రాయన్ రివ్యూ: ధనుష్ 50వ సినిమా ఎలా ఉంది, దర్శకత్వం, నటనలో మెప్పించాడా?

ఫొటో సోర్స్, Sun Pictures
- రచయిత, శృంగవరపు రచన
- హోదా, బీబీసీ కోసం
2024 సెకండ్ హాఫ్ పెద్ద సినిమాల ఓపెనింగ్ తమిళ సినిమాలతో మొదలైంది. మొదట ‘భారతీయుడు-2’ వస్తే, ఇప్పుడు ధనుష్ ‘రాయన్’ విడుదలైంది.
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. దీనికితోడు ఏఆర్ రెహమాన్ నాలుగోసారి, సందీప్ కిషన్ రెండోసారి ధనుష్‌తో జతకట్టడం సినిమాపై హైప్ పెంచాయి.
మరి ఈ సర్వైవల్ రివెంజ్ థ్రిల్లర్ ఆ స్థాయి అంచనాలను అందుకుందా? లేదా? ధనుష్ తన 50వ సినిమా మార్క్ హిట్‌ను అందుకున్నాడా? లేదా? ఈ రివ్యూలో చూద్దాం.


ఫొటో సోర్స్, Sun Pictures
కథ ఎలా ఉంది?
బాల్యంలో తల్లిదండ్రులను కోల్పోయిన రాయన్ తన తముళ్ళు, చెల్లి కోసం ఏం చేశాడు? ఈ ఫ్యామిలీ జర్నీలో మనుగడ కోసం అతను ఏ మార్గాల్లో పయనించాల్సి వచ్చింది? అన్నదే స్థూలంగా ఈ సినిమా కథ.
ఫస్ట్ హాఫ్ వరకు ఒక ఫ్యామిలీ ఎమోషనల్ జర్నీగా సాగే ఈ కథ సెకండ్ హాఫ్‌లో మలుపులు తిరిగి, అప్పటి వరకు నాయకవర్గంలో ఉన్న పాత్రలు ప్రతినాయక వర్గానికి మారడంతో కథ ఎమోషనల్ షిఫ్ట్ అయి రన్ టైమ్‌కి సంపూర్ణ న్యాయం జరిగిన కథ ఇది. కానీ పాత్రల తీరు అర్ధమైపోవడంతో సినిమాలో అనుకున్నంత ఎమోషనల్ ఇంపాక్ట్ కనిపించలేదు.
ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే రాయన్ కుటుంబం, ఆ ప్రాంతంలో దందాలు నడిపే వారితో ఏ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా ఎలా ఆ ట్రాప్‌లో పడి, చిందవందర అయి, ఒకరికి ఒకరు కాకుండా పోతారో అనేది ఎమోషనల్ జర్నీకి కొనసాగింపుగా ఉండే కథ.

ఫొటో సోర్స్, Sun Pictures
ఎవరెవరు ఎలా నటించారు?
ధనుష్
చాలా అద్భుతమైన చిత్రీకరణ ఉన్న పాత్ర ‘రాయన్’(ధనుష్)ది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేని పాత్ర ఇది. కుటుంబ పెద్దగా లోతైన ఆలోచనలతో, బాధ్యతగా ఉండే పాత్ర ఇది. రాయన్‌ను ‘రావణుడి’ సింబాలిజంతో, ఏ ఎమోషన్‌కూ లొంగని వ్యక్తిగా చూపించడం ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ పాత్రను ధనుష్ బాగా పండించారు. పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నారు.
సందీప్ కిషన్
ఈ సినిమా మొత్తం ఒక గంభీరమైన వాతావరణంలో నడుస్తుంది. ఈ సినిమాలో యూత్ ఫుల్ ఎనర్జీ నింపిన పాత్ర ఇది. డైలాగ్ డెలివరీలో, నటనలో మంచి మార్క్ ఉన్న రోల్‌లో సందీప్ కిషన్ అద్భుతంగా నటించాడు.
దుషారా విజయన్ (దుర్గ)
ధనుష్ చెల్లిగా నటించిన దుషారా విజయన్ క్యారెక్టర్ చాలా బలంగా రాసుకోవడం వల్ల, ఈమె నటన ఇంటర్వెల్ నుండి చివరకు వచ్చేసరికి దాదాపుగా ధనుష్ పాత్రతో పోటీ పడేలా ఉంటుంది. ఈ క్యారెక్టర్ షిఫ్ట్ వల్ల ‘అన్నా చెల్లెళ్ళ ఎమోషనల్ బాండింగ్’ను ఇద్దరి వైపు నుండి చూపించడం సాధ్యమైంది.
అపర్ణ బాలమురళి
సందీప్ కిషన్ ఎనర్జీతో పోటీ పడి జోడీగా నటించింది అపర్ణ. ఒక మామూలు పల్లెటూరి గడుసైన అమ్మాయిగా, తనకున్న స్క్రీన్ స్పేస్‌లో బాగా నటించింది.
ఎస్.జె.సూర్య
ప్రతినాయకుడిగా ఎస్.జె.సూర్య స్క్రీన్ మీద కళ్ళు తిప్పుకోకుండా చేసిన సినిమా ఇది. ’తల వంచి ఎరుగడే‘ పాటలో కూడా విలన్ హావభావాలతో డాన్స్ చేయడం కూడా ఈ సినిమాకు ఒక ప్రధాన ఆకర్షణ. పూర్తి స్థాయిలో ఉన్న స్క్రీన్ స్పేస్‌తో రాయన్‌కి తగ్గ ప్రతి నాయకుడిగా నిలబడ్డాడు సూర్య.
ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో వారి నటన పెద్దగా గుర్తుండదు.
సెల్వ రాఘవన్ (శేఖర్)
శేఖర్ పాత్రలో సెల్వ రాఘవన్ ఫుల్ స్కోప్ కథలో ఉండటం వల్ల, కథకు తగ్గట్టు నటించిన పాత్ర ఇది. ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా గొప్ప ఇంపాక్ట్ లేని పాత్ర ఇది.

ఫొటో సోర్స్, Sun Pictures
పాటలు- సంగీతం
‘రాయన్’ సినిమా ద్వారా ఏఆర్ రెహమాన్ మరోసారి తన మార్కు చూపారు.
తలవంచి ఎరుగడే (అడగంటి అసురన్) పాటలో తమిళ సాంప్రదాయ వాయిద్యాలైన నాదస్వరం, తావిల్,ఘటంతో పాటు ఎలక్ట్రిక్ గిటార్ లాంటి ఆధునిక పరికరాలను కూడా ఫ్యూజన్ చేయడం ఈ పాటకు ఒక స్పెషల్ మ్యూజిక్ ఎఫెక్ట్ ఉండేలా చేసింది. ఈ పాట రాయన్ పాత్ర గురించి బలంగా చెప్పడంలో విజయం సాధించింది.
పీచు మిఠాయి పాటలో కూడా మెలోడియస్ మ్యాజిక్ కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Sun Pictures
ధనుష్ డైరెక్షన్ ఎలా ఉంది?
ధనుష్ దర్శకత్వం వహించిన రెండో సినిమా ఇది. బలమైన కథతో వచ్చాడు ధనుష్. ‘సోషల్ ఎలిమెంట్స్’తో దానిని చక్కటి యాక్షన్ థ్రిల్లర్‌గా రూపకల్పన చేశాడు కూడా. ‘అసురన్’, ‘కర్ణన్’ సినిమాల తర్వాత ఆ స్థాయి సీరియస్ టోన్ ఉన్న కథ ఇది.
కథను ఫ్రెష్‌గా చెప్పే ప్రయత్నం చేయడం, బలమైన పాత్రలు ఉండేలా జాగ్రత్త తీసుకోవడం, తమిళ సంస్కృతి - సంప్రదాయాలను, జీవన విధానాన్ని ఈ కథలో కనిపించేలా చేయడం; విజువల్ రిచ్‌నెస్ విషయంలో రాజీ పడకపోవటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.
‘టాక్సిక్ మాస్క్యులినిటీ’ నుంచి బయటకు వచ్చి సాధారణ పాత్రను నాయకుడిగా చిత్రించడం కూడా ధనుష్ ప్రతిభకు ఒక గీటురాయిగా నిలిచింది.
అయినా కథ బావున్నా, పాత్రలు యాంత్రికంగానో లేకపోతే మనం ఊహించినట్టో మాత్రమే మారడం వల్ల ధనుష్ ‘ఫ్రెష్ నేరేటివ్ స్టైల్ ‘బ్యాక్ ఫైర్ అయ్యిందనే చెప్పొచ్చు.

ఫొటో సోర్స్, Sun Pictures
ఫొటోగ్రఫీ
ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాయన్ ఒంటరితనాన్ని, బాధను, అతని ఎమోషనల్ జర్నీని ప్రభావవంతంగా చూపించడంలో; గ్రామీణ నేపథ్య మూడ్, నేచురల్, ఆర్టిఫిషియల్ లైటింగ్‌ను సమన్వయంతో వాడటం హైలైట్‌గా నిలిచింది.
సినిమాలో ప్రతిపాత్రకు డబ్బింగ్ కూడా సరిగ్గా నప్పడం మరో ప్లస్ పాయింట్. మొత్తం మీద ఫొటోగ్రఫీ, మ్యూజిక్, నటీనటుల నటన సినిమాకు వెన్నెముకగా నిలిచాయి.
కానీ, ఫ్యామిలీ డ్రామా, రివెంజ్,యాక్షన్ కలిసి ఉన్న సినిమాల్లో ఉండే ఉత్కంఠను ప్రభావవంతంగా చూపడంలో అంచనాలను అందుకోలేకపోయింది రాయన్.
మొత్తం మీద ,’రాయన్’ఒక మంచి ప్రయత్నంగా ధనుష్ కెరియర్‌లో నిలిచిపోతుందని చెప్పొచ్చు.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















