పారిస్ ఒలింపిక్స్: టోక్యో రికార్డును బ్రేక్ చేయగలరా? ఏఏ భారత ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నారు

ఫొటో సోర్స్, Getty Images
టోక్యో ఒలింపిక్స్ కంటే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు మెరుగ్గా రాణించగలరా? నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించి మళ్లీ చరిత్ర సృష్టించగలరా? ఒలింపిక్స్ సింగిల్స్ పోటీల్లో రెండుసార్లు స్వర్ణ పతకం సాధించిన తొలి భారత ప్లేయర్ అవుతారా?
భారత రెజ్లర్లు రెజ్లింగ్ వివాదాన్ని వీడి మరోసారి దేశానికి పతకాలు సాధించగలరా? అనే ప్రశ్న కూడా క్రీడాభిమానుల మదిలో ఉంది.
ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో మొత్తంగా భారత్ 35 పతకాలు సాధించింది.
వీరిలో షూటర్లు అభినవ్ బింద్రా (2008), నీరజ్ చోప్రా (2021) మాత్రమే వ్యక్తిగత స్వర్ణ పతక విజేతలు.
2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలను గెలుచుకుంది, ఒలింపిక్స్‌లో ఇదే భారత అత్యుత్తమ ప్రదర్శన.
అయితే, ఈసారి భారత పతకాల సంఖ్యను రెండంకెలకు పెంచడం లక్ష్యం. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించడం భారత ఆటగాళ్లకు పెద్ద సవాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జావెలిన్ త్రోలో ప్రస్తుత చాంపియన్ నీరజ్ చోప్రా మినహా మిగిలిన అథ్లెట్లు వారివారి ఈవెంట్లలో ఎంతవరకు రాణిస్తారో చూడాలి.


ఫొటో సోర్స్, Getty Images
ఆశలన్నీ వారిపైనే
పతకంతో పోడియంపై నిల్చోగలడని భారత్ ఎక్కువగా నీరజ్‌పై నమ్మకం పెట్టుకొంది. వీరితో పాటు బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డిపైనా భారత్ ఆశలు పెట్టుకుంది.
నీరజ్ జావెలిన్‌ను 90 మీటర్ల దూరం విసరనప్పటికీ.. టోక్యో ఒలింపిక్స్ తర్వాత కూడా అంతర్జాతీయ పోటీలలో నిలకడగా రాణిస్తున్నారు.
పారిస్ ట్రాక్ మీద ఫిట్‌నెస్ సమస్యలు రాకుంటే దేశానికి మరో పతకం దక్కవచ్చు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, రెజ్లర్ సుశీల్ కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో దేశానికి వరుసగా రెండు పతకాలు అందించిన ప్లేయర్స్.
సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
రెజ్లర్ సుశీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించారు.
చిరాగ్ శెట్టి, సాత్విక్ బ్యాడ్మింటన్ జోడీ 90వ దశకం చివరలో టెన్నిస్ జోడీ లియాండర్ పేస్, మహేశ్ భూపతిలను గుర్తు చేస్తోంది. ఒలింపిక్ పతకం సాధించే సత్తా ఉన్న జోడీ ఇది.
ప్రస్తుతం పీవీ సింధు అత్యుత్తమ ఫామ్‌లో లేకపోవడం కలవరపరిచేదే, మరోవైపు ఆమెకు కష్టమైన డ్రా లభించింది. సింధు మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తే, తనకున్న అనుభవం పతకాన్ని సాధించిపెట్టవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
షూటింగ్
షూటర్లలో సిఫత్ కౌర్ (50 మీటర్ల 3 పొజిషన్), సందీప్ సింగ్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ (పురుషుల 50 మీటర్ల రైఫిల్) పతకాలు సాధించిపెట్టగల ప్లేయర్స్.
భారత్‌కు చివరిసారిగా షూటింగ్‌లో ఒలింపిక్ పతకం 2012 లండన్‌లో గగన్ నారంగ్ సాధించి పెట్టారు. ఆయనకు కాంస్య పతకం లభించింది. ఈసారి గగన్ నారంగ్ ప్లేయర్ల కోసం ‘చెఫ్ డి మిషన్ ఆఫ్ ఇండియా’గా సేవలు అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెజ్లింగ్
గత సంవత్సరం భారత రెజ్లింగ్ ఫెడరేషన్, కొందరు ప్రముఖ రెజ్లర్ల మధ్య వివాదం దేశ ఒలింపిక్ సన్నాహాలపై ప్రభావాన్ని చూపింది.
నేషనల్ క్యాంపుల ఏర్పాటు ఆలస్యమవడంతో చాలా పోటీల్లో రెజ్లర్లు పాల్గొనలేకపోయారు. అయితే, ఈసారి అన్షు మాలిక్, యాంటీమ్ పంఘల్, అమన్ సెహ్రావత్‌లు భారత్ తరఫున అత్యుత్తమ ఫామ్‌తో కనిపిస్తున్నారు.
కాగా, టోక్యో గేమ్స్ రజత పతక విజేత, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను గత కొంతకాలంగా గాయం, ఫామ్‌తో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె సక్సెస్‌ని రిపీట్ చేస్తారా లేదా అన్నది సందేహమే.

ఫొటో సోర్స్, X/PMOINDIA
భారత్ ప్రతికూలతలు
భారత బృందంలో అథ్లెటిక్స్ నుంచి 29 మంది, షూటింగ్ నుంచి 21 మంది, హాకీ నుంచి 19 మంది ప్లేయర్లు ఒలింపిక్స్‌లో ఆడేందుకు పారిస్ చేరుకున్నారు.
ఈ 69 మంది అథ్లెట్లలో 40 మంది యువ క్రీడాకారులు. అంటే, ఈ ఆటగాళ్లు ఒలింపిక్ వేదికపై మొదటిసారి తమ సత్తాను ప్రదర్శించబోతున్నారు.
మరోవైపు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్, హాకీ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ వంటి ప్లేయర్స్ పతకం కోసం కెరీర్ చివరి దశలో పోరాడుతున్నారు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు మంచి ప్రదర్శనతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించింది. కానీ ఈసారి పురుషుల హాకీ జట్టు అంతగా ఫామ్‌లో లేకపోవడం నిరాశ కలిగించేదే.
ఇటీవల ఆస్ట్రేలియాలో భారత హాకీ జట్టు మొత్తం ఐదు మ్యాచ్‌లలో ఓడింది, ప్రో లీగ్‌లో కూడా కష్టపడింది. ఈసారి ఆస్ట్రేలియా, బెల్జియం, అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి బలమైన జట్లు ఉన్న గ్రూప్‌లో భారత జట్టు ఉంది. ఒకవేళ ఈ పూల్‌లో జట్టు టాప్-4లో నిలవాలంటే ఎటువంటి పొరపాటుకు తావివ్వకూడదు. ఇక, మహిళల హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
బాక్సర్లు, రెజ్లర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ కొరవడింది, షూటింగ్‌లో గత ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శన మిశ్రమంగా ఉంది.
ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా అవినాష్ సేబుల్ ఇటీవల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో 8:09.91 తన అత్యుత్తమ టైమింగ్‌లో రేసు పూర్తి చేశారు.
అయితే, దీని కంటే మెరుగైన టైమింగ్ సెట్ చేసిన ఏడుగురు అంతర్జాతీయ రన్నర్‌లు ఉన్నారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














