లవ్లీనా బోర్గోహైన్: సెమీ ఫైనల్లో ఓటమి, కాంస్యంతో సరిపెట్టుకున్న భారత బాక్సర్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ ఎడిటర్
టోక్యో ఒలింపిక్స్ మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సెమీ ఫైనల్లో భారత బాక్సర్ లవ్లీనా టర్కీ బాక్సర్ బుసెనజ్ సుర్మెనెలీ చేతిలో ఓటమి పాలయ్యారు.
లవ్లీనాపై టర్కీకి చెందిన వరల్డ్ నంబర్ వన్ బుసెనజ్ 5-0 తేడాతో సులభంగా విజయం సాధించారు.
పీవీ సింధు కాంస్య పతకం తీసుకురావడానికి ముందే లవ్లీనా మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ సెమీస్‌కు చేరుకుని భారత్‌కు రెండో పతకం ఖాయం చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సెమీస్‌లో గెలిచి కాంస్య పతకాన్ని రజతం లేదా స్వర్ణంగా మార్చుకునే అవకాశం ఆమెకు లభించింది.
కానీ, ప్రపంచ నంబర్ వన్ బాక్సర్, టర్కీకి చెందిన బుసెనజ్ ముందు లవ్లీనా నిలదొక్కుకోలేకపోయారు.
మొదటి రౌండ్‌లోనే లవ్లీనాను ఓడించిన సుర్మెనెలి మిగతా రౌండ్లలో ఆమెపై సులభంగా విజయం సాధించారు.
క్వార్టర్ పైనల్లో చైనీస్ తైపీ బాక్సర్ చెన్ నియెన్-చిన్ మీద 1-4తో విజయం సాధించిన లవ్లీనా వెల్టర్ వెయిట్ సెమీస్‌కు చేరారు.
ఈ ఓటమితో లవ్లీనా బోర్గోహైన్‌కు మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్‌లో కాంస్యం అందుకోనున్నారు.
సెమీస్‌లో ఓడినా భారత్‌కు కాంస్య పతకం అందించిన లోవ్లీనా బోర్గోహైన్‌ను అభినందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"అద్భుతంగా పోరాడావు లవ్లీనా బోర్గోహైన్. బాక్సింగ్ రింగ్‌లో ఆమె విజయం ఎంతోమంది భారతీయుల్లో స్ఫూర్తి నింపుతుంది. ఆమె పట్టుదల, దృఢసంకల్పం ప్రశంసనీయం. కాంస్య పతకం గెలుచుకున్న లవ్లీనాకు శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, EPA
ప్రదర్శన నిరాశపరిచింది-లవ్లీనా
సెమీస్‌లో ఓటమి పాలైన లవ్లీనా తను ఇంకా మెరుగ్గా ఫైట్ చేసుండాల్సిందని అన్నారు.
ఇప్పటివరకూ తను ఎదుర్కున్న ప్రధాన పోటీలన్నింట్లో కాంస్య పతకమే గెలవడంతో ఈసారీ స్వర్ణ పతకంపై ఆశలు పెట్టుకున్నానని తెలిపారు.
ఈసారీ ఒలింపిక్స్‌లో మహిళా క్రీడాకారుల ప్రదర్శన గురించి మాట్లాడిన లవ్లీనా... ఈ విజయాలు దేశంలో ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తి కలిగిస్తాయన్నారు.
సంధ్యా గురుంగ్‌ను ద్రోణాచార్య పురస్కారంతో గౌరవించాల్సిన అవసరం ఉందని లవ్లీనా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీ బాక్సర్‌పై విజయం
టోక్యో ఒలింపిక్స్ వెల్టర్ వెయిట్ విభాగంలో సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన మహిళా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్-2లో చైనీస్ తైపీకి చెందిన బాక్సర్ చెన్ నియెన్-చిన్ మీద 4-1 తేడాతో విజయం సాధించిన లవ్లీనా ఒలింపిక్ పతకం కలను నెరవేర్చుకున్నారు.
"అప్పుడే థాంక్యూ చెప్పను, ఫైనల్స్ తర్వాత అందరికీ అది చెబుతాను" అని క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించిన తర్వాత లవ్లీనా అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఇంతకు ముందు పలు మ్యాచ్‌లలో నియోన్ చేతిలో ఓడిపోయిన లవ్లీనా ఈసారి ఆమెపై విజయం సాధించగలిగారు.
23 ఏళ్ల లవ్లీనా మొదట కిక్ బాక్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. చివరికి ఒలింపిక్స్‌లో 69 కేజీల విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరారు.
2018, 2019 ఏఐబీఏ మహిళా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం గెలిచిన లవ్లీనా.. దిల్లీలో జరిగిన మొదటి ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంటులో స్వర్ణ పతకం, గువాహటిలో జరిగిన సెకండ్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సాధించారు.

ఫొటో సోర్స్, Twitter/Lovlina Borgohain
69 కేజీల వెల్టెర్ వెయిట్ విభాగంలో మూడో రాంక్ పొందిన లవ్లీనా బోర్గోహైన్ అసోం నుంచి ఒలింపిక్స్‌కు క్వాలిపై అయిన తొలి మహిళగా, శివ థాపా తర్వాత రాష్ట్రం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రెండో బాక్సర్‌గా నిలిచారు.
భారత్‌లో క్రీడల్లో రాణిస్తున్న చాలా మంది అథ్లెట్లలానే లవ్లీనా కూడా ఒక చిన్న గ్రామం నుంచి వచ్చారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నడుమ ఆమె ఒలింపిక్స్ కలను సాకారం చేసుకుంటున్నారు.
అసోం గోలఘాట్ జిల్లాలో బోరో ముఖియా గ్రామం లవ్లీనా స్వస్థలం. తండ్రి ఓ చిరు వ్యాపారి. తల్లి గృహిణి. తండ్రి నెల వారీ సంపాదన చాలా తక్కువ.
లవ్లీనా 1997 అక్టోబర్ 2న పుట్టారు. బాక్సర్ కావాలనే కూతురి కలను నెరవేర్చేందుకు ఆమె తండ్రి చాలా కష్టపడ్డారు.
లవ్లీనా బోర్గోహైన్ అసోం నుంచి అర్జున అవార్డు అందుకున్న ఆరో క్రీడాకారిణి.
లవ్లీనాకు కవలలైన లీచా, లీమా అనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు. వారు కూడా కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. కానీ అంతకు మించి వెళ్లలేకపోయారు.

ఫొటో సోర్స్, Twitter/Lovlina Borgohain
మహమ్మద్ అలీ ఫొటో చూశాక...
అక్కల్లాగే మొదట కిక్ బాక్సర్ కావాలనుకున్న లవ్లీనా తర్వాత బాక్సింగ్ వైపు మళ్లారు.
''ఒక రోజు ఓ వార్తా పత్రికలో స్వీట్లు పట్టుకొని లోవ్లీనా దగ్గరకు ఆమె తండ్రి వచ్చారు. అప్పుడే ఆ పత్రికలోని మహమ్మద్ అలీ చిత్రాన్ని లవ్లీనా చూశారు. ఆమె తండ్రి అలీ కథను లవ్లీనాకు వివరించారు. అలా లవ్లీనా బాక్సింగ్ ప్రస్థానం మొదలైంది''అని లవ్లీనా ప్రస్థానం గురించి మీడియా చాలా కథలు ఉన్నాయి.
హైస్కూల్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ట్రయల్స్‌లో పాల్గొన్న ఆమె ప్రతిభను గుర్తించిన ప్రముఖ కోచ్ పదుమ్ బోరో ఆమెకు 2012లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అలా, ఐదేళ్లలోనే ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించే స్థాయికి ఆమె వెళ్లారు.
ఆ తర్వాత ఆమెకు చీఫ్ మహిళా కోచ్ శివ సింగ్ శిక్షణ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
అదీ సమస్య...
భారత్‌లో ప్రాక్టీస్ చేయడానికి లవ్లీనాకు ఒక ఇబ్బంది ఉండేది.
69కేజీల కేటగిరీలో బాక్సింగ్ ప్రాక్టీస్ చేసే మహిళలు మన దేశంలో చాలా తక్కువ. దీంతో వేరే కేటగిరీల్లోని మహిళా బ్యాక్సర్లతో ఆమె పోటీపడుతుంటారు.
సరిగ్గా ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు, శిక్షణలో లవ్లీనా తలమునకలై ఉన్నప్పుడు, ఆమె తల్లికి కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించారు. ఆ సమయంలో లవ్లీనా తల్లి పక్కనే ఉన్నారు.
తల్లి శస్త్రచికిత్స తర్వాత లవ్లీనా మళ్లీ శిక్షణ మొదలుపెట్టారు.
అయితే, కరోనావైరస్ సెకండ్ వేవ్‌తో పరిస్థితులు మళ్లీ ఆమెకు అవరోధంగా మారాయి. తన గదిలో గంటలపాటు కొద్దిమంది సిబ్బందితో ఆమె తలపడేవారు.
ఆమెకు శిక్షణ ఇచ్చే సిబ్బందిలో కొంతమందికి కోవిడ్ సోకింది. దీంతో వారు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఈ అడ్డంకులన్నీ నెమ్మదిగా దాటుకుంటూ లవ్లీనా ముందుకు వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కెరియర్‌లో ఊహించని మార్పు
2018 కామన్‌వెల్త్ గేమ్స్ లోవ్లీనా కెరియర్‌ను పూర్తిగా మార్చేశాయి. ఆ గేమ్స్‌లో పాల్గొనేందుకు లవ్లీనా ఎంపికయ్యారు. అయితే, ఆ విషయాన్ని ఆమెకు అధికారికంగా తెలియజేయలేదని వార్తలు వచ్చాయి.
పత్రికల ద్వారా ఆ విషయం తెలుసుకున్నానని ఆమె చెప్పారు. ఆ పోటీల్లో ఆమె పతకాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత తను చేస్తున్న తప్పులపై ఆమె దృష్టిసారించారు. టెక్నికల్ విషయాలతోపాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టారు.
ఆ ఫలితాలు కొన్ని నెలల్లోనే కనిపించాయి. 2018, 2019ల్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె కాంస్య పతకం సాధించే స్థాయికి వెళ్లారు.
కొన్ని రోజుల క్రితం మణిపుర్‌కు చెందిన మీరాబాయి చానూ భారత్‌కు రజత పతకం తెచ్చిపెట్టారు.
ఇప్పుడు, సెమీస్‌లో ఓడిపోయినా మహిళల బాక్సింగ్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన లవ్లీనాపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Please wait...
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








