డార్లింగ్ మూవీ రివ్యూ: 'అపరిచిత భార్య, అమాయక భర్త' కథ ఆకట్టుకుందా, ప్రియదర్శి నటన ఎలా ఉంది?

ప్రియదర్శి , నభా నటేష్

ఫొటో సోర్స్, Primeshow Entertainment /FB

ఫొటో క్యాప్షన్, భార్యను ఎలా అర్ధం చేసుకోవాలి? అనే కొత్త కోణంలో చెప్పిన కథ ఇది.
    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి, ‘బలగం’, ‘మల్లేశం’, ‘సేవ్ ది టైగర్స్’తో ఫ్యామిలీ సినిమాలలో తనదైన ముద్రతో సాగుతున్న నటుడు ప్రియదర్శి పులికొండ. ఆయన నటించిన తాజా సినిమా ‘డార్లింగ్’. వై దిస్ కొలవెరీ అనేది ఉపశీర్షిక.

పెళ్ళి, హానీమూన్ గురించి కలలతో పెరిగిన ఓ యువకుడు తనకు పరిచయం లేని,పేరు కూడా తెలియని ఒక అమ్మాయిని ఐదు గంటల పరిచయంతో ఎలా పెళ్ళి చేసుకున్నాడు? ఆ పెళ్ళి అతని జీవితాన్ని ఎలా మార్చేసింది? భార్యాభర్తల మధ్య అనుబంధాలు చిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న సందర్భంలో వైవాహిక విజయానికి భార్యను ఎలా అర్ధం చేసుకోవాలి? అనే కొత్త కోణంలో చెప్పిన కథ ఇది.

ఒక స్టేబుల్ జీవితాన్ని కోరుకునే మధ్యతరగతి భర్త, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియని భార్యతో పడిన పాట్ల కథ ఇది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ప్రియదర్శి, నభానటేష్

ఫొటో సోర్స్, Primeshow Entertainment /FB

ఫొటో క్యాప్షన్, రాఘవ పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు.

ప్రియదర్శి మ్యాజిక్ చేశాడా?

మన చుట్టూ ఉండే మనుషుల్లో ఒకడిగా తన బాధలను, సంతోషాలను తెర మీద పండించగల నటుడు ప్రియదర్శి. ఈ సినిమాలో మనలో ఒకడిగా రాఘవ పాత్రలో ప్రియదర్శి ప్రేక్షకులకు కనిపిస్తాడు. తన మార్క్‌తో ప్రియదర్శి మెప్పించాడు. తనదైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.

నభా నటేష్:

‘డిస్కో రాజా’, ‘సోలో బతుకే సో బెటర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సినిమాల్లో నటించిన నభా నటేష్ ఈ సినిమాలో నాయిక పాత్రలో నటించారు.

‘స్ప్లిట్ పర్సనాలిటీ ‘ ఉన్న ఈ పాత్రకు నభా ప్రాణం పోశారు.

మూడ్ స్వింగ్స్ ,కారెక్టర్ వేరియేషన్ చూపించడంలో ఆమె చూపిన ప్రతిభ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది.

విష్ణు,కృష్ణతేజ:

సినిమా మొత్తం సీరియస్ టోన్‌తో నడున్న టైమ్‌లో, దాన్ని లైట్ నోడ్ మీద నడిపించిన పాత్రలుగా విష్ణు, కృష్ణతేజ కనిపించారు. వీరిద్దరూ హీరోకు స్నేహితులుగా నటించారు.

ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మారడానికి ఈ ఇద్దరి నటన ప్లస్ అయ్యింది.

సైకాలజిస్ట్‌గా అనన్య, రాఘవ తండ్రిగా మురళీధర్, మామయ్యగా రఘు బాబు నటించారు.

కామియో రోల్స్:

సుహాస్, నిహారికా కొణిదెల అతిధి పాత్రల్లో కనిపించినా, రాఘవ జీవితంలో ఒకరు, ప్రియ జీవితంలో ఇంకొకరు ముఖ్య భూమిక పోషించడం వల్ల నటనకు ఆస్కారం ఉన్న పాత్రలుగా మారడం, కాస్టింగ్‌‌లో తీసుకున్న జాగ్రత్తలను స్పష్టం చేస్తుంది.

ప్రియదర్శి, నభానటేష్

ఫొటో సోర్స్, Primeshow Entertainment /FB

ఫొటో క్యాప్షన్, ప్రతి స్త్రీ ఈ సినిమాలోని 'ప్రియ'లో ఉన్న వివిధ పర్సనాలిటీల్లో ఏదో ఒకదానితోనైనా కనెక్ట్ అవుతారు.

ఎమోషనల్ రోలర్ కాస్టర్

కామెడీ ఎంటర్‌టైనర్‌లో 'ఎమోషనల్ రైడ్'కు ఉండే స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. కానీ ప్రియదర్శి సినిమాల్లో అన్ని వర్గాల ఆడియన్స్‌తొ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి.

ఈ సినిమా ఫస్ట్ హాఫ్ హాస్యానికే పరిమితమైనట్టు అనిపించినా, సెకండ్ హాఫ్‌లో ప్రేక్షకుడిని ఎమోషన్స్ డ్రైవ్‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అప్పటివరకు ఊహించే స్థాయిలో ఉన్న కథ సెకండ్ హాఫ్‌లో టైట్ స్క్రీన్ ప్లేతో, ఊహించని మలుపులతో ఊపందుకుంది. కథనం వేగంలోని ఈ ఎత్తుపల్లాలు మంచి సినిమాటిక్ అనుభూతి ఇస్తాయి.

కథ చాలా సింపుల్. కానీ ఆ కథ నేపథ్యంలో నాయిక పాత్రలోని 'స్ప్లిట్ పర్సనాలిటీ' కథకు కొత్త రూపం తీసుకువచ్చింది.

బాల్యం నుంచి 'సెక్సువల్ అబ్యూజ్'కి గురయ్యే ఆడపిల్లలు మగవాళ్ళ నుంచి తమను తాము ఎప్పుడూ రక్షించుకోవాలనుకుంటారు.

కానీ సమాజంలో ప్రత్యక్షంగా ఈ కోపాన్ని, ద్వేషాన్ని వెళ్ళగక్కే ఆస్కారం లేకపోవడం వల్ల వారు మానసిక సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది.

దీనికి ఔట్‌లెట్‌గా ‘స్పిట్‌పర్సనాలిటీ’ని ఎన్నుకోవడం,దానికి హ్యూమర్ ను జోడిస్తూనే,ఆ వివిధ పర్సనాలిటీలు ఏర్పడే క్రమంలో స్త్రీ జీవితంలోని అన్ని దశల్లో ఎదుర్కొనే, చెప్పుకోలేని సమస్యల గురించి మరీ ఎక్కువగా కాకుండా, సున్నితంగా చెప్పడం ఈ సినిమా స్క్రీన్ ప్లే‌లో ‘అండర్ స్కోర్ టోన్.’

బాల్యం నుంచి కుటుంబం కోసమో, సమాజం కోసమో స్త్రీలు తమ ఆశయాలను అణచుకుంటూ ఉంటారు. వాటికి ప్రతిస్పందనగా వారి మనసులో జన్మించే అనేక రూపాలకు స్వరాన్ని ఇచ్చిన సినిమా ఇది.

ట్రామా స్త్రీలు వైవాహిక జీవితం పట్ల ఎలా విముఖత చూపుతారానే విషయాన్ని లైట్ నోట్ లో చెప్పిన సినిమా కూడా ఇది.

ఎక్కడో ఒక చోట ప్రతి స్త్రీ ఈ సినిమాలోని 'ప్రియ'లో ఉన్న వివిధ పర్సనాలిటీల్లో ఏదో ఒకదానితోనైనా కనెక్ట్ అవుతారు.

డార్లింగ్ వై దిస్ కొలవెరి సినిమా టీమ్

ఫొటో సోర్స్, Primeshow Entertainment /FB

ఫొటో క్యాప్షన్, ఆరోగ్యకరమైన హాస్యంతో వచ్చిన సినిమానే ‘డార్లింగ్’-వై దిస్ కొలవెరి?

బోర్ కొట్టకుండా తీశారు

కొత్త కథను,ఆసక్తి కలిగించే అంశాలతో చెప్పడంలో అశ్విన్ రామ్ పూర్తిగా ఈ సినిమాలో విజయం సాధించారనే చెప్పుకోవచ్చు.

దాదాపుగా రెండున్నర గంటలకు పైగా ఉన్న రన్ టైమ్ లో ఎక్కడా బోర్ కొట్టకుండా తీసిన సినిమా ఇది. గంభీర నేపథ్యాకి హ్యూమర్‌ని జోడించి కూడా, కథ పలచబడకుండా జాగ్రత్తగా తీసిన సినిమా ఇది.అశ్విని రామ్ తన డైరెక్షన్ మార్క్ ను నిలబెట్టుకున్నారు.

పాటలు ఎలా ఉన్నాయి?

‘నేను శైలజ’, ‘అఆ’ లాంటి సినిమాల నుంచి హీరో ఎమోషనల్ బ్రేక్ డౌన్ ను ఒక పాటలో చిత్రించడం ట్రెండ్ గా మారింది. ఇందులో ‘ఖలాసే’ పాట కూడా అదే ట్రెండ్ లో నడిచింది.

కాసర్ల శ్యామ్,రామ్ మిరియాల కాంబినేషన్ లో వచ్చే పాటల మీద ఉండే అంచనాల స్థాయిని అందుకున్న పాట ఇది.

కొరియోగ్రఫీ కూడా పియదర్శి బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవ్వడం ఈ పాటకు ప్లస్ పాయింట్.

‘మనసంటూ ఒకటుందని లోపల’ లిరిక్స్ మెలోడియస్ గా ప్రేక్షకులు మళ్ళీ హమ్ చేసేలా ఉన్నాయి.

పాజిటివ్ వైబ్స్ తో ఉన్న ‘నిన్ను నను మోసి మోసి’ ,మంగ్లీ పాడిన ‘తస్సదియా’ పాటలు కూడా మంచి లిరికల్ మ్యాజిక్ చేశాయి.

వివేక్ సాగర్ మ్యూజిక్, కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఈ సినిమాలో మ్యాజిక్ చేశాయి.

ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఫాస్ట్ పేస్ లో నడిచి, ఓపెనింగ్ ఇంకాస్త బలంగా ఉండి, కొన్ని సన్నివేశాల్లో రాఘవ పాత్ర ప్రియ పాత్రకు బలమైన కౌంటర్ గా ఉండి ఉంటే సినిమా ఇంకా గొప్పగా ఉండేది. కానీ ఓవర్ ఆల్ గా 'డార్లింగ్' క్లీన్, నీట్ సినిమా అని చెప్పొచ్చు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)