మనమే సినిమా రివ్యూ: ఎమోషనల్ స్క్రీన్‌ప్లేతో శర్వానంద్ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగాడా?

ఫొటో సోర్స్, Sharwanand @ImSharwanand
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
ఫీల్ గుడ్ సినిమాలతో చార్మింగ్ స్టార్‌గా ఎదుగుతున్న నటుడు శర్వానంద్. ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో వచ్చిన శర్వానంద్ తాజా సినిమా 'మనమే.'
ఇద్దరు అపరిచితులైన ఆడ, మగ ఒక రెండేళ్ళ పిల్లవాడి కోసం కలిసి ఉండే క్రమంలో పుట్టిన ప్రేమ కథ ఈ సినిమా.
ఈ ప్రేమ కథకు హాస్యం, ఎమోషనల్ ట్రాక్ కూడా కలిసి ఉన్న కథ ఇది .
ఈ కథలో ముఖ్య పాత్ర విక్రమ్ (శర్వానంద్ ). అతను బాధ్యత లేని వాడు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ, తాగుతూ, అమ్మాయిల వెనుక తిరిగే ఒక రకమైన జులాయి పాత్రగానే ప్రేక్షకులకు మొదటి సన్నివేశాల్లోనే పరిచయమవుతాడు.
ఇటువంటి వాడికి ప్రాణస్నేహితుడు అనురాగ్. అనురాగ్, అతని భార్య మరణంతో అతని రెండేళ్ళ కొడుకు బాధ్యత ఇంకో అమ్మాయితో సహా విక్రమ్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆ అమ్మాయి ఎవరు? నిశ్చితార్థం జరిగిన ఆమె అతనితో కలిసి ఎందుకు ఉంది? చివరకు ఆ బాబు ఏమయ్యాడు? ఇదే ఈ సినిమా కథ.


ఫొటో సోర్స్, Sharwanand @ImSharwanand
బలమైన అంశాలు
సినిమా ఫస్ట్ హాఫ్‌లో శర్వానంద్ నటన బాగుంది. కొన్ని చోట్ల కామెడీ టైమింగ్ బాగా కుదిరింది.
శర్వానంద్ బాగా నటించగలిగే ఫీల్ గుడ్ కథ కావడం వల్ల అలవోకగా నటించాడు.
ఒక బాధ్యత లేని యువకుడిగా జాలీగా జీవితాన్ని గడిపే హీరో స్నేహితుడి కోసం ఒక పెద్ద బాధ్యతను తీసుకోవడం కథకు బలమైన ఎమోషన్ నేపథ్యం ఉండేలా చేసింది.
స్టోరీ లోకేషన్స్, పాటలు ఈ సినిమాలో 'మ్యాజిక్ ఎలిమెంట్స్'లా బలాన్ని ఇచ్చాయి.
పాత్రల గందరగోళం
ఒక ఎమోషనల్ స్టోరీలో పాత్రలు చాలా ముఖ్యం. ఈ సినిమాలో అనేక పాత్రలు ఉన్నా, అవి ఎందుకు ఉన్నాయో అర్థం కాదు. వాటికి కథతో ఉన్న సంబంధం ప్రత్యక్షంగా ఏమి కనబడదు.
ఈ సినిమాలో ట్రావెల్ గైడ్ పాత్ర, ప్రవర్తన వింతగా ఉంటుంది. ఈ పాత్ర చిత్రణ లవ్ ట్రాక్‌కు బలంగా మారలేదు.
అలాగే సీత, రాహుల్ రామకృష్ణ, సచిన్ కేడెకర్, విజయ్ కాంత్ లాంటి నటులకు స్కోప్ ఉండి కూడా వారి పాత్రలు బలవంతంగా పెట్టినట్టు ఉండటం వల్ల కథ బలహీన పడింది.

ఫొటో సోర్స్, Sharwanand @ImSharwanand
ప్రతి నాయక పాత్ర ఉందా? లేదా?
ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో రాహుల్ రవీంద్రన్ నటించారు. అయితే, హీరోకి, విలన్‌కి మధ్య ఉండే ఘర్షణ వల్ల వచ్చే సస్పెన్స్ ఈ సినిమాలో లేదు.
అసలు అపరిచిత పాత్రగా పరిచయమయ్యే ఈ పాత్ర చివరకు అలాగే మాయమైపోతుంది.
ఆ పాత్ర ఈ కథలో ఉన్నా, లేకపోయినా ఒకటే అన్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది.
ఈ క్యారెక్టర్ వల్ల కథలో మంచి మలుపులు ఉంటాయని ఊహించే ప్రేక్షకుడికి అర్థం కాకుండానే కథ మధ్యలోనే ఈ పాత్ర కనబడకుండా పోతుంది.
లవ్ ట్రాక్ వర్కవుట్ అయ్యిందా?
కథలో లవ్ ట్రాక్‌కు అనుకూలమైన నేపథ్యం ఉండేలా స్క్రీన్ ప్లే బలంగా ఉండకపోవడం వల్ల ఈ ట్రాక్ చాలా కృతకంగా ఉన్నట్టు అనిపిస్తుంది.
అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయిన హీరోయిన్ హీరోని ప్రేమించాలంటే ఏదో బలమైన ఘటనలు జరగాలి.
కేవలం ఒక పిల్లవాడి కోసం కలిసి ఉండటం అన్నది సరిపోదు. ఆ 'లవ్ మ్యాజిక్' మిస్ అయ్యిందనే చెప్పాలి.

ఫొటో సోర్స్, Sharwanand @ImSharwanand
'ఖుషి' నటన కథకు బలమైందా ?
ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర ఖుషి. రెండేళ్ళ ఆ పిల్లవాడిని హీరో, హీరోయిన్లు పెంచడం చాలా అసహజంగా అనిపిస్తుంది.
కేర్ టేకర్స్‌గా మొదట్లో బాగానే అనిపించినా, ఆ తర్వాత కథ అంతా ఒకే రకంగా సాగుతుంది.
ఆ పిల్లవాడితో ఎమోషనల్ బాండింగ్ కనిపించే సీన్స్ ఎక్కువ లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్.
ప్రతి సినిమాలో దర్శకుడి మార్క్ ఉంటుంది. ఈ సినిమాలో ఆ మార్క్ మిస్ అయ్యింది.
ఫస్ట్ హాఫ్‌లో బాగా అనిపించే శర్వానంద్ నటన కూడా సెకండ్ హాఫ్‌లో ఆ నటనకు ఆస్కారం ఇచ్చే సన్నివేశాలు, నేపథ్యం లేకపోవడం వల్ల ఆ మ్యాజిక్ కూడా సెకండ్ హాఫ్‌లో పని చేయలేదు.
చదువులు-ఉద్యోగాలు పేరిట తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లల, తల్లిదండ్రుల మధ్య ఉండే 'మిస్సింగ్ ఎలిమెంట్'ను, తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఎమోషన్స్ ను, లవ్ -కామెడీ ట్రాక్స్‌తో చెప్పే ప్రయత్నం చేసే కథ ఇది.
పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పాత్రల చిత్రీకరణ వైఫల్యం వల్ల శర్వానంద్ మ్యాజిక్ కూడా పని చేయని సినిమా ఇది.
(గమనిక: అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- అగ్నిబాణ్: 3డీ ప్రింటర్‌తో తయారు చేసిన ప్రపంచంలోనే తొలి రాకెట్ ప్రత్యేకత ఏంటి?
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- మియన్మార్: ‘టాటూ ఉందని చర్మం కోసేశారు.. దాహమేస్తుందంటే మూత్రం సీసాలిచ్చారు’
- ‘గాంధీ’ సినిమాకు ముందు ఆయన గురించి ప్రపంచానికి తెలియదా, మోదీ ఏమన్నారు?
- కోటిన్నర జీతం, ఇల్లు, ఇతర సౌకర్యాలు.. ఈ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














