హమాస్ నియంత్రణలో కూడా లేదు.
గాజా జనాభాలో ఐదింట నాలుగొంతుల మంది నిర్వాసితులయ్యారు. వారు ఎప్పటికప్పుడు తాత్కాలిక నివాసాలకు మారాల్సి వస్తోంది.
గాజా భద్రతా దళాలను (హమాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీసెస్‌తో పాటు సాధారణ నేరాలను నియంత్రించే కమ్యూనిటీ పోలీసులను కూడా) ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి.
పోలీసుల నియంత్రణ లోపించడంతో పక్కవారిని, సహాయక కాన్వాయ్‌లను దోచుకునే క్రిమినల్ గ్యాంగులు పెరిగాయి. స్థానికంగా బలవంతులైన కుటుంబాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలు పుట్టుకొచ్చాయి.

ఫొటో సోర్స్, Anadolu via Getty Images
గాజాలోని ఒక సహాయ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ.. ''వీధుల్లో దారుణ పరిస్థితులు, అరాచక పరిస్థితి'' ఉందని, ఇజ్రాయెల్ చర్యల కారణంగా జనజీవనం పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు.
హమాస్ సైనిక సామర్థ్యాలతో పాటు పాలనా వ్యవస్థను నాశనం చేసేంత వరకూ యుద్ధాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి పదేపదే ప్రతిజ్ఞ కూడా చేశారు.
కానీ, ఉత్తర గాజా, దక్షిణ గాజాలో హమాస్ అధికారుల తనిఖీలు యథావిధిగా కొనసాగుతున్నాయని కొన్ని సహాయక సంస్థలు చెబుతున్నాయి. అలాగే, దోపిడీ చేస్తూ పట్టుబడిన వారిని హమాస్ అనధికారిక భద్రతా దళాలు కాల్చి చంపుతున్న, దాడి చేస్తున్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత, నియంత్రణ కోసం స్థానిక గ్రూపులతో జరిగిన దాడుల్లోడజన్ల మందిని హమాస్ చంపిందని ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు బీబీసీకి చెప్పారు.
హమాస్ నేతలను విమర్శించే విషయంలో భయం తగ్గి ఉండొచ్చు, కానీ అది పూర్తిగా పోలేదు. కాబట్టి, హమాస్‌కు మద్దతు ఎంతమేరకు తగ్గిందనే విషయం కచ్చితంగా అంచనా వేయడం కష్టం.
ఇప్పటికీ 26 ఏళ్ల జిహాద్ తలాబ్ వంటి వారు హమాస్‌కు బలంగా మద్దతు ఇస్తున్నారు.
గాజాలోని జీటౌన్ ప్రాంతానికి చెందిన తలాబ్ తన భార్య, కుమార్తె, తల్లితో కలిసి వేర్వేరు ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. ఇప్పుడు దీర్ అల్ బలాహ్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తమ పరిస్థితికి హమాస్ కారణం కాదని ఆయన అన్నారు.
''మేం వారికి (హమాస్‌కి) మద్దతు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో పనిచేస్తోంది అదే. యుద్ధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నది కూడా అదే. నిరాధారమైన ఆరోపణలు ఆక్రమణదారులకే (ఇజ్రాయెల్) చెల్లుతాయి. తుదిశ్వాస వరకు మేం మద్దతు ఇస్తాం'' అన్నారు.

ఫొటో సోర్స్, Anadolou via Getty Images
యుద్ధానికి సంబంధించి ఇప్పటికీ హమాస్ కంటే ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలనే నిందిస్తున్నారని గాజాకు చెందిన చాలా మంది నిందిస్తున్నారని వెస్ట్ బ్యాంక్ కేంద్రంగా పనిచేస్తున్న థింక్ ట్యాంక్, పాలస్తీనియన్ సెంటర్ ఫర్ పాలసీ అండ్ రీసర్చ్ నిర్వహించిన ఒక పోల్ సూచిస్తోంది.
జూన్‌లో నిర్వహించిన ఈ తాజా సర్వేలో దాదాపు మూడింట రెండొంతుల మంది గాజన్లు హమాస్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గత డిసెంబర్ నుంచి తలెత్తిన 12 అంశాలను పరిగణలోకి తీసుకున్నప్పటికీ, యుద్ధం ముగిసిన తర్వాత గాజాను పాలించేందుకు సర్వేలో పాల్గొన్న సగం మంది హమాస్‌నే ఇష్టడుతున్నారు. ఇతరుల హమాసే ప్రభుత్వాన్ని నడపాలని కోరుకుంటున్నారు.
అయితే, ఈ సర్వే ఫలితాలు ఇతర వర్గాల నుంచి బీబీసీకి అందిన అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా తాము ప్రజల మద్దతు కోల్పోతున్నామని హమాస్‌కి చెందిన సీనియర్ అధికారి ఒకరు కూడా వ్యక్తిగతంగా అంగీకరించారు.
గాజా చుట్టూ మీడియాకి ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా ఈ వాదనలు అక్కడి పరిస్థితిని పూర్తిగా అంచనా వేయలేవు. అక్కడి ప్రత్యక్ష పరిస్థితులను రిపోర్ట్ చేయకుండా ఇజ్రాయెల్, ఈజిప్ట్ అంతర్జాతీయ జర్నలిస్టులపై ఆంక్షలు విధించాయి.
కానీ, ప్రజాభిప్రాయం విషయంలో హమాస్ చాలా అప్రమత్తంగా ఉంటుందనేది సుస్పష్టం.
కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన చర్యలను సమర్థించుకోవడం కోసం,స్థానికంగా వచ్చే విమర్శలకు ప్రతిస్పందనగా ఇలాంటి మెసేజ్‌లు కనిపిస్తుంటాయి.
హమాస్ గ్రూప్ కోసం సోషల్ మీడియా పోస్టులను సమన్వయం చేసేందుకు ఒక వ్యవస్థీకృత అంతర్జాతీయ నెట్‌వర్క్ పనిచేస్తుందని హమాస్‌తో సంబంధమున్న ఒక సోర్స్ బీబీసీకి చెప్పారు.
అక్టోబర్ 7న కొందరు మహిళా సైనికులను హమాస్ కిడ్నాప్ చేసిన వీడియోలను ఇజ్రాయెల్‌కు చెందిన బందీల కుటుంబాలు విడుదలు చేసినప్పుడు, మహిళలను టార్గెట్ చేయడం ఇస్లామిక్ బోధనలకు విరుద్ధం కాదా? అని గాజాకి చెందిన కొందరు ప్రశ్నించారు.
అందుకు ప్రతిస్పందనగా, సైనిక లక్ష్యాల విషయంలో ఆడ, మగ అనే తేడాలు ఉండవని నొక్కిచెప్పడంతో పాటు ఆరేళ్ల కిందట గాజాలో నిరసనకారులపై ఈ యూనిట్ కాల్పులకు పాల్పడిందంటూ హమాస్ అనుకూల మీడియా ఖాతాలు సోషల్ మీడియాలో పోస్టులు చేశాయి.
హమాస్‌పై విమర్శలు తీవ్రతరమవుతున్నాయి. హమాస్ పాలనపై గాజన్లలో ఎంతోకాలంగా గూడుకట్టుకున్న వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మిగిల్చిన విధ్వంసం నుంచి మరో కొత్త యుద్ధం పుట్టుకొస్తోంది. అదే గాజాలో ప్రజాభిప్రాయ అణచివేత.
ఇవి కూడా చదవండి:
- బొలీవియా: ప్రపంచంలోనే ఎక్కువ తిరుగుబాట్లు జరిగిన దేశం ఇదేనా
- వరల్డ్ వార్ 2: జర్మనీ సముద్రంలో లక్షల టన్నుల పేల్చని బాంబులు, ఇప్పుడు బయటకు తీసి ఏం చేస్తారు?
- వీళ్లు ఏటా లీటర్ల కొద్దీ మద్యం తాగేస్తున్నారు, అత్యధికంగా ఆల్కహాల్ తాగే దేశాలు ఇవే..
- ఈ పామును చంపితే రూ. 35 వేలు బహుమతి ఇస్తామని ఆ రాజకీయ నాయకుడు ఎందుకు ప్రకటించారు?
- చాంగ-6: చంద్రుని ఆవలి వైపు నుంచి అరుదైన శిలలను తీసుకొచ్చిన చైనా వ్యోమనౌక
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














