ట్రంప్ ప్రసంగం: ‘‘బుల్లెట్ తగిలినా గాల్లోకి పిడికిలి ఎందుకు లేపానంటే...’’

పిడికిలి బిగించిన డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు రిపబ్లికన్ పార్టీ మిలాకీలో ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా, జేడీ వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎన్నుకుందీ సమావేశం. తనను ఎన్నుకున్నందుకు పార్టీ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పిన ట్రంప్ తనపై జరిగిన హత్యాయత్నం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ఆయన ఏమన్నారంటే..

"మీ అందరికీ ఇప్పటికే తెలుసు. హంతకుడి బుల్లెట్ నా ప్రాణాలు తీయడానికి దూసుకొచ్చింది. ఆ సంఘటన గురించి ఏం జరిగింది? చెప్పండి.. అని చాలా మంది అడిగారు. అందుకే ఆ రోజు ఏం జరిగిందో నేనివాళ మీకు చెబుతున్నాను. ఆ సంఘటన గురించి నేను మరొకసారి మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే దాని గురించి చెప్పడం చాలా బాధాకరం.

అదొక అద్భుతమైన రోజు. ఎండ కాస్తోంది. పెన్సిల్వేనియా కామన్‌వెల్త్‌లోని బట్లర్ టౌన్‍షిప్‌లో ఆ సాయంత్రం సంగీతం హోరు వినిపిస్తోంది.

ప్రచారం అద్భుతంగా సాగుతోంది.

నేను వేదికపైకి ఎక్కాను.

అక్కడున్న ప్రజలంతా గట్టిగా కేరింతలు కొడుతున్నారు.

అందరూ సంతోషంగా ఉన్నారు.

నేను చాలా పవర్‌ఫుల్‌గా, బలంగా, సంతోషంగా మాట్లాడటం మొదలు పెట్టాను.

ఎందుకంటే నేను ఆ సమయంలో దక్షిణ సరిహద్దుల్లో అక్రమ వలసల నిరోధానికి మన ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడుతున్నాను.

దీనికి మనమంతా గర్వపడాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రసంగం ముగిసిన తరువాత కుటుంబసభ్యులతో వేదికపై ట్రంప్

నా వెనుక కుడివైపున పెద్ద స్క్రీన్ ఉంది.

దాని మీద ఒక పెద్ద చార్ట్‌ను ప్రదర్శిస్తున్నాం.

అందులో నా పాలనా కాలంలో సరిహద్దు దాటి వచ్చిన వారి వివరాలున్నాయి.

ఆ గణాంకాలు చాలా అద్బుతంగా ఉన్నాయి.

అప్పుడు నేను వేదికపైన ఉన్న స్క్రీన్ వైపు చూస్తున్నాను.

ఆ చార్ట్ చూస్తూనే నా మెడ కుడివైపుకు తిప్పాను (ఈ విషయం చెప్తూ తన మెడను పక్కకు తిప్పారు) ఇంకొంచెం అటు వైపుకు ( కుడి వైపుకు) మళ్లే ప్రయత్నంలో ఉన్నాను.

అయితే అదృష్టం కొద్దీ కుడి వైపుకు మళ్లలేదు.

అదే సమయంలో నా చెవి పక్కగా 'జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌జ్‌' మంటూ ఏదో దూసుకెళ్లినట్లు పెద్ద శబ్ధం వచ్చింది.

నాకు ఏదో తగిలిందని అనిపించింది.

అది కూడా నా కుడి చెవి మీద చాలా బలంగా తగిలింది.

అప్పుడు 'నాకు నేనే చెప్పుకున్నాను'. ఓహ్.. ఇదేమిటి. ఇది తుపాకీ తూటా కావచ్చని అనుకున్నాను. నా కుడి చేతితో నా చెవిని పట్టుకున్నాను.

చెయ్యి కిందకు దించి చూస్తే చేతి నిండా రక్తం ఉంది.

అక్కడంతా పూర్తిగా రక్తం మాత్రమే ఉంది.

మా మీద చాలా పెద్ద దాడి జరుగుతోందని అర్థమైంది.

అంతే.. వెంటనే అందరం కింద కూర్చుండిపోయాం.

బుల్లెట్లు దూసుకొస్తూనే ఉన్నాయి.

సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు వెంటనే వేదిక మీదకు వచ్చారు.

వాళ్లు నిజంగా చాలా ధైర్యవంతులు. ( చిన్న విరామం, కార్యకర్తల చప్పట్లు)

వాళ్లు చాలా గొప్పవాళ్లు. నిజంగా వాళ్లు రిస్క్ తీసుకున్నారు.

నన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. దాంతో నాకు పూర్తి రక్షణ వచ్చింది.

నా చెవితో పాటు ముఖంపై అంతా రక్తం కారుతోంది.

అయినప్పటికీ ఏదో ఒక విధంగా నేను చాలా సేఫ్‌గా ఉన్నానని అనుకున్నాను.

ఎందుకంటే దేవుడు నా వైపు ఉన్నాడు. ( చప్పట్లు)

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ట్రంప్ ప్రసంగిస్తుంటే హర్షం వ్యక్తం చేస్తున్న ప్రతినిధులు

ఓ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ తూటా పేలడానికి కొన్ని క్షణాల ముందు నేను నా తలను కుడి వైపుకు తిప్పకుండా ఉండి ఉంటే నన్ను చంపాలనుకున్న వ్యక్తి కాల్చిన తూటా తన లక్ష్యాన్ని తాకి ఉండేది.

అదే జరిగి ఉంటే నేను ఈ రాత్రికి ఇక్కడ ఉండే వాడిని కాను.

మనం అంతా ఇలా కలిసేవాళ్లం కాదు.

మరో అద్భుతమైన అంశం, ఆ సూర్యాస్తమయాన ఏం జరిగిందంటే, దాన్ని తర్వాత గుర్తించాం.

మా మీద అనేక తూటాలు కాల్చినా అక్కడున్న ప్రజలు ఎవరూ కదల్లేదు.

కార్యకర్తలు పరుగులు తీసి ఉంటే అక్కడ తొక్కిసలాట జరిగి ఉండేది.

అయితే ఈ సంఘటనలో అలా జరగలేదు. ఇది అసాధారణం.

అక్కడున్న వేల మంది కార్యకర్తలు ఒక్క అంగుళం కూడా కదల్లేదు.

వాళ్లంతా స్థిరంగా నిల్చున్నారు.

వాస్తవానికి వాళ్లంతా ధైర్యంగా ఉన్నారు.

కొంతమంది స్నైపర్ ఎక్కడ ఉన్నారు? అని అన్ని వైపులా వెతికారు.

కాసేపటికే వాళ్లు ఆ స్నైపర్‌ను గుర్తించారు.

ఆయన ఎక్కడున్నారో చేతులూ చూపిస్తూ చెప్పే ప్రయత్నం చేశారు.

మీరు నా వెనుక ఉన్న చిన్న గుంపును చూసినట్లైతే వాళ్లెవరూ భయంతో పరుగులు తియ్యలేదు.

తొక్కిసలాట జరగలేదు.

ఎలాంటి ప్రాణహాని జరగలేదు.

వాళ్లు ఎందుకు కదలలేదు అంటే, నేను చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నానని వాళ్లకు తెలుసు.

నేను కిందకు వెళ్లడాన్ని వాళ్లు చూశారు. నా చెవులు, ముఖం, చేతులకు రక్తం ఉంటడాన్ని వాళ్లు గుర్తించారు. చాలా మంది నేను చనిపోయానని అనుకున్నారు.

ఆ తూటా నా చెవికి దగ్గరగా వెళ్లింది.

అక్కడంతా రక్తం ఉంది.

అది చాలా వ్యూహాత్మక ప్రాంతం.

గాయమైనప్పుడు శరీరంలో మిగతా అవయవాల కంటే ఎక్కువగా చెవి నుంచి రక్తం వస్తుంది.

కారణాలు ఏవైనా, ఎందుకంత రక్తం కారిందంటే, చెవికి గాయమైంది కదా అని డాక్టర్లు చెప్పారు.

గాయమైతే చెవి నుంచి రక్తం ఎక్కువగా కారుతుందని చెప్పారు.

ఈ సంఘటనతో నాకు ఆ విషయం తెలిసింది.

అక్కడకొచ్చిన కార్యకర్తలు, అభిమానులు చాలా అద్భుతమైన వారు.

ఎందుకంటే నాకు గాయం కావడంతో వాళ్లెవరూ అక్కడ నుంచి కదల్లేదు.

నేను ప్రమాదంలో ఉన్నానని వాళ్లకు తెలుసు.

నా పట్ల వాళ్లకున్న ప్రేమ ప్రతి ఒక్కరి మొహంలో కనిపించింది.

వాళ్లంతా నాతోనే ఉండాలనుకున్నారు.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, GETTY IMAGES

వాళ్లంతా అసాధారణ వ్యక్తులు, మాపైకి బుల్లెట్లు దూసుకొస్తున్నాయి.

అయినప్పటికీ అక్కడ నాకు ప్రశాంతంగా ఉందనిపించింది.

సీక్రెట్ సర్వీస్ ఏజంట్లు తమ ప్రాణాలకు తెగించి ముందుకొచ్చారు.

అది చాలా ప్రమాదకరమైన ప్రాంతం.

బుల్లెట్లు వాళ్ల పక్కగా దూసుకెళ్తూ ఉన్నాయి. తర్వాత అంతా ఆగిపోయింది.

సీక్రెట్ సర్వీస్ స్నైపర్ చాలా దూరంగా ఉన్న హంతకుడిని గుర్తించారు.

ఒకే ఒక్క బుల్లెట్ వాడారు. అతడిని చంపేశారు.

ఈ రోజు రాత్రి నేనిలా మీముందు ఉండేవాడిని కాను... ఉండేవాడిని కాను...

(యూ ఆర్ దేర్ యూ ఆర్ దేర్ అంటూ మద్దతుదారుల అరుపులు...)

థాంక్యూ... కానీ నేను కేవలం దేవుడి దయవల్ల మాత్రమే ఇలా మీ ముందు ఈ వేదికపై నిలబడి ఉన్నాను.

గత కొన్నిరోజులుగా వార్తా కథనాలను చూస్తున్నాను.

జరిగిన ఘటన నుంచి బయటపడటం దేవుడి దయ, అదృష్టంగానూ చెబుతున్నారు.

నన్ను సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు చుట్టుమట్టినప్పుడు బహుశా నేను చనిపోయానని ప్రజలు గందరగోళపడ్డారు.

అప్పుడు వారి ముఖాలపై తీవ్ర విచారాన్ని గమనించాను.

నేను బయటకు చూస్తున్నప్పుడు వారి ముఖాలలో చాలా విచారం కనిపించింది.

కానీ నేను వారిని చూస్తున్నాననే విషయం వారు అర్థం చేసుకోలేదు.

వారు అంతా అయిపోయిందని భావించారు.

కానీ, నేను బాగానే ఉన్నానని వారికి తెలియజేయడానికి నేను నా కుడి చేతి పిడికిలిని పైకెత్తి, ఆందోళనతో ఉన్న వేలాదిమందిని చూస్తూ ఫైట్ ఫైట్ ఫైట్ అని అరవడం ప్రారంభించాను.

(మద్దతుదారులు కూడా ఫైట్ ఫైట్ అంటూ అరిచారు)

ధన్యవాదాలు.

నా పిడికిలి బిగించి గాల్లోకి లేపిన తర్వాత అక్కడివారందరూ నేను బాగానే ఉన్నానని గ్రహించి మన దేశం పట్ల గర్వంతో గర్జించడాన్ని మీరంతా చూశారు.

పెన్సిల్వేనియాలో ఆ దురదృష్టకరమైన సాయంత్రం ధైర్యంగా నిలబడిన ఆ దేశభక్తులు చూపిన ప్రేమకు నేను రుణపడి ఉంటాను.

షూటర్ మా తోటి అమెరికన్లలో ఒకరైన కోరీ కంపారేటర్ ప్రాణాలను బలితీసుకున్నాడు.

ఆయనను అందరూ ఓ నమ్మశశక్యం కాని వ్యక్తి అని చెబుతున్నారు.

(చప్పట్లు)

తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు మహా యోధులతో ఈ రోజు మాట్లాడాను.

డేవిడ్ డచ్ ,జేమ్స్ కోపెన్ హావర్ వీరిద్దరూ గొప్ప వ్యక్తులు.

ఆ ముగ్గురు గొప్ప వ్యక్తుల కుటుంబాలతో ఈరోజు నేను మాట్లాడాను.

మా ప్రేమ, ప్రార్థనలు వారితో ఉన్నాయి.

ఒక గొప్ప ర్యాలీ కోసం వచ్చిన వారిని మేం ఎప్పటికీ మరచిపోలేం.

వారందరూ సీరియస్ ట్రంప్‌స్టర్స్ ( ట్రంప్‌ని అభిమానించేవారు)’’ అని కొనియాడుతూ ట్రంప్ ఆ రోజు ఘటనను గుర్తుచేసుకున్నారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)