జో బైడెన్‌ అభ్యర్థిత్వంపై ఎన్నో ప్రశ్నలు, అయినా డెమొక్రాట్లు ఆయన వైపే ఎందుకున్నారు?

జోబైడెన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెడలిన్ హెల్పర్ట్, బ్రజేశ్ ఉపాధ్యాయ్
    • హోదా, బీబీసీ న్యూస్, న్యూయార్క్, వాషింగ్టన్ నుంచి..

మిషిగాన్‌లోని డెట్రాయిట్‌లో ఇటీవల జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు బైడెన్ వేదికపైకి వచ్చినప్పుడు, భారీగా తరలివచ్చిన జనం 'మీరు దిగిపోవడం లేదు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

డెమొక్రటిక్ అభ్యర్థిగా భావిస్తున్న బైడెన్‌కు వందలాది మంది ఆయన మద్దతుదారులు స్వాగతం పలికారు. వారి హర్షధ్వానాల మధ్య ఆయన మాట్లాడుతూ, ''నేను పోటీ చేస్తున్నా, గెలవబోతున్నా'' అని ధీమాగా చెప్పారు.

వేదికపై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే బాగా ప్రజాదరణ పొందిన 'టామ్ పెట్టీ' పాట 'ఐ వోంట్ బ్యాక్‌డౌన్' వచ్చింది. బహుశా, ఇది వయసు పైబడినందువల్ల అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని సూచిస్తున్న డెమొక్రటిక్ పార్టీ సభ్యుల కోసం ప్లే చేసి ఉండొచ్చు.

ఎక్కువ మంది డెమొక్రాట్లు బైడెన్‌ వైపే ఉన్నప్పటికీ, ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు, డెమొక్రటిక్ పార్టీ డోనర్లు, నటులు బైడెన్ వయసు గురించి చేస్తున్న ప్రకటనలే ముఖ్యాంశాల్లో ఎక్కువగా ఉంటున్నాయి.

దాదాపు 80 మందికి పైగా నాయకులు 81 ఏళ్ల బైడెన్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇంకా చాలామంది నేతలు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.

చర్చా వేదికలు, బహిరంగ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించకపోవడం లేదా ఆరోగ్య సమస్యల వంటి వాటి కంటే, బైడెన్ రాజకీయ చరిత్ర, ఆయన సిద్ధాంతాలు, 2020లో డోనల్డ్ ట్రంప్‌పై విజయం వంటి వాటినే చాలా మంది బలంగా విశ్వసిస్తున్నారు

గురువారం జరిగిన మీడియా కాన్ఫరెన్స్‌లో నాటోతో పాటు, తాను రెండోసారి అధ్యక్షుడినైతే తన ప్రణాళికల గురించి బైడెన్ వివరణాత్మక సమాధానాలు ఇచ్చారు. అయితే, ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌‌ను వైస్ ప్రెసిడెంట్ ట్రంప్ అని సంబోధించడమే వార్తా పత్రికలు, చానెళ్లలో హెడ్‌లైన్స్‌గా కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు

అయితే, ఆయన మద్దతుదారులు మాత్రం యుద్ధానికి సిద్ధమవుతున్న తమ 'కమాండర్ ఇన్ చీఫ్' పనితీరుని ప్రశంసిస్తున్నారు. ఈ మీడియా సమావేశాన్ని దాదాపు 23 మిలియన్లకు (2 కోట్ల 30 లక్షలు) మందికి పైగా లైవ్‌లో చూశారు. ఇది ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని వీక్షించిన వారి సంఖ్య కంటే ఎక్కువ.

నార్త్ కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ విలేఖరులతో మాట్లాడుతూ, ''విదేశాంగ విధానంపై తనకు గట్టిపట్టుందని ఆయన చూపించారని నేను భావిస్తున్నా. అది అసాధారణమైన విషయం. విదేశాంగ విధానంపై ట్రంప్ తడబడకుండా ఒక్క నిమిషమైనా మాట్లాడగలరని నేను అనుకోవడం లేదు'' అన్నారు.

బైడెన్‌కు వారసుడిగా భావిస్తున్న కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వార్తాసంస్థ సీబీఎస్‌తో మాట్లాడుతూ, బైడెన్ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అందులో ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు.

పెన్సిల్వేనియా కాంగ్రెస్ సభ్యులు బ్రెండన్ బోయ్‌లే మాట్లాడుతూ, ''విధానాల విషయంలో 'దోషిగా నిర్ధారణ అయిన మోసగాడు' ట్రంప్ కంటే తాను మిలియన్ రెట్లు ఉత్తమమని బైడెన్ నిరూపించుకున్నారు'' అన్నారు.

నవంబర్‌లో జరగనున్న అధ్యక్షఎన్నికల్లో బైడెన్‌ అభ్యర్థిత్వానికి ఈ రాజకీయ నాయకులు మద్దతు తెలపడానికి అధ్యక్షుడిగా బైడెన్ పనితీరు, 2020లో ట్రంప్‌పై ఆయన విజయం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

''అధ్యక్షుడు ఎన్నికల బరిలో ఉండాలనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలు ఆ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారని నేను అనుకుంటున్నా''అని డెమొక్రటిక్ స్ట్రాటజిస్ట్ సైమన్ రోజన్‌బర్గ్ అన్నారు.

''అధ్యక్ష అభ్యర్థిని ఇప్పుడు భర్తీ చేయడం చాలా కష్టం, దాదాపు అసాధ్యం. కాబట్టి భారీ మార్పులు ఉండకపోవచ్చు'' అని ఆయన అన్నారు.

నామినీ ఎవరనే విషయంలో మాత్రం 'ఆరోగ్యకర చర్చ'' జరుగుతోందని సైమన్ పేర్కొన్నారు.

అమెరికా

ఫొటో సోర్స్, Getty Images

అలాగే, దాదాపు 40 మంది సభ్యులున్న కాంగ్రెషనల్ హిస్పానిక్ కాకస్, 60 మంది సభ్యులున్న కాంగ్రెస్ బ్లాక్ కాకస్‌తో పాటు ఇతర సమూహాలు కూడా బైడెన్ అభ్యర్థిగా ఉండాలని చెప్పాయి.

తన ప్రత్యర్థి డోనల్డ్ ట్రంప్ మాదిరిగా కాకుండా బైడెన్ పౌరహక్కులకు కట్టుబడి ఉన్నారని బ్లాక్ కాకస్‌తో పాటు చాలామంది నల్లజాతీయులైన ఓటర్లు భావిస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రచార సలహాదారు అమేషియా క్రాస్ అన్నారు.

''డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో ఉంటే ఎలా ఉంటుందో వారు అర్థం చేసుకున్నారు'' అని ఆమె అన్నారు. ''ఆయన వైవిధ్యం, సమానత్వం, కలుపుగోలుతనాన్ని వ్యతిరేకించిన వ్యక్తి'' అన్నారు.

వామపక్ష భావజాలమున్న ఎంతోమంది రాజకీయ నాయకుల మద్దతు కూడా బైడెన్‌కి ఉంది. అలాంటి వారిలో గతంలో బైడెన్ విధానాలు మరీ మధ్యేమార్గంగా ఉన్నాయని విమర్శించిన న్యూయార్క్ కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, వెర్మాంట్‌ సెనేటర్ బెర్నీ శాండర్స్ వంటి వారున్నారు.

ట్రంప్ అధ్యక్షుడైతే పౌరులు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కులతో పాటు వాతావరణ మార్పుకి సంబంధించిన విధానాలకు కలిగే నష్టాన్ని చాలా మంది గుర్తించారని క్రాస్ చెప్పారు.

''ఇవి ప్రగతిశీల వామపక్షాలకు కీలక విషయాలు. నిజానికి, ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఈ అంశాలపై పనిచేశారు'' అని ఆమె అన్నారు.

అయితే, ఇప్పటి వరకూ డెమొక్రాట్లు బలంగా ఉన్న డిస్ట్రిక్ట్స్ నుంచే బైడెన్‌కు మద్దతు లభిస్తోంది. గట్టిపోటీ ఎదుర్కొంటున్న డెమొక్రాట్లు బైడెన్ తమ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

''వారి ఆందోళనలను అధ్యక్షుడు గౌరవించాలి. వాటిని అధిగమించేదుకు ప్రయత్నించాలి. ఇంకా దూకుడుగా వ్యవహరిస్తే ఉత్తమం'' అని రోజన్‌బర్గ్ అభిప్రాయపడ్డారు.

జోబైడెన్

ఫొటో సోర్స్, Getty Images

బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న వాదనలు పెరుగుతున్నప్పటికీ, ఓటర్ల మద్దతు భారీగా కోల్పోలేదని ఇటీవల నిర్వహించిన ఒక సర్వే సూచించినట్లు తెలుస్తోంది.

ట్రంప్ - బైడెన్ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు ది వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ, ఇప్సోస్ ప్రచురించిన ఒక సర్వేను బైడెన్ ప్రచార విభాగం ఇటీవల ఉదహరించింది. కానీ, ఇవి చర్చకు ముందు పరిస్థితులను సూచిస్తున్నాయి.

అయితే, మూడింట రెండొంతుల మంది అమెరికన్లు బైడెన్ తప్పుకోవాలని కోరుకుంటున్నట్లు ఆ సర్వే వెల్లడించింది.

హాలీవుడ్ ప్రముఖులతో పాటు మరికొంతమంది మద్దతును కూడా అధ్యక్షుడు కోల్పోయారు. ఈ వారం మొదట్లో జార్జ్ క్లూనీ బైడెన్‌‌‌ గురించి రాసిన వ్యాసాన్ని అనుసరిస్తూ, నటి యాష్లే జుడ్ 'యూఎస్ఏ టుడే'లో శుక్రవారం రాసిన వ్యాసంలో పార్టీకి బలమైన అభ్యర్థి కావాలని, బైడెన్ రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు.

డెమొక్రటిక్ పార్టీకి నిధుల సమీకరణలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న విట్నీ టిల్సన్ కూడా బైడెన్ విషయంలో నిరాశ వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం బీబీసీతో మాట్లాడుతూ, బైడెన్ పోటీ నుంచి వైదొలిగే అవకాశం పెరుగుతోందని తాను అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, డెమొక్రటిక్ పార్టీకి చెందిన మరికొందరు దాతలు బైడెన్‌‌కు మద్దతుగా నిధులు సేకరిస్తున్న సంస్థ ఫ్యూచర్ ఫార్వర్డ్‌తో మాట్లాడుతూ, 90 మిలియన్ డాలర్ల నిధులను నిలిపివేసినట్లు చెప్పారు. బైడెన్ ఉపసంహరణ కోసం వారు వేచిచూస్తున్నారు.

అయితే, డెమొక్రటిక్ పార్టీకి నిధులు సమకూర్చే ప్రధాన దాతలు మాత్రం బైడెన్‌ వైపే ఉన్నారు.

జోబైడెన్

ఫొటో సోర్స్, Getty Images

గత రెండు దశాబ్దాలుగా డెమొక్రటిక్ పార్టీ కోసం నిధులు సేకరిస్తున్న శేఖర్ నరసింహన్ మాట్లాడుతూ, బైడెన్ ప్రణాళికలు ఏమాత్రం మారలేదని అన్నారు.

''ఏం జరుగుతుందో మా కళ్లతో చూస్తున్నాం. ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో వింటున్నాం. కానీ, మౌనంగా మా పని మేం చేసుకుపోతున్నాం'' అన్నారు.

''అధ్యక్ష రేసులో ఉండాలా? వద్దా? అనేది అధ్యక్షుడి నిర్ణయం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటాం'' అని నరసింహన్ అన్నారు.

ఆయన గెలుస్తారన్న నమ్మకంతో బైడెన్‌కు మద్దతు ఇస్తున్నట్లు నరసింహన్ చెప్పారు.

''ఈ ఎన్నికల్లో మిచిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌లలో 50 వేల కంటే తక్కువ ఓట్ల తేడాతోనే గెలుపోటములు నిర్ణయమవుతాయని, అక్కడ మేం స్థానికంగా బలంగా ఉన్నామని, గెలిచేందుకు అవసరమైన వనరులు కూడా ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

( బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)