పూజా ఖేద్కర్: ఈ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి చుట్టూ నెలకొన్న వివాదం ఏంటి?

Trainee IAS Officer Puja Khedkar

ఫొటో సోర్స్, POOJA KHEDKAR/FACEBOOK

    • రచయిత, రోహన్ నామ్‌జోషి
    • హోదా, బీబీసీ కోసం

మహారాష్ట్రలోని పుణెలో ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్‌‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న పూజా ఖేద్కర్‌పై పలు ఆరోపణలు రావడంతో, ఆమెను పుణె నుంచి వాషిమ్ జిల్లాకు బదిలీ చేశారు.

పుణె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రైనీగా పూజకు పోస్టింగ్ ఇచ్చినప్పుడు, ఆమె చేసిన డిమాండ్లు, వ్యవహారశైలితో వార్తల్లో నిలిచారు.

ఇంతకీ పూజ ఖేద్కర్ ఎవరు? ఆమెపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి? వివరంగా చూద్దాం.

వాట్సాప్
Trainee IAS Officer Puja Khedkar

ఫొటో సోర్స్, POOJA KHEDKAR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, పూజా ఖేద్కర్

అసలేంటి వివాదం?

పూజా దిలీప్ ఖేద్కర్ 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. తన ప్రొబేషన్ పీరియడ్‌లో మహారాష్ట్రలోని పుణె జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

అడ్మినిస్ట్రేషన్‌ను మెరుగ్గా అర్థం చేసుకొని పని చేసుకునేందుకు, ఇతర అంశాలు నేర్చుకునేందుకు శిక్షణ సమయాన్ని కేటాయిస్తారు. కానీ, పూజా ఖేద్కర్ సర్వీసులో చేరడానికి ముందే అసమంజసమైన డిమాండ్లు చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

ఒకవేళ ఆమె డిమాండ్లు తీర్చినా, ఒకదాని తర్వాత మరొకటి కావాలంటున్నట్లు కలెక్టరేట్‌లోని చాలామంది అధికారులు కలెక్టర్ వద్ద రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత పుణె కలెక్టర్ సుహాస్ దివాసే ఆమెపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.

Trainee IAS Officer Puja Khedkar

ఫొటో సోర్స్, POOJA KHEDKAR/FACEBOOK

ఫొటో క్యాప్షన్, తనకు ఏయే సౌకర్యాలు అందిస్తారని కలెక్టర్‌ సుహాస్ దివాసేకు పూజ వాట్సాప్ సందేశాలు పెట్టారు.

కలెక్టర్‌కు మెసేజ్‌లు .. సౌకర్యాలపై ఆరా

ప్రభుత్వ రికార్డుల ప్రకారం, 2024 జూన్ 3న కలెక్టరేట్‌లో పూజా ఖేద్కర్ బాధ్యతలు చేపట్టారు. కానీ, అంతకుముందే తనకు ఏయే సౌకర్యాలు అందిస్తారనే విషయాలపై కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్లకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టి అడిగారు.

అయితే, శిక్షణలో ఉన్న అధికారులకు ఈ సౌకర్యాలన్నీ లభించవని వారు బదులిచ్చారు.

నివాస వసతి కల్పించాలని ఆమె కోరారు. జూన్ 3 నుంచి 14 వరకు అధికారులందరితో కలిసి కూర్చుని పనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని భావించారు.

అంతేకాక, ఆఫీసులో తనకు నచ్చిన ప్రాంతంలో కూర్చుంటానని పూజ చెప్పారు. ఆఫీసులో ఆమెకు నాలుగో అంతస్తులో గదిని కేటాయించినప్పటికీ, అందులో అటాచ్డ్ బాత్‌రూమ్ లేదని అక్కడ కూర్చునేందుకు నిరాకరించారు.

ఆ తర్వాత తన తండ్రితో కలిసి వచ్చి వీఐపీ హాల్‌లో తనకు సీటు కేటాయించాలని అడిగారు. ఆయన పదవీ విరమణ పొందిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్. అయితే, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ సరిగ్గా లేకపోవడంతో ఆమె మళ్లీ నిరాశ చెందారు. ఆ తర్వాత ఆమె తండ్రి లోకల్ సబ్-డిస్ట్రిక్ ఆఫీసర్‌తో మాట్లాడారు.

‘‘ఏర్పాట్లు ఏమీ లేకుండా సమావేశం జరగదు. దానికి ముందే ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి’’ అని పూజ ఖేద్కర్ తండ్రి అన్నారు.

ఆ తర్వాత పూజ కూర్చునేందుకు కొత్త స్థలం కోసం మళ్లీ వెతికారు. జూన్ 13న తన తండ్రితో కలిసి తాను కూర్చునే ప్రదేశాన్ని పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ కార్యాలయంలో కూర్చునేందుకు పూజకు ఏర్పాట్లు చేశారు.

జిల్లా అదనపు కలెక్టర్‌కు పూజ తన తండ్రితో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా హాల్ ఎందుకు కట్టలేదు? అని ప్రశ్నించారు.

దాంతో జిల్లా అదనపు కలెక్టర్ అంతకుముందు కూర్చునే చాంబర్‌లో కూర్చోవాలని ఆమెకు చెప్పారు. ఆ సమయంలో, అంటే జూన్ 18 నుంచి జూన్ 20 వరకు జిల్లా అదనపు కలెక్టర్.. మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్నారు.

అప్పుడే పూజ అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఉన్న వస్తువులన్నింటన్నీ తొలగించారు. తన పేరుతో ఉన్న బోర్డును పెట్టుకున్నారు. అంతేకాదు, సొంత లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డు, స్టాంపులు సహా తనకు సంబంధించిన వస్తువులన్నింటినీ అందించాలని తన అసిస్టెంట్‌ను ఆదేశించారు.

ఆమె చర్యలపై విమర్శలు రావడంతో, జిల్లా అదనపు కలెక్టర్ గదిలో ఆమె తెచ్చిపెట్టుకున్న సామాగ్రినంతా తొలగించాలని, ఆమె వేరే గదికి వెళ్లాలని కలెక్టర్ సుహాస్ దివాసే ఆదేశించారు.

‘‘ఈ గది నుంచి నన్ను తొలగిస్తే, అది నాకు చాలా అవమానకరం. నేను దీన్ని సహించను’’ అని పూజ ఖేద్కర్ నేరుగా జిల్లా కలెక్టర్‌కే మెసేజ్ పెట్టారు.

పూజ తండ్రి ఏం చెప్పారు?

ఈ ఘటన తర్వాత "మీరు అధికారిగా ఉన్న నా కూతురిని వేధిస్తున్నారు. భవిష్యత్తులో దీనికి తగిన పర్యవసనాలు ఎదుర్కొంటారు’’ అని పూజ ఖేద్కర్ తండ్రి తహసీల్దార్‌కు ఒక మెసేజ్ పంపించారు.

పూజ ఖేద్కర్ తన సొంత కారుపై పగటిపూట కూడా రెడ్ బీక‌న్ లైట్‌ను ఆన్ చేసి ఉంచుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.

హక్కుల కంటే విధులే ముఖ్యమని పూజ ఖేద్కర్‌కు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు కలెక్టర్ సుహాస్ దివాసే.

ఆమె ప్రవర్తన సరిగా లేదని కలెక్టర్ అన్నారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారికి పూజ ఖేద్కర్ ఇలాంటి మెసేజ్‌లు పంపకూడదని సీఎస్‌కు ఆయన ఫిర్యాదు చేశారు.

పూజ పంపిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను కూడా జత చేశారు. ఇంకా కొంతమంది అధికారులకు కూడా వాటిని పంపించారు.

Trainee IAS Officer Puja Khedkar

ఫొటో సోర్స్, POOJA KHEDKAR/FACEBOOK

పూజా ఖేద్కర్ ఎవరు ?

పూజా ఖేద్కర్ 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె అంతకుముందు వైద్యురాలు. 2022లో మల్టీ డిజేబిలిటీ కేటగిరీలో పూజ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

2022లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 821వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి దిలీప్ ఖేద్కర్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ అధికారి. వంజరి సంఘానికి ఆమె తాత జగన్నాథ్ బుద్వాంత్ కూడా ప్రభుత్వ అధికారిగా పనిచేశారు.

సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత వారి ర్యాంక్‌ల ఆధారంగా అఖిల భారత సర్వీస్‌లలో పోస్టింగ్ ఇస్తారు.

పూజ ఐఏఎస్‌గా ఎంపికయ్యాక రెండు దశల శిక్షణ తీసుకున్నారు. మొదట ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఆ తరువాత కేడర్‌ను బట్టి పుణె జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఆమె నియమితులయ్యారు.

‘‘శిక్షణ సమయంలో అధికారులు పనితీరుని నేర్చుకోవాలని భావిస్తారు" అని మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవినాష్ బీబీసీతో చెప్పారు.

‘‘ఎలా పనిచేయాలి? ఎలాంటి విధులు ఉంటాయి? సమస్యలను ఎలా పరిష్కరించాలి? లాంటి విషయాలను తెలుసుకునేందుకు వారు తమ శిక్షణా కాలాన్ని ఉపయోగించుకోవాలి. అప్పుడు వారికి ఎలాంటి పరిపాలనా అధికారాలు ఉండవు. శిక్షణ పూర్తయ్యాకే వారికి పూర్తిస్థాయి పోస్టింగ్ వస్తుంది ’’ అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ట్రైనీల శిక్షణ

నియామకానికి ముందు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ట్రైనీ ఆఫీసర్ 25 నుంచి 30 వారాలపాటు శిక్షణ పొందాలి. ఈ శిక్షణా కాలం పూర్తయ్యేసరికి ట్రైనీ అధికారులు కలెక్టరేట్, జిల్లా పరిషత్, ఇతర కార్యాలయాల్లో పనిచేసి అనుభవాన్ని పొందుతారు.

దీని తర్వాత రాష్ట్ర సచివాలయంలో వారం పాటు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు వివిధ గ్రామాలలో స్టడీ టూర్‌లు నిర్వహించాలి. ఆయా రాష్ట్రాల భాషలను నేర్చుకోవాలి.

శాఖాపరమైన పరిశీలన వంటి అనేక పనులు చేయాల్సి ఉంటుంది.

పూజా ఖేద్కర్ డిమాండ్లు చట్టబద్ధంగా లేవని, వాటిని నెరవేర్చాలని చట్టంలో ఎక్కడా లేదని మాజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అవినాష్ ధర్మాధికారి అన్నారు.

పూజ ఖేద్కర్ నియామకంపై ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంభార్ కూడా ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ అంశానికి సంబంధించి పుణె జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్) సుహాస్ దివాసేతో కూడా మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఇప్పటివరకు ఆయన అందుబాటులోకి రాలేదు.

బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)