నీరజ్ చోప్రా: టోక్యో ఒలింపిక్స్ బంగారు పతకంతో సరికొత్త రికార్డు

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టారు. జావెలిన్ త్రో‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆయన ఈ పతకాన్ని గెలిచారు.

మొదటి ప్రయత్నంలో ఆయన జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు.

రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు.

పాకిస్తాన్‌కు చెందిన నదీమ్ ఐదో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 84.62 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధిస్తారని మొదట్నుంచీ ఆశించిన అతి కొద్దిమంది యువ క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకరు.

గత కొన్నేళ్లుగా జావెలిన్ త్రోలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నీరజ్ చోప్రా అందరికీ ఆకట్టుకుంటూ వచ్చారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ-3లో 88.07 మీటర్లకు జావెలిన్ త్రో విసిరి నీరజ్ తన సొంత జాతీయ రికార్డును తానే అధిగమించారు.

అంజూ బాబీ జార్జ్ తరువాత ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ ఒక్కరే.

స్వర్ణ పతకాన్ని తీసుకున్న అనంతరం టోక్యోలో విలేకరులతో నీరజ్ చోప్రా మాట్లాడారు.

ఈ పతకాన్ని మిల్ఖా సింగ్‌తోపాటు తృటిలో పతకాలు కోల్పోయిన భారత క్రీడాకారులకు అంకితం చేస్తున్నట్లు నీరజ్ చోప్రా తెలిపారు.

ట్రాక్‌ తనకు దేవుడితో సమానమని నీరజ్ చెప్పారు. మ్యాచ్ అయిన ప్రతిసారి తను ట్రాక్‌కు వంగి నమస్కరిస్తానని వివరించారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

చరిత్ర సృష్టించావు...

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణాన్ని తీసుకురావడంపై నీరజ్ చోప్రా మీద ప్రశంసల జల్లు కురుస్తోంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘‘టోక్యోలో చరిత్ర సృష్టించాడు. నేడు నీరజ్ సాధించిన విజయాన్ని భారత్ ఎప్పటికీ మరచిపోదు. యువ కెరటం నీరజ్ అద్భుతంగా విజయం సాధించాడు. అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. బంగారాన్ని సాధించినందుకు అభినందనలు’’అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు నీరజ్‌ను వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా.. బాహుబలితో పోల్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

‘‘మేం అంతా నీ సైన్యంలో ఉన్నాం, బాహుబలి’’అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో మొట్టమొదటి సారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.

''నీరజ్ చోప్రా 87.58 మీటర్లు జావెలిన్ విసరడాన్ని చూసి దేశం మొత్తం గర్వపడింది. ఒలింపిక్స్ చివర్లో సువర్ణ అక్షరాలతో నీరజ్ చరిత్రను లిఖించాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఈ పతకాల పరంపర కొనసాగుతుందని ఆశిస్తున్నా''అని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

''నీరజ్ చోప్రా విజయం భారతదేశంలోని క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరుస్తుండటం సంతోషకరం. నీరజ్ చోప్రా విజయం భారతీయులందరికీ గర్వకారణం''అని కేసీఆర్ అన్నారు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, BEN STANSALL/AFP via Getty Images

చిన్నప్పుడు లావుగా..

పానిపట్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన నీరజ్ చిన్నతనంలో చాలా లావుగా, దాదాపు 80 కిలోలు ఉండేవాడు. కుర్తా పైజామా ధరించిన నీరజ్‌ను అందరూ సర్పంచ్ అని పిలిచేవారు.

బరువు తగ్గడం కోసం నీరజ్ పానిపట్‌లోని స్టేడియానికి వెళ్లేవాడు. కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహాతో జావెలిన్ త్రో ప్రయత్నించాడు. అక్కడినుంచి అతని క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది.

జావెలిన్ త్రోలో రాణించేందుకు మెరుగైన సౌకర్యాల ఉన్న పంచకులాకు నీరజ్ పయనమయ్యాడు. అక్కడ మొదటిసారిగా జాతీయ స్థాయి జావెలిన్ త్రో ఆటగాళ్లతో తలపడ్డాడు.

జాతీయ స్థాయిలో ఆడడం ప్రారంభించిన తరువాత నీరజ్ చేతికి మంచి జావెలిన్ అందింది. దాంతో అతని ప్రదర్శన కూడా మెరుగైంది.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

తళుక్కుమన్న తార

2016లో పీవీ సింధు, సాక్షి మలిక్‌ల విజయాన్ని వేడుక చేసుకుంటుంటే, చడీచప్పుడు లేకుండా ప్రపంచంలో మరోచోట ఇంకో తార ఉదయించింది. అదే సంవత్సరం పోలండ్‌లో జరిగిన యూ-20 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ స్వర్ణ పతకం సాధించారు.

అప్పటి నుంచి ఈ యువ ఆటగాడు ప్రపంచస్థాయిలో తన సత్తా చాటుకోవడం మొదలుపెట్టాడు.

గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 86.47 మీటర్ల జావెలిన్ త్రోతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2018లో జరిగిన ఆసియా క్రీడల్లో 88.07 మీటర్ల జావెలిన్ త్రోతో జాతీయ రికార్డును నెలకొల్పడమే కాక స్వర్ణ పతకాన్ని కూడా సాధించాడు.

కానీ, 2019 నీరజ్‌కు కలిసిరాలేదు. భుజానికి గాయం కావడంతో ఆడలేకపోయాడు. సర్జరీ తరువాత కొన్ని నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

2020లో కరోనా కారణంగా అంతర్జాతీయ పోటీలన్నీ నిలిచిపోయాయి.

అయితే, గాయాల పాలవడం, మళ్లీ పైకి లేవడం నీరజ్‌కు కొత్తేం కాదు.

2012లో బాస్కెట్‌బాల్ ఆడుతుండగా నీరజ్ మణికట్టుకు గాయమైంది. జావెలిన్ త్రోలో కావలసిందే మణికట్టు బలం. దానికే గాయం కావడంతో ఇక తాను ఆటకు పనికిరానని అతను భావించాడు.

కానీ, నీరజ్ కృషి, పట్టుదల, అతని టీమ్ సహకారంతో మళ్లీ తారాజువ్వలా పైకి లేచాడు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఈరోజు నీరజ్‌కు విదేశీ కోచ్, బయోమెకానికల్ నిపుణులు ఉన్నారుగానీ, 2015 వరకు తనకు తానే ట్రైనింగ్ ఇచ్చుకునేవాడు. అందులో గాయాలు పాలయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉండేది.

ఆ తర్వాత అతనికి మంచి కోచ్‌లు, అత్యుత్తమ సౌకర్యాలు సమకూరాయి.

నీరజ్ రియో ఒలింపిక్స్ అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అందుకు కావలసిన అర్హత సంపాదించిపెట్టే మార్కు సాధించేసరికి ఎంట్రీ గడువు దాటిపోయింది. ఇది నీరజ్‌ను చాలా కలతపెట్టింది. కానీ, టోక్యోలో అలా జరగనివ్వలేదు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

సంగీతాభిరుచి

జావెలిన్ త్రో కాకుండా నీరజ్‌కు బైక్ రైండిగ్ అంటే చాలా ఇష్టం. అలాగే, హరియాణా గీతాలు, పంజాబీ పాటలు అంటే చెవి కోసుకుంటాడు. గాయకుడు బబ్బూ మాన్ అంటే ప్రత్యేకమైన అభిమానం.

ఒకప్పుడు శాకాహారిగా ఉన్న నీరజ్ క్రీడల్లోకి వచ్చాక మాంసాహారానికి అలవాటుపడ్డాడు.

క్రీడాకారులు కఠినమైన ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. కానీ, నీరజ్‌కు గోల్ గప్పా (పానీ పూరీ) అంటే చాలా ఇష్టం.

నీరజ్ పొడవైన జుత్తు చూసి సోషల్ మీడియాలో అతని అభిమానులు జంగిల్ బుక్‌లోని మోగ్లీతో పోలుస్తారు. జుత్తే కాకుండా నీరజ్ చురుకుదనం కూడా అందుకు ఓ కారణం.

ఆ చురుకుదనమే అతన్ని ఒలింపిక్స్ దాకా తీసుకువచ్చింది. 23 ఏళ్ల నీరజ్ అప్పుడే 2024 పారిస్ ఒలింపిక్స్‌పై దృష్టి పెట్టాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)