హరోంహర రివ్యూ: ‘గాడ్ ఆఫ్ వార్’ గా సుధీర్ బాబు ట్రెండ్ సెట్ చేయగలిగాడా?

హరోంహర

ఫొటో సోర్స్, FB/Sudheerbabu

    • రచయిత, శృంగవరపు రచన
    • హోదా, బీబీసీ కోసం

ప్రేమ కథలతో మొదలుపెట్టి మాస్, యాక్షన్ స్టార్‌గా ఎదుగుతున్న నటుడు సుధీర్ బాబు. ఆయన తాజా సినిమా ‘హరోంహర.’

కథే౦టి?

ఒక ల్యాబ్ అసిస్టెంట్‌గా చేరిన సుబ్రహ్మణ్యం (సుధీర్) ఎందుకు గన్స్, గ్యాంగ్స్ దారిలోకి వెళ్ళాల్సి వచ్చింది? కుప్పంలో ప్రజలకు అతను దేవుడుగా, ‘గాడ్ ఆఫ్ వార్’గా ఎలా మారాడు అన్నదే స్టోరీ.

నేపథ్యం:

పట్టున్న కథనే ‘హరోంహర-ది రివోల్ట్’ కోసం ఎంచుకున్నాడు దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక. కథలో సాగతీతలు లేవు. కథనాన్ని పక్కదారి పట్టించే అంశాలు ఏమీ లేవు. కథ విషయంలో దర్శకుడు తీసుకున్న జాగ్రత్త స్క్రీన్‌ప్లే లో స్పష్టంగా ప్రేక్షకులకు కనిపిస్తుంది.

కథకు తగ్గ నేపథ్యం నిర్మించడంలోనూ అదే జాగ్రత్త తీసుకున్నారు. కుప్పం ప్రాంతంలో ప్రజల్లో భయాన్ని పుట్టించే పరిస్థితులు ఉన్న సందర్భాన్ని కూడా ప్రారంభ సన్నివేశంలోనే రక్తి కట్టేలా చూపించడంతో ఈ సినిమాలో ప్రతినాయక పాత్రల దౌర్జన్యం, బలం కనబడతాయి. ఇక్కడే హీరో పాత్ర మీద ప్రేక్షకులకు అంచనాలు పెరుగుతాయి. హీరో పాత్రను పరిచయం చేయడానికి ముందు సృష్టించిన పరిస్థితులు ఈ కథకు ప్లస్ పాయింట్.

వాట్సాప్ చానల్
హరోంహర

ఫొటో సోర్స్, FB/Gnanasagar Dwaraka

సుబ్రహ్మణ్యం పాత్ర బలమైందా?

ఈ కథలో నాయకుడు సుబ్రహ్మణ్యం. ఈ సినిమా స్క్రీన్ ప్లే అంతా ‘సుబ్రహ్మణ్యం’ను ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఒక యాక్షన్ హీరోగా చూపించడంపైనే దృష్టి పెట్టారు. నాయకుడు చుట్టూ కథ నడిస్తే అనేక సందర్భాల్లో అది సినిమాకు బలం అవుతుంది. కానీ, అనేక సన్నివేశాల్లో ‘సుబ్రహ్మణ్యం’ పాత్రకు సుధీర్ బాబు సంపూర్ణ స్థాయిలో న్యాయం చేయలేదని అనిపిస్తుంది.

సుధీర్ బాబు నటన

ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం పాత్రకు ఒక మేనరిజం ఉన్నా అది సుధీర్ బాబుకి నప్పలేదు. అలాగే సినిమాకు భాష ప్రాణం. యాసలో ఉండే వైవిధ్యం వల్ల అనేక సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కానీ, ఆ యాసకు ఒక నేపథ్యం ఉండాలి. పాత్రల కుటుంబ నేపథ్యం, నివసించే జీవన విధానానికి దగ్గరగా ఉంటేనే ఆ యాస సినిమాకు బలం అవుతుంది.

హరోంహర ఒక యాక్షన్ సినిమా. అందులో నాయకుడు కథ జరిగే ప్రాంతానికి చెందినవాడు కాదు. ఇందులోని పాత్రలు మాట్లాడుతూ ఉంటే బలవంతంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యాస, సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు)కు నప్పకపోవడంతో హీరో డైలాగ్స్ ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి.

ఎమోషనల్ సన్నివేశాల్లో అనేక చోట్ల సుధీర్ బాబు కథకు తగ్గ ఎమోషన్స్ పండించలేక పోయారు. ఇంత మంచి కథకు సుధీర్ బాబు నటనే కొన్ని చోట్ల మైనస్ పాయింట్‌గా మారింది.

హరోంహర

ఫొటో సోర్స్, FB/Gnanasagar Dwaraka

మిగతా వారెలా చేశారు?

కథలో బలమైన పాత్ర పళనిస్వామి. ఈ పాత్రలో సునీల్ అద్భుతంగా నటించారు. ఈ పాత్ర చిత్రణ కూడా సినిమాకు ఒక ప్లస్ పాయింట్.

సుబ్రహ్మణ్యం తండ్రి పాత్రలో నటించిన జయ ప్రకాష్, దేవి పాత్రలో మాళవిక శర్మ కూడా బాగా నటించారు.

కానీ, ప్రతినాయక పాత్రలు అనేకం ఉన్నప్పుడు క్యాస్టింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ సినిమాలో లోపించినట్టు అనిపిస్తుంది.

ఇతర అంశాలు

ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో స్టంట్స్ కొరియోగ్రఫీ కూడా బావుంది. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల తప్పా దాదాపుగా అంతా బాగుంది.

హరోంహర

ఫొటో సోర్స్, FB/Gnanasagar Dwaraka

కథలో వంక పెట్టలేం

కథ పరంగా వంక పెట్టలేని సినిమాలు కూడా అనేకసార్లు అంచనాలను అందుకోలేవు. ‘హరోంహర’ ఈ కోవకు చెందినదే. ఈ సినిమా టైటిల్ ఒక ఆసక్తిని రేకెత్తిస్తే, కథ మధ్య నుంచి గన్స్&గ్యాంగ్స్ వైపు మళ్ళడంతో పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా మారుతుంది.

యాక్షన్ సన్నివేశాల్లో బాగా కనిపించిన సుధీర్ బాబు, హీరో ఆ మార్గంలో వెళ్ళడానికి కారణమైన ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్‌లో మాత్రం ‘ఎమోషనల్ హ్యూమన్’ గా మెప్పించలేకపోయారు.

బలహీనులపై బలవంతులు చేసే దౌర్జన్యం సాధారణంగానే ఒక రకమైన ఆవేశాన్ని కలిగిస్తుంది. కానీ, కథలో ఎలాంటిదేమీ కనిపించదు. ఒక వైపు ఎమోషన్, మరో వైపు యాక్షన్ ఉన్న ఈ కథలో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే బలమైన సన్నివేశాలు పెద్దగా లేకపోవడం ఈ సినిమాకు ఒక మైనస్ పాయింట్.

సినిమాకు మంచి కథ ఎంత ముఖ్యమో, ఆ కథకు తగ్గట్టు పాత్రలు నటించడం కూడా అంతే ముఖ్యం. మంచి కథ విషయంలో మార్కులు కొట్టేసినా, నటుల నటన విషయంలో ఆకట్టుకోలేని సినిమా ‘హరోంహర’.

(గమనిక: రచయిత అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)