రాబందులు: తాము మరణిస్తూ మనుషులను చంపేస్తున్న పక్షులు

రాబందులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్‌లో ఒకప్పుడు రాబందులు పెద్ద సంఖ్యలో కనిపించేవి.

పశువుల కళేబరాల కోసం వెతుకుతూ, ఆకాశంలో ఈ పక్షులు ఎగురుతూ ఉండేవి.

కొన్నిసార్లు విమానాశ్రయాల్లో విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు జెట్ ఇంజిన్లలో చిక్కుకుపోయి పైలట్లకు ప్రమాదకరంగా కూడా మారేవి.

కానీ, రెండు దశాబ్దాలుగా భారత్‌లో రాబందుల సంఖ్య బాగా తగ్గిపోయింది.

అనారోగ్యం పాలైన పశువులకు చికిత్స చేసేందుకు ఇస్తున్న మందులే దీనికి కారణం.

1990 మధ్య కాలంలో 5 కోట్లుగా ఉన్న రాబందుల సంఖ్య ఇప్పుడు దాదాపు సున్నా అయిపోయింది.

పశువులకు వాడే చౌకైన నాన్-స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్ ‘డైక్లోఫెనాక్‌’ రాబందులకు ప్రాణాంతకంగా మారుతోంది.

చాలా రాబందులు కిడ్నీలు విఫలమై చనిపోతున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది.

పశువులకు డైక్లోఫైనాక్ వాడకాన్ని ఆపేయాలని 2006లో నిషేధం విధించినప్పటి నుంచి కొన్నిప్రాంతాల్లో రాబందుల మరణాలు తగ్గాయి.

కానీ, ఇప్పటికే మూడు జాతుల రాబందుల సంఖ్య 91 శాతం నుంచి 98 శాతం వరకు తగ్గిపోయినట్లు ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ రిపోర్టులో వెల్లడైంది.

‘‘రాబందుల జీవక్రియ రేటులో అసాధారణగా చర్యలు మేం గుర్తించాం. అవి డైక్లోఫెనాక్‌ను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఫలితంగా వాటి కిడ్నీలు దెబ్బతింటున్నాయి’’అని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ప్రిన్సిపల్ సైంటిస్టు విభు ప్రకాశ్ కూడా అంతకుముందు చెప్పారు.

ఇది మాత్రమే కాక, తాజా అధ్యయనంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది.

పశువుల కళేబరాలను తినే ఈ భారీ పక్షులు చనిపోవడంతో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, ఇన్‌ఫెక్షన్లు పెరిగిపోయాయని అమెరికన్ ఎకనామిక్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2005 మధ్య కాలంలో భారత్‌లో ఏడాదికి లక్ష మందికి పైగా ఇలాంటి కారణాలతో మరణించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
రాబందులు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పశువుల కళేబరాలను ఏరుకుని తినే రాబందులు

‘‘రాబందులను ప్రకృతిలో పారిశుద్ధ్య సేవలందించే జీవులుగా భావిస్తుంటారు. ఇవి చనిపోయిన జంతువులను తింటాయి. అంటే, చనిపోయిన జంతువుల శరీరాల్లోని బ్యాక్టీరియాలు, పాథోజెన్లు వ్యాపించకుండా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. రాబందులే లేకపోతే చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్లి వ్యాధులు వ్యాపిస్తాయి’’ అని అధ్యయన సహ రచయిత షికాగో యూనివర్సిటీకి చెందిన షికాగో హారిస్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇయాల్ ఫ్రాంక్ చెప్పారు.

‘‘ప్రజల ఆరోగ్యం కాపాడడంలో రాబందుల పాత్రను అర్థం చేసుకుని, ఈ వన్యప్రాణులను సంరక్షించే ప్రాధాన్యాన్ని చాలా తక్కువగా అంచనావేశారు. పర్యావరణ వ్యవస్థలో మన జీవితాలను ప్రభావితం చేసే చాలా పనులను ఇవి చేస్తుంటాయి’’ అని చెప్పారు.

రాబందుల జనాభా కనిష్ఠ స్థాయిలకు పడిపోయిన తర్వాత భారత్‌లోని కొన్ని జిల్లాల్లో మనుషుల మరణాల రేట్లను ఫ్రాంక్, ఈ అధ్యయన మరో సహ రచయిత అనంత్ సుదర్శన్ పోల్చి చూశారు.

రాబందులు తగ్గిపోయిన తర్వాత పరిస్థితులు, ముందు నాటి పరిస్థితులను పరిశీలించారు. రేబిస్ లాంటి వ్యాధుల వ్యాప్తి, అడవి కుక్కల సంఖ్య, నీళ్లల్లో పాథోజెన్ స్థాయిలు వంటివన్నీ వీరు పరిశీలించారు.

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అమ్మకాలు విపరీతంగా పెరిగిన తర్వాత, రాబందుల సంఖ్య తగ్గిపోయిందని వారు గుర్తించారు.

ఈ పక్షులు ఒకప్పుడు ఉండి, ఇప్పుడు కనుమరుగైన జిల్లాల్లో మనుషుల మరణాల రేటు 4 శాతానికి పైగా పెరిగిందని పేర్కొన్నారు.

పెద్ద ఎత్తున పశువుల కళేబరాలు ఉండి, వ్యర్థాలు సర్వసాధారణంగా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని కూడా పరిశోధకులు గుర్తించారు.

రాబందులు బాగా తగ్గిపోయిన కారణంగా 2000 నుంచి 2005 మధ్య కాలంలో మనుషుల మరణాలలో పెరుగుదుల నమోదైందని.. ఏటా సుమారు లక్ష మంది అదనంగా చనిపోవడానికి ఇదే కారణమని ఈ పరిశోధకులు అంచనావేశారు.

ముందస్తు మరణాలతో సంభవించే ఆర్థిక నష్టం లేదా మరణ నష్టం ఏడాదికి 69 బిలియన్ డాలర్లకు పైగా(సుమారు రూ.5,77,754 కోట్లుగా) ఉందని పరిశోధకులు చెప్పారు.

ఈ మరణాలకు కారణం వ్యాధులు, బ్యాక్టీరియాలేనని అధ్యయనకర్తలు పేర్కొన్నారు.

రాబందులు

ఫొటో సోర్స్, AFP

రాబందులు ఈ బ్యాక్టీరియాను పర్యావరణం నుంచి తొలగిస్తాయి. ఉదాహరణకు, రాబందులు లేకపోతే, వీధి కుక్కలు పెరిగిపోయి, మనుషులకు రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.

ఈ సమయంలో రేబిస్ వ్యాక్సిన్ అమ్మకాలు పెరిగాయి. కానీ, ఈ టీకాలు సరిపడినంత అందుబాటులో లేవు.

కుక్కలు కూడా చనిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి కానీ రాబందుల తరహాలో అంత సమర్థంగా పర్యావరణం నుంచి వాటిని తొలగించలేవు.

ఇవి ఈ కళేబరాలను సరిగ్గా తినకపోగా, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడంతో మంచినీటిలో పాథోజెన్లు, బ్యాక్టీరియాలు పెరుగుతాయి.

రాబందులు తగ్గిపోయిన తరువాత మంచినీటిలో ప్రాణాంతక బ్యాక్టీరియాలు రెండింతలకు పైగా పెరిగాయి.

‘పర్యావరణంలో జీవులను కోల్పోయినప్పుడు మనుషులకు కలిగే ప్రాణాంతక, అనూహ్యమైన నష్టాలకు ఇండియాలో రాబందులు కనుమరుగవడం ఒక ఉదాహరణ’ అని ఈ అధ్యయన సహ రచయిత, వార్విక్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ సుదర్శన్ చెప్పారు.

‘‘ఈ కేసులో, మందులను నిందించారు. కానీ, అటవీ నివాసాలు కోల్పోవడం, వన్యప్రాణుల వాణిజ్యం, ప్రస్తుత వాతావరణ మార్పులు వంటి ఇతర మానవ కార్యకలాపాలు జంతువులపై ప్రభావం చూపుతున్నాయి. వాటి ఫలితం మనపై పడుతుంది. ఈ నష్టాలను, వనరులను, వన్యప్రాణులను కాపాడేందుకు ముఖ్యంగా కీలకమైన జీవులను కాపాడేందుకు ఉన్న రెగ్యులేషన్స్‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం’’ అని అన్నారు.

భారత్‌లోని రాబందుల రకాల్లో ముఖ్యమైనవైన.. వైట్ రంప్డ్ వల్చర్(మెడ చుట్టూ దీనికి తెల్లగా ఉంటుంది), ఇండియన్ వల్చర్, రెడ్ హెడెడ్ వల్చర్‌(తల ఎర్రగా ఉండే రాబందు)లు 2000 సంవత్సరం ప్రారంభం నుంచి బాగా తగ్గిపోయాయి.

వీటి సంఖ్య వరుసగా 98 శాతం, 95 శాతం, 91 శాతం తగ్గిపోయింది.

ఈజిప్ట్‌ రాబందులు, వలసవెళ్లే గ్రిఫన్ రాబందుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతోంది. కానీ, భారత్‌లో పరిస్థితితో చూస్తే ఇవి అంత వేగంగా తగ్గిపోవడం లేదు.

భారత్‌లో 2019లో పశువుల సంఖ్య 50 కోట్లకు పైగా నమోదైంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. పశువుల కళేబరాలను తొలగించేందుకు రైతులు ఎక్కువగా అత్యంత సమర్థమైన స్కావెంజర్లుగా పేరున్న రాబందులపై ఆధారపడేవారు.

భారత్‌లో పక్షి జాతులలో రాబందుల సంఖ్యే అత్యంత వేగంగా తగ్గిపోయినట్లు పరిశోధకులు చెప్పారు.

రాబందు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అరుదుగా కనిపిస్తున్న ఇండియన్ వైట్ రంప్డ్ వల్చర్(మెడ చుట్టూ దీనికి తెల్లగా ఉంటుంది)

భారత్‌లో ఇంకా మిగిలి ఉన్న రాబందులు పశువుల కలుషిత కళేబరాలు ఉన్న చోట కాకుండా చనిపోయిన వన్యప్రాణులను ఆహారాన్ని వెతుకుంటూ సురక్షిత ప్రాంతాల్లో ఉంటున్నాయని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’ రిపోర్టు తెలిపింది.

పశువులకు ఇచ్చే మందులు రాబందులకు ఇప్పటికీ అతిపెద్ద ప్రమాదంగా ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం పశువుల ఖననం పెరుగుతుండటంతో కళేబరాల అందుబాటు తగ్గిపోవడం, అడవి కుక్కల నుంచి పోటీ వంటివి కూడా సమస్యగా మారుతున్నాయి.

క్వారీయింగ్, మైనింగ్ కూడా కొన్ని రాబందుల జాతుల ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి.

రాబందులు మళ్లీ తిరిగి వస్తాయా? అంటే దానికి కొన్ని సంకేతాలున్నప్పటికీ, కచ్చితంగా చెప్పడం కష్టమే.

ఇటీవల ఒక సర్వేలో దక్షిణ భారతదేశంలో 300కి పైగా రాబందులు ఉన్నట్లు గుర్తించారు. కానీ, రాబందుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)