కొత్త పన్ను విధానం బెటరా, పాత పద్ధతే బెటరా? మీ వార్షిక ఆదాయం 10 లక్షలు అయితే ఎంత పన్ను పడుతుందో తెలుసా?

డబ్బులు లెక్కపెడుతున్న మహిళ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేశారు. ఆదాయపు పన్ను విషయంలో పాత పన్ను విధానంలో మార్పులేమీ చేయలేదు. కానీ కొత్త పన్ను విధానంలో కొన్ని శ్లాబులు మారాయి.

తాజా శ్లాబుల ప్రకారం 3 లక్షల నుంచి 7 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాలి. గతంలో ఇది మూడు నుంచి 6 లక్షల రూపాయలుగా ఉండేది.

దీంతోపాటు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు పెంచారు.

ఈ మార్పుల వల్ల 17,500 రూపాయలు ఆదా అవుతుందని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

అయితే పాత పన్ను విధానంలో ఎటువంటి మార్పులు చేయలేదు.

ఇక 3 లక్షల రూపాయల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

న్యూ టాక్స్ రెజీమ్‌లో 7 లక్షల వరకు కూడా పన్ను కట్టక్కరలేదు. అదెలాగో చూద్దాం.

కొత్త టాక్స్ రెజీమ్‌లో 3 లక్షల రూపాయల వరకు పన్ను లేదు. 3 నుంచి 7లక్షల రూపాయలవరకు 5% పన్ను విధించారు. ఈ మేరకు 4 లక్షల రూపాయలకు 5% పన్నుచెల్లించాలి. అంటే 20 వేల రూపాయలన్నమాట.

కానీ సెక్షన్ 87A కింద ప్రభుత్వం 20 వేల రూపాయల పన్నును మాఫీ చేస్తుంది.

ఇక స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని కూడా 50 వేల రూపాయల నుంచి 75 వేల రూపాయలకు పెంచారు. దీంతో 7 లక్షల 75 వేల రూపాయల ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పన్ను శ్లాబులు

పైసా పన్ను కూడా కట్టకూడదంటే..

మీరు మీ 10 లక్షల రూపాయల ఆదాయం మొత్తాన్ని పన్నురహితం చేసుకోవాలంటే అది కేవలం పాత పన్ను విధానంలోనే సాధ్యమవుతుంది.

అయితే ఈ మినహాయింపు పొందేందుకు మీరు చాలా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టలేకపోతే పాత పద్ధతిలోని శ్లాబుల ప్రకారం మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

పాతపద్ధతిలో టాక్స్ సేవింగ్ ఎలా?

పాత పన్ను పద్ధతిలో ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేల రూపాయలు మినహాయింపునిచ్చింది. అంటే మీ ఆదాయం 10 లక్షల రూపాయలు అయితే అందులోంచి 50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ తీసివేస్తే మీ నికర పన్ను ఆదాయం 9.5 లక్షలు అవుతుంది.

ఆదాయపు పన్ను

ఫొటో సోర్స్, GETTY IMAGES

1.5 లక్షల పొదుపుతో టాక్స్ సేవింగ్

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మీరు 1.5 లక్షలు పొదుపు చేస్తే మీకు పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే మీరు ఆ పొదుపు(పెట్టుబడి)ని ఈపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఐదేళ్ళ ఫిక్సడ్‌ డిపాజిట్స్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడు మీరు పన్ను మినహాయింపు పొందుతారు.

మీరు పై పథకాల్లో ఏదో ఒకదాంట్లో లేదా అన్నింటిలో 1.5 లక్షల దాకా సేవ్ చేయాలి. మీరు అలా చేస్తే అప్పుడు మీ 9.5 లక్షల ఆదాయం నుంచి 1.5 లక్షలు తీసేయండి. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 8 లక్షలు అవుతుంది.

ఇంటి లోన్ ఉంటే, 2 లక్షలు ఆదా

మీకు ఇంటి లోన్ ఉంటే, దానిపై కట్టే వడ్డీపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24B ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీపై 2 లక్షల రూపాయల దాకా పన్ను మినహాయింపు పొందవచ్చు.

ఒకవేళ మీకు ఈ అవకాశం ఉంటే ఆ మొత్తాన్ని మీరు పన్ను కట్టాల్సిన మొత్తం నుంచి మినహాయించండి. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం 6 లక్షల రూపాయలు అవుతుంది.

పన్ను పద్ధతులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఆరోగ్య బీమా ప్రీమియంపై నో టాక్స్

ఆదాయపుపన్ను చట్టం సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమాపై 25 వేల రూపాయల దాకా పన్ను మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ బీమా మీతోపాటు మీ భార్య, పిల్లల పేర్లు ఉండాలి.

దీంతోపాటు మీ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ కేటగిరీ కిందకు వస్తే వారి పేరుతో ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేస్తే మరో 50 వేల రూపాయలు మినహాయింపు లభిస్తుంది. అంటే ఆరోగ్య బీమా పాలసీల ద్వారా 75 వేల రూపాయల దాకా పన్ను మినహాయింపు పొందొచ్చన్నమాట.

ఈ మినహాయింపులు పోయాక ఇప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే మీ ఆదాయం మొత్తం 5 లక్షల 25 వేలు అవుతుంది.

జాతీయ పెన్షన్ పథకం..

మీరు ప్రత్యేకంగా ఏటా నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్)లో 50 వేల రూపాయలు పొదుపుచేస్తే మీకు అదనంగా సెక్షన్ 80CCD (1B) కింద 50వేల రూపాయలు మినహాయింపు వస్తుంది. దీన్ని కూడా పన్ను పరిధిలోని మీ ఆదాయం నుంచి మినహాయిస్తే పన్ను కట్టాల్సిన ఆదాయం 4 లక్షల 75 వేల రూపాయలు అవుతుంది.

87A ప్రయోజనం

5 లక్షల రూపాయల ఆదాయంపై రూ.12,500 పన్ను మినహాయింపు ఉంది. అటువంటి పరిస్థితిలో, మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఇప్పుడు రూ .4 లక్షల 75 వేలు కాబట్టి, మీపై పన్ను భారం పడదు.

పన్ను పద్ధతులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

న్యూ టాక్స్ రెజీమ్‌లో 10 లక్షల ఆదాయానికి పన్ను ఎంత?

న్యూ టాక్స్ రెజీమ్ శ్లాబులలో మార్పులు చేసి, స్టాండర్డ్ డిడక్షన్ పెంచినప్పటికీ మీ ఆదాయం 10 లక్షల రూపాయలపై పన్ను కట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త పన్ను విధానంలో మీరు మీ పొదుపుపై ఎటువంటి మినహాయింపులు పొందలేరు.

మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మీకు స్టాండర్డ్ డిడక్షన్ కింద 50 వేలకు బదులుగా 75 వేల రూపాయల మినహాయింపు లభిస్తుంది. అంటే మీరు పన్ను చెల్లించాల్సిన ఆదాయం 9 లక్షల 25 వేల రూపాయలన్నమాట. గతంలో ఈ ఆదాయంపై 52,500 రూపాయల పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ మొత్తం 42,500కు తగ్గింది.

అంటే కొత్త పన్ను విధానంలో కూడా 10 లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు అదనంగా మరో 10 వేల రూపాయల మొత్తాన్ని సేవ్ చేసుకోగలరన్నమాట.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)