ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఇదీ

ఆసియాలోని అత్యుత్తమ మహిళల ఫీల్డ్ హాకీ జట్లలో భారత మహిళల హాకీ జట్టు ఒకటి. అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో తమ స్థానాన్ని భారత జట్టు కాపాడుకుంటూ వస్తోంది.

1982లో జరిగిన ఆసియా గేమ్స్‌లో బంగారు పతకాన్ని కూడా దక్కించుకుంది. 2004, 2017లో రెండుసార్లు ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. 2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని ఒడిసిపట్టింది. 2002 కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని కూడా దక్కించుకుంది. ప్రస్తుతం టోక్యోలో పోరాడుతున్న భారత మహిళల జట్టులో ఎవరెవరు ఉన్నారు? వారు ఏ స్థానాల్లో ఆడబోతున్నారు?

1980 మాస్కో ఒలింపిక్స్‌లో తొలిసారి విమెన్స్ ఒలింపిక్ ఫీల్డ్ హాకీ కాంపిటీషన్‌ను ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) నిర్వహించింది.

పోటీలు ప్రారంభించిన 36 ఏళ్ల తర్వాత, తొలిసారి 2016 రియో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు పాల్గొంది. అయితే, గ్రూప్ స్టేజీలోనే అప్పుడు ఎలిమినేట్ అయ్యింది. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మరీ దీనిలో ఆడుతున్న క్రీడాకారులెవరో తెలుసుకునేందుకు స్క్రోల్ చేయండి.

గోల్‌కీపర్

సవిత

గోల్‌కీపర్
సవిత

30 ఏళ్ల సవిత భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్. 18 ఏళ్ల వయసులోనే ఆమె హాకీ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే 100కిపైనే పోటీల్లో ఆమె పాల్గొన్నారు. భారత జట్టులో మంచి అనుభవమున్న క్రీడాకారిణుల్లో ఆమె కూడా ఒకరు.
జట్టులో చాలా మంది సభ్యుల్లానే ఆమె కూడా హరియాణా నుంచి వచ్చారు. హిసార్‌కు చెందిన ఆమెకు 2018లో అర్జునా అవార్డు దక్కింది. మొదట్లో ఆమె స్పోర్ట్స్‌పై అంత ఆసక్తి కనబరిచేవారు కాదు. అయితే, స్పోర్ట్స్ దిశగా ఆమెను తన తాతయ్య ప్రోత్సహించారు. సూచనలు, సలహాలు ఇస్తూ, ఆమెకు ఆయన మార్గదర్శిలా మారారు. 2017లో ఎఫ్ఐహెచ్ విమెన్స్ వరల్డ్ లీగ్ రౌండ్‌ 2లో గోల్‌కీపర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డును ఆమె అందుకున్నారు.
2018 ఆసియా గేమ్స్‌లో రజత పతకం సాధించిననాటి ఘటనలు తన జీవితంలో మరచిపోలేనివని ఆమె చెబుతున్నారు. ‘‘ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో నేర్చుకున్న పాఠాలను ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తాం. భారత్‌లో మహిళల హాకీ జట్టు చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖించేందుకు ప్రయత్నిస్తాం''అని ఆమె అన్నారు.

డిఫెండర్

దీప్ గ్రేస్ ఇక్కా

డిఫెండర్
దీప్ గ్రేస్ ఇక్కా

ఒడిశాలో జన్మించిన 27ఏళ్ల దీప్ గ్రేస్ ఇక్కాకు ఇది రెండో ఒలింపిక్స్. ప్రస్తుతం ఈమె జట్టులో వైస్ కెప్టెన్.

రెండు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒడిశా తొలి మహిళా క్రీడాకారిణి దీప్‌నే. 2013 విమెన్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జూనియర్ టీమ్‌లో ఆమె సభ్యురాలు. అదే ఏడాది ఆమెకు సీనియర్ జట్టులో అవకాశం వచ్చింది. భారత్‌ తరఫున 200కుపైగా మ్యాచ్‌లు ఆడిన అతికొద్ది మంది క్రీడాకారిణుల్లో ఆమె కూడా ఒకరు. వర్కవుట్‌లలో కోర్, రన్నింగ్ అంటే తనకు ఇష్టమని ఆమె చెబుతున్నారు.

‘‘దేశానికి పేరు ప్రతిష్ఠలు, గౌరవం తీసుకొచ్చే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా నేను అమితంగా ఇష్టపడే పనిని చేయగలుగుతున్నాను. దేశానికి బంగారు పతకాన్ని తెచ్చిపెట్టేందుకు నేను 100 శాతం కృషి చేస్తాను'' అని ఆమె అన్నారు.

నిక్కీ ప్రధాన్

డిఫెండర్
నిక్కీ ప్రధాన్

27ఏళ్ల నిక్కీ జార్ఖండ్‌లో జన్మించారు. 2016లో తొలిసారి భారత్ తరఫున ఈమె ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అప్పటినుంచి భారత్ జట్టులో ఈమె సభ్యురాలిగా ఉన్నారు.

జార్ఖండ్ నుంచి కొంతమంది పురుషుల జట్టులో ఉన్నారు. అయితే, జార్ఖండ్ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి మహిళా హాకీ ప్లేయర్ మాత్రం ఈమే.
నిక్కీ తండ్రి పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారు. చిన్నప్పటినుంచే తమ గ్రామంలో నిక్కీ హాకీ ఆడేవారు. ఇప్పటివరకు భారత్ తరఫున వందకుపై మ్యాచ్‌లలో ఆమె పాల్గొనారు. ఎఫ్‌ఐహెచ్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో భాగంగా అమెరికాతో తలపడినప్పుడు ఈమె కీలకంగా మారారు. ఈ మ్యాచ్ ద్వారా ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత జట్టు అవకాశం దక్కించుకుంది.

‘‘ఒలింపిక్స్ అంటే ఏ క్రీడారుడికైనా కల లాంటిదే. మరోసారి భారత్ తరఫున ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మైదానంలో సత్తా చూపించేందుకు ఎదురుచూస్తున్నాం. నేను ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ 100 శాతం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను''అని ఆమె అన్నారు.

గుర్‌జీత్ కౌర్

డిఫెండర్
గుర్‌జీత్ కౌర్

గుర్‌జీత్‌కు ఇవే తొలి ఒలింపిక్స్. ఇటు డిఫెండర్‌గా.. అటు డ్రాగ్‌ఫ్లికెర్‌గా ఆమె సత్తా చాటబోతున్నారు.

పాకిస్తాన్ సరిహద్దుల్లోని పంజాబ్‌లోని ఓ గ్రామంలో గుర్‌జీత్ జన్మించారు. స్కూల్‌లో ఉన్నప్పుడే ఈమెకు హాకీపై చాలా ఆసక్తి ఉండేది. హాకీని ఆమె చాలా ఆస్వాదిస్తుంటారు. డ్రాగ్‌ఫ్లిక్‌పై మొదట్లో ఆమెకు అంత ఆసక్తి ఉండేది కాదు. అయితే, ప్రత్యేక శిక్షణతోపాటు నిరంతర అభ్యాసంతో ఇప్పుడు భారత్ జట్టులో ఉన్న అత్తుత్తమ డ్రాగ్‌ఫ్లికర్స్‌లో ఒకరిగా ఈమె పేరు సంపాదించారు. 2019లో జపాన్‌లో జరిగిన ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ సిరీస్ ఫైనల్లో ఎక్కువ గోల్స్ కొట్టింది గుర్‌జీత్‌నే. ఈ మ్యాచ్‌లో భారత్‌కు స్వర్ణం వచ్చింది.

‘‘భారత మహిళా జట్టు ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తే.. కొత్తగా వచ్చే క్రీడాకారిణుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీంతో మరింత మందిని ఈ దిశగా ప్రోత్సహించినట్లు అవుతుంది''అని బీబీసీతో ఆమె చెప్పారు.

ఉదిత

డిఫెండర్
ఉదిత

ఉదిత ఇప్పటివరకు భారత్ తరఫున 32 మ్యాచ్‌లు ఆడారు. హరియాణాలో జన్మించిన ఈమె 2017లో సీనియర్ హాకీ జట్టులో చోటు సంపాదించారు. 2018 ఆసియా గేమ్స్‌లో రజతం సాధించిన భారత జట్టులో ఈమె కూడా ఉన్నారు.
కెరియర్ మొదట్లో ఉదిత ఓ హ్యాండ్‌బాల్ ప్లేయర్. ఆరేళ్ల క్రితమే ఈమె హాకీ వైపుగా అడుగులు వేశారు. అది తన జీవితంలో చరిత్రాత్మక నిర్ణయమని ఆమె చెబుతారు.

‘‘కొంతకాలంగా భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడుతున్నాను. టోక్యోలో భారత్ జట్టు విజయం సాధించేందుకు నా వంతుగా 100 శాతం కృషి చేస్తాను''అని ఆమె చెప్పారు.

నిషా

మిడ్‌ఫీల్డర్
నిషా

భారత జట్టులో తాజాగా చేరినవారిలో నిషా ఒకరు. 2019లో తొలిసారి ఈమె భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడారు. ఆ తర్వాత కరోనావైరస్ వ్యాప్తి నడుమ పెద్దగా టోర్నమెంట్‌లేవీ జరగలేదు. 2021లో అర్జెంటీనాలో ఆడేందుకు వెళ్లిన భారత జట్టులో నిషా కూడా ఉన్నారు.
కెరియర్ ప్రారంభంలోనే టోక్యో ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆమె చెబుతున్నారు. హరియాణాలోని సొనేపట్ ఈమె స్వస్థలం. నిషా తండ్రి ఒక టైలర్. తన కుమార్తె భారత్ తరఫున ఆడాలని ఆయన కలలు కన్నారు. నిషాతో కలిసి ఆడుతున్న నేహాది కూడా సోనేపట్‌నే. వీరిద్దరి తల్లులు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. నిషా, నేహాలు కలిసే ప్రాక్టీస్ చేసేవారు.

నవ్‌జ్యోత్ కౌర్

మిడ్‌ఫీల్డర్
నవ్‌జ్యోత్ కౌర్

నవ్‌జ్యోత్ స్వస్థలం హరియాణాలోని కురుక్షేత్ర. అండర్-19 జూనియర్ ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో, 2012లో నవ్‌జ్యోత్‌కు సీనియర్ హాకీ జట్టులో చోటు దక్కింది.
కొరియాలో నిర్వహించిన 17వ ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన భారత జట్టులో నవ్‌జ్యోత్ సభ్యురాలు. తను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ తల్లిదండ్రులు తనకు అండగా నిలుస్తారని ఆమె వివరించారు. ముఖ్యంగా స్కూల్ సమయం నుంచే స్పోర్ట్స్‌లో పాల్గొనే దిశగా తండ్రి తనను ప్రోత్సహించారని ఆమె చెప్పారు. ఇది నవ్‌జ్యోత్‌కు రెండో ఒలింపిక్స్.

మోనికా

మిడ్‌ఫీల్డర్
మోనికా

27 ఏళ్ల మోనికా సొంత రాష్ట్రం కూడా హరియాణానే. భారత్‌కు పేరు, ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన కీలక మ్యాచ్‌లలో మోనికా ఆడారు. 2016లో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టిన జట్టులో మోనికా సభ్యురాలు. 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులోనూ మోనికా ఉన్నారు.

‘‘క్రీడాకారులందరికీ ఒలింపిక్స్ చాలా ప్రత్యేకమైనది. అంత పెద్ద వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం అంటే గర్వకారణంగా ఉంటుంది. జట్టులో సీనియర్ ప్లేయర్లలో ఒకరిగా ఉన్న నేను, జూనియర్లు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మొదటి రోజు నుంచే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు వంద శాతం కృషిచేస్తాను.''

భారత్‌ కోసం ఆడిన తొలి మ్యాచ్‌ను తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని ఆమె చెప్పారు.

సుశీలా చానూ

మిడ్‌ఫీల్డర్
సుశీలా చానూ

2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్ అర్హత సాధించినప్పుడు.. జట్టుకు సుశీలా కెప్టెన్‌గా ఉన్నారు. జూనియర్ టికెట్ చెకర్‌గా కెరియర్‌ను మొదలుపెట్టి కెప్టెన్ స్థాయి వరకు వెళ్లారు. ఈమె సొంత రాష్ట్రం మణిపుర్. 2013లో భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టిన జూనియర్ విమెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా సుశీలానే ఉన్నారు.
జట్టులో మంచి అనుభవమున్న వారిలో 29ఏళ్ల సుశీల ఒకరు. గత కొన్నేళ్లలో భారత జట్టు ఆడిన దాదాపు అన్ని ప్రధాన మ్యాచ్‌లలోనూ సుశీల ఉన్నారు. 2014 ఆసియా గేమ్స్, 2017 ఆసియా కప్‌లు కూడా దీనిలో ఉన్నాయి.

సలీమా టేటే

మిడ్‌ఫీల్డర్
సలీమా టేటే

ఈమె వయసు కేవలం 19ఏళ్లే. ఇప్పటికే భారత్ తరఫున ఆమె 29 మ్యాచ్‌లు ఆడారు. నిక్కీ ప్రధాన్ తర్వాత జార్ఖండ్ నుంచి వచ్చి, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న రెండో హాకీ ప్లేయర్ ఈమెనే.

2018 యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం తెచ్చిపెట్టిన జట్టుకు ఈమె కెప్టెన్‌గా ఉన్నారు. నాటి అనుభవాలను ఎప్పటికీ మరచిపోలేనని ఆమె అన్నారు.

‘‘ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పాల్గొనడం అనేది ఒక కల లాంటిది. ఈ పోరాటంలో మాకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో నాకు తెలుసు. అయితే, నా దృష్టి మొత్తం ఆటపైనే కేంద్రీకరించాను'' అని చెప్పారు.

నేహా

మిడ్‌ఫీల్డర్
నేహా

నేహా గోయల్, 24, 2011 లో జూనియర్ జట్టులో చేరారు మరియు చివరకు 2014 లో సీనియర్ జట్టులో అడుగుపెట్టారు.

2017 మహిళల హాకీ ఆసియా కప్‌లో చైనాపై ఆమె మొదటి గోల్ సాధించింది.

నేహా బీబీసీతో మాట్లాడుతూ, "మా నాన్న మద్యం సేవించేవాడు మరియు ఇంట్లో వాతావరణం బాగా లేదు. నేను హాకీలో చేరాను ఎందుకంటే నాకు ఉచిత బూట్లు మరియు బట్టలు లభిస్తాయని చెప్పబడింది. నా కోచ్ నన్ను ప్రేరేపించాడు మరియు నాకు ఆర్థికంగా సహాయం చేసాడు. మా నాన్న చనిపోయిన తర్వాత, మా అమ్మ ఒక ఫ్యాక్టరీలో పని చేసేది మరియు నా సోదరీమణులు మరియు నేను ఇంట్లో ఆమెకు జీవితాన్ని గడపడానికి సహాయం చేసాను.

గోయల్‌కు ఇది తొలి ఒలింపిక్ ప్రదర్శన. "భారత ఒలింపిక్ జట్టులో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మేము గత ఐదు సంవత్సరాలలో ఈ టోర్నమెంట్ కోసం చాలా కష్టపడ్డాము మరియు చివరకు ఇక్కడ ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మేము మా ప్రణాళికలన్నింటినీ అమలు చేస్తున్నాము మరియు వాటిని మన సామర్థ్యాలకు తగినట్లుగా అమలు చేయాలి."

ఫార్వార్డ్

రాణి

ఫార్వార్డ్
రాణి

భారత మహిళల హాకీ జట్టుకు రాణి కెప్టెన్. 2020లో ‘‘వరల్డ్ గేమ్స్ అథ్లేట్ ఆఫ్ ది ఇయర్''అవార్డును గెలుచుకున్న తొలి హాకీ ప్లేయర్‌గా రాణి చరిత్ర సృష్టించారు.
15ఏళ్ల వయసు నుంచి రాణి భారత జట్టు తరఫున ఆడుతున్నారు. 2010 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడిన జట్టులో అత్యంత పిన్న వయస్కురాలు ఈమే. రాణి తండ్రి రిక్షా తొక్కుతుంటారు. హరియాణాలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఈమె హాకీలోకి అడుగుపెట్టారు.

రాణి మొదట్లో హాకీ ఆడాలని అనుకున్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే, మంచి ప్రదర్శనతో ఆమె విమర్శకుల నోళ్లు మూయించారు. ఇదే ఆమెకు భారత జట్టులో అవకాశాన్ని కల్పించింది. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ 2020కు నామినేట్ అయిన వారిలో రాణి ఒకరు. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

2019లో ఒలింపిక్స్ పాల్గొనేందుకు అర్హత కోసం అమెరికాతో భారత జట్టు పోరాడినప్పుడు, గెలుపును నిర్ణయించిన చివర్ గోల్‌ను రాణి కొట్టారు.

శర్మిలా దేవి

ఫార్వార్డ్
శర్మిలా దేవి

టోక్యో ఒలింపిక్స్‌కు రెండేళ్ల ముందు, 2019లో సీనియర్ హాకీ జట్టులో శర్మిలా దేవి చోటు సంపాదించారు. తొమ్మిది మ్యాచ్‌ల తర్వాత ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో పాలుపంచుకోబోతున్నారు.
19ఏళ్ల శర్మిల స్వస్థలం హరియాణాలోని హిసార్. భారత జట్టులో ఈమెను సర్పైజ్ ప్యాకేజీగా చెబుతున్నారు. ఎఫ్‌ఐహెచ్ హాకీలో అమెరికాను ఓడించిన భారత జట్టులో ఈమె కూడా ఉన్నారు.
ఎఫ్‌ఐహెచ్ హాకీ ఒలింపిక్ క్వాలిఫైంగ్ మ్యాచ్‌లో అమెరికాపై తొలి గోల్ కొట్టడంలో ఈమె కీలకంగా మారారు. ‘‘టోక్యో ఒలింపిక్స్ నాకు మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నా. ఇలాంటి పెద్ద వేదికపై భారత్ తరఫున ఆడేందుకు ఎదురుచూస్తున్నా''అని ఆమె అన్నారు.

వందన కటారియా

ఫార్వార్డ్
వందన కటారియా

29 ఏళ్ల వందనకు ఫెదరర్ అంటే చాలా ఇష్టం. భారత జట్టులో గోల్స్ కొట్టేందుకు దూసుకెళ్లే బృందంలో వందన కూడా ఉన్నారు.

2013లో జరిగిన జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోర్ కొట్టింది వందననే. ఆ తర్వాత సీనియర్ జట్టులో ఈమెకు చోటు దక్కింది. రియో ఒలింపిక్స్‌లోనూ ఈమె పాల్గొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వందన ఇప్పటికే 200కుపైగా మ్యాచ్‌లలో ఆడారు. భారత జట్టులో మంచి అనుభవమున్న స్ట్రైకర్లలో ఈమె కూడా ఒకరు.

2016 ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు బంగారు పతకం తెచ్చిపెట్టిన జట్టులో వందన కూడా ఉన్నారు. అయితే, 2013నాటి జూనియర్ విమెన్స్ వరల్డ్ కప్‌ తన కెరియర్‌లో ప్రత్యేకమైనదని ఆమె చెబుతున్నారు.

లాల్రెంసియామీ

ఫార్వార్డ్
లాల్రెంసియామీ

మిజోరం నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి మహిళా హాకీ ప్లేయర్ లాల్రెంసియామీనే.

21ఏళ్ల లాల్రెంసియామీ.. మిజోరంలోని కోలాసిబ్‌లో పుట్టి పెరిగారు. 2019 ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆమె అందుకున్నారు. అందరూ ఈమెను సియామి అని పిలుస్తుంటారు. 2018 ఆసియన్ గేమ్స్‌లో రజతం తెచ్చిపెట్టిన భారత జట్టులో సియామీ కూడా ఉన్నారు.

2019లో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత కోసం కీలక సెమీఫైనల్ మ్యాచ్‌ జరిగేటప్పుడే, సియామీ తండ్రిని కోల్పోయారు. అయితే, సియామీ వెనకడుకు వేయలేదు. భారత జట్టులో కొనసాగి, ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అర్హత సంపాదించారు.

ఆసియా గేమ్స్‌లో పతకం సాధించిన తొలి మిజోరం హాకీ ప్లేయర్ సియామీనే.
‘‘నాకు ఒలింపిక్స్ అంటే చాలా ఇష్టం. దీనిలో పాల్గొనేందుకు అవకాశం రావడాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను'' అని అమె చెప్పారు.

నవ్‌నీత్ కౌర్

ఫార్వార్డ్
నవ్‌నీత్ కౌర్

25ఏళ్ల నవ్‌నీత్ కౌర్ భారత్ తరఫున 79 మ్యాచ్‌లు ఆడారు. జట్టులో మంచి ప్రదర్శన ఇస్తున్న ప్లేయర్లలో ఆమెకు మంచి పేరుంది. ఈమె సొంత రాష్ట్రం కూడా హరియాణానే. 2013లో జర్మనీలో జరిగిన జూనియర్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్‌లోనూ కౌర్ పాల్గొన్నారు.
2019లో ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్‌లో భారత్‌కు విజయం తెచ్చిపెట్టిన జట్టులో నవ్‌నీత్ కూడా ఉన్నారు. ఒలింపిక్స్ క్వాలిఫైంగ్ మ్యాచ్‌లోనూ ఈమె కీలకంగా మారారు.
‘‘దీని కోసం ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. విజయం కోసం మేం చాలా కష్టపడుతున్నాం''అని నవ్‌నీత్ అన్నారు.