ఎస్పీజీ: భారత ప్రధాని చుట్టూ ఉండే భద్రత వ్యవస్థ ఎలా ఉంటుంది? వారిని దాటి గతంలో ఎలా దాడులు జరిగాయి

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ
    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్‌పై దాడి తర్వాత అమెరికాలో భద్రత లోపాలపై సమగ్ర విచారణ జరుగుతోంది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా వీఐపీ భద్రతా సంస్థలు కూడా తమ వ్యవస్థలను సమీక్షించడం ప్రారంభించాయి.

గతంలో భారత్‌లో భద్రత లోపం కారణంగా మహాత్మా గాంధీ, మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు హత్యకు గురయ్యారు.

భారత్‌లో ప్రధానమంత్రి భద్రతా వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన ఏర్పాట్లలో ఒకటిగా పరిగణిస్తారు.

ఇందిరా గాంధీ హత్యానంతరం భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని భావించి, దానిని నిరంతరంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.

భద్రతా వ్యవస్థలోని లోపాలతో ప్రధాని ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఘటనలు భారత్‌లో చాలానే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలను చూద్దాం.

వాట్సాప్
ఇందిరాగాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇందిరాగాంధీ

ఇందిరాగాంధీపై దాడి

1967 సార్వత్రిక ఎన్నికల సమయంలో భువనేశ్వర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇందిరాగాంధీ పాల్గొన్నారు. ఆమె ప్రసంగం ప్రారంభమైన వెంటనే అక్కడి జనంలోని కొందరు వేదికపైకి రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

ఒక రాయి సెక్యూరిటీ గార్డు నుదుటిపై, మరో రాయి అక్కడున్న జర్నలిస్టుకి తగిలింది. ఇది చూసిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఇందిరాగాంధీకి రక్షణగా పక్కన నిలబడ్డారు.

ప్రసంగాన్ని వెంటనే ముగించాలని భద్రతాధికారులు ఇందిరాగాంధీని అభ్యర్థించినప్పటికీ ఆమె వారి మాట వినలేదు. కాసేపటి తర్వాత ఇందిర ప్రసంగాన్ని ముగించి వేదికపైన ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అనంతరం స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడటం ప్రారంభించడంతో వేదికపై మళ్లీ రాళ్లు విసిరారు.

ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రాసిన కేథరీన్ ఫ్రాంక్ ఆ రోజు పరిస్థితిని వివరిస్తూ.. మళ్లీ రాళ్లు రువ్వడం చూసిన ఇందిరాగాంధీ వెంటనే మైకు వద్దకు వెళ్లి 'ఏమిటీ దురహంకారం. దేశాన్ని నిర్మించే మార్గం ఇదేనా?' అని అన్నారు.

ఆ సమయంలో ఇందిరాగాంధీ ముఖానికి రాయి తగలడంతో ఆమె ముక్కుకు గాయమైంది. అయినా కూడా ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారాన్ని ఆపలేదు.

వేదికపైకి రాళ్లు వేసేంత దగ్గరగా ప్రజలను అనుమతించడం బ్లూ బుక్‌లోని నిబంధనల ఉల్లంఘనే. సహజంగానే, భద్రతా సంస్థలకు ఇది ఒక పాఠం.

రాజీవ్ గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ

రాజీవ్ గాంధీపై హత్యాయత్నం

1984లో ఇందిరాగాంధీని ఆమె భద్రత సిబ్బంది హత్య చేయడంపై చాలా కథనాలు ఉన్నాయి.

ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత మరో ఘటన జరిగింది.

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1986 అక్టోబరు 2న ఉదయం 6:55 గంటలకు రాజ్‌ఘాట్ సమాధి వైపు వెళ్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. ప్రధాని భద్రత సిబ్బంది వెంటనే ఆయనకు రక్షణగా చుట్టూ నిలిచారు.

పేల్చిన బుల్లెట్ రాజీవ్ గాంధీ వెనుక పూల మొక్కల నుంచి దూసుకెళ్లింది. వెంటనే భద్రత సిబ్బంది రాజ్‌ఘాట్‌ అంతా తనిఖీ చేయడం ప్రారంభించారు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న భవనాలను వెతకడం మొదలుపెట్టారు, కానీ నిందితుడు అక్కడ తీగలతో కప్పి ఉన్న ఒక చెట్టు వద్ద దాక్కున్నాడు, అక్కడ మాత్రం తనిఖీ చేయలేదు.

మహాత్మ గాంధీ సమాధి వద్ద రాజీవ్ గాంధీ పుష్పాంజలి ఘటించి, 8 గంటల ప్రాంతంలో కారు వైపు తిరిగి వస్తుండగా రెండో బుల్లెట్ శబ్దం వినిపించింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీతో రాష్ట్రపతి జైల్ సింగ్ కూడా ఉన్నారు. జైల్ సింగ్‌ బుల్లెట్‌ప్రూఫ్ మెర్సిడెస్‌ కారు ఎక్కారు. సోనియా గాంధీతో కలిసి రాజీవ్ అంబాసిడర్ కారులో ఎక్కబోతుండగా మూడో బుల్లెట్ శబ్దం వినిపించింది.

ఆ బుల్లెట్ రాజీవ్ గాంధీ వెనుక నిల్చున్న అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రిజేంద్ర సింగ్ మొవై, బయానా జిల్లా మాజీ జడ్జి రామ్ చరణ్ లాల్‌లకు తగిలింది. సోనియాను కారు లోపలికి వెళ్లాలని రాజీవ్ కేకలు వేశారు.. భద్రత సిబ్బంది రాజీవ్ వెంట రక్షణగా చేరారు.

ఇంతలో దట్టంగా ఆకులతో కప్పిన చెట్టు నుంచి పొగలు రావడాన్ని భద్రత సిబ్బంది చూశారు. వారు తమ 9 ఎంఎం జర్మన్ మౌజర్ పిస్టల్‌తో ఆ చెట్టుపైకి కాల్పులు జరిపారు. ఆకుపచ్చ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి తన చేతులను పైకి ఎత్తి, పొదలో నుంచి బయటకు రావడం కనిపించింది.

ఆ వ్యక్తి కరమ్‌వీర్ సింగ్‌గా విచారణలో తేలింది. అతను చాలాకాలంగా ఆ పొదలలో దాక్కున్నట్లు దర్యాప్తులో తెలిసింది. అతని వద్ద ఒక ప్లాస్టిక్ షీట్, వేయించిన శనగలు, నీళ్ల క్యాన్, నొప్పి నివారణ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు.

ప్రధాని పర్యటనకు ముందు రోజు జరిపిన తనిఖీలలో కుక్కలు ఆ పొదల వద్ద మొరిగినా, ఆ వైపు తేనెటీగలు ఉన్నందున భద్రత సిబ్బంది ముందుకు వెళ్లలేదు.

రాజ్‌ఘాట్‌లో రాజీవ్ గాంధీపై దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ బ్యూరో అప్పటికి కొద్ది రోజుల క్రితం హెచ్చరించింది కూడా. ఆ ఘటనను భద్రత లోపంగా పరిగణిస్తూ, పలువురిని సస్పెండ్ చేశారు.

రష్యా ప్రధాని పర్యటన సమయంలో..

1987 అక్టోబరులో అప్పటి రష్యా ప్రధాని నికోలాయ్ రిజ్కోవ్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు భద్రతలో మరోసారి లోపం బయటపడింది.

భారత, రష్యా ప్రధానుల కారు, అధికారుల కారుతో ఢీకొనే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు కూడా.

రాజీవ్ ప్రధాని హోదాలో కొలంబో పర్యటనకు వెళ్లినపుడు శ్రీలంకలోని అధ్యక్ష భవన్ ప్రాంగణంలో కూడా ఆయనపై దాడికి ప్రయత్నించారు.

ఆ ఘటనతో శ్రీలంక ప్రభుత్వం, అక్కడి భద్రత సంస్థలు చాలా ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది.

ప్రధాని మోదీ కాన్వాయ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీ కాన్వాయ్

నరేంద్ర మోదీ కాన్వాయ్‌లో భద్రత లోపం

2022లో పంజాబ్‌లో రైతుల నిరసనతో ఏర్పడిన జామ్ కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్‌పై 15-20 నిమిషాలు ఆగవలసి వచ్చింది, ఇది ఆయన భద్రతకు ముప్పు. ప్రధాని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు ప్రత్యామ్నాయ మార్గం కూడా ఏర్పాటు చేస్తారు.

బఠిండా విమానాశ్రయంలో దిగిన తర్వాత ప్రధాని హెలికాప్టర్‌లో జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు వెళ్లాలని ముందుగా నిర్ణయించారు, అయితే ప్రతికూల వాతావరణం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది.

పంజాబ్ డీజీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత ప్రధానిని రోడ్డు మార్గంలో తీసుకువెళ్లారు, దీనికి రెండు గంటల సమయం పట్టింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయమైంది.

ప్రధాని కాన్వాయ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని కోసం ఎస్పీజీ

ప్రధానమంత్రి భద్రత బాధ్యత ప్రత్యేక రక్షణ బృందం (ఎస్పీజీ)పై ఉంటుంది. ప్రధాని దేశంలో ఉన్నప్పుడు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు కూడా ఎస్పీజీ ఆయన/ఆమె భద్రత చూసుకుంటుంది.

మొదట్లో ప్రధాని నివాసంలోని ఆయన బంధువులు కూడా ఎస్పీజీ భద్రతలో ఉండేవారు, కానీ 2019లో ఈ నిబంధనను మార్చారు. దాని ప్రకారం ఎస్పీజీ భద్రత ఇప్పుడు ప్రధానికి మాత్రమే ఉంది.

ఎస్పీజీని 1988లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం దిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఉంది. ఈ విభాగంలో పనిచేసే భద్రత సిబ్బందిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్పీఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సైనికుల నుంచి ఎంపిక చేస్తారు.

ఈ ఏజెన్సీల నుంచి అత్యుత్తమ సైనికులను ఎంపిక చేస్తారు. ప్రధానమంత్రితో సర్కిల్‌లో నడిచే ఎస్పీజీ సైనికులు నల్ల సూట్లు, నల్లని సన్ గ్లాసెస్ ధరిస్తారు.

వారి చూపు ఎవరిపై ఉందో జనాలకు తెలియకుండా పరిసరాలపై నిఘా ఉంచడమే ఈ నల్ల సన్‌గ్లాసెస్ ఉద్దేశం. వారు ప్రత్యేక బూట్లు ధరిస్తారు. ఆయుధాలు చేతుల నుంచి జారిపోకుండా వారికి చేతి తొడుగులు కూడా భిన్నంగా ఉంటాయి.

రెండో సర్కిల్‌లోని ఎస్పీజీ కమాండోలు బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న మూడున్నర కిలోల రైఫిల్స్‌ పట్టుకొని ఉంటారు, ఇవి 500 మీటర్ల దూరం వరకు దాడి చేయగలవు.

ప్రతి కమాండో 2.25 కిలోల బరువున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తారు. వారి మోకాళ్లపై, మోచేతులపై ప్యాడ్‌లు ఉంటాయి.

ప్రధాని చుట్టూ ఎస్పీజీ

ఫొటో సోర్స్, Getty Images

బ్లూ బుక్

కమాండోలకు శిక్షణ సమయంలో ఆయుధాలు లేకుండా కూడా పోరాడగలిగేలా మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తారు. వారిని క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అంటారు.

రిమోట్ పేలుళ్ల ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని కాన్వాయ్‌లో జామర్‌లను ఉపయోగిస్తారు. దాడి చేసేవారికి టార్గెట్‌గా ఉండకుండా ప్రధాని కాన్వాయ్‌లో ఆయన ప్రయాణించే వాహనం తరహాలో మరో రెండు వాహనాలు వస్తాయి. రాష్ట్రాలలో ప్రధాని పర్యటనకు ముందు బ్లూ బుక్‌ రూల్స్‌ను ఎస్పీజీ కచ్చితంగా అమలు చేస్తుంది.

బ్లూ బుక్ ప్రకారం ప్రధాని పర్యటనకు మూడు రోజుల ముందు పర్యటనలో భాగమయ్యే వ్యక్తులు, సంస్థలతో ఎస్పీజీ ముందస్తు సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో, సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్ ఉంటారు.

ఈ భేటీలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ప్రతి నిమిషం వివరాలు చర్చిస్తారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రతి స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందిస్తారు.

ప్రధాని కాన్వాయ్‌లోని కార్ల ఆర్డర్ కూడా ముందే నిర్ణయిస్తారు. పైలట్ కారు ముందువైపు వెళుతుంది, దాని తర్వాత దాని మొబైల్ సిగ్నల్ జామర్, తర్వాత డెకాయ్ కారు, ఆ తర్వాత ప్రధానమంత్రి కారు, మెర్సిడెస్ అంబులెన్స్, ఇతర కార్లు ఉంటాయి. ఒక స్పేర్ కారు కూడా వెంట వెళుతుంది, ప్రధాని కారు చెడిపోతే దానిని ఉపయోగిస్తారు.

ప్రధాని ఎయిర్ ఇండియా-1 విమానాలలో విదేశాలకు వెళ్తుంటారు. ఇది 747-400 బోయింగ్ విమానం. ప్రధానమంత్రి విమానాశ్రయంలోకి రాకముందే భారత వైమానిక దళానికి చెందిన రెండు విమానాలను సిద్ధంగా ఉంచుతారు. చివరి క్షణంలో విమానంలో ఏదైనా సమస్య ఉంటే, అప్పుడు ఈ విమానాలను ఉపయోగిస్తారు.

ప్రధాని విమానం టేకాఫ్‌కు ముందు ఆ ప్రాంతాన్ని కొద్దిసేపు 'నో ఫ్లయింగ్ జోన్'గా ప్రకటిస్తారు.

ప్రధాని చుట్టూ ఎస్పీజీ

ఫొటో సోర్స్, Getty Images

కఠిన శిక్షణ

ఈ కమాండోలను విధుల్లోకి తీసుకునే ముందు మూడు స్థాయిలలో బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేస్తారు. వారి కుటుంబ సభ్యులు, దూరపు బంధువులు, స్నేహితులను విచారిస్తారు.

మొదటి మూడు నెలలు కమాండోలు సాయుధ, నిరాయుధ శిక్షణ పొందుతారు. తర్వాత అన్ని రకాల పేలుడు పదార్థాలు, వాటి గురించిన సమాచారం తెలిసేలా చేస్తారు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే ఉపాయాలను వారికి నేర్పిస్తారు. దీంతో పాటు యోగా, మెడిటేషన్, మానసిక వ్యాయామాల్లో శిక్షణ కూడా ఇస్తారు.

‘’ఈ కమాండోలు కదులుతున్న వాహనం నుంచి కూడా గురి పెట్టి కాల్చగలరు. ఇతరులకు హాని లేకుండా గుంపులో నిలబడి ఉన్న ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకునేలా కూడా వారు శిక్షణ పొందుతారు’’ అని ఎన్ఎస్‌జీ అధికారి ఒకరు తెలిపారు.

వారు చాలా మంచి ఈతగాళ్ళు , తాజా కమ్యూనికేషన్ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో తెలుసు. మొదటి మూడు నెలల శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, తదుపరి మూడు నెలలు మరింత ఇంటెన్సివ్ శిక్షణ ఇస్తారు.

దాడులు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి కూడా వారికి శిక్షణ ఇస్తారు. ఎవరైనా వ్యక్తి ఎస్పీజీ కార్డన్‌కు దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే, వారిని ఎలా వెనక్కి నెట్టాలో శిక్షణ ఇస్తారు. ఈ దెబ్బ ప్రభావం వారాలపాటు బాధితుడిపై ఉండొచ్చు.

కమాండోలు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ మార్గదర్శకాల ప్రకారం శిక్షణ పొందుతారు.

ఇప్పుడు ఇజ్రాయెల్ శిక్షణ మాన్యువల్ 'క్రావ్ మాగా' కూడా శిక్షణలో చేర్చారు. దాని ప్రకారం కమాండోలు బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటేలలో ప్రావీణ్యం సంపాదించాలి.

ప్రతి కమాండోకు వార్షిక పరీక్ష ఉంటుంది. అందులో విఫలమైతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారి పాత కేడర్‌కు తిరిగి పంపిస్తారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)