నీట్ వివాదం: ఆరుగురికి ఫుల్ మార్క్స్ వచ్చిన ఆ పరీక్ష కేంద్రంలో అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, BBC/SERAJ
- రచయిత, ఉమంగ్ పొద్దార్, సత్ సింగ్
- హోదా, బీబీసీ కోసం
ఒక పరీక్ష, 23 లక్షల మంది విద్యార్థులు, వందలాది ప్రశ్నలు.
జూన్ 4 తర్వాత నుంచి నీట్ పరీక్ష ఫలితాలు చర్చల్లో నిలిచాయి.
నీట్ పరీక్ష పత్రం లీక్‌లు, 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంకు సాధించడం, పరీక్ష నిర్వహణలో అవకతవకలు వంటి ఆరోపణలతో తలెత్తిన వివాదాన్ని చల్లార్చడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అనేక వివరణలు ఇచ్చింది.
నీట్ పరీక్ష ఫలితాలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారిస్తోంది.
నీట్-యూజీ 2024లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నామని జూన్ 14న సుప్రీంకోర్టుకు ఎన్‌టీఏ తెలిపింది.
గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. కావాలంటే గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు, అలా పొందిన మార్కుల్ని వదులుకుంటే మళ్లీ పరీక్షకు హాజరు కానక్కర్లేదని తెలిపింది.

ఇస్రో మాజీ చైర్మన్ నేతృత్వంలో కమిటీ
నీట్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు ఈ పిటిషన్లపై తదుపరి విచారణ జులై 8న జరగనుంది.
నీట్ పరీక్ష వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు ప్రకటించింది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ బీజే రావు, దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పరీక్షలు సజావుగా, న్యాయబద్దంగా నిర్వహించడం వంటి అంశాలలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ సిఫారసులు చేయనున్నది.
ఈ ఏడాది నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులు 720 మార్కులకు గానూ 720 మార్కులు పొందడం వివాదంగా మారింది.
ఈ 67 మంది విద్యార్థుల్లో ఆరుగురు హరియాణాలోని ఝజ్జర్ హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్‌లో నీట్ పరీక్ష రాశారు.
ఇదే కేంద్రంలో రాసిన మరో ఇద్దరు విద్యార్థులు కూడా 718, 719 మార్కులు పొందారు.
ఈ పరీక్షలో 718 లేదా 719 మార్కులు సాధించడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, BBC/SERAJ
‘‘గందరగోళంగా పరీక్ష మొదలైంది’’
బీబీసీ బృందం ఝజ్జర్‌కు చేరుకుని అక్కడి విద్యార్థులు, వారి కుటుంబాలతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. మేం మాట్లాడుతున్నప్పుడు అందరిలోనూ నిరాశ, తర్వాత ఏం జరుగుతుందో అనే భయం కనిపించింది.
తమకు ఒక్క సెట్‌కు బదులుగా రెండు సెట్ల పేపర్లు రావడంతో పరీక్ష చాలా గందరగోళంగా మొదలైందని విద్యార్థులు బీబీసీతో చెప్పారు.
దీని కారణంగా తొలి 20 నిమిషాలు వృథా అయ్యాయని అంటున్నారు.
ఝజ్జర్‌లోని గుఢా గ్రామంలో నివసించే యశ్ కటారియా ఈ ఏడాది నీట్ పరీక్షలో 718 మార్కులు సాధించారు. ఆయన కూడా హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్‌లో పరీక్ష రాశారు.
“మాకు రెండు సెట్ల పేపర్లు వచ్చాయి. పరీక్ష కోసం ఏ సెట్‌ను వాడాలో కనుక్కొని వస్తానని ఇన్విజిలేటర్ అన్నారు. అక్కడే 20-25 నిమిషాలు వృథా అయింది. భారతదేశం అంతటా Q, R, S, T సెట్లు ఉన్నాయి. కానీ, మా కేంద్రంలో మాత్రం M, N, O, P సెట్లు ఇచ్చారు. రెండు సెట్లలోని ప్రశ్నలు పూర్తి భిన్నంగా ఉన్నాయి’’ అని యశ్ చెప్పారు.
యశ్‌కు మొదటగా 718 మార్కులు వచ్చాయి. తర్వాత ఎన్‌టీఏ గ్రేస్ మార్కులను తొలగించడంతో ఆయన మార్కులు 640కి తగ్గాయి. అంటే అతనికి 78 మార్కుల్ని గ్రేస్ మార్కులుగా ఇచ్చారు.
గ్రేస్ మార్కులు ఇస్తారని తనకు తెలియదని యశ్ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/SERAJ
రితేష్ అహ్లావత్ అనే విద్యార్థిది మరో సమస్య. ‘‘సమయం లేకపోవడం వల్ల నేను 15 ప్రశ్నలకు సమాధానం రాయలేకపోయాను’’ అని ఆయన చెప్పారు.
తనకు 100 గ్రేస్ మార్కులుగా ఇచ్చారని ఆయన తెలిపారు.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడటం కోసమంటూ రెండు సెట్ల పేపర్లు తయారు చేశామని పరీక్ష పత్రాన్ని సిద్ధం చేసిన వారు చెబుతున్నారు. కానీ, హరియాణాలోని రెండు కేంద్రాల్లో సమన్వయం లేకపోవడంతో విద్యార్థులకు ఎమర్జెన్సీ కోసం తయారు చేసిన పేపర్‌ను ఇచ్చారని అన్నారు. ఈ కేంద్రాల్లో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
హర్‌దయాల్ పబ్లిక్ స్కూల్ కాకుండా ఇక్కడ నీట్ పరీక్ష నిర్వహించిన మరో కేంద్రం విజయ్ స్కూల్.
విజయ్ స్కూల్‌లో పరీక్షకు హాజరైన దీక్ష బర్వాల్ మాట్లాడుతూ, “మాకు 25 నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారు. సమయానికి పేపర్ ఇచ్చి ఉంటే, నేను ఇంకా బాగా పరీక్ష రాసేదాన్ని’’ అని దీక్ష అన్నారు.
పరీక్ష పూర్తి చేయడానికి విజయ్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థులకు 30 నిమిషాల అదనపు సమయం ఇచ్చారు. విజయ్ స్కూల్‌లో పరీక్షకు హాజరైన విద్యార్థులు గ్రేస్ మార్కులు పొందకపోవడానికి ఇదే కారణం.
అదనపు సమయం ఇస్తామని తమకు మొదట్లో చెప్పలేదని విద్యార్థులు అంటున్నారు.
గందరగోళం కారణంగా పరీక్షను సరిగ్గా రాయలేకపోయానని, మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలని దీక్ష కోరుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తప్పు ఎవరిది?
విజయ్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపాక్షి నారంగ్ మాట్లాడుతూ, తమకు సరైన సూచనలు ఇవ్వలేదని, దీంతో గందరగోళం ఏర్పడిందని అన్నారు.
"సిటీ కోఆర్డినేటర్ మాకు ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి రెండు చోట్లకు తీసుకెళ్లారు. ఇది గందరగోళానికి దారి తీసింది’’ అని చెప్పారు.
ఝజ్జర్ సిటీ నీట్ ఎగ్జామ్ కోఆర్డినేటర్ వీఎన్ ఝాను బీబీసీ సంప్రదించింది. కానీ ఆయన మాట్లాడటానికి నిరాకరించారు.
వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ఏటా లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతారు. ఈ వివాదాల తర్వాత లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. ఎందుకంటే ఈ పరీక్షకు సంబంధించి తర్వాత ఏం జరుగనుందో ప్రస్తుతానికి ఏమీ తెలియదు.

ఫొటో సోర్స్, Getty Images
యూజీసీ నెట్ కూడా రద్దు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్ తరహాలోనే యూజీసీ నెట్ పరీక్షను కూడా నిర్వహిస్తుంది.
ఎన్‌టీఏ మంగళవారం (18.06.2024) నిర్వహించిన యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
అయితే, ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత చెబుతామని పేర్కొంది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు అభ్యర్థులు యూజీసీ – నెట్ పరీక్ష రాస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పేపర్ లీక్, కాపీయింగ్
గత కొన్నేళ్లతో పోలిస్తే ఈసారి విద్యార్థులు నీట్ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించారు.
‘కెరీర్ 360’ వ్యవస్థాపకులు, చైర్మన్ మహేశ్వర్ పేరి మాట్లాడుతూ, “2023లో 600 మార్కులు సాధించిన విద్యార్థికి 26 వేల ర్యాంక్ వచ్చింది. ఈసారి అదే 600 మార్కులు సాధించిన విద్యార్థుల ర్యాంక్ దాదాపు 80 వేలకు చేరుతుండొచ్చు. ఇప్పుడు వచ్చినంత స్కోర్ గతంలో ఎప్పుడూ రాలేదు. ఇలా ఎందుకు జరిగిందనేదానికి సరైన సమాధానం లేదు’’ అని అన్నారు.
ఇదే కాకుండా, నీట్ పరీక్షపై సందేహాన్ని రేకెత్తించే అనేక పరిణామాలు ఉన్నాయి.
బిహార్‌లో నీట్ పరీక్ష జరిగిన రోజున ఒక పోలీసు అధికారి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు.
వ్యవస్థీకృత ముఠా అండతో నీట్ పేపర్ లీక్ అయిందని తమకు సమాచారం అందిందని ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారని, వారిలో నలుగురు పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
తనకు పరీక్షకు ఒకరోజు ముందే ప్రశ్నాపత్రాన్ని ఇచ్చారని, ప్రశ్నలకు సమాధానాలన్నీ గుర్తుంచుకోవాలని చెప్పినట్లు ఒక విద్యార్థి వాంగ్మూలం ఇచ్చినట్లు నివేదికలు చెప్తున్నాయి.
అయితే, ఈ మీడియా కథనాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
గోద్రాలో నీట్ పరీక్షలో కాపీయింగ్ జరిగినట్లు గుజరాత్ పోలీసులకు ఫిర్యాదులు అందాయని గుజరాత్‌లోని గోద్రా పోలీస్ సూపరింటెండెంట్ హిమాన్షు సోలంకి చెప్పారు.
ఈ కేసులో అయిదుగురిని అరెస్టు చేశామని, వారిని విచారిస్తున్నామని అన్నారు.

ఫొటో సోర్స్, BBC/SERAJ
అయోమయంలో విద్యార్థుల భవిష్యత్తు
నీట్ పరీక్ష పరిణామాలు విద్యార్థులపైనే కాకుండా వారి కుటుంబాలపై కూడా ప్రభావం చూపించాయి. మళ్లీ ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు కూడా సంతోషంగా లేరు.
“నీట్ పరీక్ష మళ్లీ రాయడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారు. ఈ తొమ్మిది రోజుల్లో సిలబస్‌ను పూర్తిగా చదవడం కష్టం. నీట్ పరీక్షను మళ్లీ దేశవ్యాప్తంగా నిర్వహించాలి’’ అని యశ్ కటారియా అన్నారు.
నీట్ పరీక్ష రాయనున్న రితేష్ అహ్లావత్ మాట్లాడుతూ, ‘‘నేను డాక్టర్ కావాలనుకుంటున్నా. ఈ సంవత్సరం పరీక్ష సరిగ్గా జరగకపోతే, ప్రత్యామ్నాయాలు చూడాలి’’ అని చెప్పారు.
యశ్ కటారియా తండ్రి ఓం ప్రకాష్ కటారియా మాట్లాడుతూ, “ ఈ విషయంలో ప్రభుత్వం తప్పు కూడా ఉంది. పిల్లలతో చెలగాటమాడుతున్నారు. పిల్లలందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలి. పిల్లలు మానసిక వేదన అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు ఒత్తిడికి గురవుతున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నీట్‌కు సంబంధించి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నారా అని చూస్తూనే ఉన్నాం’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సామర్థ్యంపై నిపుణులు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ.
నీట్, యూజీసీ నెట్ పరీక్షలతో పాటు ఎన్‌టీఏ అనేక ఇతర పరీక్షలను కూడా నిర్వహిస్తుంది. వీటిలో జేఈఈ, కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ కూడా ఉన్నాయి.
ఎన్‌టీఏ ఏర్పాటుకు ముందు నీట్ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించేది.
2004 నుంచి 2010 వరకు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణ కుమార్ మాట్లాడుతూ, “ఎన్‌టీఏలో శాశ్వత ఉద్యోగి లేరు. ప్రతి ఆరు నుంచి ఎనిమిది నెలలకు ఉద్యోగులు మారుతూ ఉంటారు. వ్యవస్థలోనే లోపం ఉంది. ఒక్క వ్యక్తిని దీనికి బాధ్యులుగా చూపలేం’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మెదక్: బక్రీద్ సందర్భంగా ఇక్కడ జరిగిన గొడవేంటి? ఎందుకు జరిగింది?
- చంద్రబాబు కేబినెట్లో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, ఇంకా ఎవరెవరు అంటే..
- భాష తెలియని మహిళను మానసిక రోగి అనుకుని 12 ఏళ్లు అమెరికాలోని ఆసుపత్రిలో ఉంచేశారు, బయటపడ్డాక నష్టపరిహారం వస్తే అదీ దోచేశారు
- చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న కేసరపల్లి ఎక్కడుంది? అమరావతిలో ఎందుకు చేయడం లేదు
- ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














