ఒలింపిక్స్: యాంటి సెక్స్ బెడ్స్, కండోమ్స్ కథల గురించి ఒక మహిళా అథ్లెట్ ఏం చెప్పారు?

పారిస్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కిర్‌స్టీ గిల్మోర్
    • హోదా, బీబీసీ స్పోర్ట్ కాలమిస్ట్

నేను మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నాను. బ్యాడ్మింటన్ బ్యాట్ తిప్పుతూ నేను కూడా ఒకటి రెండు విషయాలు తెలుసుకున్నాను.

మీ కిట్ ఎలా పొందాలి? ఒలింపిక్ విలేజ్‌పై క్రేజ్ ఎలా ఉంటుంది? యాంటీ సెక్స్ బెడ్‌లని చెప్పుకునే కార్డ్‌బోర్డ్ పడకలేంటి? కండోమ్‌ కథేంటి?

తరచూ ఒలింపిక్స్ గురించి అడిగే ఇలాంటి ప్రశ్నలకు స్వాగతం... మీ సందేహాలను తీర్చడానికే నేనిక్కడ ఉన్నాను. నా పేరు కిర్‌స్టీ గిల్మోర్

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
పారిస్ ఒలింపిక్స్ 2024

ఫొటో సోర్స్, Getty Images

ఒలింపిక్స్‌కి ఎంపికైనట్లు ఎలా తెలుస్తుంది?

బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్ ఉంటాయి. ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు హై ర్యాంకింగ్ సరిపోతుంది. అయినా మీరు ఒలింపిక్స్‌కు ఎంపిక అయినట్టు బ్రిటిషు ఒలింపిక్ అసోసియేషన్‌ నుంచి ఈమెయిల్ ద్వారా ధ్రువీకరణ రావాలి. మీకు మెయిల్ వస్తే మీరు ఎంపికైనట్టే.

దీని తరువాత టీమ్ గ్రేట్ బ్రిటన్ లెటర్‌పాడ్‌పై ఓ లేఖ వస్తుంది. దాంతోపాటు మీకు శుభాకాంక్షలతో జట్టులోకి స్వాగతం పలుకుతూ ఓ చిన్న కార్డు కూడా ఉంటుంది.

తర్వాత ఏం జరుగుతుంది?

ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాక కొన్నినెలలపాటు సన్నాహకాలు ఉంటాయి. అవి కొద్దిగా విసుగనిపిస్తాయి. యాంటి డోపింగ్ నిబంధనలకు సంబంధించిన వర్క్‌షాపులకు హాజరవ్వాలి, మీడియా ట్రైనింగ్ పొందాలి.

ఇక టైమ్, డేట్, వేదిక, ట్రాన్స్‌పోర్ట్ తదితర వివరాలు లాజిస్టిక్స్ బ్రీఫింగ్ ద్వారా తెలుసుకోవాలి.

వీటన్నింటితోపాటు ఒలింపిక్స్‌తో పాటు రాబోయే టోర్నమెంట్స్‌కు కూడా ప్రతిరోజూ 4 నుంచి 6 గంటలపాటు కసరత్తు చేయాలి.

టీమ్ యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images

మీకు కిట్ ఎలా వస్తుంది?

మీ కిట్‌ను తెచ్చుకోవడానికి కిట్టింగ్ - అవుట్ డే అని ఉంటుంది. ఆ రోజున ఆటగాళ్ళు తమ జట్టు అధికారిక యూనిఫామ్స్, ఇతర అవసరమైన వస్తువులు పొందుతారు. నేను అక్కడికి కొన్నిసార్లు వెళ్ళాను. అదో భయంకరమైన అనుభవం.

మీరు బర్మింగ్‌హామ్‌లోని నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్దకు చేరుకోగానే, మీరో గుహలాంటి హాలులోకి తీసుకెళతారు. ఆ దారి మిమ్మల్ని వందలాది డిజైన్లతో కూడిన ఆటగాళ్ళ వస్తువులు అడిడాస్ షోరూమ్‌కు తీసుకుపోతుంది.

అక్కడ అన్నీ ఉచితమే అని నాకు తెలుసు.

మీరు ఒకసారి లాంజ్ లోకి ప్రవేశించి...మీకు స్వాగతం పలికే చోటుకు చేరుకుంటారు. అక్కడ మీరు గ్రేట్ బ్రిటన్ అథ్లెట్ కావడం ఎంత గొప్ప విషయమో వింటారు. తరువాత మీరు అక్కడ షాపింగ్ చేసేందుకు మీకో సహాయకుడిని కేటాయిస్తారు.

మీరు అన్నిరకాల అవుట్ ఫిట్స్ ప్రయత్నిస్తుంటే సహాయకులు ఐ ప్యాడ్స్ పై నోట్ చేసుకుంటూ ఉంటారు.

నేను ఒలింపిక్ విలేజ్ లో వేసుకునే రోజూవారీ దుస్తులు, పోటీలకు యూనిఫామ్,అధికారిక ఫోటో షూట్ కోసం సూటు, ఒలింపిక్, ప్రారంభ, ముగింపు వేడుకలకు అవసరమైన దుస్తులు, వాటన్నింటికి మ్యాచ్ అయ్యే బూట్ల గురించి మాట్లాడాను.

మీరు మీ అవుట్ ఫిట్స్ ను అన్నింటిని ( ఓ ఫ్యాషన్ షో మాదిరి) ప్రయత్నించాక.. మీ సహాయకుడు వాటన్నింటిని భద్రంగా యూకే జాతీయ పతాకం ఉన్న మూడు పెద్ద బ్యాగుల్లో సర్దినట్టు భరోసా ఇచ్చాక మీరు మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటారు.

విమానాశ్రయంలో మీ బ్యాగుల బరువు చూసుకున్నప్పుడు అవి 30 కేజీలు ఉంటాయని మీకు అర్ధమవుతుంది.

దుస్తులతోపాటు అనేక ఇతర వస్తువులు కూడా మీకు అందిస్తారు. వాటిల్లో చెప్పులు, సన్ గ్లాసెస్, గొడుగు, స్వెట్ బ్యాండ్, టోపీలు, నోట్ బుక్స్, ఓ చిన్న రబ్బర్ బాతు బొమ్మ ఉంటాయి.

పారిస్

ఫొటో సోర్స్, Getty Images

మీరు ఎప్పుడైనా పారిస్‌కు వెళ్లారా?

ఇంతకుముందు,నేను హిత్రూలో బ్యాడ్మింటన్ జట్టును కలిశాను.మేము అక్కడి నుంచి రియో ​,టోక్యోకు వెళ్లాం.

ఈసారి,నా గర్ల్‌ఫ్రెండ్ నన్ను విమానాశ్రయం దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడి నుంచి నేను నేరుగా పారిస్ వెళతాను.ఇక మిల్టన్ కీన్స్‌ నగరంలో ఉండే అబ్బాయిలు రైల్లో పారిస్‌కు చేరుకుంటారు.

ఫ్రాన్స్‌కి వెళ్లాక అసలు కథ మొదలవుతుంది. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక క్రీడాకారులు వెళ్లడానికి ప్రత్యేక దారి ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్లాలో దారిచూపేవారుంటారు. తరువాత మనల్ని బస్సులలో ఒలింపిక్ విలేజ్‌కు తీసుకువెళతారు.

అక్కడ మనకి ఒక గుర్తింపు కార్డ్ ఇస్తారు. దానిని మనతో పాటే ఉంచుకోవాలి. మూడు వారాల వరకూ అది లేకుండా ఎక్కడికీ వెళ్లలేం.

ఒలింపిక్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

70 ఫుట్ బాల్ మైదానాలంత...

ఒలింపిక్ విలేజ్ చాలా పెద్దది. కానీ ప్రత్యేకంగా కనిపించే టీమ్ జీబీ టవర్ బ్లాక్‌ను మిస్ కాలేం. మేం అక్కడ మా ఉనికి బలంగా కనిపించేలా ఉండాలని అనుకుంటాం. కానీ ఈ భావన మిగిలిన దేశాల క్రీడాకారులకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు.

అక్కడి అలంకరణలు, ఫర్నీచర్, ఆటలన్నీ చూసేందుకు వీలుగా ఏర్పాటుచేసిన అతిపెద్ద స్క్రీన్‌కు ఎదురుగా కృత్రిమంగా తయారుచేసిన లాన్‌పై వేసిన కుర్చీలు... ఇలా ప్రతి వస్తువు టీమ్ జీబీ రంగులను ప్రతిఫలిస్తూ రెడ్, వైట్, బ్లూలో ఉన్నాయి. అక్కడ ఎర్రని రంగులో ఉండే టెలిఫోన్ బాక్స్ కూడా ఉంది.

ఒలింపిక్ గ్రామం సాధారణంగా కన్నా చిన్నగా ఉంది. కానీ నడక మాత్రం ఎక్కువగానే చేయాలి. ఈ నడక నేను ఇంటి దగ్గర చేసే దానికంటే ఎక్కువ చేయాలి.

ఒలింపిక్స్‌ సన్నాహాలలో నడకను కూడా భాగం చేయడం నా గర్ల్‌ఫ్రెండ్‌కు బాగా నచ్చింది.

పారిస్ ఒలింపిక్ విలేజ్ చాలా పెద్దది. దాదాపు 70 ఫుట్‌బాల్ పిచ్‌ల అంత ఉంటుంది. అదృష్టవశాత్తూ, మేము గ్రామమంతా ప్రయాణించడానికి మడతపెట్టే సైకిళ్లతో పాటు బస్సులు కూడా ఉన్నాయి.

ఈ ఒలింపిక్ విలే‌జ్‌లో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హెయిర్ కట్, మానిక్యూర్, దంతపరీక్షలు, జనరల్ స్టోర్, బేకరీ పోస్టాఫీసు లాంటి సదుపాయాలు ఉన్నాయి.

పారిస్ ఒలింపిక్స్ 2024

ఫొటో సోర్స్, GETTY IMAGES

నిత్యం 60వేల భోజనాలు

ఇక్కడి డైనింగ్ హాల్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ అని పిలుస్తారు.

ఒకేసారి 3500మంది భోజనం చేసేంత పెద్ద డైనింగ్ హాల్ అది. దాదాపు 14,250మంది అథ్లెట్‌లు ఉంటారు. ఒకరోజులో 60,000 భోజనాలు వడ్డిస్తారు.

వేలాది ఇతర అథ్లెట్‌లతో పాటు రోజుకు మూడు సార్లు క్యూలో నిలబడటం ఓ అగ్నిపరీక్షే.

అంతెందుకు టామ్ డాలే, ఉసేన్ బోల్ట్ లాంటి దిగ్గజాలు కనిపించిన ఆనందాన్ని కూడా మీరు కోరుకున్న ఆహారం దొరకలేదనే బాధ తుడిచిపెట్టేస్తుంది.

అయితే ఈ గందరగోళం వద్దనుకుంటే మీ లివింగ్ ఏరియా వద్ద చిరుతిళ్ళు, ఇన్‌స్టంట్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. జీబీకి సూపర్ మార్కెట్‌తో భాగస్వామ్యం ఉంది.

మొదట కొన్ని రోజులు 15 నిమిషాలపాటు నడిచి, విశాలమైన ఫుడ్ హాల్‌లో అల్పాహారం కోసం క్యూలో నిల్చోవడం కంటే ఈ ఇన్‌స్టంట్ ఫుడ్ తినడమే అమోఘమనిపిస్తుంది.

కిర్‌స్టీ గిల్మోర్

ఫొటో సోర్స్, Getty Images

కార్డ్‌బోర్డ్ పడక సంగతేంటి ?

ఈ కార్డుబోర్డు బెడ్స్ చుట్టూ అనేక సంచలనాత్మక కథనాలు నడుస్తుంటాయి. మీరు సోషల్ మీడియాలో చూసిన హెడ్‌‌లైన్స్‌ను బట్టి ఇవి యాంటీ సెక్స్ బెడ్స్ అనుకుంటారు. కానీ అలా కానే కాదు.

అవి చక్కగా 200 కేజీల బరువును తట్టుకుంటాయి. ఒలింపిక్స్ ముగిశాక వాటిని తిరిగి ఉపయోగించుకునేలా రూపొందించారు.

(యాంటీ సెక్స్ బెడ్స్‌ను ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులు ఒకరికొకరు సన్నిహితం కాకుండా ఉండేలా ఏర్పాటు చేసిన బలహీనమైన మంచాలుగా చెబుతారు. వీటిని టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా ప్రవేశపెట్టారంటూ విమర్శలు కూడా వచ్చాయి. అయితే, తాజా ఒలింపిక్స్ సందర్భంగా ఈ కార్డ్‌బోర్డ్‌ బెడ్స్‌పై ఎగిరి దూకుతూ, ఇవి బలంగానే ఉన్నాయని, యాంటీ సెక్స్ బెడ్ అన్నమాట నిజం కాదంటూ కొందరు క్రీడాకారులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడుతున్నారు.)

గదులు చాలా సాధారణంగా ఉంటాయి. కానీ టీమ్ గ్రేట్ బ్రిటన్ వాటిని సౌకర్యవంతంగా మార్చేసింది.

ఈ ఒలింపిక్ విలేజ్‌లో అందించే కండోమ్‌ల గురించి నేను తరచూ వింటూ ఉంటాను. కానీ సేమ్ సెక్స్ రిలేషన్‌లో ఉన్న నాకు దానిపై పరిజ్ఞానం లేదు.

కానీ ఒకటి చెప్పగలను. రియోలో ఇవి తేలికగా దొరికేవి. కానీ టోక్యో లో మాత్రం, కోవిడ్ నిబంధనల కారణంగా కండోమ్‌లు అందుబాటులో ఉన్నదీ లేనిది గమనించలేదు.

నాకు సంబంధించిన విషయం కాకపోయినా చెబుతున్నా...పారిస్‌లో 300,000 కండోమ్‌ల స్టాక్‌ ఉంది.

పారిస్ ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

ఐడెంటిటీని మర్చిపోవద్దు...

విభిన్న సంస్కృతులు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన చాలా మంది ఇక్కడ ఉంటారు. విభిన్న వ్యక్తులతో, ప్రతి ఒక్కరు వేర్వేరు పోటీ షెడ్యూల్‌లో పోటీ పడతారు. తర్వాత వారికి నచ్చినట్టుగా విశ్రాంతి తీసుకుంటారు.

ఇప్పుడు గేమ్‌ల తర్వాత వ్యవహారాలు తగ్గాయనే అనుకుంటున్నా. చాలా మంది అథ్లెట్లు గౌరవప్రదంగా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది పోటీలో ఉన్నారని తెలుసు.

నాకు తెలిసి విలేజ్ బయట చాలా పార్టీలు జరుగుతాయి. కానీ నా సలహా ఏంటంటే మీ ఐడెంటినీ కోల్పోకండి. దాన్ని మీరు తిరిగి పొందలేరు

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)